నిత్యచైతన్యం ...దీపావళి వైశిష్ఠ్యం .
>> Thursday, November 8, 2012
భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి రోజూ పండుగే. అంటే సంవత్సరం మొత్తం 365 రోజులూ పండుగలే. మన మొత్తం జీవితాన్నంతా పండుగలా పరమ సంతోషంగా గడిపేయాలన్న సదుద్దేశంతోనే ఈ ఆచారం ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తూ మనం మామూలు దినచర్యలో దారమ్మటపోతూ, ఆఫీసుకు వెడుతూ, సంతోషంగా, ఉత్సాహంగా ఉండలేక పోతున్నాము. అందుకే ఈ పండుగల కారణంగానైనా సంబరంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారని అవి అవతరించాయి.
కొత్త ఉత్సాహం
దీపావళి పండుగ ఉద్దేశం కూడా అదే, మీ జీవితంలో సంబరాన్ని నింపడమే దాని పరమార్థం-దానికి గుర్తుగానే టపాకాయలు పేల్చడం. దీపావళి పండుగ పరమోద్దేశం కూడా మీలో ఎంతో కొంత ఉత్సాహాన్ని నింపడమే. అంతేతప్ప, ఏదో ఆ ఒక్కరోజు ఉత్సాహం నింపుదామన్న ధోరణితో సృష్టించినది కానేకాదు. ప్రతినిత్యం ఇదే తీరున మన జీవితాలు సాగిపోవాలనే పరమోద్దేశంతో కల్పించినది.
దీపాలు వెలగాలి
దీపాల పండుగే దీపావళి. ఈ దీపావళి రోజున, పల్లెలేమి, పట్టణాలేమి, నగరాలైతేనేమి..అన్నీ వందలు వేలాది దీపాలతో వెలిగిపోతుంటాయి. అయితే, ఈ పండుగ పరమోద్దేశం కేవలం బాహ్యంగా దీపాలు వెలిగించడమే కాదు, అంతర్జ్యోతి వెలగాలి. వెలుగంటే స్పష్టత. ఈ స్పష్టత లేకుండా మీలో ఎన్ని సుగుణాలున్నా అవేవీ అక్కరకు రావు, పైగా అవన్నీ మీకు అడుగడుగునా ప్రతిబంధకంగా మారతాయి. స్పష్టత లేని విశ్వాసం ఘోర విపత్తులకు దారితీస్తుంది. లోకంలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే...ఎటువంటి స్పష్టతా లేకుండా ఎంతో విపరీతంగా పనులు చేసేస్తున్నారు. ఇదే పరమ దురదృష్టకరం.
స్పష్టత ఉండాలి
ఉదాహరణకు ఓ సంఘటన చెబుతాను. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పోలీసు మొదటిసారిగా వాహనంలో తన సీనియర్ వెంటరాగా ఓ వీధివెంట వెళుతున్నాడు. కొంతసేపటికి వాళ్లకు వైర్‌లెస్‌లో ఓ వార్త వచ్చింది. ఫలానా చోట చాలామంది గుమికూడి ఉన్నారని, అదేదో చూడమని ఆ సందేశ సారాంశం. దానితో వీళ్ల వాహనం ఆ మార్గానికి మళ్లింది. నిజమే, ఆ వీధిలో ఓ ప్రక్క చాలామంది ఉన్నారు. ఇంకేముంది, మన కొత్త పోలీసుగారు పరమోత్సాహంతో, తమ కారు కిటికీ తలుపుతు కిందకు దించి, వాళ్లనుద్దేశించి మర్యాదగా అందరూ అక్కడి నుండి వెళ్లిపోండంటూ గట్టిగా చెప్పాడు. ఆ జనమంతా అర్థంగాక సందిగ్ధంగా అతడి వైపు చూశారు. అంతేకాని వాళ్లు అక్కడి నుండి కదలలేదు.
దానితో కొత్త పోలీసుకు కొంచెం కోపం వచ్చింది. స్వరం కాస్త పెంచి, చెపుతున్నది మీకే కదా? వెళతారా, వెళ్లరా? అని కసురుకున్నాడు. ఇక వారంతా వెళ్లిపోయారు. వారు మన మాట విని వెళ్లిపోయారు కదా, ఇదంతా నా ఘనతే అనుకుని పొంగిపోతూ, తన సీనియర్‌కేసి తిరిగి గర్వంగా చూస్తూ, 'తొలి రోజు ఉద్యోగం మొదటి డ్యూటీ బాగా చేశాను కదా?' అని అడిగాడు. దానికా అనుభవజ్ఞుడు లోలోన నవ్వుకుంటూ బయటికి మాత్రం 'ఫరవాలేదు, బాగానే చేశావు కానీ, అది బస్సుస్టాపు మరి' అంటూ కొసమెరుపు మెరిపించాడు. ఇంకేముంది మన కొత్త పోలీసు నోరెళ్లబెట్టాడు.
దారి చూపే జ్యోతి
ఇలా ఉంటుంది స్పష్టత లేకుండా ఏ పనిచేసినా! అలా చేసినదేదైనా సరే విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. అందుకే దీపం మన దృష్టికి స్పష్టత తెస్తుంది. కేవలం లౌకిక, భౌతిక పరమైన వ్యవహారాలకే పరిమితం కాదు.ప జీవితాన్ని మరింత స్పష్టంగా పరికించి, మీ చుట్టూ ఉన్న వాటికి సంబంధించి అవగాహన పెంచుకుంటారనే దానిపై మీ జీవితాన్ని ఎంత సమర్థవంతంగా, మరింత అవగాహనతో నడిపిస్తున్నారనేది ఆధారపడి ఉంటుంది. చీకటి శక్తులను అంతం చేసి, వెలుగులు పంచిన రోజే దీపావళి. మానవ జీవితంలో కూడా ఇటువంటి దురవస్థే ఎదురవుతుంటుంది. తాము సూర్యకాంతిని అడ్డుకుంటున్నామనే ధ్యాస ఏ మాత్రం లేకుండా, కారుమబ్బులు ఎలాగైతే ఈ లోకాన్ని ఆవరించి అంధకారం కలిగిస్తున్నాయో, ఆ విధంగా...తనలో గూడుకట్టుకొని ఉన్న చీకటి మేఘాలను మానవుడు కనుక చెదరగొట్టగటిగినట్లేయితే..వెలుతురు వస్తుంది. అంతే తప్ప మరెక్కడి నుంచో తన కోసం వెలుగును వెతికి తెచ్చుకోనవసరం లేనేలేదు. ఈ వాస్తవాన్ని గుర్తు చేయడానికే ఈ దీపాల పండుగ.
[ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment