శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సర్వజ్ఞ అమ్మ!

>> Monday, February 11, 2013

సర్వజ్ఞ అమ్మ!


సంఖ్యయోగాన్ని ప్రతిపాదించిన కపిలుడే సర్వజ్ఞుడు. సదాశివుడు సర్వుడు. దయగలవాడు దయలేనట్లు, సర్వజ్ఞుడు సర్వం కాదు. లౌకిక వ్యవహారంలో అన్నీ తెలిసిన వ్యక్తిని సర్వజ్ఞుడంటున్నాం. తాను ఏదై వున్నాడో, దానినెరిగిన వాడు సర్వజ్ఞుడని, ఆత్మనెరిగిన వాడు ఆత్మకావాలి. అదే పూర్ణత్వం. ఒక సందర్భం అమ్మను సర్వజ్ఞగా అనుభవంలోకి తెచ్చుకోవటం నిత్య స్మరణీయం.

అన్నీ తెలిసిన అమ్మ
నాలుగున్నర దశాబ్దాల నాటి సంఘటన. ఆ అనుభవాన్ని బలపరుస్తూ వెనువెంటనే మరొక అనుభవం! ఒక వ్యక్తి అమ్మను చూడాలనుకుని, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని బాపట్లకు చేరుకున్నాడు. ఈలోగా అతని ఆలోచనల్లో ఎన్నో విషయాలు దాగి వున్నయ్. హోటల్‌లో మంచి టిఫిన్ చేసి, అమ్మను చూసి, తిరుగు ప్రయాణానికి ముందు సినిమా చూసి, ఆ రాత్రికి యిల్లు చేరటం. టిఫిన్ చేయటం, బస్సు ఎక్కటం వరకు అనుకున్నట్లే జరిగింది. బస్సు ఎక్కిన తర్వాత చూసుకుంటే జేబులో డబ్బు గల్లంతు. కేవలం జిల్లెళ్లమూడి చేరటానికి కావలసినంత పైకం మాత్రం మిగిలింది. ఆశ్రమం చేరుకున్న కొన్ని నిమిషాలలో ఆయన్ను అమ్మ లోపలికి పిలిపించింది. ఆయన్ను చూస్తూనే, "పోనీలే నాన్నా! నీ దగ్గర ఎంత వుందో అంతే పోయింది. తరతరాలు హాయిగా బతకగలిగేంత డబ్బు నీకున్నది. తీసుకున్న వాడికి రోజు గడవడం దుర్భరంగా వుంది. ముందు యిక్కడ భోజనం చెయ్. సినిమాదేముంది? ఇంకోసారి చూడొచ్చు. హాయిగా ఇంటికి వెళ్లు''. అవునూ! మీ యింటి పేరు ఫలానా కదూ..నువ్వు ఇంకో ఇంటికి దత్తు వెళ్లావు కదూ, మీ పూర్వీకులు, నీ అన్నదమ్ములింతమంది కదూ అంటూ అమ్మ వివరంగా మాట్లాడుతున్నంతసేపూ ఆశ్చర్యపోవటం ఆయన వంతయింది.

అవసరమైనదే ఇవ్వాలి
'అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు' అన్న అమ్మ మాటలో ఎంత భావం యిమిడి వుందో తెలుస్తుంది. అంతేకాదు, అవసరమే విలువైనది. విలువైనవన్నీ మనకు అవసరం కాదు. అవేమీ అక్కరకు రావు. మన సంపద, జ్ఞానం, మరొకరికి అవసరం తీర్చేతై, అజ్ఞాన భూమిక నుండీ జ్ఞానం వైపు నడిపించగలిగితే, అవి తమ ఉనికికి సార్థకతను కల్పించుకుంటయ్. మనిషి ఆకలికి అన్నం అవసరం. బాధితుడికి ఓదార్పు అవసరం. దుఃఖితుడికి ఆనందం అవసరం, ఆర్తుడికి ఆపన్నహస్తం అవసరం. ఆ క్షణంలో అవసరమే విలువైనది. ఒక సందర్భంలో బిచ్చగత్తె ఒకామె వస్తే, ఎవరో ఏదో ఇచ్చి పంపించినపుడు, ఏమిచ్చి పంపావని అమ్మ అడిగితే, ఇచ్చినావిడ అణా ఇచ్చి పంపాన్నది. వెంటనే అమ్మ "అణా అన్నమౌతుందా?'', అన్నం పెట్టి పంపవలసింది అన్నది కంఠాన కరుణాస్వనం చిప్పిలుతుండగా. ఆ సందర్భంలో అన్నమే అవసరం. అదే విలువైనది. అణాకు ఆ క్షణంలో విలువ శూన్యం. మరొక అనుభవం!

మనసు ఖాళీగా ఉంటే...
అమ్మ దగ్గరకు ఒకాయన వచ్చి, అపుడపుడే తాను తిరిగి వచ్చిన ప్రపంచ దేశాలు, పర్యటన విషయాలు, విశేషాలు వివరంగా చెప్తూ, "అమ్మా! రష్యాలో మన జెండాను మోసే అదృష్టం నాకు దక్కింది. ఆ క్షణంలో మన దేశం గొప్పదనాన్ని చెప్పటం, మరింత ఆనందం కలిగించింది'' అంటూ ఆపకుండా అంటున్నపుడు అమ్మ కలుగచేసుకుంటూ, "అవునూ..లైను చివర్లో ఉన్న ఒకామె కళ్లు తిరిగి పడిపోవటం, ఇంతలో డాక్టరు రావటం చెప్పవేం?'' అన్నది. ఆయన ఆశ్చర్యపోతూ, "అమ్మా! ఈ మంచం మీద కూచునే ఎక్కడో రష్యాలో జరిగిన విషయాన్ని స్వయంగా చూసినట్లు ఎలా చెప్పావమ్మా? ఇదెలా సాధ్యం?'' అని అడిగినపుడు, "మనసు శుద్ధంగా, ఖాళీగా ఉంచుకోగలిగితే అంతటనూ అన్నిటినీ చూడొచ్చు. ఇదొక చిన్న సిద్ధి. దూరదర్శనం, దూరశ్రవణం అసాధ్యం కాదు. సిద్ధులన్నిటికీ ముందే శుద్ధత్వం ఉండాలి. కాలము, దేశము మనల్ని దాటి మరొక చోట ఉన్నయ్యా?'' అంటూ ఏమీ ఎరగనట్లు మౌనం వహించటం ఒక ముచ్చట.

కర్తే నిర్ణాయకుడు
భగవాన్ రమణులన్నట్లు సిద్ధులు విదేశీయాలు. వాటిని పట్టించుకోవటం సాధకుడికి ఏమాత్రం మంచిది కాదు. ఎన్నో జరుగుతుంటయ్, మన ప్రమేయం లేకుండానే. సాక్షిగా ఉండాలి. సాధనా క్రమంలో ఎన్నో సిద్ధులు ఏర్పడుతుంటయ్. అక్కడే ఆగిపోతే, గమ్యం చేరటం అసాధ్యం. కనుక సాధనలో తీవ్రత, ఏకాగ్రత, లక్ష్యసాధన ఉండాలి. ఏ సిద్ధికైనా ప్రదర్శన కోసం కాక, భగవచ్ఛిక్తికి నిదర్శనంగా భావించాలి. వ్యక్తి మనసు విశ్వమనసుతో అనుసంధానమైనపుడు ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా వ్యక్తికి అనుభవమౌతుంది. శీతల పవనాలు శరీరాన్ని తాకినపుడు కలిగే నిమేషమాత్ర స్పర్శానుభవం సిద్ధి. జగత్కళ్యాణానికి, సర్వలోక సంక్షేమానికి వినియోగపడితేనే సిద్ధులకు విలువ. అది లోకానికి అవసరం. అన్నిటినీ మించి కర్త, కర్తను ఆశ్రయించి శక్తి, శక్తిని అనుసరించి ఆలోచన, ఆలోచనను ఆవరించి వాక్కు, వాక్కును ఆచరణీయం చేస్తూ కర్మ, ఇవన్నీ కలిసి క్రియ ఏర్పడుతున్నపుడు ఈ జగతే ప్రణాళిక ముందెన్నడో నిర్దేశింపబడే ఉన్నదన్న సత్యం అవగతమౌతుంది. కర్తే నిర్ణాయకుడు. పాంచభౌతిక దేహాన్ని ధరించి అవతారిగా కర్త వచ్చినా, ఆతడు సైతం కాలాధీనుడే. ప్రకృతి నిబంధనలకు లోబడే ఆతడి సంచారం సాగుతుంది.

కాలదేశాతీతమైన అమ్మ ఈ నియమాన్ని నిష్టం చేసింది. సర్వజ్ఞ అయినా సాధారణి వలె, సిద్ధమూర్తి అయినా శుద్ధమాతృమూర్తి వలె, రసాతీత అయినా కరుణ వలె, వాత్సల్యమే మూర్తిమంతమైన అమ్మ వలె సంచరించింది. ధరించటం కంటే భరించటమే మిన్న యన్న అమ్మ, అవధరించింది, తరించటానికి మానవతే మార్గమని బోధించింది. అమ్మ సర్వజ్ఞ. అమ్మ పూర్ణజ్ఞ.

వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP