అడుగడుగునా అడ్డంకులు.
>> Friday, August 7, 2015
వ్యాధి స్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతిదర్శన
అలబ్ధ భూమికత్వాన్ అవస్థి తత్వాని చిత్త విక్షేపః అస్తే అంతరాయః
- పతంజలి యోగసూత్ర 30
అలబ్ధ భూమికత్వాన్ అవస్థి తత్వాని చిత్త విక్షేపః అస్తే అంతరాయః
- పతంజలి యోగసూత్ర 30
అడ్డంకులు
తొమ్మిది రకాలుగా ఉంటాయి. మొదటిది వ్యాధి. అంటే శారీరక అనారోగ్యం. రెండోది
స్త్యాన అంటే మానసిక అనారోగ్యం. అర్థం చేసుకోలేకపోవడం. ఉదాహరణకు మీరు
ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు ఏమీకాదు గాని, ధ్యానానికి కూర్చుంటే
మాత్రం చికాకుగా అనిపిస్తుంటుంది. ఓపిక నశిస్తుంది.
తరువాతది
సంశయం అంటే సందేహం. ఇది మూడు రకాలు. నిన్ను నీవు సందేహించుకోవటం.
చేయాల్సిన పని చేయలేనేమోనని సందేహిస్తావు. అందరూ హాయిగా ధ్యానం
చేసుకుంటున్నారు. నీవు మాత్రం ఎప్పటికీ చేయలేవని అనుకుంటావు. రెండోది
ధ్యానం చేసే విధానంపైన సందేహం కలుగుతుంది. వేరే మార్గంలో ప్రయత్నించాలని
అనుకుంటావు. ఇక మూడోది గురువును శంకిస్తావు. ఈ మూడురకాల సందేహాలు నీ
అభివృద్ధికి అడ్డుగా మారుతాయి. మంచి విషయాలనే సందేహిస్తావు గాని,
చెడ్డవాటిని ఏమాత్రం సందేహించవు. ధ్యానమార్గంలో ఇది పెద్ద అడ్డంకి.
తరువాతది
ప్రమాద. అంటే తెలిసి, కోరి ఉండి తప్పుగా పని చేయడం. దురుద్దేశంతో పని
చేయడం, ఫలానా పని చేయడం నీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. అయినా సరే ఆ
పనిని చేస్తుంటావు.
ఐదోది ఆలస్యం. అంటే బద్ధకం.
సాధారణంగా నీవు బాగా చురుకుగా ఉన్నా సరే యోగాసనాలు, ప్రాణాయామం
చేయమనేసరికల్లా బద్ధకం ముంచుకొస్తుంది. బద్ధకం జీవితంలో ఏ పని మీదనైనా
ప్రభావం చూపగలదు.
ఆరోది.. అవిరతి. అంటే ఇంద్రియ
విషయాలపై ఎక్కువ మమకారం చూపుతూ ఉండటం. కోరికలను వదులుకోకపోవడం. నీకు ఆకలి
వేసింది. కాస్త ఆహారం తీసుకున్నావు. నీ కడుపు నిండాక ఇక ఆ రోజంతా అన్నం
గురించి ఆలోచించాల్సిన పని లేదు కదా. ఒక అందమైన ప్రదేశాన్ని చూసి ఆనందించాక
ఇక చూడాలనే ఆలోచన తగ్గిపోవాలి. అదేపనిగా ఆ ప్రదేశాన్ని గురించే ఆలోచిస్తూ
ఉండకూడదు. ఇంద్రియాల ద్వారా చేసే కర్మలు కొంత సమయానికే పరిమితం కావాలి.
అలాకాకుండా పదే పదే ఒకే విషయాన్ని ఆలోచిస్తూ ఉండటమే అవిరతి. ఇదే కామానికి
కూడా వర్తిస్తుంది. కామతృష్ణ కలిగింది. దానిని తీర్చుకుంటావు. అక్కడితో
దాన్ని వదిలేయాలి. అంతే తప్ప అదేపనిగా అవే ఆలోచనలు మోసుకుని తిరగరాదు.
అవిరతిని అదుపులో ఉంచుకోకపోతే పెద్ద ఆటంకం కలుగుతుంది.
ఏడోది
భ్రాంతి ప్రదర్శన. ఈ చిత్తం చాలామందిలో కనిపిస్తుంది. హఠాత్తుగా ఓ పెద్ద
స్టార్ అయిపోయినట్టు ఊహించుకుంటావు. సాధకులలో చాలామంది తమకు ఏవో సిద్ధులు
కలిగినట్టు ఊహించుకుంటారు. నిజానికి ఊహ పూర్తిగా అసత్యం కాదు. అలాగని
సత్యమూ కాదు. కాబట్టి ప్రజలు దానికి పట్టుకునేందుకు తాపత్రయపడుతుంటారు.
కేవలం ఈ భ్రాంతి మీదనే ఆధారపడి అనేక (ఆధ్యాత్మిక) పథాలు వెలిశాయి. వారు
సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అవన్నీ యోగమార్గంలో వచ్చే అడ్డంకులు
మాత్రమే. దీనికే యోగమాయ అని పేరు. మనసు పూర్తిగా శూన్యం కాని స్థితిలో
కలిగే స్పందనలు అవి. ఇంకా ఎక్కడో కొంచెం కోరికలు, ఆసూయా ద్వేషాలు, భయాలు,
ఉండిపోయాయన్నమాట. ఇటువంటి భ్రాంతిలో చిక్కుకుపోవద్దు.
అలబ్ధ భూమిగత్వ
అంటే ఏ స్థితినీ, సమాధి స్థితిని లేదా ప్రశాంతతను.. పొందలేకపోయామనే భావన.
చాలా కాలం నుంచి సాధన చేస్తున్నా ఏ ప్రయోజనమూ లేదని అనుకుంటూ ఉంటారు. ఇది
కూడా ఒక అడ్డంకి. అలా అని సాధనను వదిలేయరు.. ముందుకు వెళ్లలేరు.
అనవస్థితత్వ-
అస్థిరత. కొన్ని మంచి అనుభవాలు కలుగవచ్చు. నీకు ప్రశాతంగా, అద్భుతంగా
ఉండవచ్చు. కాని ఆ అనుభూతి స్థిరంగా కాకుండా కొద్ది సేపు మాత్రమే ఉండి
మాయమైపోతుంది. చాలామంది సాధకులు చేసే ఆరోపణ.
ఈ అడ్డంకులన్నీ
దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖం మనసును బలహీనం చేస్తుంది. అపుడు శరీరం కూడా
నీ మాట వినదు. శరీరానికి మనసుకు గల సంబంధం దెబ్బతింటుంది.
దుఃఖదైర్మనస్యాంగం అజయత్వా శ్వాస ప్రశ్వాస విక్షేప సహభూత్వః
- పతంజలి యోగసూత్ర 31
దుఃఖం,
మానసిక దౌర్బల్యం, భ్రాంతి, మనసుకు శరీరానికి సమతౌల్యం లేకపోవడం, శరీరం నీ
మాట వినకపోవడం, అస్థిరమైన శ్వాసక్రియ.. ఇవన్నీ ఈ అడ్డంకుల వలన కలిగే
పరిణామాలు.
శ్రీశ్రీ రవిశంకర్,
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
0 వ్యాఖ్యలు:
Post a Comment