శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అస్పృశ్యత-బ్రాహ్మణిజం

>> Friday, January 9, 2015

అస్పృశ్యత-బ్రాహ్మణిజం

ప్రపంచంలోని రెండు బలీయ సంస్కృతుల మధ్య పోటీతత్త్వం. దానిలో భాగంగా మతమార్పిడులు, దేశభద్రతపై దాని ప్రభావం అనే విషయాన్ని గత వ్యాసంలో కొంత చూశాం. మతమార్పిడులపై ప్రస్తుతం జరుగుతున్న వివాదాల జోలికి పోకుండా వాటి కారణాలను పరిశీలించి మనం ఆత్మవిమర్శ చేసుకోవల్సిన విషయం ఒకటి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇదే అస్పృశ్యత, సామాజిక, ఆధ్యాత్మిక అసమానత.
మనిషికి ఆహారం, నీరు ఎంత నిత్యావసరాలో మత విషయంలో సమానత కూడా అంతే అవసరం. తానున్న వ్యవస్థలో ఈ సమానత దొరకనప్పుడు అతడు తన వ్యవస్థ నుండి మరొక వ్యవస్థలోకి వెళతాడు. మతమార్పిడిపై ఇతరుల ప్రచారం కొన్ని వర్గాలపైనే ఎక్కువ ప్రభావం ఎందుకు చూపగలిగింది అనడానికి కారణం ఆ వర్గాలు ఈ సంస్కృతిలో భాగంగా భావించుకోకపోవడమే.
అస్పృశ్యత, వర్ణవ్యవస్థ గురించి ఎలాంటి వివరణ ఇవ్వడానికి ముందు మొట్టమొదటగా హిందూసమాజం అసమానతకు గురైన ఈ వర్గాలతో క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మతమార్పిడుల దృష్టితో కాదు. మన ఉపనిషత్తులలో చెప్పిన సంస్కారం దృష్ట్యా ఇది అవసరం. ఇతర సంస్కృతుల వారు మనల్ని తప్పుపట్టడానికున్న ఒకే ఒక అంశమిది. దురదృష్టవశాత్తూ మన సంస్కృతికి వ్యవస్థాగత నిర్మాణం (Organizational structure) లేకపోవడం వల్ల ఈ పనిని ఎవరు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. దీన్ని బహుశా హిందూ సమస్యల్ని గూర్చి చర్చించే వి.హెచ్‌.పి. లాంటి సంస్థలు సాధు పరిషత్తుల ద్వారా చేయించడంపై ఆలోచించాలి.
అస్పృశ్యత అనే పేరు మనుస్మృతిలో కానీ, భారతం, రామాయణంలలో కానీ మరే ఇతర స్మృతిలో కానీ కనిపించడం లేదు. చండాలుడు అనే పదం ఉంది కానీ అది ఈనాడు మనం ఎస్‌.సి.లుగా భావించే వర్గాన్ని ఉద్దేశించి చెప్పింది కాదు. బ్రాహ్మణసీ్త్రకి, శూద్రుడితో కలిగిన సంబంధం వల్ల పుట్టినవాళ్లని చండాలురనీ, వారిని దూరంగా పెట్టాలనీ స్మృతుల్లో చెప్పారు. వీరిని శూద్రులలో భాగంగానే చెప్పారు. ఇది క్రమక్రమంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఎస్‌.సి. వర్గాలకు ఎలా అన్వయించడం జరిగిందో చరిత్రకారులు పరిశీలించాల్సి ఉంది. భరతఖండంలో ఒకే సంస్కృతి ఉన్నంతకాలం ఈ వర్గాలవారు ఈ సంస్కృతిలో ఉన్నా ఇతర సంస్కృతులతో సంపర్కం కలిగిన తర్వాత వాటిలోకి క్రమక్రమంగా వెళ్ళడం జరిగింది. ఒకవైపు నుండి వెలివేత. మరోవైపు నుండి ఆహ్వానం- దీని పరిణామం చెప్పాల్సిన పనిలేదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక అసమానతలను తొలగించడానికి చట్టాలు వచ్చాయి. హిందూ మత పెద్దలు కానీ, సమాజం కానీ ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. చరిత్రలో ఏ శతాబ్దంలో గమనించినా సంఘంలో సంస్కరణల్ని మొట్టమొదట ప్రవేశపెట్టినవారూ, సమర్థించిన వారూ బ్రాహ్మణవర్గాలే. ప్రస్తుత వ్యవస్థలో ఎస్‌.సి. అధికారుల్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్ణకుంభాలతో స్వాగతం చెప్పేది బ్రాహ్మణ పూజారులే. సామాజిక మార్పును పూర్తిగా అవగాహన చేసుకున్నవి బ్రాహ్మణ వర్గాలే. నగర ప్రాంతాల్లో అసమానతలు పూర్తిగా అంతరించినా, గ్రామాల్లో ఇలాంటివి దేవాలయ ప్రవేశం మొదలైన సందర్భాల్లో ఇంకా ఉంది. గ్రామాల్లో కూడా మార్పు తేవడానికి చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి.
అస్పృశ్యతకూ, బ్రాహ్మణవర్గాలకూ సంబంధాన్ని కల్పించడం, కేవలం బ్రాహ్మణ వర్గాన్ని మాత్రమే గురిపెట్టి నిందించడం, ఒక వ్యూహంలో భాగం. హిందూమతాన్ని అంతో ఇంతో ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపజేస్తున్నది బ్రాహ్మణవర్గమే. ఈ కొద్దిపాటి అడ్డంకి కూడా తొలగిపోతే చాలా సులభంగా తమ సంస్కృతిని వ్యాపింప చేయవచ్చనే భావంతో ఈ వ్యూహాన్ని అమలు చేయడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఈ ప్రణాళికతోనే కొందరు మేధావులు ‘బ్రాహ్మనిజం’ అనే పదాన్ని ప్రతి సందర్భంలోనూ వాడుతూ ఒక వర్గం పట్ల ద్వేషం రెచ్చగొట్టే రచనలు చేయడం బాధాకరం.
చరిత్ర పాఠ్యపుస్తకాలు వ్రాసేవాళ్లు ఎన్ని విషయాలను దాచినా అనేకమంది మేధావులు చరిత్రలోని అన్ని కోణాలనూ పరిశీలించి వాస్తవాలు వ్రాసారు. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా పదవ శతాబ్దం తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకంటే ఎక్కువ హింసను ఎదుర్కొన్నవారు బ్రాహ్మణులు, రాజులు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నా కేవలం రెండింటిని మాత్రం చెబుతాను. హిందుత్వవాదుల రచనల్ని పక్కనబెట్టి అంబేద్కర్‌ వ్రాసిన "Revolution and Counter-Revolution in india ' అనే పుస్తకాన్ని చూస్తే ఇస్లాం దండయాత్రల ప్రారంభ కాలంలో పురోహిత వర్గాలపై దాడి ఎలా జరిగింది. బౌద్ధం ఎలా నశించింది. హిందూమతం ఎలా నిలదొక్కుకుంది అనే విషయంపై ఆయన ఇలా వ్రాశారు. "The Buddhist priesthood perished by the sword of islam and could not be resusciated.On the other hand it was not possible for islam to annihilate the brahmanic proesthood''.  బౌద్ధపండితులు ముఖ్యంగా ఒకేచోట, అంటే వాళ్ళ ఆరామాలలో ఉండటం వల్ల చాలామంది హతమయ్యారు. పుస్తకాలు కాల్చివేయబడ్డాయి. కొందరు టిబెట్టుకు పారిపోయారు. హిందూమతంలో వేదాల్నీ, మిగతా శాసా్త్రల్నీ పుస్తకరూపంలో వ్రాయకపోవడం, కేవలం కంఠతాపెట్టడం, ప్రతి బ్రాహ్మణుడూ తన వేదశాఖను నేర్చుకోవడం వల్ల గ్రామగ్రామాల్లో ఉన్న పండితులందరినీ నిర్మూలించలేకపోయారని ఇదే సందర్భంలో అంబేద్కర్‌ వివరించారు.
"Donald lach '  వ్రాసిన "Asia in the Making of Europe'' అనే పుస్తకం మూడు వాల్యూముల్లో ఉంది. మొదటి వాల్యూములో పదహారవ శతాబ్దం చివర్లో ఫ్రాన్సిస్‌ జేవియర్‌ అనే మత ప్రచారకుడు గోవాలో బ్రాహ్మణులపై సాగించిన హింసాకాండ వర్ణింపబడింది. ఈ వర్గాన్ని నాశనం చేస్తే తప్ప తమ మతాన్ని వ్యాపింపజేయలేమంటూ ఈయన స్పెయిన్‌లో ఉన్న రాజుకు లేఖ పంపాడు. బ్రాహ్మణుల్ని చాలామందిని చంపడం, చేతులు తెగకొట్టడం జరిగింది. దాని స్మృతిచిహ్నంగా ఈనాటికీ పాత గోవాలో ఒక స్తూపం ఉంది. ఈ వివరాలు చాలా మటుకు ఇంటర్నెట్‌లో కూడా లభిస్తాయి. ‘బ్రాహ్మనిజం’ అనే భావనకి ఇతడే మూలం. తర్వాతి కాలంలో ఈ వ్యూహాన్నే ఇతరులు అనుసరించారు. మాసిన పంచ కట్టుకుని షర్టు లేకుండా పగలంతా గుడిలో నిల్చుని ఉండే బ్రాహ్మణుడంటే అందరికీ కనికరమే ఉంటుంది. ఈ బ్రాహ్మణులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఇలాంటి పేద బ్రాహ్మణుడు మన మేధావికి వర్గ శత్రువు. భారతదేశంలో వెనుకబడ్డ వర్గాలవ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు కానీ పూజారి కాలేడు అంటూ వ్రాస్తూంటారు. ఇది చాలా బాధాకరం.
ఇటీవలి వరకూ బ్రాహ్మణుడికి అంటరానితనం ఇంట్లోనే మొదలయ్యేది. మడిబట్ట కట్టుకుని వంటచేసే తల్లిని లేదా పూజచేస్తున్న తండ్రిని పిల్లలు ముట్టడానికి వీలులేదు. తాము పవిత్రంగా ఒక పనిని చేస్తున్నామనే భావన వారిలో ఉండటమే దీనికి కారణం. అలాగే తాము ఎవరినైనా ముట్టుకున్నపుడు ఇంటికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసారే కానీ మరేమీ చేయలేదు. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం కూడా లేదు. ప్రపంచంలో మిగతా దేశాల్లో అంటరానితనం పాటించలేదు గానీ మతప్రచారంకోసం ఇతర దేశాలపై దాడులు చేసి మనుషుల్ని బానిసలుగా బంధించి తీసుకెళ్ళారు. మార్కెట్‌లో వేలం వేశారు. కాళ్ళకు సంకెళ్లు వేసి కొరడాలతో హింసించారు. తమ సిద్ధాంతాన్ని నమ్మని లక్షలాదిమందిని మంటల్లో కాల్చివేశారు. చరిత్ర చదవకపోవడం మనకు ప్రమాదకరం.
అనాదిగా సమాజంలో పేదరికాన్ని అనుభవిస్తూ చరిత్రలో ఎన్నో హింసల్ని అనుభవించిన నేపథ్యంలో అంటరానితనాన్ని బహిష్కరిస్తే మొట్ట మొదటిగా స్వాగతించేది బ్రాహ్మణవర్గాలే.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com  కు పంపండి


andhrajyothy  daily

3 వ్యాఖ్యలు:

srinu the boss January 9, 2015 at 6:01 AM  

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక అసమానతలను తొలగించడానికి చట్టాలు వచ్చాయి. హిందూ మత పెద్దలు కానీ, సమాజం కానీ ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు.?
..అభ్యంతరం పెట్టారు కనుకనే హిందూ కోడ్ బిల్లు ప్రవేశ పెట్టడం జరగలేదు.. మీరు హిందూ కోడ్ బిల్లు గూగుల్ చేసుకోగలరు

voleti January 9, 2015 at 6:58 AM  

దుర్గేశ్వర గారు..శ్రీ అరవిందరావు గారు వాస్తవ పరిస్థితులు చాలా బాగా రాశారు..మీ ద్వారా మరోసారి అందించారు.. ధన్యవాదములు..
@ srinu the boss గారు ..నాకు తెలిసి "హిందూ కోడ్ బిల్లు" కి ఇక్కడ రాసిన ఆర్టికల్ కి సంబంధము లేదు.. పైగా నెహ్రూ గారు తరువాత ఈ బిల్లుని యధాతదంగా కాక మూడో నాలుగో బిల్లులుగా విడగొట్టి ప్రవేశపెట్టడము జరిగింది.. ఈ హిందూ కోడ్ లో భర్తను విడిపోయిన స్త్రీ కి భర్త యొక్క ఆస్థిలో వాటా పొందే హక్కుని కల్పించడం కోసం పెట్టబడింది..అయితే అప్పటి హిందూ కుటుంబాల పరిస్థితి విడాకులకి వ్యతిరేకత వలన మెజారిటీ మగవాళ్ళు వ్యతిరేకించారు.. ఆడవాళ్ళు కోరుకున్నారు.. ఈనాడు స్త్రీలకి కలిపించ అనేక చట్టాలను కొంత మంది ఆడవాళ్ళు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో రోజూ చూస్తునే వున్నాం.. ప్రతీ చట్టానికి మెరిట్స్ & డిమెరిట్స్ వుంటాయి తప్పవు.. మనకి చట్టాల్లో వున్న లొసుగులు ఆధారంగానే అనేక నేరాలు, అత్యాచారాలు జరుగున్నాయి.. అందువలన మనుషుల ప్రవర్తనలో మార్పు రావాలి గాని ఈ చట్టాలు కొంతమందికి చుట్టాలు..sorry to say..

voleti January 9, 2015 at 7:01 AM  

The Hindu Code Bill mentioned to give to the female members of the Hindu society full rights relating to property,
marriage, divorce, adaption, maintenance, inheritance, minority and guardianship. He protested against the evils of
dowry system. To him, all female should be given to equal individual freedom and social equality. The basic structure of the Hindu society should
be reformed. As the first Law Minister of independence India Dr. Ambedkar introduce the Hindu Code Bill to provide equal opportunities of
women as enjoyed by male members of the family.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP