శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహోపకారం చేసే 30 రకాల శివలింగాలు

>> Saturday, March 14, 2015

మహోపకారం చేసే 30 రకాల శివలింగాలు
30 Great Shiva Lingas
సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...
1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
3. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
4. రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.
5. ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
6. తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
7. లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
8. కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.
9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
10. శర్కరామయలింగం: సుఖప్రదం.
11. సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.
12. పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం
13. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
14. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
15. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
17. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.
18. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.
19. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
20. దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
21. వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం
22. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
23. సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
24. రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.
25. ఇత్తడి – కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.
26. ఇనుము – సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.
27. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
28. తుsసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.
29. స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
30. సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. ఆ దారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారానిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.
ఇవి కాకుండా మరికొన్ని శివలింగాలున్నాయి. మన పురాణాల్లో వర్ణ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. దాని ప్రకారం ఏయే వర్ణాలవారు ఏ రకమైన లింగాలను అర్చించాలి అంటూ వివరాలు అందించారు. ఎవరు ఏ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నది పురాణాలలో విశదీకరించారు. ఆ సమాచారాన్ని అనుసరించి బ్రాహ్మణులు రస లింగాన్ని, క్షత్రియులు బాణ లింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలాలింగాన్ని పూజించాలని పురాణాలు సూచిస్తున్నాయి. వితంతువులు స్ఫటిక లింగాన్ని పూజించవచ్చని చెబుతున్నాయి.
సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో లయ కారకుడైన మహేశ్వరునిది ఎంతో సాత్విక స్వభావం. కనుకనే పరమశివునికి బోళా శంకరుడనే పేరు తెచ్చి పెట్టింది. దేవతలకు ముప్పు తెచ్చిపెట్టే ఏ దైత్యుడైనా ముందుగా మొక్కేది, ప్రార్ధించేది కరుణాసముద్రుడైన మహేశ్వరుడినే. శివుడు అనుగ్రహిస్తే ఎంత కరుణా సముద్రుడో ఆగ్రహిస్తే మాత్రం ఇక వారి అంతు చూస్తాడు. కనుకనే పరమేశ్వరుని భక్త సులభుడు అంటారు. కోరిన వరాలు ప్రసాచిందే ఆ బోళా శంకరుని అనుగ్రహం పొందడానికి శివరాత్రిని మించిన రోజు లేదు. శివరాత్రినాడు శివభక్తులే కాదు, హిందువులంతా నియమనిష్టలతో శివుని పూజించి, ప్రార్థించి, తరిస్తారు. మన తెలుగువారికి పరమేశ్వరుడితో అనాదిగా అపూర్వమైన అనుబంధం ఉంది. మనది తెలుగుదేశం. ఈ ప్రాంతాన్నే త్రిలింగ దేశమని కూడా అంటారు. అంటే మూడు పవిత్ర, మహిమాన్విత శివలింగాలైన శ్రీశైలం, కాళేశ్వరం దాక్షారామం నడుమ ఉన్న ప్రదేమని అర్ధం. కాలగమనంలో ఈ ఎల్లలు విస్తరించాయి. అయినా మనకు శివుడితో ఉన్న అనుబంధం మాత్రం చెరిగిపోలేదు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, శివుని నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో 13 లేదా 14వ రోజును శివరాత్రిగా మనం పాటిస్తాము. శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసి, ఉపవాసం, జాగరణ ఉంటూ శివనామస్మరణ చేసే ఆ భక్తుడికి పరమేశ్వరుడు కటాక్షించి కోరిన వరాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
శివ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి పరమ పుణ్య ప్రదేశాలని మనకు తెలుసు. అవి మాత్రమే కాదు, ఆంధ్రదేశంలో ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. ఈ పుణ్య క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానిదీ ఒక్కో చరిత్ర. ఇంద్రకీలాద్రి మీద మల్లికార్జునిది ఒక కథ అయితే, కోటప్పకొండ మీద త్రికూటేశ్వరునిది మరో గాథ. అలాగే వేములవాడ. ఇటువంటి క్షేత్రాలన్నీ శివరాత్రి రోజు మాత్రమే కాదు, ఇతర దినాల్లోనూ భక్తులతో రద్దీగా ఉంటాయి. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. శివ పూజా విధానమూ తేలికే. మహావిష్ణువుకు పెట్టినట్టు దద్దోజనం, చక్రపొంగలి వంటి నైవేద్యాలు పరమేశ్వరుడికి అక్కరలేదు. ఒక్క అభిషేకం చాలు.
మనసంతా శివుడిపై లగ్నం చేసి, చేసే అభిషేకం చాలు శివుని ప్రసన్నం చేసుకోవడానికి, తన మీద భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి అనుగ్రహం పొందడం ఎంత తేలికో, ఆయన ఆగ్రహిస్తే రక్షణ పొందడం అంత కష్టం. తెలిసీ తెలియక భక్తుడు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమిస్తాడా శంకరుడు.
బోళా శంకరుడు భక్తులపై వెనకా ముందు చూడకుండా కరుణ కురిపించే లక్షణమున్నదని తెలుసుకున్న ఎందరో రాక్షసులు, ఆయనను ప్రసన్నం చేసుకుని. ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. వరాలు ప్రసాదించడంలో, భక్తులను కటాక్షించడంలో ఈశ్వరుడి గుణమే అంత. ఆయన కరుణే అంత. భస్మాసురుడు వంటి రాక్షసులపై ఆయన కురిపించిన ఆ కరుణ అపారం.
మహాశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలున్నది మన భారతదేశంలోనే. సౌరాష్ట్రలో సోమనాథునిగా, శ్రీశైలంలో మల్లికార్జునిగా, ఉజ్జయినిలో మహా కాళేశ్వరునిగా ఇలా 12 ప్రాంతాలలో జ్యోతి స్వరూపంలో వెలశాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రాలన్నీ పరమ పవిత్రమైనవి. మనకు ఎంతో పుణ్యక్షేత్రమైన కాశీలో కూడా దేవుడిది జ్యోతిర్లింగ రూపమే. ఈ జ్యోతిర్లింగాలలో ఎక్కువ అంటే ఐదు క్షేత్రాలున్న రాష్ట్రం మహారాష్ట్ర ఆ క్షేత్రాలేమిటంటే ఉజ్జయని, పర్లి, డాకిని, నాసిక్, దేవసరోవర్ ఈ ప్రాంతాలలో మహాకాళుడిగా, వైద్యనాథుడిగా, త్రయంబకేశ్వరుడిగా, భీమశంకరుడిగా, ఘ్రశ్నేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు.
కావడానికి శివుడు లయ కారకుడైనా జనులకు ఏదైనా ముప్పు వాటిల్లుతుంటే చూస్తూ కోర్చోడు. జన సంరక్షణకు నడుము బిగిస్తాడు, సాగర మధనమపుడు జనించిన హాలాహలాన్ని స్వీకరించడం, గంగను తలలో ధరించడం దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. భక్తుల మొరను ఆలకించి వారిని ఆడుకోవడంలో ముందుండే పరమేశ్వరుని మనసారా పూజిద్దాం. ఆయన కృపకు పాత్రులమవుదాం.

1 వ్యాఖ్యలు:

sahoo March 15, 2015 at 12:26 PM  

We can see a wonderful shivalinga in puttaparthi, The prasanthi nilayam itself as shivalinga can be found in google maps only with the following link

Note: dont forget satelite image view setiing

https://www.google.co.in/maps/place/Prashanthi+Nilayam/@14.1655753,77.8103044,197m/data=!3m1!1e3!4m2!3m1!1s0x3bb164ceb60c226f:0x30e17984363a75b?hl=en

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP