భగవత్‌స్వరూపం
>> Friday, August 30, 2013
ఆకాశం నుంచి పడిన నీరు వివిధ నదీ నదాల ద్వారా సముద్రంలో కలిసినట్టు ఏ దేవతలకు చేసిన నమస్కారమైనా అది ఆ కేశవునికే చెందుతుంది. ఈశ్వరుడొక్కడే. ఆయన గుణాలను బట్టి రుద్రుడిగా, విష్ణువుగా, గణపతిగా అనంతనామాలతో స్మరిస్తారు. కొందరు నిర్గుణునిగా పూజిస్తారు. మరికొందరు తమ ప్రాంతీయాచారాలను అనుసరించి వివిధ విగ్రహ రూపాలతో పరమాత్ముని పూజిస్తారు. ముగ్గురు శిష్యులు చెట్టుపై ఒక చిన్న జంతువును చూశారు. మిత్రమా! చూడుచూడు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఆ జంతువు. సరసర చెట్టుపైన పాకుతూ ఉన్నది. భూమిపై ఇలాంటి ప్రాణి ఉన్నదా అరే. అది రూపంలో బల్లిలా ఉన్నది. ముఖం చూద్దామా. చేపలాగా ఉన్నది. నాలుక చూద్దామా పాము నాలుక. శరీరం రంగు మాత్రం మేఘంలాగా నల్లగా ఉంది. రెండో శిష్యుడు అడ్డుకున్నాడు. తగ్గవయ్యా తగ్గు. నల్లగా ఉందా దాని దేహ ఛాయ? భలే చెబుతున్నావే నీకు నోరెలా వచ్చింది. అది చిలకపచ్చరంగులో ఉంది. మొదటివానికి కోపం వచ్చింది. నీకేమైనా తిక్కపట్టిందా? చిలకపచ్చగా ఉన్నదంటావేమిటి? నల్లటి దాన్ని చూచి పచ్చగా ఉన్నదంటావెందుకు? పిచ్చివాగుడుమాను. మూడో శిష్యుడు జోక్యం చేసుకున్నాడు. ఇలా వాదించుకోవడానికి మీకు సిగ్గులేదా? కోడిపుంజుల్లాగా కొట్లాడతారెందుకు? ఎవరైనా చూస్తే నవు్వతారు. ఆ జంతువు నలుపూ కాదు, చిలకపచ్చా కాదు. దాని శరీరం రంగు నిప్పులాగా ఎర్రగా ఉంటే మీకు కళ్లు కనబడటం లేదా?
మిగిలిన ఇద్దరూ ఏకమై మూడో శిష్యునిపై పడ్డారు. నీకా,మాకా పిచ్చి? ఎర్రగా ఉన్నదంటావేమిటి? అతడిని గదమాయించారు. ఇంతలో ఆ జంతువు చెట్టుపై నుండి దిగి వారి ఎదుట మరో రంగులో ఉంది. కాదు, కాదు నేను చెప్పిదే సత్యం. ముగ్గురు శిష్యులూ ఎవరికి వారే తాము చెప్పినదాన్ని రుజువు చేసుకోవాలనే పట్టుదలతో వాదులాడసాగారు. ముగ్గురూ కలిసి దానిపై పడి గట్టిగా పట్టుకున్నారు. అందరూ ఆశ్చర్యపడే విధంగా అది తెల్లబడిపోయింది. ముగ్గురూ నివ్వెరపోయారు. నోటమాటరాక కళ్లప్పగించి దాన్నే చూస్తున్నారు. ఇంతలో గురువు గారు వచ్చారు. గురువుగారికి తమ గోడు వెళ్లబోసుకున్నారు శిష్యులు. గురువు దయతో వారిని చూస్తూ ఇలా బోధించారు. నాయనలారా! ఇప్పుడు మీ వద్దనున్న జంతువును ఊసరవెళ్లి అంటారు. అన్ని రంగులూ దానిలో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి పరిసరాలను బట్టి అది రంగులు మారుస్తూ ఉంటుంది. మీరు ముగ్గురూ సరిగ్గానే చూశారు. అదే నల్లగా, చిలకపచ్చగా, ఎర్రగా కనబడుతుంది. నిజానికి మీరు చూసిన రంగులన్నీ అశాశ్వతమైనవి. మీరు దాన్ని పట్టుకున్నప్పుడు కనబడిన తెలుపే శాశ్వతమైనది. పరమాత్మ స్వరూపమూ ఇలాంటిదే అని తెలుసుకోండి. ఆయన అసలు రూపం తెలియనంతకాలం వివిధ స్వరూపాలుగా ఊహిస్తాం. ఆయన పాదాలు పట్టుకున్న వెంటనే సందేహాలన్నీ మటుమాయమైపోతాయి. సత్యదర్శనం అవుతుంది. - ఉలాపు బాలకేశవులు
0 వ్యాఖ్యలు:
Post a Comment