శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మాతృ యాగం!

>> Monday, May 6, 2013



మానవ జన్మలన్నీ ఆగాలు. అధ్యాత్మ సాధనలో అవన్నీ యోగాలు అవుతయ్. మధ్యలోవన్నీ యాగాలు. సామాన్యుడు, అసామాన్యుడు, అసాధారణ వ్యక్తిత్వ సంపన్నుల జీవన విధానమంతా ఈ ఆగ, యాగ, యోగాల పరిధిలో నడుస్తుంది. అవిద్య, అస్పష్టత, అనాచారం, ఆందోళన, ఆతృత వంటి ప్రతికూల భావాలన్నీ ఆగమౌతయ్. అటువంటి జీవితం వ్యక్తికి గాని, సమాజానికి గాని ప్రయోజనకరం కాదు.

మానవ శక్తులన్నీ నిర్వర్యమై వేదనాభరితమైన జీవితాలుగా బండబారి ముగిసిపోతయ్. దానం, ధర్మం, సత్కర్మలు, సమాజసేవ, సద్భావన, తృప్తి, సంతోషం వంటి విషయం వ్యక్తికీ, సమాజానికీ శ్రేయోదాయకమౌతయ్. అవి యాగ రూపంగా మానవ శక్తులను సంఘటితం చేస్తయ్.

పరస్పర ప్రేమ, ఆధార ఆధేయ సంబంధం, సమాజ స్పృహ, సహజానందం వంటివన్నీ మానవ శక్తులన్నీ ఏకీకృతం చేస్తయ్. ఇదంతా నల్లేరు మీద బండి నడక వంటిది. ధ్యానం, యోగం, తపస్సు, స్వాధ్యాయం, సద్గోష్ఠి, సంప్రదాయం, నియమం, నిష్ఠ, నియతి వంటివన్నీ యోగానికి సంబంధించిన సంగతులై మానవ శక్తులన్నీ అంతరంగంలో శక్తివంతమై, నిస్తంద్రమంద్రమై, అంతర్ముఖత్వానికి దారి తీస్తయ్. అంతర్ముఖుడైన జ్ఞానికి ద్వంద్వాలు లేవు. అంతా ఒక్కటే, ఒక్కటే అన్నీయై తనకంటే భిన్న వస్తువు మరొకటి లేదన్న స్థితి శాశ్వతము, స్థిరము, సంస్థితము అవుతుంది.

జ్ఞానికి కర్మలుంటాయా?
ఆగంలో వున్నవాడికి అలసట తప్పదు. ఆసరా కావాలి. యాగంలో వున్న వాడికి పై స్థితి ఇంకా అందవలసి వుంది. అన్నీ దాటిన వాడికి ఆనందం తప్ప అన్యం తెలియదు. జ్ఞానికి కర్మలుంటాయా? ఉంటయ్. కర్మలన్నిటినీ ఏ విధమైన బంధనా లేకుండా చేస్తాడు. ప్రారబ్దాలుంటాయా? పాంచభౌతిక దేహం ధరించినందున ప్రారబ్దాలు అనివార్యం. కాకపోతే ప్రారబ్దాన్ని అనుభవిస్తున్నానన్న స్పృహ వుండదు. కనుక అనుభూతులుండవు. చూస్తున్న వారికి "ఇంతటి వారికీ ప్రారబ్దమా'' అనిపిస్తుంది.

అరవై సంవత్సరాలు అమ్మ సాగించినదంతా యాగమే! స్వరూపం స్త్రీరూపం కనుక, దృష్టి సమదృష్టి కనుక, కుల, గుణ, మతాతీత భావనాబలం సహజ మాతృస్థితి కనుక, అమ్మ ప్రతి కదలిక, ప్రతి మెదలిక, ప్రతి చేత, యాగ-యోగాల మేలుకలయికగా సాగినయ్. తల్లికి బిడ్డలందరూ సమానమే. బిడ్డల సుఖం, సంతోషం, ఆనందం, భవిత..ఒకటేమిటి సమస్తమూ అమ్మ కరుణాదృష్టి సోకి భద్రతమం కావలసిందే. ఆకలిగొన్న వాడికి అన్నం, బతుకే భయమైనవాడికి అభయం, అహంకరించిన వాడికి అతిశయశమనం, అమ్మ అలుపెరుగని రీతిలో అనుగ్రహించింది. బాగా చదువుకున్నాననుకున్న వాడికి, మరిని కోణాలను ఆవిష్కరించింది.

మాటలే మహామంత్రాలు
మెడికల్ సెంటర్, సంస్కృత కళాశాల, అన్నపూర్ణాలయం, వాత్యల్యాలయం, ధ్యానమందిరం, ఆలయ సముదాయం, ఆదరణాలయం, అధ్యయన పరిషత్ వంటి సంస్థలన్నీ అమ్మ సంకల్పంలోంచి పుట్టినవే. 'విశ్వజనని' పత్రిక అమ్మ బిడ్డల ఆ్రర్దవాణి. ఇవన్నీ అమ్మ సాగించిన యాగ ప్రవాహంలోవే. దేనికదే సమాజంలో అనుసంధానమై సేవా యాగంలో పూర్ణత్వాన్ని సంతరించుకున్నవే. ఇవన్నీ ఒక ఎత్తు. పైకి కనిపించేవి. వ్యక్తిత్వ పరిణామం మీద అమ్మ చూపిన ప్రభావం అమితం. అనేక సందర్భాలను సమన్వయం చేస్తే అమ్మ సాగించిన యాగంలో ఎన్నో మాటలు మహామంత్రాలయినయ్.

*జగన్మాత అంటే జగత్తే తల్లి.
*అన్నిటినీ చేయిస్తున్న వాడొకడున్నాడనుకో. దానివలన "నేను చేస్తున్నానన్న'' అహం నశిస్తుంది.
*కష్టమంటే ఇష్టంలేనిది.
*నిగ్రహం కోసమే విగ్రహారాధన.
*సహన పూజకు కావలసింది బాధలనే పూలు.
*అవసరమే విలువైనది.
*అనుకున్నది జరుగదు. తనకున్నది తప్పదు.
*నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో.
*ఉన్నదంతా బ్రహ్మమైనపుడు భగవంతుణ్ణి ప్రత్యేకంగా చూడాలనుకోవడమెందుకు?
కోకొల్లలై వెల్లివిరిసిన ఈ మాటన్నీ జీవన సత్యాలు. ఎవరి స్థాయిని బట్టి వారు ఆలోచించుకుని సాధనను ప్రారంభించటానికో, ముగించుకోవటానికో అక్కరకొచ్చే సాధనా సూత్రాలు. అలుపెరుగక, అలసట తెలియక, అవిశ్రాంత విశ్రాంతంగా లక్షలాది జనావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా చల్లగా పలుకరించి, కరుణ చిలుకరించి, ప్రేమను ముద్దలుగా పంచిన నిండు, పండు ముత్తైదువ అమ్మ. సహజ త్యాగం, సహజప్రేమ, సహజ కారుణ్యము ఆనందరాగమై వినిపించిన అమ్మది చల్లని మాటల యాగం. కన్నీరు తుడవటం, కడుపు నింపటం, ఆదరించటం, అక్కున చేర్చుకోవటం...అమ్మ చేయవలసిన యాగమైతే అమ్మ సాగించినదంతా మాతృయాగమే!

వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP