శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చరిత్ర 49,50,51,52

>> Sunday, June 24, 2012

ఎవరు ఇంద్రియ తృప్తిని కల్గించే సుఖములను కోరక, కేవలము వాటి ధర్మములను నిర్వహిస్తాడో, అతడు ఇంద్రియనిగ్రహము కలవాడే అవుతాడు.
ఇంద్రియ సుఖములనుండి విముఖులై కూడా, మనస్సులోని కలుషాలను తుడిచి వెయ్యలేనివారు ఎందరో ఉన్నారు. జనులు చస్తారేమో అన్న భయం చేతనో, లేదా జనులలో కీర్తిని పొందటానికో, లేదా ఆధ్యాత్మికోన్నతికో, ధార్మికంగా కనిపించే మాయాజాలం చెయ్యటానికో, వారు జితేంద్రియులలాగా ప్రవర్తిస్తారు. కాని వారికి లోపల ఇంద్రియ దాహం ప్రబలంగానే ఉంటుంది. ఆజన్మాంతరము వారు స్ఖలితులు కానప్పటికీ, వారు ఇంద్రియ సంయమనానికి దూరంగా ఉన్నవారే! ఇంద్రియ పరితృప్తి కోసం మాటిమాటికీ ప్రయత్నించి సఫలమయ్యేవారికీ, పైవిధంగా చెప్పబడే కుహనా ధర్మాత్ములకూ ఏమీ భేదములేదు. వారిద్దరూ ఒకేవిధంగా ఇహలోకమనే నరకాగ్నిలో దగ్ధం కావలసినవారే! ఇంద్రియ సంతృప్తి కలిగినా కలగకపోయినా, ఇంద్రియ సంతృప్తి అనే భావన మనస్సులోకి పొరపాటున వచ్చి ధర్మరక్షణ కోసమో ఆత్మతృప్తి కోసమో ఇంద్రియతృప్తి కలిగించవలసి వస్తే ఎవరికి సుఖం కంటే దుఃఖమే ఎక్కువ అనిపిస్తుందో, అలాంటివారికి ఇంద్రియ నిగ్రహం కలిగిందని తెలుసుకోవాలి. అది లేకపోతే యోగము, తపస్సు, ఉపాసన, కఠోర నియమాలు అన్నీ వృథాయే!
కేవలం యోగంవల్లనో తపస్సువల్లనో ఇంద్రియ నిగ్రహం కలగదు. ఈ సంసారంలోనే ఇంద్రియ సంయమనం కలుగుతుంది. అరణ్యంలో ఉండి, ఇంద్రియ తృప్తిని కలిగించే సాధనాలకు దూరంగా ఉండి, అన్ని విషయాల పట్ల నిర్లిప్తంగా ఉండి, ఇంద్రియాలను జయించానని అనుకోవచ్చు. కాని బాగా కాలని మట్టిపాత్ర స్పర్శ మాత్రం చేతనే నిలవలేనట్లే, అలాంటివారి ఇంద్రియా నిగ్రహంకూడా లోభస్పర్శచేత నిలవదు. అందుకు ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. స్వర్గం నుంచి ఒక అప్సరస దిగిరాగానే ఒక ఋషి మహోదయుని యోగం భంగం అయింది. అంతేకాక తిరిగి ధైర్యం వహించటానికి ఇంద్రియ తృప్తి కలిగించక తప్పలేదు. ఏ దేశంలో ఏ వస్తువు దొరకదో అక్కడివారు ఆ వస్తువును తినరు; అమ్మరు. దాని భావము త్యాగమని అనకూడదు. ఇంద్రియ తృప్తినిచ్చే పదార్థాలతో ప్రతినిత్యం సంసర్గం కలవాడు, వాటితో యుద్ధం చేసి ఎప్పుడో విజయం పొందితే, అతడు విజయుడనబడతాడు. అదే ఇంద్రియ జయమనబడుతుంది. పరాశరుడు కాని, విశ్వామిత్రుడు కాని మొదటనే ఇంద్రియాలను జయించలేకపోయారు. కాని, భీష్ముడు- లక్ష్మణుడు ఇంద్రియ జయమును సాధించగలిగారు.
ఇంద్రియ సంయమనం చెయ్యాలనే కోరిక చిత్తశుద్ధిలోని మరొక గొప్ప లక్షణము. చాలామందికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. కాని వారికి ఇతర కారణాలవలన చిత్తశుద్ధి ఉండదు. ఇంద్రియ సుఖాలను అనుభవించకపోయినా మనం చక్కగా ఉందాము; అందరూ మనను ప్రేమిస్తారు అనే వాసన మనస్సులో ప్రబలంగా ఉంటుంది. ధనము, అభిమానము, గౌరవము, కీర్తి, సౌభాగ్యము, ఉన్న పెద్దవాళ్లు తమను అందరూ ధార్మికుడని మహాత్ముడని గౌరవించాలని కోరుకొంటూ ఉంటారు. కాని వారి మనస్సులో ఉన్న విషయాలపట్లనే వారు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. అందువలన చెయ్యరాని పనులు చేస్తారు. అంతేకాక అన్నింటిలోనూ తమ మనస్సును లగ్నం చేస్తూ ఉంటారు. అలాంటివారు ఇంద్రియాసక్తులకన్న నికృష్టులు. వారికి ధర్మము కాని, కర్మకాని, జ్ఞానము కాని భక్తికాని ఏదీ ఉండదు. ఈశ్వరుడున్నాడని ఒప్పుకొన్నప్పటికీ, ఆయనున్నాడా లేడా అన్న సందేహం పోదు. జగత్తు ఉన్న దానిపట్ల నమ్మకం ఉండదు. ఇలాంటి ఇంద్రియాసక్తి పట్ల కోరిక, స్వార్థపరత్వము, చిత్తశుద్ధికి ఎక్కువ బాధాకరమైనవి. స్వార్థపరత్వము, వాసనలను త్యజించడంవలన తప్పక చిత్తశుద్ధి కలుగదు. మనలాగానే ఇతరులు కూడా ఉన్నారు. మనము మన సుఖాలను కోరుకొన్నట్లుగానే ఇతరులు సుఖాలను కూడా కోరుకోవాలి.
 ఇతరులంతా మనకన్న గొప్పవారని భావించినప్పుడు, ఇతరులను మనలో చూడగలిగినప్పుడు, మన మనస్సు విశ్వవ్యాప్తి అవుతుంది. అప్పుడు మనకు చిత్తశుద్ధి కలిగినట్లు తెలుసుకొంటాము. అట్లాకాక, సంసారాన్ని త్యజించి కౌపీన దండములను ధరించి, భిక్షావృత్తిని అవలంభించి, ఇంటింటికీ వెళ్లి హరినామ స్మరణ చేస్తూ తిరిగినా చిత్తశుద్ధి కలుగదు. అంతకన్నా మణిమాణక్య మకుటధారియైన ఏ మహారాజు తన సింహాసనంపైన కూర్చొన్నా, ఒక భిక్షకునిలాగా ఇతరుల దుఃఖాలను తన దుఃఖాలుగా భావిస్తాడో, అతనికి చిత్తశుద్ధి కలిగినట్లు, అన్ని పవిత్ర వస్తువులకు ఎవరు సృష్టికర్తయో, ఎవరు స్వయంగా పవిత్రుడో, ఎవరి దయవలన పవిత్రత చేకూరుతుందో, ఆయన పట్ల ప్రగాఢమైన భక్తి కలిగి ఉండటం చిత్తశుద్ధి యొక్క ప్రధాన లక్షణము. అలాంటి భక్తియే చిత్తశుద్ధికి, ధర్మమునకు మూలము.
చిత్తశుద్ధి యొక్క ప్రధాన లక్షణము హృదయములో ప్రశాంతత. రెండవ లక్షణము ఇతరులను ప్రేమించటం మూడవ లక్షణము ఈశ్వరునిపట్ల భక్తి. ఎవరికైతే అలాంటి శాంతి, ప్రేమ, భక్తులు కలుగుతాయో, వారికి ఎలాంటి కోరికలు ఉండవు. అలాటివారికి సాలోక్యము అంటే మనతో పాటు నివసించటము; సామీప్యము అంటే మనకు సమీప వర్తులై ఉండటము; సాయుజ్యము అంటే మనతో సమానమైన ఐశ్వర్యము; సారూప్యము అంటే మనతో సమానమైన రూపము లేదా ఏకత్వము అనే అన్నిరకాల ముక్తులూ లభిస్తాయి. అలాంటివాడు భగవత్సేవను తప్ప మరేమీ కోరడు. ధనాశను పరిత్యజించటం, శ్రద్ధ కలిగి ఉండటం, హింసాత్యాగము, నిష్కామ పూజ లేదా జపముల ద్వారా భగవత్ స్వరూప దర్శనము- స్పర్శనము స్తుతించటము, వందనము, అన్ని ప్రాణులలోను భగవంతుని దర్శించటము, ధైర్యము, వైరాగ్యము, గొప్పవారిని గౌరవించటము, దీనుల పట్ల దయ, తనతో సమానమైన వారిపట్ల మైత్రి, అంతరింద్రియాల దమనము, బాహ్యేంద్రియ నిగ్రహము, ఆత్మసంబంధిత విషయముల శ్రవణము, భగన్నామ సంకీర్తనము, సరళత్వము, సత్సంగము, నిరహంకారము మొదలైన గుణముల ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. అలాంటివారు ఏ ప్రయత్నమూ లేకుండానే ఆ భగవంతుని పొందుతారు. సువాసన గాలితో కలిసి ఘ్రాణేంద్రియములను ఆశ్రయించినట్లు భక్తియోగంతో కూడిన చిత్తము అప్రయత్నంగానే పరమాత్మను ఆత్మలో చేర్చుకొంటుంది.
ప్రాణులలో పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్నాడు. అన్నిప్రాణులలోను ఉన్న జీవుడే తన హృదయంలో కూడా ఉన్నాడనే స్థితి కలగనంతవరకూ తన కర్మలో లీనమై ఉపాసన లేదా జపము చెయ్యాలి. తమకు ఇతరులకు మధ్య భేదాన్ని పాటించేవారు, ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించలేనివారు, ఈశ్వరుని, ఈ బ్రహ్మమయ ప్రపంచాన్ని గురించి తెలుసుకోలేరు. ఈశ్వరుడు సర్వవ్యాపి. ఆయన అన్నిచోట్లా అంటే అడవిలోను, నగరంలోనూ, గ్రామంలోనూ, నీటిలోనూ, భూమిమీది, శూన్యంలోనూ, రాతిలోనూ అన్ని ప్రాణులలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు.
ఈశ్వరుడు సర్వవ్యాపి అని కేవలము నోటితో చెబితే లాభం లేదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఒప్పుకొన్నప్పుడు ఈ జగత్తు బ్రహ్మమయమని నిశ్చయింపబడుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి అని జ్ఞానం ద్వారా తెలుసుకొన్నవారు, ఈ బ్రహ్మమయ జగత్తు ఎట్లా ఉంటుందో చక్కగా తెలుసుకోగలుగుతారు. ఈశ్వరుడు ఏపదార్థము, ఆయన ఆకారం ఎట్లా ఉంటుంది, ఏ మార్గంలో వెళ్తే ఆయన లభిస్తాడు అనే విషయాలను మనం నిరూపించలేకపోవచ్చును.
కాని, వాటిని కేవలం అర్థం చేసుకోవచ్చును. వీటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ముందుగా కారణరూపంలోను, ఆ తరువాత ప్రత్యక్ష రూపంలోను, ఈశ్వరుని దర్శనం లభిస్తుంది.
ఆయన రాత్రింబగళ్లూ మనముందేన్నాడు. ఆయనను మనం అంతఃకరణంలో చూడాలని కోరుకోవటం లేదు అందుకే ఆయనను చూడలేకపోతున్నాము.
 ధర్మము
ఈనాడు సర్వత్రా అందరినోటా బహిరంగంగాను, అంతరంగంలోను ధర్మం అనుమాట వినబడుతూనే ఉన్నది. ధర్మబోధలేని పుస్తకం కాని, పత్రిక కాని, ప్రబంధం కాని ఉండనే ఉండదు. కాని వాస్తవానికి ఈనాటి మానవ సమాజంలోను, సభ్య సంప్రదాయంలోను ధర్మం చాలా తక్కువగా ఉన్నది. అందరి మనుష్యులోలను, అన్ని సంప్రదాయాలలోను హింసాద్వేషాలు నిండి ఉన్నాయి.
కేవలం భావచౌర్యమే కన్పిస్తుంది. అంటే లోపల ఒకటి, బయట మరొకటి. ఈ రోజులలో కన్యాదానం చెయ్యటం చాలా కష్టమైపోతున్నదని చెప్పేవారే, తమ కుమారుని వివాహానికి కనీసం పదివేలు ఇవ్వనిదే రాజీపడటంలేదు. కేవలం నోటినుంచి మాత్రమే ధర్మమనే మాట వెలువడుతున్నది. ఇంతటి కపటత్వం బహుశా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కనిపించలేదు. ఇలాంటి దురవస్థ మానవ సమాజంలో ఎప్పుడూ ప్రాప్తించలేదు. మనిషి ఈనాడు ఎంతో అసంతృప్తితో ఉన్నాడు. అందుకే అతడు సుఖదుఃఖాల విషయంలో భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు.
అసలు ధర్మం ఎక్కడినుంచి వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? దాని సృష్టికర్త ఎవరు? అనే విషయాలను గురించి తెలుసుకోవాలి. వీటికి సమాధానం చాలా తేలిక అని అందరూ అనుకోవచ్చును.
కాని అది అంత తేలికైనది కాదు. భూమిమీదున్న అన్ని జాతులకూ ఒక్కొక్క ధర్మం ఉన్నది. ధర్మంలేని జాతి భూమిమీద ఏదీ లేదు. మరి వారి ధర్మం ఎక్కడినుంచి వచ్చింది? అయినా వారి ధర్మానికి స్రష్ట ఎవ్వరూ లేరు.
ధర్మం యొక్క ఉత్పత్తిని గురించి తెలుసుకోవటానికి నాగరక జాతులు చేసిన పరిశోధనలు ఏవీ ఫలితాల నివ్వలేదు. ఎందుకంటే సభ్య సమాజంలోని ధర్మాలు చాలా ప్రాచీనమైనవి. వాటి ప్రాథమిక అవస్థలు ఈనాడు లేవు.
అవి ప్రాథమిక అవస్థల నుంచి పూర్తిగా మారిపోయాయి. ఈనాడు వాటిలో ఎక్కడా ఆనాటి ప్రాథమిక లక్షణాలు కన్పించవు. ఎట్లాగంటే వృక్షం ఎక్కడినుంచి వచ్చిందో దాని అంకురాన్ని బట్టి తెలుస్తుంది. కాని బలమైన కాండాన్ని బట్టి తెలియదు. కనుక సభ్యజాతుల ధర్మాలను తెలుసుకోవాలంటే అనాగరక జాతుల ధర్మాలనుగురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
మనిషి ఎంత నాగరకుడు కాకపోయినా, శరీరం కన్న చైతన్యం పూర్తిగా భిన్నమైనదని అతనికి తెలుసు. ఒకడు నడుస్తున్నాడు, పనిచేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు. కాని అతడు చనిపోయిన తరువాత ఆ శరీరం ఏమీ చేయలేదు కాని, అతని శరీరం ఎప్పటిలాగే ఉన్నది. కాని ఆ శరీరము ఏమీ చేయలేదు. అతని శరీరంలో నుంచి ఏదో ఒక ప్రధాన వస్తువు వెళ్లిపోయింది. అందువలననే అతడు ఏ పనీ చేయలేకపోతున్నాడు.
దీని విషయంలో అజ్ఞానులైన మానవులు కూడా, శరీరంలోని జీవత్వానికి బలంకాక, శరీరంకన్న భిన్నమైన జీవపదార్థం మరొకటి ఉందని అర్థం చేసుకొంటారు. జ్ఞానులు దానినే జీవమనీ, ప్రాణమనీ అంటారు. అజ్ఞానులు దానికి పేరు పెట్టగలరో, పెట్టలేదో తెలియదు. కానీ, శరీరంలోపల ఒక ముఖ్యమైన పదార్థం ఉందని మాత్రం అందరికీ తెలుసు.
మరొక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తే, అది కేవలం మనుష్యులలోనే కాక, చెట్లు- చేమలలో కూడా ఉంటుందని తెలుస్తుంది.
చెట్లు చేమలలో ఆ వస్తువు ఉన్నంతవరకూ వాటికి పూలు పూస్తాయి. పండ్లు కాస్తాయి. ఆకులు వస్తాయి. వృద్ధి చెందుతాయి. ఆ వస్తువు లేకపోతే చెట్లు పుష్పించవు, ఫలించవు. ఎండిపోయి నశిస్తాయి. అందువలన చెట్లు- చేమలలో కూడా జీవం ఉన్నది.
అయితే చెట్లు- చేమలలో ఉన్న జీవ పదార్థంలో ఒక తేడా ఉన్నది. అదేమిటంటే- చెట్లు కదలవు; ఊగవు; మాట్లాడలేవు. తమ ఇష్టానుసారం ఏమీ చెయ్యలేవు.
అందువలన మనుష్యుడు జ్ఞానమార్గంలో ఒక అడుగు ముందున్నాడు.

కారణం ఏమిటంటే శరీరంలో జీవం కన్న భిన్నమైన మరొక పదార్థం ఉన్నదని, అది చెట్లు చేమలలో లేదని తెలుసుకొన్నాడు. దానిని జ్ఞానులు చైతన్యమని, జ్ఞానమని అంటారు.
మనిషి చనిపోయిన తరువాత, శరీరం ఉంటున్నది కాని, చైతన్యం ఉండటం లేదని అందరికీ తెలుసు. అయితే మనిషి నిద్రపోయినప్పుడు కూడా శరీరం ఉంటుంది కాని చైతన్యం ఉండటంలేదు. మూర్ఛవంటివి వచ్చినప్పుడు శరీరం ఉంటుంది. కాని, చైతన్యం ఉండదు. కనుక శరీరంకన్నా భిన్నమైన మరొక వస్తువు చైతన్యమని అంగీకరించవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆలోచించవలసిన విషయం మరొకటి ఉన్నది. అది శరీరం లేనప్పుడు చైతన్యం ఉండగలదా? లేదా? అసలు ఉంటుందా, ఉండదా? అని. ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఎట్లా ఉంటుంది? చైతన్యం శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోదలచుకొంటే అక్కడికి పోతుంది, ఎక్కడ ఉండదలచుకొంటే అక్కడ ఉంటుంది అని అందరికీ తెలిసినదే. దానికి ప్రమాణం ఏమిటంటే స్వప్నావస్థలో శరీరం ఒకచోట ఉంటుంది; కాని చైతన్యం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సుఖదుఃఖాలను అనుభవిస్తుంది; నానారకాల పనులు చేస్తుంది. కనుక శరీరం పోయినా చైతన్యం ఉంటుంది. ఇందులో సందేహం ఏమీ ఉండదు. జీవుడు తన ఇష్టప్రకారం పని చేయగలుగుతున్నాడంటే కారణం జీవునిలో చైతన్యం ఉన్నది. జీవనం లేనివాడు తన ఇష్టానుసారం ఏ పనీ చెయ్యలేడు. కనుక అచేతనుడు. దానిని బట్టి శరీరం పోయినా చైతన్యం ఉంటుందనే విషయం అందరికీ స్పష్టం అయి ఉంటుంది. అదే నమ్మకం ధర్మానికి మొదటి మెట్టు. జ్ఞానమే ధర్మానికి మూలం. జ్ఞానం లేనివారికి ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి?
జడపదార్థంలో చైతన్యాన్ని ఆరోపించటం ధర్మానికి రెండవమెట్టు. దీనిని ధర్మం అని కాక, ఉపధర్మం అనవచ్చును. ఉపధర్మమే సత్యధర్మపు మొదటిస్థితి. ఆకాశంలో మేఘాలు ఎక్కడినుంచి వస్తాయి? వచ్చిన మేఘాలు ఎందుకు వర్షిస్తాయి. వర్షించి ఎక్కడికి పోతాయి? మేఘాలు వచ్చినా ఎప్పుడూ ఎందుకు వర్షించవు? ఎప్పుడు వర్షం అవసరమో, ఎప్పుడు వర్షిస్తే పంటలు పండుతాయో, అప్పుడు ఎందుకు వర్షించవు? మరొకసారి అట్లా కూడా జరగకపోవచ్చు కదా! దానికి కారణం అదంతా ఆకాశం యొక్క ఇష్టము. మేఘాలయొక్క ఇష్టము. వర్షంయొక్క ఇష్టము. కనుక ఆకాశము, మేఘము, వర్షము అన్నీ సచేతనములని చెప్పవచ్చును.
అట్లాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, వాయువు, తుఫాను, పిడుగులు, మెరుపులు, సముద్రము మొదలైన వాటి విషయంలోను అట్లాగే చెప్పవచ్చును. తుఫాను, వర్షము, పిడుగులు, మెరుపులు, అగ్ని మొదలైనవాటిని మించిన బలం వేటికి ఉంటుంది? వాటిని మించిన బలం కలవాడు సూర్యుడు. ఆయన ప్రచండ తేజము, తీవ్రమైన గతి, ఫలోత్పాదన శక్తి, జీవోత్పాదన శక్తి, కిరణములు అన్నీ ఆశ్చర్యకర విషయములే. ఆయనను జగద్రక్షకుడు అనటంలో కూడా ఆశ్చర్యం లేదు. సూర్యుడు ఉదయించనంతవరకూ జగత్తు యొక్క సర్వకార్యములు బహుశః ఆగిపోయి ఉంటాయి. ఈ జగత్తులోని శక్తిమంతములైన పదార్థములలోని సామర్థ్యాన్ని చూసియే ఉపాసనా విధానం ఉత్పన్నమైంది. దీనినే ధర్మము యొక్క మూడవ మెట్టు అని చెప్పవచ్చును. అందువలననే అన్నిదేశాలలోనూ, సూర్యుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని, ఆకాశము మొదలైన వాటి ఉపాసనా జరుగుతున్నది. అందువలననే వేదాలలో ఇంద్రుడు, ఆకాశము, సూర్యుడు, వాయువు, అగ్ని మొదలైన దేవతల ఉపాసనా పద్ధతులు కన్పిస్తాయి. మెట్లు, కఱ్ఱలు, త్రాళ్ళు మొదలైన నానా రకాల ఉపాయాలతో ఇంటిపైకి వెళ్లగలిగినట్లే, ధర్మరాజ్యంలోకి వెళ్లటానికి ఎనె్నన్నో ఉపాయాలు మార్గాలు ఉన్నాయి.
అసింస, భక్తి, ప్రేమ అనేవి ధర్మానికి మూలములు. అన్ని చోట్ల అందరినోట అంతరంగిక బాహ్య ప్రేమల మాటలు వినబడుతూ ఉంటాయి. కానీ ఎవ్వరూ ఎవ్వరినీ వాస్తవంగా అంతరంగంతో ప్రేమించరు.
- ఇంకాఉంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP