నిన్ను నీవు తెలుసుకో!
>> Sunday, April 10, 2016

లోకంలోని అనేక మానవేతర ప్రాణులకు సైతం తమ జనన మరణాల వైనం తెలియదు. ఆయా ప్రాణుల్లో సహజసిద్ధమైన ప్రకృతికి అనుగుణంగా మార్పుచేర్పులు వస్తాయే తప్ప, వాటి మూలాల్ని గ్రహించే పరిస్థితి ఉండదు. అడవిలో జంతువు, ఆకాశంలో పక్షి, నీటిలో చేప... వీటన్నింటికీ మించిన విజ్ఞాన వికాసాలు కేవలం మానవుడికే సొంతం! అతడిలో ఉండే ఆలోచనలు, అనుభూతులు అన్నీ ఇన్నీ కావు. చావు పుట్టుకల రహస్యం తెలుసుకొనేంత విజ్ఞత, ఆ అవకాశం అతడికే ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో గ్రహించేంత తెలివి, ఆయా పరిస్థితుల నుంచి బయటపడే యుక్తి- మనిషికి ఉన్నంతగా సృష్టిలోని మరి ఏ ఇతర ప్రాణికీ ఉండవు.
వ్యక్తి తన స్వభావాన్ని, సంతోషాన్ని, స్వేచ్ఛను అవసరాలకు అనువుగా మార్చుకోగలడు. కాలమాన పరిస్థితులు అనుసరించి ప్రశ్నించడం, ప్రశ్నించుకోవడం అతడికి మాత్రమే సాధ్యపడే విషయాలు. ఆ తత్వచింతనే అతడి అస్తిత్వానికి మూల కేంద్రమవుతుంది. దాని ఫలితమే సమాజం లోనూ కనిపిస్తుంది. అది అభిలషణీయమైతే- సమాజం గుర్తించి, గౌరవించి, భావితరాలకు చక్కటి జ్ఞాపకంగా అందజేస్తుంది. లేదంటే నిరసిస్తుంది, విస్మరిస్తుంది.
జనన మరణాల మధ్య జీవితకాలమే మనిషి స్థాయిని నిర్ణయిస్తుంది. ఆగని ఆ కాలప్రవాహంలో అతడు కొట్టుకుపోకూడదు. తాను ఎవరో ఏమిటో తెలుసుకోవాలి. ప్రశ్నించే స్వభావం ద్వారా, అజ్ఞానం నుంచి బయటపడాలి. ప్రశ్న వల్ల అతడి మనసు శక్తిసంపన్నమవుతుంది. అంతరంగ సాగరంలోని అగాధాలు బయటపడతాయి. కెరటాల శక్తి పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మానవ జీవితం కొత్త కాంతి సంతరించుకుంటుంది. సొగసుగా మారి, నిత్య నూతనత్వం కలిగిస్తుంది. అడ్డదారుల్లో ప్రయాణించేవాడు ఏదీ సాధించలేడు. మనోనేత్రం తెరిచి తనలోకి తాను చూసుకుంటే, ఆ ప్రయాణం ఎటువైపు సాగుతోందో అతడికే తెలిసొస్తుంది. మౌనంగా ఉంటూనే, అంతరాత్మ అంతా గమనిస్తుంటుంది!
తనలో ఉన్న శక్తిసామర్థ్యాల్ని, వాటి వల్ల తాను ఎంతదూరం ప్రయాణించగలనన్న అంచనాల్ని మనిషి వేసుకోగలడు. అది అతడికి ఉన్న రాగద్వేషాల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సంకల్పం ఒక్కటే చాలదు. దాన్ని మించిన కార్యాచరణ కావాలి. తనమీద తనకు నమ్మకం బలపడినప్పుడు, మనిషికి విజయం సులభసాధ్యమే!
పుష్పానికి సువాసన, కిరణానికి ప్రకాశం సహజ లక్షణాలు. సృజన, విశ్లేషణ, హేతుబద్ధత గల ఆలోచనలే వ్యక్తికి సహజ అలంకారాలు. ‘నిన్ను నీవు తెలుసుకో’ అని ఎందరో భారతీయ విజ్ఞానులు ప్రవచించారు. అంతకుముందుగానే, తమను తాము తెలుసుకోగలిగిన జ్ఞానసంపన్నులు వారు. అందుకే వారందరూ జాతికి ఆరాధ్యులయ్యారు!
- జి.నరసింహమూర్తి
0 వ్యాఖ్యలు:
Post a Comment