శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

1. దీపారాధన ఎందుకు చేయాలి?

>> Thursday, June 13, 2013

1. దీపారాధన ఎందుకు చేయాలి?

ప్రతి భారతీయ గృహములోను దైవపీఠము వద్ద రొజూ దీపాన్ని వెలిగిస్తారు.  కొన్ని ఇళ్ళలొ ఈ దీపాన్ని ఉదయము, మరి కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉభయ సంధ్యలలొ వెలిగిస్తారు.  అరుదుగా కొందరు (అఖండ దీపము) ప్రతి దినము రోజంతా ఉండేలాగ దీపాన్ని వెలిగిస్తారు.

శుభ సందర్భాలు, నిత్య పూజలు, ప్రార్ధనలు, పర్వ దినాలు మరియు సామాజిక ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్నీ కూడా దీపము వెలిగించిన తర్వాతనే ప్రారంభిస్తారు.  ఒక్కొక్కసారి ఆయా సందర్భాలు పూర్తయ్యేవరకు ఆ దీపాన్ని అలాగే కొనసాగిస్తారు.

అట్లా ఎందుకు చెయ్యాలి?
కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నములు.  భగవంతుడు జ్ఞానస్వరూపుడు.  అన్ని విధములైన జ్ఞానానికీ ఆయనే ఆధారము.  జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పోషించే వాడు కనుక జ్యోతి రూపములో భగవంతుడిని ఆరాధిస్తాము.
కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది.  జ్ఞానమనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద.  అన్ని సంపదలకన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాము.  మనము చేసే పనులు మంచివైనా, చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారముగా చేసికొనే చేస్తాము.  అందువలననే అన్ని శుభ సందర్భాలలో మన ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.
బల్బును కానీ ట్యూబ్ లైట్ను గానీ ఎందుకు వెలిగించరు? అది కూడా చీకట్లను తొలగిస్తుంది కదా!
కానీ సాంప్రదాయ దీప కాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది.  దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని వాసనలు లేక స్వార్ధ పూరితమైన సంస్కారాలకు చిహ్నము. వత్తి అహంకారానికి ప్రతీక.  ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానముతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లగా కరిగి పోయి అహంకారం అంతరించిపోతుంది.  
జ్యోతి ఎప్పుడూ పై వైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది.  అదే విధముగా మనము ఆర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్ళిస్తుంది.
ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది.  అదే విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతో మందికి అందిస్తాడు.  దీపాలను వెలిగించడము వలన వెలిగించే దీపము యొక్క కాంతి ఏమాత్రము తగ్గి పోదు.   అదే విధముగా జ్ఞాని జ్ఞానాన్ని ఇతరులకి పంచడము వలన తన జ్ఞానము తగ్గదు.  పైపెచ్చు జ్ఞానము గురించిన అవగాహన పెంపొందుతుంది.  ఇచ్చిన వాళ్లకు, తీసికొనే వాళ్లకు కూడా ఉపయోగ కారి అవుతుంది.

దీపం వెలిగించే టప్పుడు ఈ క్రింది ప్రార్ధన చేస్తాము.
దీపం జ్యోతీ పరబ్రహ్మ దీపం స్సర్వం తమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో2స్తుతే
అజ్ఞానాన్ని హరించి, జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటిని సిద్ధింప చేసికొనే శక్తినిచ్చే సంధ్యా దీపానికి ప్రణామములు.

ఈ ఆచారము జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది.


చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్ వారి సౌజన్యం తో

4 వ్యాఖ్యలు:

satya June 14, 2013 at 4:02 AM  

నిత్య పూజ లో కేవలం ఒక వత్తిని మాత్రమే వాడి దీపం వెలిగించకూడదని విన్నాను.సరైన విధానం తెలియచేయగలరు.

durgeswara June 15, 2013 at 5:26 AM  

నమస్కారాలండి

చాలా మంది మనసులో మెదలుతున్న ప్రశ్న వేశారు. ఇదే ప్రశ్న పైన అనేక వాదనలు ఉన్నాయి కాని నేను విన్నంతలోను, నా అవగాహన లో ఉన్నది ఏమిటంటే

దీపంలో ఎన్ని వొత్తులు వేశారు అంటే ఒక్క వొత్తి వేశారా లేక ఎన్ని వొత్తులు వేశారు అన్నది ముఖ్యం కాదు. దీపంలో ఎన్ని జ్యోతులు వెలిగించారు అన్నది ముఖ్యం.

తల వైపు దీపం పెట్టినప్పుడు కాని ఆ కర్మకి సంబంధించిన సందర్భాలలో ఒక్క జ్యోతి వెలిగిస్తారు.

దైవ కార్యాలలో భగవంతుని వద్ద, లేక ఇతర శుభ సందర్భాలలో రెండు, ఇంకా ఎక్కువ జ్యోతులు వెలిగిస్తారు. నిత్య పూజలో లేక ఇతర ప్రత్యేక పూజ లలో రెండు కన్నా ఎక్కువ జ్యోతులకి వత్తులు సిద్ధం చేసుకుని అందులో ఖనీసం రెండు జ్యోతులు, ముఖ్యంగా తూర్పు వైపు జ్యోతి, ఉత్తరం వైపు జ్యోతి ముందు వెలిగిస్తారు. వాటినే పూజా పర్యంతం ఉంచుతారు. మిగతా వత్తులని అవసరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి వెలిగిస్తారు. ఏ వత్తి వెలిగించినా జ్యోతి మనవైపు కాకుండా భగవంతుని వైపు ఉండేటట్లు చూసుకోటము మంచిది.

satya June 16, 2013 at 3:00 AM  

నమస్కారాలు దుర్గేశ్వర గారూ,
చాలా చక్కటి వివరణతో నా సందేహాన్ని తీర్చారు.ధన్యవాదాలు.
మీకు వీలు కుదిరినప్పుడు గృహస్థులు వివిధ పూజలలో పాటించవలసిన పద్దతులనూ,నియమాలనీ అలాగే చేయకూడని విధానాలనూ తెలియచేయగలిగితే మాలాంటి ఎందరికో మేలు చేసినవారు అవుతారు.
నమస్కారాలతో

durgeswara June 16, 2013 at 9:41 AM  

ఈ వ్యాసం అందించినవారు కెబిఎన్ శర్మగారు సమాధానం కూడా వారిదే

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP