అముక్త జీవులు
>> Thursday, July 28, 2011
- అప్పరుసు రమాకాంతరావు
ఇలాంటి భిన్న ప్రవృత్తి గలవాడిగా భారతంలో ధృతరాష్ట్రుడు మనకు కనిపిస్తాడు. తన సోదరుడు పాండురాజు పట్ల అతడెన్నడూ ప్రేమ ప్రదర్శించలేదు. కురురాజ్యం సర్వంసహా తన ఆధీనంలో ఉండేటట్లుగానే ఆయన పావులు కదుపుతూ వచ్చాడు. తన కొడుకులతో సమానంగా పాండురాజు తనయులను ధృతరాష్ట్రుడు చూడలేదు. గుడ్డివాడిని కనుక ఏదీ చూడలేక పోతున్నానంటూనే తన సంతానం చేసే దుర్మార్గపు చేష్టలను సహిస్తూ వచ్చాడు. వారిలో అసూయాద్వేషాలను పెంచి పోషించాడు. విచిత్రమేమంటే- విదురుడు వినిపించే నీతివాక్యాలను విని ధృతరాష్ట్రుడు ఆనందం వ్యక్తం చేసేవాడు. అక్రూరుడివల్ల ఇతరులపట్ల పగ, ద్వేషం ఉండకూడదని తెలుసుకున్నాడు. అయినా రాజ్యం పంపకాల విషయంలో, దుర్యోధనుడి కుయుక్తులకు సంబంధించీ అతడెప్పుడూ ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకొనేవాడు. ధార్తరాష్ట్రీయులు పాండవులపట్ల ప్రవరిస్తున్న తీరును తప్పుపట్టలేకపోయేవాడు. 'నీవు చేసే కార్యం తప్పు సుయోధనా' అంటూనే... 'ఆ తరవాత నీ ఇష్టం!' అంటూ కొడుకుపట్ల అనురాగం ప్రదర్శించేవాడు. శ్రీ కృష్ణుడు భగవత్ స్వరూపుడని భీష్మపితామహుడు చెబితే ధృతరాష్ట్రుడు ఆయనపట్ల భక్తిభావం పెంచుకొన్నాడు. పాండవులను ఎల్లప్పుడూ కాపాడగలుగుతున్నది శ్రీకృష్ణుడని ధృతరాష్ట్రుడికి తెలుసు. నీతి, ధర్మం నిలిచి ఉన్నచోట శ్రీకృష్ణుడు ఉంటాడనీ ఆయనకు తెలుసు. అయినా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో పుత్రవాత్సల్యం- కళ్లతో సహా ఆయన మానసాన్నీ గుడ్డివాడిని చేసింది. పాండవులను తమ కుయుక్తులతో అరణ్యవాసం పంపేటప్పుడు సుయోధనాదులను ఆయన వారించలేదు. ఒక సందర్భంలో సంజయుడు- ధృతరాష్ట్రుడు పాండవులపట్ల ప్రవర్తిస్తున్న తీరును విమర్శిస్తాడు. గోపాలుడు విష్ణు అంశగల అవతారమని తెలిసీ పాండవులను హింసకు గురిచేస్తూ పరోక్షంగా నీవూ పాపం మూటకట్టుకుంటున్నావని సంజయుడు నిందిస్తే- ధృతరాష్ట్రుడు చెప్పిన సమాధానం మానవులకు ఎప్పటికీ గుణపాఠంగా భాసిస్తుంది.
'నన్నేం చేయమంటావు సంజయా! నిన్న, నేడు, రేపు కూడా నాలాంటి ద్వివిధ భావాలుగల వ్యక్తుల ఉనికి ఉంది, ఉంటుంది. ఇలా జీవించడం తప్పని నాకు మాత్రం తెలియదా? మమతానురాగాలతో బతకకూడదు. పరోక్షంగా నేను నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నానని తెలుసు. దీని పరిణామం చివరలో ఎలా ఉంటుందీ ఊహించగలను. అయినా సంజయా! నేను కడుపు తీపితో బతుకుతున్నాను. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్న గరికపోచను. ఏ కలుపు మొక్కకో తగిలి నా ప్రయాణం ఆగిపోతుంది. పారమార్థిక సముద్రంలో లీనంకాగల లక్ష్యాన్ని చేరుకోలేను' అన్నాడు. ఈ సమాధానం మనలనందరినీ మేల్కొలుపుతుంది.
ఇంతా తెలిసి ధృతరాష్ట్రుడు తన బుద్ధిని మార్చుకోలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుని అవతారమని ఆయనకు అవగాహన ఉంది. ఆయనపై భక్తి ఉంది. శ్రీకృష్ణుడి రాయబారం సందర్భంలో ఆయన విరాట్ స్వరూపాన్ని చూడటానికి తహతహలాడాడు. ఆ విశ్వరూపం వీక్షించడానికి చూపునివ్వాలని పరమాత్ముని కోరాడు. విశ్వరూపం చూసిన కళ్లతో ప్రాపంచిక పాపాలను చూడనంటూ తిరిగి తనను గుడ్డివాడిగా చేయమని కోరిన జ్ఞాని ధృతరాష్ట్రుడు. ఇంతచేసి కొడుకులకు నచ్చజెప్పి మహాభారత యుద్ధాన్ని నివారించలేకపోయాడు. భక్తికన్నా కొడుకులపై అనురక్తి ఆయనను బలహీనుణ్ని చేసింది. యుద్ధంలో తన వాళ్లనందరినీ కోల్పోయాడు. అయినా అరిషడ్వర్గాల్లోని అసూయను ద్వేషాన్ని ఆయన పోగొట్టుకోలేదు. యుద్ధం తరవాత గదా కౌశలాన్ని మెచ్చుకొనే మిషతో భీముణ్ని కౌగలించుకొని చంపాలని చూశాడు. చివరికేమైంది? తనయులతో సహా బంధువర్గానికి దూరమై పాండవుల ప్రాపకంలో జీవచ్ఛవంగా జీవించాడు. అన్నీ తెలిసీ అపమార్గంలో పయనించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అలాంటి వ్యక్తిత్వాలు ఏనాడూ అభిలషణీయాలు కావు. పుణ్యఫలితం తెలిసీ పాపం చేయడం క్షమించరానిది. పరమాత్మను విస్మరించి ప్రాపంచికాలపై అనురాగం పెంచుకోవడం ముక్తజీవులకు తగనిది.
0 వ్యాఖ్యలు:
Post a Comment