శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆమ్మా! మాకోసం నీకెందుకిన్ని రాళ్ల దెబ్బలు.

>> Tuesday, August 4, 2015

ప్రస్తుతం పీఠం లో ఉన్న నెరేడు చెట్లు విరగ పండాయి . తియ్యని ఫలాలను  ప్రసాదిస్తున్న ఈచెట్లు ఆ కాయలను తింటున్నవారిని  చూస్తూ పాలుతాగుతున్న పిల్లలనువీక్షించే తల్లిలా మురిసిపోతున్నట్లనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా.  హిందూపబ్లిక్ స్కూల్ పేరుతో పాఠశాలను నడిపేప్పుడు . పిల్లలు నాటారీ చెట్లను.నాకు చెట్లంటే ప్రాణం. వాటి కొమ్మలను అనవసరంగా ఎవరన్నా విరుస్తున్నా మనసు విలవిల లాడుతుంది. ఇప్పుడు రోడ్డున పోయేప్రతివారూ, పశువులకాపరులు, పాఠశాలలకు వెళ్ళే పిల్లలు వచ్చి మగ్గి రాలిపడిన తియ్యని కాయలను దోసిళ్లనిండా ఏరుకుని తింటున్నారు. అంతవరకు బానే ఉంది. మేము గమనించటం లేదనిపిస్తే చాలు. కర్రలు విసరటం. రాళ్లువిసిరి కాయలు రాలగొట్టాలని ప్రయత్నించటం కొమ్మలు విరగదీయబూనటం తో బాగా కోపం వస్తుంది.
పసివాళ్లకంటె తెలియదు. పెద్దవాళ్లుకూడా  మర్యాదమరచి ఇదేపనికి పాల్పడుతుండటం చూస్తే వీళ్లదురాశకు ఒళ్లు మండుతుంది. అలా కర్రలు రాళ్లువిసిరినప్పుడు చెట్లకుకూడా ఎంత బాధకలుగుతుందో అని నాకు బాధ, చిన్నప్పటినుండి చదువుకున్న కథలలో,పెద్దలద్వారా నేర్చుకున్న వాటిలో చెట్లు,మూగజీవుల బాధలు నామనసుపై ప్రగాఢముద్రను వేసి ఉన్నాయి. అందువలన చెట్లంటే మమకారం నాకు. ఇప్పుడేమో !ఆచెట్లను చూస్తున్నప్పుడల్లా  అమ్మా! నీవెందుకు ఇలా కాయలు కాయాలి. ఇలా మాచేత ఎందుకు హింసింపబడాలి  అనిఅడగాలని పిస్తుంది. పాపం సమాధానం చెప్పలేవుకదా ఆచెట్లు.
చివరకు కొన్నిసార్లు జనాన్ని ఇక్కడకు రావద్దని కసురుకుంటున్నాను కూడా.  అయ్యో నలుగురూ తినే ఫలాలు వృధాగా నేలపాలే కదా ! రానిస్తే పోలే అనుకుంటాను మరలా.
ఈ మధ్య రెండు జర్మన్ షేఫర్డ్ కుక్కపిల్లలు పెంచుతున్నాము. వాటిలో రాజుగాడు కాస్త గట్టిగా అరచి భయపెడుతూ ఉంది. కనుక కొద్దిగా చూసుకుని వస్తున్నారు.

చక్కగా కాయలు ఏరుకుని తినవచ్చుకదా ! ఎందుకిలా హింసించటం చెట్లను?
 ఇంకా కొందరున్నారు . పీఠం లో పూజకు వచ్చినప్పుడు చెట్లకున్న పూలన్నీ  తెంపి దేవతలమీద వేసే దిక్కుమాలిన భక్తి ప్రదర్శిస్తుంటారు. నేనుకూడా  పూజకు అవసరమైన కొన్ని పూలు కోసుకుని మిగతావాటితో చెట్లన్నీ కిలకిలా నవ్వుతున్నట్లుగా ఉండనిస్తాను. . వెంటవచ్చిన పిల్లలు ఆకులు తుంచటం కొమ్మలువిరవటం చేస్తున్నా  మహాతల్లులు! కనీసం ఇది తప్పురా అనికూడా చెప్పరు వారి పిల్లలకు. మేం కోప్పడితే  . అయ్యో! దేవునికి పెట్టటానికే కదండీ ! అని దీర్ఘాలు తీస్తారు.
అమ్మా! దేవునికి సమర్పించాలంటే మీ ఇంటివద్దనుండి తీసుకురండి . లేదా కొనుక్కురండి . ఇక్కడ కొచ్చి కష్టపడి కోయకండి. అంత కష్టపడేపనులు మేం చేస్తాం కదా ? అని నవ్వుతూనే చెబుతాను లోపల బాధపడుతూనే.
ఇలా మొక్కలను చెట్లను హింసించకుండా మన అవసరాలకు వాటి ఫలపుష్పాలను వాడుకోవాలనే ఇంగితం కలగదా మనకు. 
నా  ప్రశ్నకు సమాధానం రాదు. వీల్లలో మార్పూ రాదు ఎన్నిసార్లు చెప్పినా

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP