మాట తప్పని ధర్మం
>> Thursday, July 18, 2013
రాయబారము చేయటానికి కౌరవుల వద్దకు వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో తాను చెప్పవలసినదంతా చెప్పాడు. ఆ తర్వాత కుంతి మనోభావాన్ని గ్రహించాడు. కర్ణునితో ఏకాంతంగా మాట్లాడదలచి కర్ణుణి తన రథంలో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. కర్ణునితో ఓ కర్ణా! వివాహమైన తర్వాత పుట్టిన వానిని సహోఢుడని, వివాహానికి ముందే పుట్టిన వానిని కానీనుడని అంటారు. కన్యకు జన్మించిన కుమారునకు ఆ కన్యను వివాహం చేసుకొన్నవాడే తండ్రి అని శాస్త్రాలు చెబుతాయి. నీవు కానీనుడవు, కుంతికి కన్యాత్వమందు పుట్టావు ధర్మంగా నీవు పాండు నరపాలుని తనయునిగా పరిగణింపబడతావు. ధర్మశాస్త్రాన్ననుసరించి నిశ్చయముగా నీవు రాజు కాగలవాడవు. నీవు నా వెంట వచ్చేయ్. పాండవులందరూ నిన్ను ధర్మరాజు కంటే పెద్ద అన్నయ్యగా గౌరవిస్తారు. రాజన్యులు రాజకన్యకలు నీకు అభిషేకం చేస్తారు. ద్రౌపది నిన్ను భర్తగా స్వీకరిస్తుంది. పాండవులతో కూడిన నీవు ''నక్షత్ర గ్రహ పరివృతుండగు సుధాంశుండువోలె రాజ్యంబు పాలింపు" అన్నాడు.
ఈ మాటలను వినిన కర్ణుడు శ్రీకృష్ణునితో-ఏది ఏమైనా అతిరథుడనే సూతుడే నా తండ్రి, ఆయన భార్య రాధ నాకు పాలిచ్చి పెంచిన తల్లి. వారు నాకు పెట్టిన 'వసుషేణుడు' పేరే నా పేరు. సూతకన్యలను నేను వివాహం చేసికొన్నాను, వారి వల్ల నాకు పుత్రులు, పౌత్రులు కూడా ఉన్నారు. ధృతరాష్ట్రుని ఇంట దుర్యోధునునాశ్రయించి పదమూడు సంవత్సరాలు నిష్కంటకముగా రాజభోగాలను అనుభవించాను. కృష్ణా! నన్ను నమ్మి దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. నాకు తెలుసు, ధర్మాత్ముడగు యుధిష్ఠిరుడే ఈ ఫృథివికి రాజవుతాడు, యుద్ధంలో విజయం వారిదే అని అంటాడు. మహాభారత యుద్ధాన్ని ఒకయజ్ఞంగా వర్ణిస్తాడు ఇలా-''దుర్యోధనునకు శస్త్రయజ్ఞంబవశ్యంబునగా నున్నయది...కృష్ణా! ఈ యజ్ఞంబున నీవయధ్వర్యుండవగుదువు. కపిధ్వజంబున సన్నద్ధుండైన బీభత్సుండు హోతయుగాండీవంబు స్రుక్కును మహాయోధుల వీర్యం బాజ్యంబును సైంద్రంబు పాశుపతంబు బ్రాహ్మంబు స్థూణాకర్ణంబునకు సవ్యసాచిచే ప్రయోగింపబడునస్త్రంబులు మంత్రంబులును కాగలవు. కృష్ణా! ఆ యజ్ఞంబున రుధిరంబు హవిస్సు కాదగును. మహాత్మా! అతిరాత్రంబను నీవితతంబగు యాగంబున సర్వంబు సుసంపన్నంబు కాగలదు. వైతానికంబగు కర్మముఖంబున నగ్ని వలన జనించిన వాడగుటం జేసి ధృష్టద్యుమ్నుండీ యాగంబున దక్షిణకాదగును. ఇలా వర్ణించి ఇంతకు ముందు పాండవులను దూషించినందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు చెబుతాడు కర్ణుడు. కౌంతేయుని యుద్ధసన్నద్ధునిగా చేసి తీసుకురావలసిందిగా కృష్ణుని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేటికి ఏడవ దినమున అమావాస్య అవుతుంది. ఆ అమావాస్యకు ఇంద్రుడు దేవత అని ఆర్యులు అంటారు. ఆరోజు యుద్ధాన్ని ఆరంభించటం మంచిదని ఆ విషయాన్ని భీష్మద్రోణులకు చెప్పమని కర్ణునికి చెపుతాడు (పేజి528-ఉద్యోగపర్వం)
మహాభారతంలోని విషయాలు కనీసం కొన్నిటినైనా మనం భారతీయులం ఆదర్శంగా చేసుకుని జీవిస్తే మనదేశం బాగుపడుతుంది. శ్రీకృష్ణుడు కర్ణునకు నీవు పాండవుల పక్షాన చేరితే రాజువవుతావు అని ఆశచూపాడు. కానీ కర్ణుడు లొంగలేదు. పాండవులతోను, రాజన్యులతోను, రాజకన్యలతోను అభిషేకింప బడతావు అన్నాడు. ఊహు కర్ణుడు తన నైతిక ఔన్నాత్యాన్నుండి వంగలేదు. ద్రౌపది నిన్ను భర్తగా స్వీకరిస్తుందని ఊరించాడు. కర్ణుడు ఏ మాత్రమూ చలించక తనను నమ్ముకొన్న దుర్యోధనుని ముంచక స్థిరంగా నిలబడ్డాడు తన స్థానంలో. మరి నేడో! ఎన్నికలలో నిలబెట్టి, గెలిపించి, పదవులిచ్చి పేరు ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టిన పార్టీని ఏదో ఒక కుంటిసాకుతో వదలి, కీలకసమయంలో పార్టీ పెద్దలను నట్టేట ముంచి ఇతర పార్టీలలోకి జారుకుంటున్న రాజకీయ నాయకులను చూస్తున్నాం. ఎంత పతనం! - రాచమడుగు శ్రీనివాసులు
0 వ్యాఖ్యలు:
Post a Comment