నవ చైతన్య వైతాళికుడు
>> Monday, October 1, 2012
జగతి ముందుకు సాగడానికి అవసరమైన మూలధాతువు చైతన్యం. జఢత్వంతో నిండిన జాతి మృతప్రాయమైనదంటాడు స్వామి వివేకానంద. ఈ చైతన్యమనే మహోత్తేజం నుంచే మనిషిని బలోపేతుణ్ణి చేసిన మనోబలం ఆవిర్భవిస్తుంది. ఈ జగాన ప్రతి వ్యక్తికీ అవసరమైన సిద్ధమంత్రం మనోబలం. మనోబలం వ్యక్తి జీవితానికి నిత్యత్వాన్నీ, సకలత్వాన్నీ ప్రసాదించే తత్వాన్ని కలిగిన చైతన్య సంజీవని. మానసిక దుర్బలత్వం జనులకు సదా ప్రయాసను, దైన్యాన్నీ కలుగచేస్తుంది. ఇది అక్షర సత్యం. భరతజాతి ఈ మనోదౌర్బల్యానికి గురి అయిన సమయాలలోనే పరదేశీయుల దాడులకు గురి అయింది. భారత జాతిపిత మహాత్మాగాంధీ ఈ చైతన్యాన్ని విభిన్న దశలలో భిన్న ధోరణులలో వికటించని రీతిలో ప్రకటించి, అదీ అహింసా మార్గంలో పయనించి నవ చైతన్య వైతాళికునిగా జాతికి మార్గ దర్శనం చేసిన విధం స్వాతంత్య్ర భారత చరిత్రలో నిత్య స్తవనీయమైన విషయమే.
ఐక్యతాలోపమే... ప్రపంచ చరిత్రను అవలోకిస్తే, విదేశీయులు కానీ, దురాక్రమణదారులు గానీ ఒక జాతిపై, లేదా ఒక సమాజంపై ఆధిపత్యం హస్తగతం చేసుకున్నపుడు, దానికి కారణం అధికశాతం ఆ జాతిలోని వైషమ్యాలు, వర్గవిభేదాలు కారణమని పదే పదే నిరూపించబడిన విషయం. జనులలో పెచ్చు మీరిన అమితమైన జఢత్వం, ఏకత్వం లేని ఆలోచనలే ఈ పరపీడన పరాయణత్వానికి దోహదం చేస్తాయి. అతి కొద్ది తెలివితేటలే అవతలివాడికి ఉన్నా, ఈ కారణాల వల్ల అతి సులభంగా ఆ జాతిపై దురాక్రమణదారు పైచేయి సాధించిన సందర్భాలు కోకొల్లలుగా గతంలో, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో దర్శనమిస్తాయి. నిరంతరమూ ప్రజలలో పొడసూపే అకారణ విభేదాలు, వర్గ వైషమ్యాలు, సంస్థానాధీశుల్లో నెలకొన్న చైతన్య రాహిత్యం మన దేశాన్ని పదే పదే పరదేశీయుల పాలనకు గురిచేసి స్వాతంత్యాన్ని కోల్పోయేలా చేశాయి. భారతీయులకు ఉన్న ఈ బలహీనతలనే తమ బలమైన ఆయుధాలుగా మార్చుకున్న పరదేశీయులు ఘోరీ మహమ్మద్, ఘజనీ మహమ్మద్‌ల కాలం నుంచి ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు తమ కరాళమైన ఆలోచనలకు ధారాళమైన రూపాన్ని సంతరించగలిగారు. అయితే జాతిని జాగృతం చేసే విధిని చేబూనిన పవిత్రాత్ములైన స్వాతంత్య్ర యోధులు హింసా, అహింసా మార్గాలలో తమ తమ పంథాలలో స్వరాజ్య సమరం చేసిన విధం, విధానం అందరికీ తెలిసినదే. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ వంటి యోధులు హింసామార్గాన్ని అవలంబించినా హింసకు ప్రతిహింస ఏమాత్రం సమాధానం కాదని, అహింసే పరమ శ్రేష్టమైన, సవ్యమైన మార్గమని జాతిపిత మహాత్మా గాంధీ తొలి నుంచీ తలపోశారు.
టాల్‌స్టాయ్ లేఖతో స్ఫూర్తి గాంధీజీ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు 'ఫ్రీ హిందుస్తాన్' అనే మాసపత్రికకు ప్రఖ్యాత రచయిత టాల్‌స్టాయ్ రాసిన లేఖలోని సారాంశం ఆయనను వివశుణ్ణి చేసింది. 1909వ సంవత్సరంలో రాయబడిన సుదీర్ఘమైన ఆ లేఖలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని అహింసా మార్గంలో భారతీయులు ఎదుర్కోవాలని, బ్రిటిష్ నాగరికతను కలిసికట్టుగా తిరస్కరించాలని టాల్‌స్టాయ్ వాదిస్తాడు. ఆ లేఖలోని ఆసక్తి కలిగించే అనేక వాక్యాలలో ఆనాటి భారతీయ పరిస్థితులకు అతి దగ్గరగా ఉండే కొన్ని వాక్యాలు ఈ విధంగా సాగుతాయి. "ఓ వాణిజ్య కంపెనీ 20 కోట్ల జనాభా ఉన్న ఒక దేశాన్ని దాస్యంలో బంధించింది. ఉత్సాహవంతులైన, తెలివైన, బలిష్టులైన, స్వేచ్ఛాప్రియులైన 20 కోట్ల మందిని శారీరక దారుఢ్యం ఏమాత్రం లేకపోగా రోగగ్రస్తుల్లా కనిపించే ఓ 30 వేల మంది(ఈస్ట్ ఇండియా కంపెనీ) దాస్యంలోకి నెట్టడమంటే అర్థమేమిటి? భారతీయుల్ని ఇంగ్లీషువారు దాస్యంలో బంధించలేదని, వారు తమకు తామే దాస్యాన్ని విధించుకున్నారని ఈ అంకెలు సూచించడం లేదా?'' అంటూ అత్యంత స్ఫూర్తివంతంగా లిఖించబడిన ఈ లేఖ గాంధీలో కొత్త శక్తి నరనరాన ఆవరించేలా ఉత్ప్రేరకంలా పనిచేసింది. టాల్ స్టాయ్ అనుమతితో గాంధీజీ అప్పట్లోనే ఈ లేఖను దాదాపు 20 వేల ప్రతులు అచ్చు వేయించి, స్వరాజ్యాన్ని కాంక్షించే వారందరూ అహింసా సమరానికి సన్నద్ధులయ్యేలా ఉత్తేజితులను చేశారు.
సత్యాగ్రహ శక్తి అహింస, సత్యం, ధర్మం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గడిపిన మహాత్ముడు సత్యాగ్రహం తోనే భారతీయుల ఆగ్రహజ్వాలను ఆంగ్లేయులకు చూపించి స్వాతంత్య్రం సాధించే వరకు ఆ జ్వాల చల్లారదని ఆచరణలో చూపించారు. 'సత్యం' అనే మాటను ప్రేమకు, ధర్మానికి, సామాజిక న్యాయానికి, ఆత్మయొక్క ప్రబలమైన శక్తికి పర్యాయపదాలుగా వాడుతూ దృఢత్వాన్నీ, బలాన్నీ సమానార్థకాలుగా ముందుకు తెచ్చిన గాంధీజీ సత్యం యొక్క అజేయ శక్తిని ప్రస్ఫుటంగా తెలిసేలా, విస్తృతమైన సత్యవ్రతానికి నిత్యమైన ప్రాతిపదికగా, కాంతులు చిందే కరదీపికలా, విశ్వం ముందుకు తెచ్చిన అహింసా వజ్రాయుధం 'సత్యాగ్రహం'. విశ్వంఖలమైన ఇంగ్లీషువారి పాలనపై జరిగే స్వాతంత్య్ర పోరాటంలో ధర్మానిది, న్యాయానిది, సత్యానిదే అంతిమ విజయమని తెలిపేలా జాతిని అణువణువునా జాగృతం చేసి పరతంత్ర శృంఖలాలు తెంచిన మహాయోధుడు మన జాతిపిత. అసామాన్యమైన రీతిలో, ఊహించనలవిగాని తీరులో 'సత్య' ఆగ్రహాన్ని ప్రకటించి సామాన్యునిలోనూ చైతన్యం రగిలించిన మృదు గంభీర చరితుడు, మేరునగధీరుడు గాంధీజీ. పరతంత్రమనే అమావాస నిశి నుంచి స్వాతంత్య్రమనే పున్నమ వెన్నెల వేపు జాతిని నడిపిన కమనీయ చరితుడు.
చైతన్యదీప్తి మహాకవి శ్రీశ్రీ తన విప్లవాత్మక కవితాధారలో "నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనమంతా కదిలితే ప్రభంజనం'' అంటూ చైతన్యాన్ని రగిలిస్తాడు. మన రక్తంలో నిరంతరమూ ఉత్తుంగ తరంగంలా ప్రవహించే రసప్లావిత శక్తినే చైతన్యం అనవచ్చు. ఎల్లెడలా ఉద్వేగ భరితమై, తేజోమయ ప్రజ్జ్వలితమై భాసించే చైతన్య దీప్తి ఒక విశాల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాన ఆవశ్యకం. ఈ చైతన్యం జాతిలో ఒక్కరిలోనో, కొందరిలోనో ఉంటే లక్ష్యం హస్తగతమవదు. అది సమున్నతంగా విస్తరించి జనులందరిలో ఈ చైతన్య మహోదధి ప్రగతి పయోనిధియై పెల్లుబికినపుడు అది జాతికి హితకరమవుతుంది, ప్రగతి కారకమవుతుంది. మహాత్ముడు స్వాతంత్య్ర పోరాట సమయాన జాతి జనులందరినీ ఉద్దేపింపచేసిన విధానం నిరతమూ స్తవనీయం, విశాలమైన ఈ జాతి నిలిచి ఉన్నంత వరకూ చిరస్మరణీయం. మహాత్ముడు, మిగిలిన స్వాతంత్య్ర సమరయోధులు పల్లవింపచేసిన ఈ చైతన్యగీతిక భరతజాతికి మధురమైన స్వాతంత్య్రమనే సంగీతాన్ని వినిపించి పాలకాంకితగాత్రులను చేసింది. పరతంత్రపు శృంఖలాలు తెంచుకుని తమ భాగస్వామ్యంతో నిర్మించబడిన ప్రజాస్వామ్య మహాసౌధంలో భారతీయులంతా వసించేలా పరవశింపచేసింది.
వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి తాళ్ళపాక పద సాహిత్య విశ్లేషకులు
0 వ్యాఖ్యలు:
Post a Comment