శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పరమాచార్య వాణి [రెండవభాగం]

>> Friday, May 10, 2013

పరమాచార్య వాణి # 4
Inline image 1
స్నానం ఏ దిక్కుకి నిలబడి చేయాలి?
"శాస్త్రంలో మనం చేసే ప్రతీ పనీ అది భగవంతుడి పూజ అయినా, లౌకికమైన పనులయినా సరే అన్నిటినీ ఆధ్యాత్మిక దృష్టి కోణంలో చూడబడినది. ఉదయాన్నే లేచి పళ్ళు తోమడం దగ్గర నుంచి, పడుకునేవరకు, సంతానాన్ని కనడం, అంత్యేష్టి సంస్కారం ఇలా అన్ని రకాల పనులూ ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూడడం మన శాస్త్రాలు నేర్పుతాయి. అందుకే ప్రతీ పని చేయడానికి, ఏ విధంగా చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, ఆ విధంగా శాస్త్రం విధి విధానాలను మనకు అందించినది. ఉదాహరణకు, నదిలో స్నానం చేయాలి అంటే, నదీ ప్రవాహం వెళ్ళే దిక్కువైపు నిలబడి స్నానం చేయాలి. ప్రవాహానికి ఎదురుగా చేయకూడదు. అలాగే నది కాకుండా, నిలబడి ఉన్న ఒక సరస్సు/చెరువులలో స్నానం చేయాలంటే, అప్పుడు తూర్పు దిక్కుగా నిలబడి స్నానం చేయాలి.

ఎప్పుడైనా మనం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేయవలసి వచ్చినది అనుకోండి.... ఉదాహరణకి గ్రహణం అప్పుడో, ఎవరైనా చనిపోయారని వార్త తెలిసినప్పుడో, అప్పుడు ఎలా?? ఇలాంటి వాటిని కూడా మన పూర్వ ఋషులు దర్శించి, శాస్త్రాలను మనకందించారు. ఇటువంటి పరిస్థితిలో (రాత్రి పూట గ్రహణం అప్పుడు కానీ, మృతాశౌచం వల్ల కానీ) చెరువు/సరస్సులో కానీ స్నానం చేయవలసి వస్తే, తూర్పుకి కానీ, పడమరకి గానీ తిరిగి స్నానం చేయాలి అని శాస్త్ర వాక్యం. అదే రాత్రి పూట ఇంట్లోనే ఉన్న బావి దగ్గర కానీ, బక్కెట్లో నీళ్ళు తీసి చెంబుతో పోసుకునే విధంగాగానీ స్నానం చేయవలసి వస్తే, అప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే స్నానం చేయాలి".

-------------------------------------------------------------------------------
 
పరమాచార్య వాణి # 5
Inline image 1

"అశౌచంగా ఉండడం వల్ల (శరీరాన్ని, దుస్తులను శుభ్రంగా ఉంచుకోక పోవడం, అన్ని వేళలా అందరినీ తాకడం వంటివి..) కలిగే దుష్ఫలితాలు కానీ, 'మడి'గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ మన కంటికి కనబడవు. కనబడవు కదా అని, చాలా మంది నమ్మరు మరియు వీటిని మూఢ నమ్మకాలు అని చెప్తారు.

కానీ మన శాస్త్రాలు చెప్పినది పరమసత్యం. శాస్త్ర వాక్యాలను మనం ఎంతగా దూరంగా పెడుతూ, మడి ఆచారాల నుంచి దూరంగా వెడుతున్నామో అంతగా మనలో అస్వస్థత పెరుగుతోంది, అనేక పవిత్రమైన పుణ్య స్థలాలలో కూడా ప్రమాదాలలో జన నష్టం జరుగుతూ ఉండడం, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ ఉండడం, అనావృష్టి, భూకంపాలు అన్నీ పెరుగుతున్నాయి.

ఇన్ని జరుగుతున్నా, వీటికి ప్రథాన కారణం "మనం శాస్త్రం చెప్పినట్టుగా ఆచార వ్యవహారాలను పాటించక పోవడం" అని అంగీకరించలేక పోవడం నా** దృష్టిలో పెద్ద మూఢ నమ్మకం".

** ఇక్కడ 'నా' అంటే శ్రీశ్రీశ్రీ పరమాచార్య స్వామి వారు అని గమనించగలరు.

---------------------------------------------------------------------------------------
పరమాచార్య వాణి # 6
Inline image 1
ఆచార అనుష్టానముల వలన ప్రయోజనం
"ఆచారములు పాటించడం వలన మనలో శౌచం పెరుగుతుంది, కుటుంబములో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజములో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆచార సాంప్రదాయములను పాటించడం వలన దీర్ఘాయుష్మంతులౌతారు, సత్సంతానం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఆచార అనుష్టానములను పాటించడం వలన వ్యక్తులలో తేజస్సు పెరుగుతుంది, అందవికారం తగ్గుతుంది (ఇక్కడ అందం అంటే కేవలం బాహ్య అందం ఒక్కటే కాదు). ఆచార, అనుష్టానములను పాటించగా పాటించగా, వ్యక్తి పుట్టుకతో ఎటువంటి రూపుతో ఉన్నా, ఆతని తేజస్సు పెరిగి, నలుగురి చేత గౌరవింపబడి, ఎవరైనా అతనిని మొదటి సారి చూసినా సరే నమస్కార యోగ్యతని పొందుతాడు. చక్కని సదాచారం పాటించే వ్యక్తి, స్నానం చేసి, విభూతి/కుంకుమలు ధరించి, పూజ చేసి బయటకి వచ్చినప్పుడు చూస్తే, ఎటువంటి వారైనా ఆయన తేజస్సుకి నమస్కరించ వలసినదే. ఆచారాన్ని అనుష్టించడం వల్ల మనం నమస్కార యోగ్యతని, పూజనీయతని పొందుతాము".
----------------------------------------------------------------------------------
పరమాచార్య వాణి # 7
Inline image 1
"ఆకలి కూడా ఒక వ్యాధి వంటిదే. మనకి ఏదైనా వ్యాధి వస్తే ఔషధం సేవించట్లేదా.. అలాగే ఆకలి అనే వ్యాధిని మాన్పడానికి ఆహారము కూడా ఔషధములా పరిమితంగా సేవించాలి. రోజుకి ఒక్క సారి భోజనం, ఒక్కసారి ఫలాహారం స్వీకరించి ఉండగలిగితే అది సర్వోత్తమైనది. అలా వీలుకాకపోతే, రోజుకి రెండు సార్లు భోజనం, ఒకసారి అల్పాహారం (టిఫిన్) స్వీకరించే విధానంలో అయినా, ప్రతీ సారీ తీసుకునే పదార్ధం తగుపాళ్ళలో పరిమితంగా ఉండాలి. మన సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం మరియు నేటి ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రముల ప్రకారం కూడా మనం భోజనం ఎప్పుడూ కడుపు పూర్తిగా నిండేవరకు భుజించకూడదు. జీర్ణాశయంలో సగం వరకు (అంటే సుమారుగా ఎంత తింటే కడుపు పూర్తిగా నిండి పోతుందో అందులో సగం..) మాత్రమే భోజనం చేయాలి, మిగతా సగంలో సగం వరకు అనగా జీర్ణాశయంలో నాలుగో వంతు నీళ్ళు త్రాగాలి. ఇక మిగిలిన నాలుగో వంతు జాగా ఖాళీగా ఉంచాలి.

మామూలు రోజుల్లో అలా రోజుకి రెండు సార్లు భోజనం, ఒకసారి అల్పాహారం భుజించినా, శని, సోమ, గురు వారాల్లోనూ, అమావాస్య తిథులలోనూ, మన ఇలవేల్పు/కులదైవము ప్రకారం ఆ దేవతా స్వరూపము యొక్క ప్రీతికరమైన/ప్రతీక ఐన రోజులలో అనగా... షష్ఠి, కృత్తిక, చతుర్థి, ప్రదోషం వంటి రోజులలో... రోజుకి ఒకసారి భోజనం, ఒకసారి ఫలహారం మాత్రమే భుజించాలి. ఆదివారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత, ఎటువంటి భోజనం తీసుకోరాదు. రాత్రి పూట పెరుగు తినరాదు. రాత్రి పూట పెరుగుని మజ్జిగలా చేసుకుని త్రాగవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట పాలు త్రాగరాదు. ప్రతీ పక్షానికి (పదిహేను రోజులకి ఒకసారి), ఒక రోజు సంపూర్ణ ఉపవాసం ఉండాలి, అనగా ఏకాదశి తిథులలో అన్నమాట".
-------------------------------------------------------------------------------
 
పరమాచార్య వాణి # 8
Inline image 1

"ఆహారం నందు ఉప్పు తగ్గించడం మంచిది. అసలు లవణం కలపకపోతే దానిని అలవనం అంటారు. ఆహారంలో ఉప్పు కలిపి తినడం వలన, రజో గుణముతో కూడిన భావోద్రేకము ఎక్కువ అవుతుంది. మనం సాధారణంగా సమాజంలో ఒక మాట వింటూ ఉంటాము..."ఏమిరా నీకు పౌరుషం లేదా? నువ్వు ఉప్పు కారం తినట్లేదా??" అని. కానీ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి పౌరుషము, అహంకారము వంటి భావములు ఉండకూడదు. ప్రస్తుత కాలంలో ఆధునిక వైద్య విజ్ఞానం, ఆహారంలో ఉప్పు తినవద్దనీ లేదా తగ్గించమనీ చెప్పారంటే దానికి కారణం భౌతికమైనదైతే, మన శాస్త్రాలు చెప్పినది అంతకన్నా పెద్దదైన కారణం - ఆత్మోన్నత్తి కొరకు. వరుణ జపం చేసేవారు, ఆహారంలో ఉప్పు తీసుకుంటే, ఆ చేసిన జపం ఫలించదు. అలా కాకుండా వారు నిష్టతో జపం చేస్తూ, ఆహారంలో ఉప్పు లేకుండా ఉన్నట్లయితే, ఈ రోజుకీ ఆ జపం ఫలించి వర్షం పడడం మనం చూస్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజులలో అనగా మంగళవారాలు, షష్ఠి తిథులు, కృత్తికా నక్షత్రం ఉన్న రోజులలో, ఆహారంలో ఉప్పు లేకుండా తినడం ఇప్పటికీ తమిళనాట ఎంతో మంది భక్తులు చేస్తారు".


[సంకం  ః నెమ్మూరి మోహన్ కిోర్]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP