శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూర్ణ జ్ఞానోదయం

>> Friday, May 24, 2013

పూర్ణ జ్ఞానోదయం


సుమారు ఎనిమిది సంవత్సరాల ఘోర తపస్సు చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన 'సమాన' సాధనలో ఉన్నారు. 'సమాన' సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా నడుస్తూనే ఉండాలి. కేవలం ఉపవాసం, నడవటం. ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు చావుకి దగ్గరయ్యేంతగా శుష్కింప చేసింది. ఆయన అలా నడుస్తూ నిరంజన నది వద్దకు వెళ్లారు. భారతదేశంలోని చాలా నదుల్లా ఈ రోజు అది ఎండిపోయి, కనిపించకుండా పోయింది. ఈ నది ఒక పెద్ద పాయలా మోకాలి లోతు నీరుతో నెమ్మదిగా పారుతున్నది. ఆ నదిని దాటటానికి ఆయన ప్రయత్నించారు.
కానీ మధ్యకు వెళ్లాక ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే ఆయన మరొక్క అడుగు కూడా వేయలేకపోయారు. అంత తేలికగా వదలే మనిషి కాదు కాబట్టి, ఆయన అక్కడున్న ఒక పెద్ద ఎండు కొమ్మని పట్టుకుని అలా నిలబడ్డారు. ఆయన అలా గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన పరిస్థితుల్లో కొన్ని క్షణాలే గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కానీ తాను కోరుకునేది తనలోనే ఉంది! అనే విషయం ఆ క్షణంలోనే ఆయన గ్రహించారు.
ఈ శ్రమంతా ఎందుకు? కావలసిన సంపూర్ణమైన సమ్మతి, అది ఎలాగూ ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను? అనుకున్నారు. అలా అనిపించాక ఆయన అడుగు వేయడానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన బోధి వృక్షం కింద కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఎంతో పట్టుదలతో 'పరమోన్నతి స్థితి ప్రాప్తమయ్యే వరకు, నేను కదలను. నేను ఒక జ్ఞానిగా లేచి నిలబడాలి, లేదా ఇలానే చనిపోవాలి' అనుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.

కావలసింది అదే
ఎందుకంటే పరమోన్నతి స్థితి సాధించడానికి కావలసింది అదే. సాధించవలసినది అది ఒక్కటే కావాలి. అప్పుడే అది క్షణంలో జరిగిపోతుంది. సాధాన, ప్రయత్నం అంతా దానికోసమే కావాలి. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. వాటన్నిటినీ ఒక చోట కేంద్రీకరింపజేసి సాధన చేయడానికి ఎంతో సమయం పడుతుంది. ప్రజలు చాలా వాటిలో మమేకమైపోతున్నారు. అందుకే ఎంతో సమయం పడుతుంది. కాబట్టి, మొదట మీరు చేయవలసింది మిమ్మల్ని మీరు ఒకచోట చేర్చుకోవడం. ఈ మనిషి నిర్దిష్టంగా పూర్ణుడైనప్పుడు మాత్రమే అతనికి ఏదైనా చేయడం సాధ్యపడుతుంది. బుద్ధునికి కేవలం ఒక్క క్షణంలో అది జరిగింది.
పున్నమి చంద్రుడు ఉదయిస్తుండగా, ఆయన పూర్తి జ్ఞానిగా అవతరించారు.
ఆయన కొన్ని గంటలు కూర్చుని అక్కడ నుంచి లేచారు. 'సమాన'గా ఆయన సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను ఆదర్శవంతంగా భావించారు. కాని ఆయన లేచి నిలబడగానే మొదట మనందరం భోజనం చేద్దాం! అన్నారు. దీనితో వాళ్లు నిర్ఘాంతపోయారు. వారంతా ఆయన పతనమైపోయాడనుకున్నారు. వారు పూర్తిగా నిరుత్సాహ పడిపోయారు. గౌతముడు "మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం చేయడం గురించి కాదు, ఇది సాక్షాత్కారం గురించి! నాలో పూర్ణజ్ఞానోదయమయింది, నన్ను గమనించండి, నాలోని ఈ మార్పుని చూడండి, ఆ స్థితిలో ఉండిపోండి, అంతే అన్నారు.

జ్ఞానులు చాలా మంది ఉండవచ్చు. కానీ ఇలా ఈ భూమి అసలు రూపాన్నే మార్చి, ఈ నాటికి కూడా ఇంకా ప్రభావం చూపుతున్న ఇలాంటి అద్భుతమైన మనిషి వేరొకరు ఉండరు. 2500 సంవత్సరాలు అనేది కొంచెం సమయం కాదు. ఈశా యోగా సెంటర్‌లో బుద్ధపౌర్ణమి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. బౌద్ధమంత్రాల ఉచ్ఛాటన ధ్యానలింగం వద్ద ప్రత్యేకమైన సమర్పణలు, సాయంత్రపు వేళ పూర్ణ చంద్ర దర్శన సమయాన ధ్యానాలు జరుగుతాయి. అంతరంగ పరిణతకు ఈ పున్నమినాటి శక్తులు చాలా ఉపయోగకరంగా పరి గణింపబడతాయి.
 సద్గురు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP