ఆధ్యాత్మిక విద్య
>> Monday, April 11, 2016
లోకంలో
ఒక వస్తువు ఉన్నదంటే, దాని నిర్మాత ఒకరున్నారని భావం! భగవంతుడే అందరి
సృష్టికర్త అని పురాణాలు చెబుతున్నాయి. సృష్టికి ఆధారమైనవాడు, చరాచర
జగత్తును సృష్టించినవాడు ఆయనే. ఒక ప్రాణి ఉన్నదనేందుకు సృష్టికర్త
కారణమైతే- అదే సిద్ధాంతం ఆధారంగా ఆ ‘ఉనికి’ ఉన్న భగవంతుణ్ని
సృష్టించినవారెవరు అనేది ప్రశ్న. అది ఈనాటిది కాదు. ఉండీ కనిపించనివాడు
భగవంతుడైనప్పుడు- ఆయనను సృజించినవారు మరొకరుంటే, ఆయన మాత్రం కంటికి
కనిపిస్తారా... అనేది మేధను మథించే విషయం!సర్వజగత్తును
ఆవరించి ఉన్నవాడు శ్రీమహావిష్ణువు అని పురాణగాథలు వర్ణిస్తున్నాయి. వాటి
ప్రకారం- సృష్టి, లయల్ని బ్రహ్మ, రుద్రులు నిర్వర్తిస్తారు. విష్ణువు నాభి
కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. త్రిమూర్తుల పుట్టుకకు ‘జగజ్జనని’
ఆదిపరాశక్తి మూల కారణమంటున్నాయి శాస్త్రాలు. ఆ జనని ఆవిర్భావం గురించి
పరిశీలించినప్పుడు, ఆమె ‘స్వయంవ్యక్త శక్తి’ అని పెద్దలు చెబుతారు. ఆమె
అవతారమూర్తి.తన ఆవిర్భావాన్ని లేదా అంతర్ధానాన్ని సంకల్పమాత్రంగా చేసే సామర్థ్యం ఆ జగజ్జనని/ జగత్పితకు ఉందంటారు. ప్రాణిని మనిషి సృజించినట్లే- ప్రాణికోటిని, సకల స్థావర జగత్తును పరమాత్మ సృష్టించాడు. ఆ పరమాత్మ తన ఉనికికి తానే కారణమవు తాడన్నది తత్వవేత్తల మాట.
ఈ ప్రపంచం పంచభూతాల సమ్మేళనం. ఆ అయిదూ సమంగా వర్తించినప్పుడే, మనిషి సుఖంగా జీవిస్తాడు. వాటి సమతౌల్యం లోపించినప్పుడు, అతడు అనేక బాధలకు గురవుతాడు. అందుకే పంచభూతాల్ని ఆరాధించడం అంటే, పంచభూతాత్మకుడైన పరమాత్మను ఆరాధించడంతో సమానమని మన పూర్వులు విశ్వసించారు. ఆకాశం నుంచి జారిపడిన ప్రతి నీటిచుక్క గమ్యమూ సముద్రమే. అలాగే ప్రకృతిలో దేన్ని ఆరాధించినా, ఆ పూజ తనకే చేరుతుందన్నది శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రబోధం. దేవతలు, పంచభూతాలు, ప్రకృతి ఆరాధనకు అదే ఎంతో వూతమిస్తుంది.
ప్రకృతి ధర్మానికి మానవుడే మెరుగులు దిద్దాడు. అందుకే ‘బతుకు, బతకనివ్వు’ అనే ధర్మసూక్ష్మానికి కట్టుబడి జీవిస్తూ, అతడు మానవత్వం చూపాలి. ప్రతి వ్యక్తీ తనను తాను ఉద్ధరించుకోవాలన్నది భగవద్గీత సారాంశం. ఆ గీతావాక్యాన్ని అనుసరించి, మనిషి తన ఆధ్యాత్మిక పురోగమనానికి తానే పూలబాట వేసుకోవాలి.
సంతానాన్ని తండ్రి పోషిస్తాడు. తల్లి ఆలనాపాలనా చూస్తుంది. గురువు చేరదీసి జ్ఞానబోధ చేస్తాడు. ఆ వ్యక్తిని జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దుతాడు. దానికి అదనంగా, స్వయంకృషి ద్వారా మనిషి అనేక విద్యలు నేర్చుకుంటాడు. అందులో కృతార్థుడైనవాడే తనను తాను ఉద్ధరించుకోగలుగుతాడు!
ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని కళల్లో ఆరితేరినా మనిషి సంపూర్ణుడు కాలేడు. అరవై అయిదో కళగా అతడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి. అదే చింతనతో జీవితాన్ని సాగించాలి. ఆ విద్య ఉదర పోషణకు సంబంధించినది కాదు. అది విజ్ఞాన తృష్ణకు చెందినది. ఆ జ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించుకొని లౌకిక, పారలౌకిక ధర్మాల్ని పాటించడానికి ఆధ్యాత్మిక విద్య దోహదపడుతుంది. లోక కల్యాణం కోరేవారి ఆశయ సాధనకు ఆ విద్యే ప్రాణంపోస్తుంది. కంటికి కనిపించని దివ్యశక్తి ఆరాధన అది. సాకార, నిరాకార విధానాల్లో ఎలా చేసినా ఆ సాధన పరమార్థం నెరవేరినట్లే!
ఒక వ్యక్తి ఆనందంగా జీవిస్తున్నప్పుడే, ఇతరుల ఆనందం గురించి ఆలోచిస్తాడు. అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్న తరుణంలోనూ, సమాజ ప్రయోజనం ఆశించే మహాత్ములు ఉంటారు. వారు ఎప్పుడూ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. సాధకుడే భక్తుడవుతాడు. ఆధ్యాత్మికవేత్తగా మారతాడు. అటువంటివారికే జీవితానంద సాధన సులువుగా సాధ్యపడుతుంది!
- గోపాలుని రఘుపతిరావు
from eenedu




1 వ్యాఖ్యలు:
ఆధ్యాత్మిక విద్య యనగ
బాధ్యత గూడన్ జిలేబి బాగుగ జేయన్
సాధ్యము ప్రభువుని గానన్
సేద్యము జేతను సులభపు సేవయు గూడన్ !
సావేజిత
జిలేబి
Post a Comment