చేసిన మంచే చివరకు మిగిలేది
>> Monday, January 30, 2012
చేసిన మంచే చివరకు మిగిలేది
కాని నైతికంగా మనం ఎక్కడున్నామన్నది ప్రధాన ప్రశ్న. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, మానవ విలువలను మంటగలిపి, ఆధ్యాత్మికతను భ్రష్టు పట్టించిన ఫలితంగానే మానవ సమాజం ఈ విధంగా అధోగతి పాలవుతోందన్న విషయాన్ని మనం గమనించడం లేదు. భౌతిక ప్రగతే అసలు ప్రగతి అన్న భ్రమలో పడి ప్రాపంచిక ప్రయోజనాల వెంట పరుగులు తీస్తున్న ఫలితమే ఈ అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అధర్మాలు.
అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్(సం) అన్నారు. "మనిషి అంతా నాది నాది అంటాడు. కాని నిజానికి అతనిది ఏది? అతను తినికాజేసింది, తొడిగి చించేసింది, దైవ మార్గంలో వెచ్చించి రేపటికోసం(పరలోకం కోసం) కూడబెట్టుకున్నది. ఇదిగాక మిగిలిందంతా ఇతరులదే.'' అంటే ఈ మూడు మార్గాల్లో వెచ్చించిందే నిజానికి అతనిది. ఇక ఇదిగాక మిగిలిందంతా అతని వారసులదే.
అది ఏ విధంగానూ అతనికి ఉపకరించదు... ఇహలోకంలోనూ, పరలోకంలోనూ. అందుకని తనది కాని దాని కోసం మనిషి ఎప్పుడూ పాకులాడకూడదు. మనుషుల్లో ఈ స్పృహ జాగృత మైననాడు, సమాజంలో అవినీతికి, బంధుప్రీతికి, మనుషుల్లో ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. తద్వారానే నైతిక, మానవీయ విలువలు వికసిస్తాయి.
ముహమ్మద్ ప్రవక్త(సం) ఇలా సెలవిచ్చారు. "అవినీతికి, అధర్మానికి పాల్పడి సంపాదించిన సొమ్ముతో పోషించబడిన శరీరం ఎట్టి పరిస్థితిలోనూ స్వర్గానికి పోజాలదు.'' అంటే అవినీతి, అధర్మ సంపాదనతో మూన్నాళ్ల ముచ్చటైన ఈ ప్రాపంచిక జీవితంలో తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కాని, శాశ్వతమైన పరలోక జీవితంలో మాత్రం నరక శిక్షను చవిచూడవలసి ఉంటుంది. అదీగాక ప్రాపంచిక జీవితంలో కూడా ధన సంపాదనతో ఆనందం దొరుకుతుందా అంటే దానికీ స్పష్టమైన హామీ లేదు. ఎందుకంటే, కోట్లు గడించిన వారు కూడా ఆనందానికి దూరమై, నిత్య దుఃఖం అనుభవించే వాళ్లూ ఉన్నారు.
కనుక కొన్నాళ్ల ప్రాపంచిక జీవిత ఆనందం కోసం, శాశ్వతమైన, అమరసుఖాల పరలోక జీవితాన్ని పణంగా పెట్టడం వివేకవంతుల లక్షణం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఎన్నాళ్లు బ్రతికినా ఏదో ఒకనాడు ఇహలోకాన్ని వీడిపోవడం తథ్యం. అందుకని బ్రతికినన్నాళ్లు ఎలాంటి అవినీతికి, ధర్మానికి తావులేకుండా, నైతిక, ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవితం గడిపితే ఇటు ఇహలోక జీవితమూ గౌరవప్రదంగా, శాంతియుతంగా ముగుస్తుంది. అటు పరలోక జీవితంలో కూడా శాశ్వత సాఫల్యం మన సొంతమవుతుంది. దైవం అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్
[andhrajyothy.com]
1 వ్యాఖ్యలు:
నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, మానవ విలువలను మంటగలిపి, ఆధ్యాత్మికతను భ్రష్టు పట్టించిన ఫలితంగానే మానవ సమాజం ఈ విధంగా అధోగతి పాలవుతోందన్న విషయాన్ని మనం గమనించడం లేదు. భౌతిక ప్రగతే అసలు ప్రగతి అన్న భ్రమలో పడి ప్రాపంచిక ప్రయోజనాల వెంట పరుగులు తీస్తున్న ఫలితమే ఈ అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అధర్మాలు.
------------------
చక్కగా సింపుల్ గ చెప్పారు. థాంక్స్.
Post a Comment