శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అతిథి కి అన్నం పెట్టబుధ్ధిగాని దారిద్ర్యం పెరుగుతుంది జనంలో

>> Wednesday, November 27, 2013

ఒకనాటి సంస్కృతి, సంప్రదాయంలో అతిథి అనే మాట నిత్యం వినిపించేది.  ఏ సమయంలో నైనా ఎవరు వచ్చినా, ఆహ్వానించి, ఆదరించి, కడుపు నిండా భోజనం పెట్టి పంపటం జరిగేది.  అతిథి దేవోభవ అని దేవుడిలాగే అతిథిని గుర్తించే వారు.  రోజూ అతిథి పంక్తిని భోజనం చేయడం ఒక నియమంగా పెట్టుకునే గృహస్థులుండే వారు.  'వండనలవదు వేవురు వచ్చెనేని, అన్నపూర్ణకు ఉద్దియో అతని భార్య' అంటూ ఇల్లాలు ఇంటికొచ్చిన వారికి ప్రేమగా వండి వడ్డించేది. 
ఈ సంప్రదాయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.  అతిథి ఇంటికి వచ్చి భోజనం చేసి దీవించి వెళ్ళటం ఒక పుణ్యకార్యంగా భావించేవారు .   ఇప్పుడు ఇళ్ళకి వచ్చే వారే తగ్గిపోతున్నారు అనేది వాస్తవం.  చిన్న కుటుంబాలు వచ్చ్చాయి.  సంప్రదాయాలు, విలువలు మొత్తం తగ్గిపోయి వాటి స్థానంలో స్వార్థం, అహం రాజ్యమేలుతోంది.  ఎవరైనా కొత్తవాళ్ళు భోజనం వేళలో వచ్చారనుకుందాం! 'వాళ్ళు వెళ్ళాక భోజనం చేద్దాంలే' అనే మాట అనిపిస్తుంది కానీ, 'రండి మాతో కలిసి భోజనం చేయండి.  ఇవాళ మా అదృష్టం' అనే మాట వింటున్నామా! ఆలోచించండి.  దీనికి కారణం ఏమిటి?  ఆ ఇంటి వాళ్ళు నిజంగా బీదవాళ్ళు, వాళ్ళకే తిండి లేదు, ఇంకొకరికి ఏం పెడతారు అనుకునే అవకాశమే లేదు.  భోగ భాగ్యాలలో తులతూగుతున్న వాళ్ళే.  మరి దీనికి కారణం  ...   మానవ సంబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోవడమే. 
మనం తినటంలో వున్న ఆనందం మరొకరికి పెట్టడంలో కూడా వుండాలి.  ఈ రోజుల్లో యువత, పెద్ద పెద్ద నక్షత్రాల హోటళ్ళలో వేలకు వేలు ఖర్చు చేయడానికి వెనుకాడరు.  కానీ, ఒక వ్యక్తికి గుప్పెడు అన్నం పెట్టడానికి వాళ్ళకి చేతులు రావటం లేదు.  దానికి కారణం యువతది కాదు.  అతిథి అభ్యాగతులను ఆదుకోవటం మన ధర్మం అని చెప్పే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇట్లాంటి విషయాలపై శ్రద్ధ పెట్టక పోవడమే.  పెద్దలు చెబితే మంచి మాట మనసులోకి ఎక్కుతుంది. 
అయితే ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది.  మాకు టైము లేదు, మేము ఉద్యోగానికి వెళ్లి పోవాలి అని.   ఇవన్నీ నిజమే. కాని మనసుంటే మార్గముంటుంది. 
ఇప్పుడు బంధుత్వాలు - వారిలో సత్సంబంధాలు చాలా వరకు తగ్గిపోయాయి.  దీనివల్ల మాకేం లాభం అనే భావం పెరుగుతోంది.  ఒక విధంగా ప్రతి విషయంలోను వ్యాపార ధోరణి బాగా చొచ్చుకొస్తుంటే అతిథుల్ని గౌరవించటం మన సంప్రదాయమనేది ఒక చాదస్తపు మాటలాగే వినిపిస్తోంది.
మానవ విలువలు నిలబెట్టాల్సింది ఎన్నో విధాలు అని నూరి పోస్తూ డబ్బు, పదవి, హోదా అన్నవి వీటికి అడ్డు కాకూడదు అనే మంచి మాటలు ప్రతి క్షణం మనస్సులోకి ప్రవేశిస్తే, ఇలాంటి సంప్రదాయాలు నిలబడతాయి. 
ఒక ఇల్లాలు నిత్యాన్నదానం చేస్తూ, ఏ అర్థరాత్రి ఎవరొచ్చినా లేదనకుండా అన్నం వండి పెట్టేదంటే నమ్మలేక పోవచ్చు కదా! వరదల్లో చిక్కుకొన్న వారికి అన్నం పెట్టి ఆదరించిన తల్లి గురించి తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది - ఆమె డొక్కా సీతమ్మ.  ఆమె తెలుగింటి అన్నపూర్ణ.  ఒక్క విషయం ఆలోచించండి.  ఆమె వెళ్ళిపోతూ ఈ లోకం నుంచి ఎం పట్టుకెళ్ళిందీ? - ' చేసిన పుణ్యము చెడని పదార్థము; ఏగునే నీ వెంట'
ఇళ్ళలో పెద్దలు మంచి మాటలు చెప్పాలి.  పిల్లల మనసులు విశాలంయ్యేటట్లు చూడాలి.  మన సంస్కృతీ సంప్రదాయాలు నిలబడే ప్రయత్నం అనుక్షణం జరగాలి.  ఇంటా బయటా కూడా!!
పిల్లకి చెప్పే ప్రతి విషయం పెద్దలు ఆచరిస్తూ పిల్లలకి చెబితే అది వారికి బాగా హత్తుకుంటుంది. 
--

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

-- 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP