శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహం ఎలాఉంటుందో మాకు చవిచూపించిన "శ్రీవారిసేవ"

>> Thursday, November 1, 2012

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆనందనిలయుడైన ఆపరమాత్మ లీలావిభవాన్ని చవిచూసే అవకాశం ఈనెల ఏడవతేదీనుండి పదమూడవతేదీ వరకు కల్పించాడాయన . ఎన్నో సార్లు తిరుమల వెళ్లి ఒక్కక్షణం ఆయనను దర్శించుకున్నప్పుడు , నిత్యం పీఠం లో జరిగే అర్చనాకైంకర్య సమయంలో ఆయన పాదములపై తలానిస్తూ తండ్రీ! నీ ఆనందనిలయంలో గడపవద్ద నిలబడి నిన్నుచూస్తూ నిలచిపోయే అవకాశమివ్వు చాలు. అంతకంటే కోరదగ్గది ఇంకేమీ లేదు అని మనసులో తలంపు వస్తుండేది. కోరగా కోరగా వీడి కోరికలో నిజమెంతో చూడాలనుకున్నాడేమో ! ఆ దేవదేవుడు  హఠాత్తుగా తన సన్నిధికి పిలిపించాడు నా కపటత్వాన్ని వెల్లడిచేశాడు.

గత నెలలో    ఇక్కడ  నెట్ ద్వారానే పరిచయమైన కుర్రవాడు రేణుకుమార్ ఫోన్  చేశాడు . మాష్టారూ ! శ్రీవారి సేవకు  వెళుతున్నాం  మీ దగ్గరనుండి ఎవరినైనా పంపిస్తారా ? అని . తెలుగుభక్తి పేజెస్ వారు సేవకు వెలుతుంటారు ప్రతిసంవత్సరం. మొత్తం అరవైమందికి పైగా వస్తున్నారు. ఢిల్లీ ,హైదరాబాద్ తదితర ప్రదేశాలనుండి అని చెప్పాడు . నేనుకూడా వస్తానన్నాను. మీరొస్తే ఇంకా సంతోషం అన్నాడు. నాతోపాటు ఇంకా తొమ్మిది మంది  కలసి శ్రీవారిసేవకు సిద్దమయ్యాము. వారంరోజులపాటు అక్కడ  క్షేత్రంలో సేవచేసే అవకాశం . పదహారవతేదీ నుండి నవరాత్రులు మొదలవుతాయి ఇక్కడ .చూసుకోవలసిన పనులు చాలా ఉన్నాయి కానీ ఈ అవకాశం వదులుకోరాదనే నిర్ణయంతో బయలుదేరాము. తిరుపతిలో ఆరవతేదీ రాత్రికి "శ్రీనివాసం" లో బసచేసి ఉదయాన్నే రేణూతో కలసి  కొండపైకి వెళ్లాము
. అక్కడ ఫార్మాలిటిస్ అన్నీ పూర్తిచేసుకుని  మొదటిరోజు సాయంత్రం కాలినడక భక్తుల క్యూలైన్లో ఉన్నవారికి అహారపదార్థాలు అందించటం తో మా సేవాకార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం నిర్వహణచూస్తున్న శ్రీ పరిటాల గోపీకృష్ణగారు  ఉదయాన్నే అందరం నాలుగు మాడవీధులలో ,సుప్రభాతం,విష్ణుసహస్రనామం పారాయణం చేయాలని నిర్ణయించారు .
మరుసటి రోజు ఉదయాన్నే రాజగోపురం ముందుచేరుకుని అక్కడనుండి పారాయణం చేస్తూ సాగాము. పడమర వీధి పూర్తయ్యేసరికి పారాయణాదులు ముగిసాయి. అక్కడ నుండి భక్తబృందం చే సంకీర్తన  చేపించే  అవకాశం నాకిచ్చారు. ఆహా ! అది నాతండ్రి నిత్యం విహారానికొచ్చి భక్తులకు దర్శనమిచ్చి ధన్యులనచేసేదివ్యపథం. నారదాదిమునీంద్రబృందము ,అన్నమయ్య,వెంగమాంబపురందరదాసాది ఆంతరంగిక భక్తులు స్వామివారి కీర్తిని గానం చేస్తూ నడచిన ప్రదక్షిన మార్గం . ఆ వీధులలో గొంతెత్తి హరినామం పలుకుతూ పలికిస్తూ నడచేభాగ్యం ఏపూర్వపుణ్యం వలనో లభించినది.
ఆరోజు  వెంగమాంబ అన్నదాన సత్రం లో భక్తులకు అన్నదానం  చేసే అవకాశమిచ్చారు.  ఆ బృందం లో నేనూ గోపీకృష్ణగారూ  కూడా ఉన్నాము . ముందుగా స్వామికి పూజ చేసి వండిన వంటకాలను స్వామివారికి నివేదించి భోజనపంక్తులను ఆరంభించాము. ఆరుగంటలపాటు అలుపు సొలుపు లేకుండా మాబృందం వడ్డనలుచేస్తూనేఉన్నారు. హైదరాబాదు నుండివచ్చిన లక్ష్మిగారు ,ఇంకా మిగతావారి  పేర్లన్నీ గుర్తులేవు కానీ ఆతల్లులుకూడా ఒక్కక్షణం విశ్రాంతిలేకుండా ఆసేవ లభించడమే మహాభాగ్యంగా  భావించి సేవలందించారు.
ఆమరుసటిరోజు సర్వదర్శనం క్యూకాంప్లెక్స్ మరుసటిరోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో సేవలందించాము .
మంగళవారం రోజు రేణు,నేనూ వున్న బృందానికి సేవాసమయం ఒంటిగంట నుండి కావటం తో హనుమంతులవారి జన్మస్థలమైన జాపాలి క్షేత్రానికి బయలుదేరాము . రేణూ  మంచి ఫోటోగ్రాఫర్ . దారిలో ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధిస్తుండగా  ప్రకృతిమాతఒడిలో సాగుతూ లోయలో ఉన్న స్వామివారి ఆలయం చేరుకున్నాము .ఆరోజు అక్కడ ఆంజనేయస్వామికి అభిషేకం జరుగుతున్నది. అక్కడ పూజ జరిపి చాలిసా పారాయణం చేసి తిరిగి వచ్చి సేవకు హాజరయ్యాము

 తరువాత రోజు మరలా వైకుంఠం క్యూకాంప్లెక్స్ , వెంగమాంబ అన్నదాన సత్రం లలో రెండురోజులు డ్యూటీ . ఇక గురువారం కొంతమందికి సన్నిధిలో సేవకు అవకాశమిచ్చారు .అదీ కేవలం ఇరవైమందికి అని చెప్పారు
. సరే ! మనకు ప్రాప్తం ఇంతవరకే .కనుక వక్రమార్గాలలో దర్శనానికి వెళ్లవద్దు ఆయన పిలిస్తేనే మనం లోనకెళ్లి సేవ  చేద్దాము అని మావాల్లకు చెప్పాను.
 గురువారం అంగప్రదక్షిణలకు ముందురోజు రాత్రే టిక్కెట్లు తీసుకుని తెల్లవారు జామున  రెడుగంటలకే వెళ్లి క్యూలైన్లో నిలుచున్నాము. వారు ఒక  గంటసేపు కూర్చోబెట్టిన హాలులో సంకీర్తన మొదలుపెట్టి నామం  చేస్తుంటే  హాలులో భక్తులంతా గొంతుకలపి కరతాళములతో  లయ కలుపుతూ  అహో! అద్భుతంగా సాగింది నామస్మరణ.  సుప్రభాతానంతరం స్వామివారి ఆనందనిలయం చుట్టూ పొర్లుదండాలు పెడుతూ ప్రదక్షిణములు చెసి ఆప్రభాతవేళలో స్వామి దర్శనం తో మనసు,తనువూ పులకించిపోయాయి .
ఆరోజు  సేవ ముగియగానే స్వామి అనుగ్రహం వలన శుక్రవారం రోజు ఎనిమిదిగంటలనుండి శ్రీవారి సన్నిధిలో సేవకు మా బృందానికి కూడా అవకాశమిచ్చారు అని చెప్పారు.  మా బృందంలో నైతే కేరింతలే . అదీ స్వామి వారి పిలుపు .ఆయనపిలుపువచ్చేదాకా వేచి ఉండాలి మనం.

 మా పదిమందితో పాటు  ఇంకోపదిమంది.  మొత్తానికి డ్యూటీలిచ్చారు . నావెంటవచ్చినవారిలో ఎనిమిది మందికి సన్నిధిలో డ్యూటీ కేటాయించగా  ఇద్దరికి మాత్రం అదిశేషయ్యకు రోప్ దగ్గర  ...శ్రీనివాసరెడ్డికి తీర్థం వద్ద డ్యూటీ ఇచ్చారు.  లోపలికెళ్ళేసరికి వీఐపీ దర్శనం[ఇది వినటానికే ఇబ్బమ్ది నాకు] అయిపోయి వారంతా నింపాదిగా స్వామిని దర్శించుకుని వస్తున్నారు. మాకు దర్శన ప్రసాదం ఇచ్చి డ్యూటీ స్థలములు నిర్ణయించారు. నేను గరుడాత్తళ్వార్ వారి దగ్గర నిలుచుండి లైన్ కంట్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మనవాల్లకు భక్తి శ్రద్దలేమోగాని ఇతరభక్తులపట్ల గౌరవం ఏమాత్రం లేదు. అక్కరలేకపోయినా తోసుకోవటం. నెట్టటం. కేకలు మరీ ముఖ్యంగా తమిళనాడు నుంచివచ్చేవాల్లలో కొందరుమరీ ఘోరం అవతల ఆడవారు, పసిపిల్లలున్నా చూసుకోకుండా పశుబలంతో నెట్టటం ..కేకలు . ఈలోపల అక్కడ సిబ్బంది శ్రీవారి సేవకులను ప్రోత్సహించి జనాన్ని లాగేసేలా చేస్తున్నారు. ఎవరో మలేషియా నుంచి వచ్చిన ఒకావిడ తీరా స్వామి దగ్గరకెళ్లేసరికి లాగేశారు . ఆవిడ దర్శనం లేకుండానే బయటకొచ్చి పడింది. నాకుదర్శనం కాలేదు ఒక్కసారి చూసొస్తానని బతిమిలాడుతున్నది. పంపుదామంటే సెక్యూరిటీవాల్లు ఒప్పుకోరు . ఆవిడ నిరాశతో దుఃఖిస్తూ వెళ్ళడం మాత్రం బాధకలిగించింది .
ఇక టిటీడీ వాల్ల అడ్మిషన్ ఎంతఘోరంగా ఉందో చెప్పలేము . ఈ జనప్రవాహంలోకే  వికలాంగులు,వృధ్దులను వదిలారు. వాల్లు నడవలేక ఆవత్తిడిలో శ్రీవారిని దర్శించే క్షణంలో కూడా ఎంత ఇబ్బంది పడ్డారో చూసి మనసు విలవిలలాడింది. ఎంతవారించినా వినరు . నిదానంగా వెళ్లగలిగే అవకాశమున్నా అలావెళ్లరు.
చిత్రమేమిటో గాని లోన దర్శనమయ్యాక బయటకు వచ్చేవారి ముఖాలన్నిటిలో ఆనందం పొంగిపొరలుతున్నది స్వామీ అని చెబుతాడు మాశ్రీనివాసరెడ్డి .

నిలువుదోపిడి స్వామిదగ్గరే దోపిడీ కుదురుద్దా ?
----------------------------------

   మేము జనప్రవాహాన్ని అదుపుచేస్తూ స్వామీ జరగండి జరగండి అని చెబుతూ ఉండగనే  ఒకమహిళ  మెడలో  గొలుసు కట్   చేశాడో కుర్ఱకుంక . అయితే ఆవిడ అయ్యో! నామెడలో గొలుసు కట్చెశాడని కేకవేయటం వాడు జనంలోకి దూరి తప్పిమ్చుకునేలోగా ముందువరుసలో నిల్చుని వున్న మా సుందరరావు చేతికి చిక్కటం జరిగింది. ఇవతలవైపున్న గిద్దలూరు కృష్ణారావుగారు  ఇద్దరు కలసి వాడ్ని వెనక్కు లాగి బాదటం మొదలెట్టారు. ఈలోగా వాడు గొలుసు క్రింద జారవిడిచాడు . దాన్ని గమనించి తీసుకుని వాడ్ని సెక్యూరిటీ వాల్లకప్పగించారు మావాల్లు. నేలకు మూడడుగులఎత్తులేదు గాని వాడ్ని ఉడుముపట్టుపట్టి వదల్లేదు ఆ తూ,గో,జీ .మహిళ.  వీడు అక్కడక్కడా దొంగతనాలు చేసి  ఖర్మగాలి నేరుగా నిలువుదోపిడి స్వామి ముందే వాడి చిల్లరవిద్యప్రదర్శంచబూనటం తో పాపం పండింది. ఆయన ఆశ్రితరక్షకుడుకదా !


ఇక నేను ఒకగంటసేపు తనివితీరా స్వామిని చూస్తూ భక్తులలైన్ ను కంట్రోల్  చేస్తూ  నానిత్య పారాయణాలు చేయాలని ఎంతప్రయత్నించినా సాగలేదు. నోరు పిడచకట్టుకు పోతున్నది. నామం సాగలేదు.  ఎందుకని స్వామీ ?నీనామాన్ని గూడా పలుకలేకపోతున్నాను అనుకుంటూఉన్న నాకు మనోవీధులనుండి ఓసమాధానం వచ్చింది మెరుపులాగా !

ఓరి తింగరవెధవా ! సమస్త జపాలు, తపాలు,పారాయణాదులు లన్నీ స్వామి దర్శనం కోరి కదా  చేసేది. ఇప్పుడు జగత్త్ప్రభువుసన్నిధిలోనే నిల్చుని ఆయననను దర్శించుకుని ఆనందించక ఇంకా చేయాల్సినదేమిట్రా అని మాగురువుగారు హనుమంతులవారి హెచ్చరికలా వినిపించినది. మనమింతే ! అఖిలాండకోటిబ్రహ్మాండ నాయకుని సన్నిధికెళ్ళినా ఆవకాయముక్క కోరికలే కోరుతాం . ఇదే బుధ్ధిహీనత . సద్గురువులేమో  అపారకరుణతో ఎప్పుడో ఒకప్పుడు వీడు బాగుపడకపోతాడా అని పరమాత్మ పాదపీఠానికి దగ్గరగా తీసుకెళుతూనే ఉంటారు.

 ఇక ఒక గంటాగి బయటకు చూద్దునుగదా ! బయట ఉన్న శ్రీనివాసరెడ్డి ముఖం కందగడ్డలా మారి ఉంది. ఆసమయంలో ఎవరన్నా ఆప్తులు కదిలిస్తే  స్వామి సన్నిధిలోకి నన్ను పిలవలేదని పసిపిల్లవానిలా ఏడ్చేసేలా ఉన్నాడు. స్వామి దర్శనం కోసం అంత ఆర్తిగా ఉన్నాడతను. పరిస్థితి గమనించి  స్వామికి నమస్కరించుకుని అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని అనుమతి అడిగి  నాస్థలంలోకి శ్రీనివాసరెడ్డిని పిలచి నేనెల్లి బయట అతనిస్థలంలో నిలుచుని సేవకొనసాగించాను. నాలుగ్గంటలపాటు మావాల్లు తృప్తిగా స్వామిని దర్శించుకుని  బయటకొచ్చారు. చివరలో ఆదిశేషయ్యను, మిగతావారిని కూడా ఆనందనిలయంలోకి పంపి మిగతావారిని వారి స్థలాల్లో నియమించి శ్రీవారిసేవ ఆనందం అనుభవించాము.
ఆరోజు సాయంత్రం వెంగమాంబ అన్నసత్రంలో  తెలుగుభక్తిపేజ్  వారి తరపున శ్రీవారి సేవకొచ్చిన భక్తబృందమంతా గ్రూప్ ఫోటో దిగాము. ఆసందర్భంగా లోనే  హనుమత్ రక్షాయాగం ప్రతులను పంపిణీ చేసి హనుమత్ రక్షాయాగం గూర్చి ఆ తదనంతరం భద్రాచలంలో సత్సంగంబృందం వారి చే తలపెట్టిన శ్రీరామ పట్టాభిషేకం గూర్చి వివరించాము.
శ్రీమా పరిటాల గోపీ కృష్ణ గారు. మాన్యశ్రీ గోపాలకృష్ణద్వివేదీ గారలచే ప్రతులను ఆవిష్కరింపజేశాము .
ఆరోజు సాయంత్రం వెంగమాంబ అన్నసత్రంలో డ్యూటీ చేస్తుండగా ఒక మహాప్రసాదాన్ని పంపాడు స్వామి మాకు. ఆలయంలో ఒక భక్తుడున్నారు ఆయన శుక్రవారం అభిషేక జలాలను తీసుకుని కొండంతా తిరుగుతూ ఎవరికి ఇవ్వాలని పిస్తే వారికి తీర్ధం ఇస్తూ వెళతాడట . ఆయన ఆ సత్రానికి రావటం   మాకు తీర్ధాన్ని ప్రసాదిమ్చటం నిజంగా స్వామి కృపయే.

      ఇక శనివారం వీఐపీ క్యూకాంప్లెక్స్ లో డ్యూటీ ఇచ్చారు. అది పూర్తిచేసుకుని స్వామీ   నాసేవ నీకు నచ్చినదా అని మనసున అడుగుతూ .... ఢిల్లీ నుంచి వచ్చిన గోపాలకృష్ణద్వివేదీ గారికి[ఈయన ఢిల్లీలో ఐబీ. లో అసిస్టెంట్ డైరెక్టర్]  బావాజీ మఠం చూపించాలని తీసుకెళ్లాము. అక్కడ అర్చకులతో వీరికి బావాజీ మఠం గూర్చి వివరింపచేశాము .[ నేనే  చెబుదామంటే  నాకు కుచ్ కుచ్ మాత్రమే హిందీ వచ్చు. ఆయనకు దుర్గేశ్వర్ గరూ. బాగుందీ. స్వామిని చుస్తూ నడండీ... అనే నాలుగు పదాలు తప్ప తెలుగురాదు] ఇక్కడ చూపాడు స్వామి తన అనుగ్రహం. అక్కడ అర్చకుడు  స్వామి తీర్థం ప్రసాదం ఇచ్చాక మరలా మాకు,,  శ్రీవారికి  ఉదయాన్నే బావాజీమఠం వాల్లు సమర్పించే  నవనీతం ప్రసాదం   ప్రసాదించారు. ఆహా ! స్వామి కరుణ కల్లవెంట నీల్లొచ్చాయి. తండ్రీ నీ సేవకువచ్చినందుకు ఎంతటి మహద్భాగ్యమబ్బింది . ఉదయాన్నే నీవు స్వీకరించిన నవనీతాన్ని ప్రసాదింపజేశావా  అని నమస్కరించుకున్నాను.  ఇంతకీ ! ఆయన గడపముందు నిలుచునే భాగ్యం చాలు ఈజన్మ కని బీరాలుపోతుంటివే ఇక ఇక్కడే ఉండి స్వామి సేవలో ఉండవచ్చుకదా అని మనసు దెప్పిపొడుస్తుంటే తేలుకుట్టిన దొంగలా విననట్లు నటిస్తున్నాను. నిజమే ఆయన రమ్మన్నా మనం అన్నీ వదలి ఆయనకోసం వెళ్లలేని బలహీనులం. ముచ్చట్లుమాత్రం కోటలుదాటేలాచెబుతాం. అన్నీ వదలి ఆయనకోసం వెళ్లినవారు మాహాత్ములై వెలుగురేఖలై ఉన్నారు జగాన.ఆతరువాత మహంత్ అర్జుఅనదాస్ గారి ఆశీర్వాదాలందుకున్నాను హనుమత్ రక్షాయాగానికి ,రామ పట్టాభిషేకమునకు

ఇక ఈ వారం రోజులు  సాయంత్రం మావిడిదిలో సంకీర్తనలతోనూ సత్సాంగత్యాలతో ఆనందంగా గడచినది. ముఖ్యంగా  గోపాలక్రుష్ణద్వివేదీ గారు  ..ఎదీ దుర్గెశ్వర్ గరు  పాడండి,, ధీరవీర గంభీర రామభక్త మారుతీ.... అంటూఅడగటం  [వీరు కాశీ విశ్వనాథస్వామి అర్చక వంశస్తులు కూడా]   రేణూ, బంగారు బాబుగారు ,  గణేశ్ ఇంకా వివిధప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు అదొకదివ్యానందం. ఈసందర్భంగా ఇక శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున రామదండు నేర్పరచి భక్తులను శ్రీవారి సేవకు  జట్లుజట్లుగా పంపాలని నిర్ణయిమ్చుకున్నాము.

ఇక మరో ముఖ్యమయిన విషయమేమిటంటే  పాడేరు గిరిజన ప్రాంతాలనుండి నాలుగువందలయాభైమంది ని శ్రీవారి సేవకు తీసుకువచ్చినదో బాలిక . ఆ అమ్మాయి పేరు సూర్యకుమారి . డిగ్రీ చదువుతూ మానివేసి శ్రీవారిసేవలోకి నిమగ్నమైనది . గిరిపుత్రులంతా ఆ అమ్మాయి నాయకత్వంలో ఒక్కొక్కల్లుఉ ఒక్కో హనుమంతులవారిలా చేస్తున్న సేవ ఎన్నదగినది. వారి గూర్చి తెలుసుకుని ఫోన్ ద్వారా సంప్రదించి  బసకు వెల్లాను. మాష్టర్ గారొచ్చారంటూ ఆమె వారందరిచేత బృందంగా నృత్యం చేపిస్తూ   చేసిన నామస్మరనతో తిరుమలగిరులు మార్మోగాయి. నిజంగా ఆమె చెంచులక్ష్మీ మాతఅంశయే. అంతటి తేజస్సు ఉందామె ముఖంలో. ఇరవైరెండేళ్లులేవు కానీ స్వామి పట్ల ఆమెకున్న భక్తి .....ఏదో కారణజన్మురాలు . మొత్త<ం రాష్ట్రంలో తొమ్మిది ఐటీడి ప్రాజక్టుల పరిధిలోని గిరిజనులనంతా శ్రీవారిసేవకు తరలించాలనే బృహతర లక్ష్యాన్ని చేపట్టినట్లు తెలిపినదాఅమ్మాయి. హనుమత్ రక్షాయాగం గూర్చి,భద్రాచరంలో శ్రీరామపట్తాభిషేకం గూర్చి విని వారంతా వస్తామని తెలిపారు, నిజంగా స్వామి నన్ను అక్కడకు అనుమతించినందుకు సరైన రీతిలోనే పనిచేశాననుకుని తిరుగుప్రయాణమయ్యాను .ఈ హడావుడిలో  మన ఆదిలక్ష్మిగారిని చూడటానికి  వశిష్ఠాశ్రమానికి వెళ్లలేకపోయాను

[ఇంటికిరాగానే నవరాత్రి ఉత్సవాల పనులవత్తిడి వలన ఈపోస్ట్ ఇంతవరకూ వ్రాయలేకపోయాను]
శ్రీవారి సేవలో మాఫోటోలు ఇక్కడ రేణు పంపిన  ఈ లింక్ లో చూడండి.

https://www.dropbox.com/sh/9308bgtrpm2cu9p/keF6Bl2ajS







https://www.dropbox.com/sh/9308bgtrpm2cu9p/keF6Bl2ajS

12 వ్యాఖ్యలు:

venkatram rao November 1, 2012 at 5:56 AM  

Durgeswar Garu

You are very lucky. We missed a chance to join in Bhaktipages group as we already went Tirumala in the first week of October.

Venkatram Rao K

venkatram rao November 1, 2012 at 5:58 AM  
This comment has been removed by the author.
GKK November 1, 2012 at 7:13 AM  

మీరు ధన్యులు దుర్గేశ్వర్ గారు. చాలా ఆసక్తికరంగా ఉంది మీరు వ్రాసిన శ్రీవారి సేవ విశేషాలు.

Srikar November 1, 2012 at 8:08 AM  

ayya alaanti sadavakaasam vaste... ee sari nannu gurthu unchukondi swamy ! Jai Sri Raam !!! aa pai swamy daya !

Srikar November 1, 2012 at 8:14 AM  

Jai Srimannarayana !

Srikar November 1, 2012 at 8:15 AM  

aa swamy leelalu chadavadaaniki kuda adrustam undaali lendii !!! Mee dwaara maaku kaneesam adi dakkutondi ! dhayavaadaalu !

durgeswara November 1, 2012 at 8:47 AM  

వెంకట్రామ్ గారికి తెలుగు అభిమాని గారికి ధన్యవాదములు
శ్రీకర్ ! ఈసారి పీఠం నుంది పంపే బృందంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,విద్యాధికులు రైతులు,విద్యార్థులు, హరిజనగిరిజనులు ఉండేట్లు చూస్తున్నాము తప్పనిసరిగా వెళుదురుగాని

old is gold November 1, 2012 at 9:33 AM  

దుర్గేశ్వర రావు గారు,
మీరు కళ్లకు కట్తినట్తు తెలియ చేసిన విశయ విశేషాలు మనోహరముగా ఉన్నాయి.
మీరు అదృష్టవంతులు.మీకున్న చిత్తశుద్ది,భగవంతుని మీద ఉన్న భక్తి శ్రద్ధలు అపూర్వము.ఎంతో
ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు.మీకు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు సకల
ఆయురారోగ్యాలు,సుఖ సౌఖ్యాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశే అవకాశాలు మళ్లీ మళ్లీ
ఇవ్వాలని మనసారా కోరు కుంటున్నాను.

శుభాభివందనములు
ఆదిపూడి భాస్కర రాజు

Kottapali November 1, 2012 at 10:13 AM  

చాలా సంతోషం మాస్టారు. ధన్యులు. మీ అదృష్టన్ని మాతోనూ పంచుకుని మమ్ములనూ ధన్యులను చేశారు

mahadev November 1, 2012 at 11:20 AM  

DURGESH GARU
NAMASKAR ANDI CHEPANDI
BAGUNARA?
SWAMI CHOOSKONDI NADWANDI
JAI SRI RAM
HAR HAR MAHADEVA

siva November 1, 2012 at 10:10 PM  

Durgeswara swamy Meeru chala lucky andee chala happy gaa feel ayyi vuntaru swamy variki seva cheyadam loo

Unknown December 16, 2012 at 9:58 PM  

Der sirs,

All of you are very lucky all the best always
sastry

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP