శ్రీ శంకరవేదం
>> Monday, December 12, 2011
వేదాలు అపౌరుషేయాలా? కర్మాచరణ, తత్త్వ చింతనలలో ఏది ఉత్తమం? కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచం నిజమా? కల్పనా? ఇవీ ప్రశ్నలు, సందేహాలు, విచారణాంశాలు. ఈవిషయాలనే నిరంతరం చర్చించే వేదిక మండనమిశ్రుడి యిల్లు. జగత్తుకు సమాధానం అందించటం జ్ఞాని బాధ్యత. ఆ బాధ్యతను తలకెత్తుకున్నది పరమేశ్వర స్వరూపమైన శంకరాచార్యులు. మండనమిశ్రుడి వాదనలు, శంకరుల స్పష్టమైన భావ శరపరంపరలో ఛిన్నమైన వైనం, ప్రపంచం సాధించుకున్న అద్వైత స్థితి. శ్రీ శంకర భగవత్పాదుల ఆలోచనలు సర్వకాలికాలు. అవేంటో విందాం.
"వేదాలలో కర్మకాండ కంటే ఆత్మవిచారణకే పెద్దపీట. తొలిదశలో సాధకుడికి కర్మాచరణం, ఆధ్యాత్మసాధనకు తోడ్పడవచ్చు. కర్మలు ఆత్మవిద్యకు ఆలంబనం కాదు. అంతరంగము బ్రహ్మమేనని తెలుసుకోవటానికి, అదేనీవు, ఆ బ్రహ్మము నీవే, వేదం నుంచే అన్నీ పుడుతున్నాయి అనే మాటలు, ప్రమాణాలు కాదా! అసలు వున్నదే ఆత్మ! సృష్టికి పూర్వమే సత్యం వున్నది. అంటే ఆత్మన్నా, సత్యమన్నా ఒకటే కదా! ప్రత్యేక రూపం లేనిది, అన్ని రూపాలు తనే అయినది సత్యం. కనుక సత్యమే ఆత్మ! అది కాలాద్యవచ్ఛిన్నం.
ఏమీ లేదనేదే ఆత్మ
నేనే బ్రహ్మము అనుకోవటం అసలు ధ్యానం. పది యింద్రియాలు, మనసు కలిపి నేను అనుకుని ధ్యానిస్తే, అది బ్రహ్మానుభవానికి దారితీస్తుంది. మేనులోని అసలు నేనును అనుభవ పరిథిలోకి తెస్తుంది. కర్మకాండలను ఆచరించినందువలన కలిగే శ్రమకు ఫలితం లభిస్తే, మోక్షమూ అటువంటిదే. కానీ బ్రహ్మభావన, జ్ఞానంగా అనుభూతం అవుతుంది. ఆ స్థితిలో నిలకడగా వుండగలగటమే ఎరుక. ప్రపంచం, నిత్య, సత్య, శాశ్వతమనే భావన మనసు ఆడుకునే ఆట. ఆత్మను చూసిన వారెవరున్నారు? ఆత్మ, సాక్షాత్ ఆకారంగా వున్నదనుకున్న వాడికి, దేహము ఆత్మగానే అనిపిస్తున్నది. ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదని అర్థం. లేదు అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా ఆత్మ అని కదా స్ఫురణ! అదే అహం స్ఫురణ! సగుణం వున్నంతకాలం వ్యత్యాసం, వైరుధ్యం తప్పవు. నిర్గుణం అనుభవం అయినప్పుడు సందేహమూ కలుగదు. కనుక సమాధానం అవసరం వుండదు.
అసలైన రాజయోగి
యోగనిష్ఠలో, ఆత్మనిష్ఠలో, బ్రహ్మనిష్ఠలో వున్నవాడికి ఎంతటి బాహ్య సౌందర్యమూ అకర్షణీయం కాదు. యోగేశ్వర కృష్ణుడి సంచారమంతా బ్రహ్మచర్యమే. బాహ్యచర్య కాదుకదా! కృష్ణుడు అందరినీ అకర్షించాడు. ఆయన ఎవరి ఆకర్షణకూ లోబడలేదు కదా! కారణం, ఆయన ఆత్మజ్ఞాని కనుక. అంటినదీ, అంటించుకున్నదీ లేదు. ఆయనకున్న లోలత్వమంతా బ్రహ్మజ్ఞానం పట్లనే. వైరాగ్యంలో జీవుడు, కామాంతకుడు కావాలి. బ్రహ్మజ్ఞానమంతుడికి యితర విద్యలన్నీ కరతలామలకం. ముంజేత కంకణాలు. అవే ఆయనను అనుసరించి, ఆయన సేవలో ధ్యనవంతము, ప్రామాణికమూఅయి, శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి.
మరొక్కవిషయం. కర్మకాండకు వేదాలే ఆధారం. మహనీయుల బోధలన్నీ ఒక కాలాన్ని, దేశాన్ని, ప్రదేశాన్ని అనుసరించి విభిన్నంగా వినిపిస్తుంటయ్. మనమే సమన్వయం చేసుకోవాలి. సంఘర్షణకు తావులేని రీతిలో విషయాన్ని అర్థం చేసుకోవాలి. జీవుడు ఆత్మాభిముఖుడు కావటానికి కర్మకాండ సహాయపడుతుంది. సాధనాకాలంలో తనంతట తానే, సర్వమూ తాత్కాలికమేనని, సత్యమే సర్వమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ ఎరుక కలిగిన తర్వాత జీవుడి మనసు కర్మకాండ నుంచి బయటపడి, బ్రహ్మజ్ఞానం వైపు మరలి, కడగా అక్కడూ లయం అవుతుంది. అదే జీవన్ముక్తి. కర్మకు అతీతమైనవాడికి ప్రపంచమూ లేదు, దాన్ని గురించిన ఆలోచనా లేదు.
స్థిమితంగా వుంటాడు. పరబ్రహ్మము చైతన్యమనీ, ప్రపంచమంతా దాని చ్ఛాయేనని, మాయగాఅనుభవం కలిగి, సంస్థితుడై వుంటాడు. శరీరగౌరవాన్ని కాపాడే గోచిగుడ్డనీ, అరచేతిలో భిక్షాపాత్రనీ, మనసంతా వేద ధ్వనుల ప్రతిధ్వనులనీ... అన్ని వేళలా, దివ్యవైరాగ్యాన్నీ అనుభవించగలవాడే యోగిరాజు. నిజానికి వాడే అసలైన రాజయోగి!
[ ఆంధ్ర జ్యోతి దినపత్రిక నుండి]
0 వ్యాఖ్యలు:
Post a Comment