శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమంతుని వేదాంత కథ

>> Tuesday, August 19, 2014

హనుమంతుని వేదాంత కథ
ఒక రోజు శ్రీ రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా.దేహ,జీవ ,పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు అని కోరాడు .అదే శిరోధార్యంగా భావించిన పరమ భక్త శిఖామణి మారుతి శ్రీ రామా ! వేదాంత రహస్యము తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మను వేరువేరుగానే భావించాలి .దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి, శరణాగతి పొందాలి.ఇతరులకు ఉపకారం చేస్తూ, వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి, సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ ...భగవంతుని పూజలు చేస్తూ ...భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటాన్నే ద్వైతం అంటారు.

జీవుడు, పరమాత్మ ఒక్కరే .ఎందులోను భేదం అనేది లేదు అని భావనలో, ఆచరణలో చూపించటం జ్ఞాన లేక, విజ్ఞాన లక్షణం అంటారు. ఇదే అద్వైత భావన. దేహ బుధ్యాతు దాసోహం, జీవ బుద్ధ్యాతు త్వదంశః ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్‌ రామా ! దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని .జీవ దృష్టిలో నీవు పరమాత్మవు. నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను.పరమాత్మ దృష్టిలో నీవే నేను-నేనే నీవు. ఈ మూడు లక్షణాలు నాలోనూ, నీలోను ఉన్నాయి. ఇంక భేదానికి అవకాశమే లేదు .అని స్పష్ట పరచాడు హనుమంతుడు..అంజనానందనుడి సమాధానం విని పరమానంద భరితుడయ్యాడు దాశరధి. త్వమేవాహం,త్వమేవాహం అని చాలా సార్లు హనుమను అభినందించాడు .

యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం భోగశ్చ, మోక్షశ్చ, కరస్త యేవ అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కానీ శ్రీ హనుమ సేవా తత్పరులైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు వరం అను గ్రహించాడు.దానికి వెంటనే ఆంజనేయుడు నువ్వు శివుడవు .నేను భద్రుడను.నీకూ నాకు భేదమే లేదు అని చెప్పాడు .

చిటికెల భాగవతం
అయోధ్యలో ఉన్నంత కాలం శ్రీ రామునికి సర్వ సేవలు హనుమంతుడే చేశాడు .ఇది చూసి సీత ,లక్ష్మణుడు,భరత శత్రుఘు్నలు చాలా బాధ పడుతున్నారు . వారికి రాముని సేవలు చేసే అవకాశమే రావటం లేదు .రాత్రి వేళల్లో సీతాదేవి చేయాల్సిన సేవలకు హనుమ అడ్డం వస్తున్నాడు.వీరంతా కలిసి ఆలోచించి,ఒక ప్రణాళిక సిద్ధం చేసు కొన్నారు .అన్ని సపర్యలు తామే చేసేటట్లు హనుమకు మాత్రం అతి చిన్నది అయిన ఒక పని అప్పగించారు .అదే చిటికెల కార్యక్రమం .ఆ పనినైనా తనకు ఉంచినందుకు పరమానందపడ్డాడు మారుతి .అందరికి అంగీకారమైన పరిష్కారం లభించింది.



ఆ రోజు హనుమ శ్రీ రాముడిని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు.పగలంతా గడిచి పోయింది .సీతాదేవి శ్రీ రాముని గదిలోకి ప్రవేశించింది.హనుమ బయటకు వచ్చేశాడు .తలుపులు మూసేశారు దంపతులు .రాముడు ఎప్పుడు ఆవలిస్తాడో తెలీదు అందుకని హనుమ విడువకుండా చిటికెలు వేస్తూనే ఉన్నాడు .రాముడికి ఆవులింతలు వచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.పధకం బెడిసికొట్టింది. మళ్ళీ అంతా సమావేశమై సేవలన్నీ ఆంజనేయుడే చేయాలి అని నిర్ణయించారు.ఈ విషయాన్ని హనుమకు తెలియజేశారు . అప్పుడు చిటికెలు వేయటం మానేశాడు మారుతి.దానితో శ్రీ రాముడు నిద్రకు ఉపక్రమించాడు.ఇదే చిటికెల భాగవతం .

భక్తుల సేవలో హనుమంతుడు
భక్తుల సేవలను స్వీకరించడమే కాదు ... అవసరమైతే ఆ భక్తులకు సేవ చేయడానికి కూడా భగవంతుడు వెనుకాడాడు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు వున్నాయి. అయితే అంతలా భగవంతుడి మనసును ఆకట్టుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి తాను నమ్మిన దైవం అనుగ్రహాన్ని పొందిన వారిలో �మధ్వమహర్షి� ఒకరు. ఆయన హనుమంతుడి భక్తుడు. నిరంతరం హనుమంతుడిని ధ్యానిస్తూ ఉండేవాడు. ప్రశాంతమైన వాతావరణంలో మధ్వమహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, హనుమంతుడిని సేవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. స్వామి సేవలోనే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. ఒకసారి ఆయన స్నానానికి వెళ్లి, నీరసం కారణంగా నీటిలో పడిపోయాడు. అదే సమయంలో ఒక పెద్ద కోతి వచ్చి ఆయనని కాపాడింది. అదే ఆయనని ఆశ్రమానికి చేర్చి సపర్యలు చేయసాగింది.

ప్రతి నిత్యం ఆ కోతి ఆయనకి ఒక రుచికరమైన ఫలాన్ని ఇస్తూ వుండేది. ఆ ఫలాన్ని తినగానే ఆయన ఆకలి తీరిపోయేది. ఇలా కొన్నిరోజులపాటు జరిగాక మధ్వ మహర్షి కాస్త కోలుకున్నాడు. అప్పుడు కూడా ఆయనకి ఏం కావాలనేది గ్రహించి, ఆ పనులను ఆ కోతి పూర్తిచేసి పెట్టేది. అలా మధ్వమహర్షి పూర్తిగా కోలుకునేంత వరకూ, ఆ కోతి అన్నిరకాలుగా ఆయనకి సేవలు చేసింది. ఆ కోతి సాక్షాత్తు హనుమంతుడేననే విషయం మహర్షి గ్రహించాడు. తన దైవంతో సేవలు చేయింకున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు హనుమంతుడు తన నిజరూపాన్ని ఆయనకి చూపించాడు. భక్తుడికి సేవచేయడంలో భగవంతుడికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదని అంటాడు. త్వరలో మహర్షి అక్కడ మద్ది చెట్టుగా అవతరిస్తాడనీ ... ఆ చెట్టు నీడలో తాను ఆవిర్భవిస్తానని చెబుతాడు. ఈ నేపథ్యంలో విలసిల్లుతున్నదే పశ్చిమ గోదావరి జిల్లాలోని �శ్రీ మద్ది ఆంజనేయస్వామి� క్షేత్రం. మధ్వమహర్షికి హనుమంతుడు రోజుకో ఫలాన్ని ఇచ్చాడనడానికి నిదర్శనంగా ఇక్కడ చేతిలో ఫలంతో స్వామి దర్శనమిస్తూ వుండటం విశేషం. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించి తరిస్తుంటారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP