శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

19. ఓంకారము పలుకుతాము - ఎందుకు?

>> Wednesday, July 3, 2013

19. ఓంకారము పలుకుతాము - ఎందుకు?భారత దేశములో ఎక్కువగా పలుకబడే శబ్ద చిహ్నము ఓంకారము.  ఓంకారము - ధ్వనింపచేసే వారి శరీరము, మనసులపైన మరియు పరిసరాల పైన కూడా పరిపూర్ణ ప్రభావము ఉంటుంది.  చాలా మంత్రాలు, వైదిక ప్రార్ధనలు ఓంకారముతో ఆరంభమవుతాయి.  ఓంహరిఃఓం మొదలైన అభినందనలలో కూడా అది వాడబడుతుంది.  దాని ఆకారము పూజింపబడుతుంది.  దానిపై భావన చేయబడుతుంది.  శుభసూచకంగా వాడబడుతుంది.  ఇది మంత్రము మాదిరి గానే పదే పదే జపించ బడుతుంది.

ఓంకారము ఎందుకు చేస్తాము?ఓం అనేది భగవంతుని యొక్క ప్రధమ నామము.  అది అ, ఉ, మ అనే అక్షరాల కలయిక వలన ఏర్పడినది.  స్వరస్నాయువుల నుండీ వెలువడే శబ్దము గొంతు యొక్క అడుగు భాగము నుంచీ 'అ'కారముగా ఆరంభమవుతుంది.  పెదిమలు మూసుకొన్నప్పుడు 'మ'కారము తో శబ్దము ఆగిపోతుంది.  మూడు అక్షరాలూ, మూడు అవస్థలు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి), ముగ్గురు దేవతలు (బ్రహ్మ విష్ణు, మహేశ్వర), మూడు వేదాలు (ఋగ్, యజుర్, సామ), మూడు లోకాలు (భూః, భువః, సువః) మొదలైన వాటికి ప్రతీకలు.  ఇవి అన్నీ మరియు వీటన్నింటికి ఆవల ఉన్నవాడు "భగవంతుడు" రెండు ఓంకార ధ్వనుల మధ్యనున్న నిశ్శబ్దము నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సూచిస్తుంది.  ఓంకారం ప్రణవము అని కూడా పిలువబడుతుంది ("దేని ద్వారా అయితే భగవంతుడు స్తుతించ బడతాడో" అని అర్ధము).  వేదాలలోని సారమంతా "ఓం" అనే పవిత్రాక్షరములో నిక్షిప్తమైనది.

భగవంతుడు ఓంకారము మరియు 'అథ' అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం ఆరంభించాడని చెప్ప బడుతుంది.  కాబట్టే మనం తలపెట్టే ఏ పని ఆరంభము లోనయినా ఓంకార నాదము శుభ సూచకంగా పరిగణించ బడుతుంది.

ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి (ఓంooooo...మ్ మ్) అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది.  మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు.

ఓంకారం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయ బడుతుంది.  సర్వ సాధారణమైన ఓం ఆకారము గణేశుడికి చిహ్నముగా ఉంటుంది.  పైన ఉన్న వంపు తల, క్రిందగా ఉన్న పెద్ద వంపు పొట్ట ప్రక్కగా ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము. 

ఈ విధముగా ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.
(తరువాతి శీర్షిక - హారతి ఇస్తాము ఎందుకు?)

...

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP