స్వాధ్యాయంతో సాధ్యం
>> Saturday, November 7, 2015
స్వాధ్యాయంతో సాధ్యం Updated :05-11-2015 23:15:13 |
మనం
తపస్సు గురించి మాట్లాడుకుంటున్నాం. తపస్సు మన వ్యవస్థను శుద్ధి
చేస్తుంది. ఇదే తపస్సు కొందరిలో అహంకారాన్నీ పెంచగలదు. తపస్సు చేయగానే ఎంతో
గొప్పవారైనట్లు కొందరు భావిస్తుంటారు. అలా ఊహించటం అహంకారానికి
దారితీస్తుంది.
తపస్సుతో పాటుగా
చేయాల్సిన పని స్వాధ్యాయం. అంటే తనను తాను పరిశీలించుకోవడం, అర్థం
చేసుకోవడం. మీరు పనుల వెనుకున్న ఆంతర్యాన్ని గ్రహించండి. మీకు ఏం కావాలో
మీకే తెలియదు. ఎందుకంటే మీరెప్పుడూ మీ అంతరంగంలోకి ఇంతగా చూసుకోలేదు. మీ
ఆలోచనలు, భావాలు, కోరికలు ఎటువైపు వీస్తే అటువైపు మీరూ పని చేశారు. ఇంకా
చెప్పాలంటే మీ కోరికలు సైతం మీవి కావు. బయటి ప్రభావాలు, మీరు తీసుకునే
ఆహారం, చుట్టూ జరిగే సంఘటనలు, సహవాసం.. ఇవన్నీ కలిసి మీలో తుపాను
రేకెత్తిస్తాయి. అందువల్లే, చాలాసార్లు మీ కోరికలు తీరాక కూడా మీకు ఆనందం
కలగడం లేదు.
తపస్సు ద్వారా శరీరాన్ని
శుద్ది చేసుకున్నారు సరే. మీరంటే శరీరమా? మీ బుద్ధిని శుద్ధంగా, తేలికగా
ఉంచుకున్నారు. కాని మీరు అంటే మీ బుద్ధా..? మీ ఆలోచనలే మీరా? మీ భావనలే
మీరా? మీరెవరు? ఈ రకమైన ఆలోచనే- స్వాధ్యాయం. ఇది మిమ్మల్ని మీరు ఇంతవరకూ
చూడని ప్రపంచానికి తీసుకువెళ్తుంది. మీ మనసులోని కష్టాలను, బాధలను
తొలగిస్తుంది.
కాయానుపశ్చన- శరీరాన్ని గమనించు. ఇది తపస్సు.
వేదానుపశ్చన- శరీరంలో స్పందనలను గమనించు.
చిత్తానుపశ్చన- మనసును, అందులోని జ్ఞాపకాల ముద్రలను, ఆలోచనలను, భావాలను గమనించు.
ధమ్మానుపశ్చన- నీదైన నీ స్వభావాన్ని గమనించు. స్వధర్మాన్ని గమనించు.
పతంజలి మహర్షి కూడా ఈ విషయాన్నే చెప్పాడు.
తపస్స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన
మానసికమైన,
భావాత్మకమైన దోషాలను, భయాలను, ఉద్వేగాలను స్వాధ్యాయం పోగొడుతుంది.
భగవంతుని ప్రేమించి అతనిని శరణు వేడినపుడు (ఈశ్వర ప్రణిధాన) ఈ ప్రక్రియ
సంపూర్ణమవుతుంది. భగవంతుని పట్ల ప్రేమ అనేది మనలో ఎలా కలుగుతుంది ?
మొదటి
మెట్టు ఏమంటే, దైవం నీకంటే వేరుగా ఉన్నాడని భావించడం. సమర్పణ అనేది
జరగాలంటే దైవం, నేను.. ఈ ఇద్దరూ కావాలి. ఒకరు సర్వవ్యాపి, సర్వశక్తివంతుడైన
భగవంతుడు. రెండవది ఏమీ కాని నువ్వు. ఎప్పుడైతే ‘నేను ఎవరినీ కాను, ఏమీ
కాను’ అని తెలుసుకుంటావో అపుడే భగవంతునితో కలవగలం. సృష్టి అంతా భగవంతుడే.
నీ శరీరం అతనిది. అనేక విరుద్ధమైన భావాలతో, సంఘర్షణలు, అందమైన ఆలోచనలతో
నిండిన మనసూ అతనిదే. ఈ సమర్పణాభావం నిన్ను నీ కేంద్రానికి చేరుస్తుంది.
ఈశ్వర
ప్రణిధానం సమాధికి దారితీస్తుంది. నీ శరీరంలోని అణువణువూ భగవంతుడికి
సమర్పించాలి. ప్రతి శ్వాసా, ప్రతి ఆలోచనా, మంచీ, చెడూ అన్నీ సమర్పించాలి.
చెడును
సమర్పించినపుడు నీవు విముక్తుడవు అవుతున్నావు. నీలోని మంచి అనుకున్నవాటిని
సమర్పించినపుడూ నీవు విముక్తుడవు అవుతున్నావు. మంచి గుణాలు నీలో గర్వాన్ని
పెంచుతాయి. దీనివల్ల భగవంతునితో చేరకుండా ఉండిపోతే ఇక నిన్ను ఏ శక్తీ
అతనితో కలుపలేదు. భగవంతునికి సన్నిహితం కావాలా లేదా అన్నది నీ చేతుల్లోనే
ఉంది. భగవంతునికే కాదు ఎవరికైనా సన్నిహితంగా ఉండాలా లేదా అనేది నీ చేతుల్లో
ఉన్నది తప్ప ఎదుటివారి చేతుల్లో కాదు. మరి సన్నిహితంగా ఉన్నానా..? లేదా..?
అనేది ఎలా తెలుస్తుంది? ఎదుటివారి ప్రవర్తనను బట్టి దీనిని గుర్తించడం
సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు భగవంతుడికి సన్నిహితంగా ఉన్నావన్న విషయం
నువ్వు మాత్రమే, నీ మనసు మాత్రమే చెప్పగలదు. నీవు ఏ విత్తనం నాటితే ఆ మొక్క
మొలుస్తుంది.
పనికిరాని మొక్కల విత్తనాలు నాటితే
పనికిరాని మొక్కలే మొలుస్తాయి. చాలాసార్లు మనం ప్రత్యేకంగా నాటకపోయినా సరే
పనికిరాని (కలుపు) మొక్కలు వస్తూనే ఉంటాయి. పనికొచ్చే మొక్క పెరగాలంటే
కలుపును తీసివేస్తూ ఉండాలి. అవసరం లేని ఆలోచనలు, సందేహాలనే కలుపును..
స్వాధ్యాయం తీసివేస్తుంది. జీవితానికి ఏది కావాలో దానినే పెరగనిస్తుంది.;
రవిశంకర్ గురూజీ
0 వ్యాఖ్యలు:
Post a Comment