వద్దన్నా వచ్చేదే కర్మఫలం
>> Wednesday, December 14, 2011
వద్దన్నా వచ్చేదే కర్మఫలం
ధర్మాన్ని త్యజించినవాడు జీవచ్ఛవం లాంటివాడు. ధర్మాచార పరాయణుడు మృతి చెందినా సత్కీర్తితో చిరంజీవి కాగడు. ఇది నిస్సంశయం. ధర్మో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. అంటే, ధర్మాన్ని నీవు రక్షించు! అది నిన్ను రక్షిస్తుంది అని అర్థం. సత్కర్మలను ఆచరిస్తూ స్వల్పకాలం జీవించినా ఆ మానవుడి జీవితం ధన్యమే. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు. దయ చెలికాడు. శాంతం భార్య, సహనం కుమారుడు. ఈ ఆరుగురూ మానవుడికి బంధువులు. ఐహిక విషయాలలో బంధాలలో చిక్కిన మనిషికి మనస్సు బంధానికి కారణం. ఈ బంధానికి లోబడి, ధర్మాచరణ విడువరాదు. కర్మయందే నీకు అధికారం కలదు, కాని, దాని ఫలితంపై నీకు ఆసక్తి ఉండరాదని గీతలో కృష్ణుడు బోధించాడు. దేహం పట్ల ప్రేమను వదులుకొని, తాను పరమాత్మయందు ఉన్నట్లు తెలుసుకుంటే, మనస్సు ఎక్కడ వెళ్లినా, ఆ చోట పరమాత్మయందు నిలుస్తుంది. కోరిన కోరికలన్నీ నెరవేరి ఎవరికైనా అంతా సుఖమే ప్రాప్తించదు. సమస్తమూ దైవాధీనం, ప్రాప్తించిన దానితో సంతృప్తి చెందడమే ధర్మం. దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టి సజ్జన సాంగత్యాన్ని చేరాలి. రాత్రింబవళ్ళు దైవాన్ని భజిస్తూ ఉండాలి. అహం శాశ్వతం కాదని తెలుసుకోవాలి.
ముక్తిని కాంక్షించేవారు ఐహిక విషయాలను విషంతో సమానమని గ్రహించాలి. సహనం, ఋజువర్తన, దయ, పవిత్రత, సత్యాన్ని అమృతంలా భావించి ఆచరించి ధర్మమార్గంలో పయనిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆదిశంకరులు. అంటే, సత్సాంగత్యంవల్ల నిస్సంగత్వం అలవడుతుంది. తద్వారా నిశ్చలతత్వం వస్తుంది. దానివల్ల జీవన్ముక్తి కల్గుతుందని భావం. శరీరాలు అనిత్యమని, శాశ్వతంకాదని, మృత్యువు ఎప్పుడూ వెన్నంటి వుంటుందని గ్రహించి, పుణ్యకార్యాలు ఆచరించడం ఉత్తమం. ప్రాణులపట్ల దయతో ఎవని హృదయం కరుగుతుందో అతడే జ్ఞాని. అతడికే మోక్షం ప్రాప్తిస్తుంది. విదేశంలో విద్యయే తోడు, ఇంటిలో భార్య తోడు, రోగికి ఔషధం తోడు. ధర్మాచరణే చివరి తోడు. ఈ చరాచర ప్రపంచంలో సంపదలు, ప్రాణాలు శాశ్వతం కావు. యవ్వనం కూడా అశాశ్వతమే. ధర్మమొక్కటే శాశ్వతమైనది. ధన సంపద భూమిపై, పశుసంపద గోశాలలో, భార్య ఇంటి వాకిట ఉంటే, బంధువులు, మిత్రులు శ్మశానంవద్ద ఉండిపోతారు. కాని కేవలం ఆచరించిన ధర్మమే తనకు తోడుగా వెడుతుంది.
కర్మఫలం కర్మకు లోబడి వుంటుంది. మానవుల బుద్ది కర్మను అనుసరించి ఉంటుంది. కనుకనే జ్ఞానులైనవారు, సజ్జనులైనవారు ధర్మాచారణయందు ఆసక్తి కల్గి మానవజన్మను చరితార్థం చేసుకోవాలంటే, చక్కగా ధర్మాన్ని ఆచరించి, కర్మల్ని నిర్వహించాలి. రామాయణంలో శ్రీరాముడు, సత్యహరిశ్చంద్రుడు లాంటి మహనీయులు ఆచరించిన ధర్మసంబంధమైన కార్యాలు స్మరించుకుంటూ మనం కూడా అదే బాటలో పయనిస్తే జీవితం మృతతుల్యం అవుతుంది!
0 వ్యాఖ్యలు:
Post a Comment