హన్నా ! స్వామినే మోసం చేద్దామనే !!!???
>> Friday, December 2, 2011
కొంతమందికి ఎక్కువ తెలివితేటలుంటాయి . దానితో మనుషులనే కాదు భగంతుణ్ణికూడా మోసం చేయగలమనే మూర్ఖత్వభావన ప్రబలంగా ఉంటుంది . వీళ్ళ వ్యూహాలలో కొన్నిసార్లు భక్తులుకూడా చిక్కుకుని భగవంతునిఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది . మొన్నశుక్రవారం నాకెదురైన ఓ అనుభవం ఓపెద్దపాఠం నేర్పింది నాకు.
మొన్న దరిశినుంచి హనుమద్దీక్షాధారుల గురుస్వామి ఒకాయన ఫోన్ చేశాడు .
స్వామీ మా ఊరిలో ఉన్న ఒక రియల్టర్ మంచి భక్తుడు హనుమంతునికి . హనుమంతుని భారీ విగ్రహాన్ని కురిచేడులో నిర్మించాలని సంకల్పించారు . ఈకార్యక్రమానికి సోమవారం శంఖుస్థాపన . మిమ్మల్ని తప్పనిసరిగా తీసుకురమ్మని కోరుతున్నాడు . మాదీక్షాధారులంతా అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలట . అని అడిగాడు .
నేను సామాజికశ్రేయస్సుకలిగించే సామూహిక కార్యక్రమాలు అదీ ఆలయాలలో జరిగితే నే వెళతాను లేదా వ్యక్తిగతంగా ఇబ్బందులలో ఉన్న భక్తులు తమ ఇంట్లో ఏర్పాటుచేసుకున్న పూజలకైతే ఎప్పుడన్నా వీలైతే వెళతాను అదీ చాలా తక్కువ.
ఇలా రియల్టర్లు,వ్యాపారులు ,రాజకీయ నాయకులు ఆశక్తితో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు వెళ్లబుద్దికాదు. వీలుకాలేదని తప్పుకుంటుంటాను . అందువల్ల నాకు కుదరదు స్వామీ అని చెప్పాను
మరలాఫోన్ చేసి అక్కడ ఏమేమి ? కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అడగమంటున్నాడు అని అడిగాడు. ఇలా ఫోన్ లో కాదులే ,అతన్ని రమ్మను మాట్లాడదాం అనిచెప్పాను. గురువారం వస్తామన్నారు .రాలేదు .
నిన్నశుక్రవారం అమ్మవారికి ,స్వామి వార్లకు అభిషేకములు కనుక ఆ హడావుడిలో ఉన్నప్పుడు వచ్చారు . పూజయ్యేంతవరకు వేచి ఉండమని సైగచేసి నాపూజాకార్యక్రమంలో మునిగిపోయాను . పూజయ్యేంతవరకు కూర్చున్నారు . హనుమత్ దీక్షాగురుస్వామి చెప్పేవన్నీ శ్రద్దగా వింటూ బుద్దిగా కూర్చున్నాడు కానీ అతని ముఖంలో ఏదో విచారం, ముఖమంతా కాంతిహీనంగా ఉంది. పూజయ్యాక చక్కగా అమ్మవారికి నివేదనచేసినప్రసాదం తీసుకుంటూ విషయం చెప్పుకొచ్చాడు .
స్వామీ ! నేను గతంలో ప్రతిఏటా హనుమద్దీక్ష తీసుకునేవాడిని .నాకు వ్యాపారంలోనూ అన్నింటాను శుభకరంగా ఉండేది . ఈరియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాక కుదరకపోవటం వలన మూడు సంవత్సరాలుగా తీసుకోవటంలేదు. అప్పటినుంచి కాస్త వత్తిడులు మొదలయ్యాయి . అందుకని ఓ మంచిస్థలంలో నలుగురికీ అందుబాటులో ఉండేలా పెద్దహనుమంతుని విగ్రహాన్ని నెలకొల్పాలని ఆలోచన. అందుకు గాను కురిచేడులో వేసిన వెంచర్లో స్థలం కేటాయించి అక్కడ నాలుగైదులక్షలతో విగ్రహం నిర్మించాలని అనుకున్నాను. అందుకే అక్కడ సోమవారం శంఖుస్థాపన కు ఏర్పాట్లుచేసుకున్నాను. దీక్షలో ఉండేస్వాములచేత చాలీసాపారాయనం చేపించాలని సంకల్పం. ఇంకా ఏమన్నాచేపించమంటారా ? అనడిగాడు.
స్థలశుద్ధికోసం అక్కడ ఏకాహంగా హరినామసంకీర్తన ,గణపతి,వాస్తుహోమాలు జరిపించండి మంచిది అనిచెప్పాను. మీరు దగ్గరుండి జరిపించాలి అని అడిగాడు.
నేను వేరే ఊరికి వెళ్లాల్సినపని ఉండి సెలవు పెట్టుకుని వున్నాను . కుదరదని చెప్పినావదలకుండా కనీసం ఆస్థలంచూసి మీసలహాచెప్పాలి వెంటనే వద్దురుగాని అని బతిమిలాడటం మొదలెట్టాడు.
పిలుపేమో గురువుగారు. ఆపై ఏసీ కారు .పక్కన ఉన్నస్వాములు పొగడ్తలహోరు .ఇంకేముంది గజ్జిపుండును గోర్లతో గీక్కుంటున్నప్పుడుండే సుఖంలా పారవశ్యం . [గీకేటప్పుడు బానే ఉంటుంది చేయి తీశాకగదాఉండేది భయంకరమైన మంట ,ఆపై వచ్చే తంటా] మనం లొంగిపోయాం ,నియమాన్ని విడచి స్వామి కార్యక్రమమేకదా అని వెళ్లాను. మనసులోమాత్రం ఇతను ఈకార్యక్రమం చేయలేడే అని అనిపిస్తుంది. తీరా వెళ్లాక ఆస్థలంలో అడుగుపెట్టగానే విపరీతమైన చికాకు . విసుగు. ఇతను ఇక్కడ ఈకార్యక్రమం చేస్తే ప్రమాదం అని మనసుగోలచేస్తున్నది. ఈస్థలంలో గతంలో ఓ ప్రైవేట్ పాఠశాలనడిపారు . అక్కడ నైరుతిలో ఒక్కగదిమాత్రమే ఉందిప్పుడు .మొత్తం నాలుగెకరాలస్థలం. ప్లాట్లుగా విభజించారు . ఆగదిదగ్గరకు తీసుకెళ్ళీ దీన్నితీసి మొత్తం పదిసెంట్లు స్వామివారికి కేటాయించి నిర్మాణం సంకల్పించామని వివరించాడు. అసలాగది దగ్గరకెళ్లగానే ఎందుకో అకారణమైన కోపం విసుగు.ఒక్కక్షణం నిలబడబుద్దికాలేదు.
స్థలంమొత్తం తిప్పాడు .అతనికి ఈస్థలం నష్టాలు తెచ్చేదిలా ఉంది అనిపించింది . పైగా ఇక్కడ ఇళ్ళుకట్టేసరికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది , మరీలోపల విగ్రహం కడితే !పూజాపునస్కారాలులేకుండా ఎందుకుకట్టడం ?పైగా అతనేమీ ఇక్కడ నివాసం ఉడడట ! ............రెడ్డీ .ఇక్కడ నువ్వే చేయవద్దు. ఇక్కడ ఏదైనా దేవాలయం కోసం ఓలక్షోరెండులక్షలో ఫిక్స్ డ్ చేయి .అప్పటికి ఇళ్ళుకట్టుకున్నవాళ్లకు ఇస్తానని చెప్పు .ముందు నువ్వు ఇందులోంచి బయటపడు . నేను నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోవద్దు. నాకెందుకో ఇది నీకు శ్రేయస్కరం కాదనిపిస్తున్నది అని నిర్మొహమాటంగా చెప్పాను .
అతను సరే స్వామీ ! అని నన్ను మరలా ఇంటివద్ద దింపుతానని కారు తిప్పాడు . భోజనం సమయమయింది , మావూరు దాకావెళ్ళేసరికి ఆలస్యమవుతుంది కురిచేడు ఊర్లోకి పోనియ్ అక్కడ మామేనత్తవాళ్ళింటిదగ్గర దింపమని చెప్పాను. అతను నన్ను దింపివెళ్లాడు . నేను ఇంట్లో కెళ్లగానే మా మేనత్త అదేమిటీ స్వామీ మొహమంతా పీక్కుని పోయి ఉంది ? అనడిగింది.
ఏంలేదే ! ఎసీ కార్లో ప్రయాణమేనే అని ఆశ్చర్య పోయాను. సరే సాయంత్రం సుందరరావు అనే పిల్లవాడ్ని[కురిచేడులో వ్యాపారి] మావూరిదాకా వదిలిపెట్టివద్దుగాని రమ్మనిఫోన్ చేశాను. అతను బండి తీసుకుని వచ్చాడు. ఏంటిస్వామి ! హఠాత్తుగావచ్చారు మావూరు ? అనడిగాడు
విషయం చెప్పాను . ఓహో ఆస్థలమా ? అంతకుముందు ఒకతను స్కూల్ పెట్టాడు వెనుకవైపున్న వాగునుకూడా పూడ్చి ఆక్రమించుకున్నాడు .ఓసారి గాలివానకు రేకులు లేచి గోడకూలిపోయి దానికిందపడి ఒకతను అక్కడికక్కడే మరణించాడు . ఆసంవత్సరంతోనే స్కూలుకూడా ఎత్తేశారు, మేము మిల్లు కట్టటానికని కొందామనుకుని కూడా మానుకున్నాము అనిచెప్పాడు.
చెంపచెల్లు మన్నట్లనిపించింది.
ఓర్నీ ! ఎంత మభ్యపెట్టాడితను. అసలు విషయం దాచిపెట్టి ఆదోషపూరితమైన స్థలంలో స్వామి విగ్రహాన్ని పెట్టి జనానికి భయంలేకుండా చేసి ప్లాట్లు అమ్ముకోవాలనే వ్యాపారపు ప్లానా ?ఇది ?
ఇదితెలియక పిలిచాడుకదా అని ఎగురుకుంటూవచ్చి చాలీసా చేశామే అనుకో ?
పిలవగానే వస్తున్నాకదా అని ఇంత అలుసుగా ఉందటరా మీకు ? ఎక్కడకుపడితే అక్కడకు పిలవటమేనా ? అని స్వామి ఒక్కటి పీకేవాడు . హమ్మా ! ఎంతప్రమాదం తప్పింది .
ఇంటికొచ్చి ఆ గురుస్వామికి ఫోన్ చేసి . గట్టిగా కేకలేశాను. ఏమనుకున్నావు నువ్వు చాలీసా పారాయణమంటే !వాడెవడో వ్యాపారం పెంచుకోవటాకి స్వామిని వాడుకోవాలని చూస్తే , వెనుకాముందాలోచించొద్దా ? మొదలుపెట్టినతరువాత అతనికేకాదు ఆదోషం మనకూ చుట్టుకుంటుంది. తెలుసుకుని వెళ్లాలి. ఇంతవరకు ఎప్పుడులేనిది మీరువచ్చారని నేనూ ఎగేసుకుంటూబయలుదేరాను. ఇంకానయం స్వామి చేతిలో తన్నులు తినలేదుమనం .అని కోప్పడ్డాను
మాకు ఈ విషయం తెలియదుస్వామీ ! అని బాధపడ్డారు వాల్లుకూడా
అందుకే గురువుగారూ ! అనగానే గుండెలో వణుకురావాలి అనేది నేను. మనం నిజంగానే ఆపదానికి అర్హులమాకాదా !లేక అవసరంకోసం మనపై ఈపదాన్ని ప్రయోగిస్తున్నారా గమనించుకోవాలి . లేకుంటే ఆథ్యాత్మిక సాధనచేస్తున్నామనుకుని అథఃపాతాళానికి జారిపోయేప్రమాదం ఉంది .అని చెప్పాను.[దీన్ని శుక్రవారం రాత్రే వ్రాసిప్రచురిద్దామనుకున్నాను కుదరలేదు][ఆపై స్వామి లీలచూడండి]
ఒకసారి తనపాదాలు పట్టుకున్నవాడు తననుమరచిపోయినా ఆయన కనిపెట్టీకాపాడుతూనే ఉంటాడు.మరలా నిన్నరాత్రి ఫోన్ చేశారుదరిశినుంచి స్వాములంతా ఈరోజు పీఠంలో నిదురచేయటానికి వస్తామని .
రమ్మన్నాను.
చిన్నవిషయం స్వామీ? ఆ.............రెడ్డికూడా వస్తాడట. భయపడుతున్నాము మీరు తిడతారని అనడిగారు.
అయ్యో ! భగవత్ దర్శనానికి వద్దని అడ్డుకునే హక్కుమనకెవరిచ్చారు ? రమ్మనండి. అనిచెప్పాను. రాత్రి అందరితోపాటువచ్చాడు .స్వామీ ! ఇక్కడకొచ్చి వెళ్లాక మీరు వద్దన్నాక ఎందుకో ఆస్థలం వద్దనిపించింది .అమ్మవారి అనుగ్రహం వలన రాత్రి బేరం వస్తే అమ్మేశాను మొత్తం .మీకు చూపించిన ఒక్కప్లాటే మిగిలింది .నేను మిమ్మల్ని మోసం చేద్దామని కాదు ,స్వామి విగ్రహం అక్కడ పెడితే దోషాలు పోతాయన్ని ఉద్దేశ్యంతో ఇలా సంకల్పించాను అని సంజాయిషీ చెప్పుకోబోయాడు.
మీరు ముందుగా మాకు విషయం మొత్తందాచకుండా చెబితే పరిష్కారం ఆలోచించుకునేవాళ్లం పెద్దలనడిగి.
మనపెద్దలు వాగులు వంకలు,బావులు సరస్సులను పూడ్చకూడదని చెప్పటంలో చాలాలోతైన రహస్యాలున్నాయి . అవి భౌతికపరమైనవేకావు కొన్ని చెడుశక్తులకు ఆవాసాలుగాకూడా ఉండి ఉంటే హానికలుగుతుందని అంతరార్ధం . ఆస్థల యజమాని చేసినది తప్పు. కానీ తెలివిగా నీకమ్మి తప్పుకున్నాడు.నువ్వైనా అది నీనివాసంచేసుకోవటానికి కాదు,భక్తితోనూకాదు ,కేవలం వ్యాపారంకోసం స్వామిని ఇక్కడకూర్చోబెట్టాలనుకున్నావు తప్పుకదా ? అసలు ఆ నిర్మాణం మొదలయ్యాక నీ పరిస్థితి దారుణంగా ఉండేది . పోనీలే బయటపడ్డావు. ముందా ప్లాట్ కూడా వదిలెయ్యి ఎంతోకంతకు .
నీకు స్వామి అండగా ఉన్నాడనటానికి ఇది గుర్తు. కనుకనే ఈ ఆపదసమయంలో నిన్నుకాపాడాడు.[ఇతను ఇప్పడు ఇరుక్కునివున్నసమస్యలవలయంగూర్చి ఇప్పుడుబయటపెట్టాడు] ముందు బండి రివర్స్ లోపడింది . నిన్నిప్పుడు నీడబ్బు,బలగం ,తెలివితేటలు కాపాడలేవు. వెళ్ళి వెంటనే హనుమద్దీక్షతీసుకుని ఆయన శరణువేడు అని నాకుతెలిసిన మార్గం చెప్పాను. అందరితోపాటు శ్రద్దగా ఈరోజు అభిషేకాదులలో పాల్గొని పూజ చేసుకుని వెళ్లాదు. ఈనెల ఎనిమిదిన హనుమత్ వ్రతం చేసుకుని తిరుమలజాపాలి క్షేత్రానికి వెళ్ళి మాలాధారణ చేస్తానని చెప్పి ఇంటికెళ్ళాడు.
స్వామి ఆపదలో ఉన్న భక్తుణ్ణి వదిలెయ్యడు. ఎవడో ఒకడు నాలాంటి పిచ్చేడో, వెర్రోనిచేతనైనా పరిష్కారం చెప్పించి కాపాడుతాడు
జైశ్రీరాం .
4 వ్యాఖ్యలు:
దేవుడి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ అమ్ముకోవడం కోస్తాజిల్లాల్లో మిగతాచోట్ల కూడా ఉంది. మీది వెఱ్ఱీ పిచ్చీ కాదు. ఉపాసనాబలంలో ముందుకెళ్ళినవాళ్ళకి మనస్సాక్షి ఇతరుల కంటే బాగా పనిచేస్తుంది. అది మూడో కన్ను.
-తాడేపల్లి
ధన్యవాదములు
చాలా బాగుంది. చక్కటి నిదర్శనం. దైవ బలం ఉన్నచోట మోసం కుదరదు.
భగవంతుడు సర్వజ్ఞాని. ఆయనకి అన్నీ తెలుసు. మనుషులాయనని మోసం చెయ్యలేరు.ఆయన సేవ చేసుకుంటున్న మీరు అదృష్టవంతులు.
Post a Comment