"ఆర్ట్" తో కాదు అమ్మను" హార్ట్" తో చూడాలి
>> Friday, December 3, 2010
్మొన్న విజయవాడ నుంచి పెళ్ళికి దరిశి వెళుతూ మా ఆవిడతరపు బంధువులు ఇటువైపు వచ్చారు . ఆయన ఇంటిల్జెన్స్ లోఅధికారి .వాళ్ల ఆవిడ ,కుమారుడు కూడా ఉన్నారు . అతనికుమారుడు కాట్రాక్టర్ కూడా . .సరే కాఫీలు గట్రా అయ్యాక మందిరంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించు కుంటామని కోరితే మందిరం లోకి తీసుకెళ్ళాను . లోపలకొచ్చాక ఆకాంట్రాక్టర్ గారు అన్నీ పరిశీలిస్తున్నాడు . అమ్మవారి ముందు నిలబడి మూర్తిని పరిశీలించి చూస్తున్నాడు . .
ఏమిటీ అమ్మవారిని దర్శిస్తున్నారా ? అడిగాను
కాదండి ! నేను ఎక్కడకెళ్ళినా విగ్రహం చెక్కినతీరు చూస్తుంటాను . ఇక్కడ ఆ కళ్ళూ అవీ చక్కగా చెక్కారు . మంచి ఆర్ట్ ఉంది అంటూ చెప్పుకుపోతున్నాడు ....
నాకు అరి కాలిమంట నెత్తికెక్కింది .
అమ్మవారిని చూడటం ఎలాగో తెలియకపోతే చూసి నేర్చుకోవాలి లేదా ఎవరినన్నా అడగాలి . అసలు ఆలయమంటే ఏమిటనుకున్నావు ? ఆలయం దైవస్థానం దైవం కొలువైఉన్న దివ్యస్థలం . ఆలయాలలోకెళ్ళినప్పుడు వినయ విధేయతలతో.నమస్కారముద్రలో భగవన్మూర్తి ముందు నిలబడాలి . చాలాగౌరవభావంతో అక్కడి అర్చకులను మన అనుమానాలడగాలి . ఇదీ తీరు . ఎవడయ్యా నీకు నేర్పినవాడు . నీ కళాత్మక పరిశీలనలు చేస్తే దైవాగ్రహానికి గురై ఉన్నకూడుకూడా పోయి దరిద్రుడవవుతావు . అమ్మను చూడాలంటే ఆర్ట్ తోకాదు హార్ట్ తో చూడాలి . నీలా చూసేవాడికి బొమ్మ కనపడుతుంది ,అమ్మెలా కనపడుతుంది ? శిల్పకళను చూడాలనిపిస్తే మ్యూజియాలకెళ్ళు అంతేగాని గుళ్లకెళ్లమాకు ... కఠినంగా గట్టిగా నానోటినుంచి వచ్చిన మాటలకు బిత్తరపోయారు వాళ్ళు .
ఆ మాజీ అధికారికి తన తప్పు తెలిసినదిలా ఉంది ...లేదండి ..మావాడు విజయవాడలో దుర్గగుడికి తరచు వెళుతుంటాడు...........ఏదో చెప్పబోయాడు
గంగానదిలో చుట్టుపక్కల గ్రామాల పశువులు రోజూ మునుగుతాయి . ఉపయోగమేముంది ? ఇంకాస్త చీదరింపుగా అన్నాను .
బంధువర్గంలో ఎక్కువగా గౌరవింపబడుతుంటాడు [డబ్బుద్వారా,హోదాద్వార] ఆయన .వారికంటే ముందే వచ్చిన బంధువులంతా ఉన్నారు అక్కడే
మిగతావాళ్లు బిక్కచచ్చిపోయారు . ఏమిటీ ? ఈ స్వామి మరీ మొహమాటం లేకుండాతిడుతున్నాడు ,నోరుతెరిస్తే మమ్మల్నేమంటాడో ...అని బెదిరిపోయి చూస్తున్నారు .
. నేనిక్కడ ఉన్నంతసేపు అమ్మకు సేవకుణ్ణి . ఇతరులహోదాలనో ,గొప్పతనాలనో చూసి ఆమ్మదగ్గర గర్వప్రదర్శన చేసేవాళ్ళను గౌరవించలేను
అయితే అలా అరచినంత మాత్రాన సరిపోదు .విషయం తెలియజెప్పటం నాబాధ్యత గనుక వినేవాళ్లకు వివరిస్తుంటాను. . మామూలు గా సౌమ్యంగా వివరించటం మెదలెట్టాను .
చరాచరసృష్టి అంతటావ్యాపించివున్న భగవత్శక్తిని విగ్రహంలోకి ఆహ్వానించి భక్తులకు మేలుచేయటానికి మహర్షులు మూర్తి ప్రతిష్టాకలాపం ఏర్పాటుచేశారు . చెక్కేప్పుడు రాయే . కానీ ఒకసారి ప్రతిష్ట జరిపాక అక్కడ దైవశక్తి కొలువై ఉంటుంది .
మనం ఒక అధికారి వద్దకో పెద్దవాళ్లదగ్గరకో వెళ్లినప్పుడు చూడండి ఎంత వినయంగా ఉంటామో ! ఎందుకని ? ఆయనముందు గర్వంగా ప్రవర్తిస్తే వాళ్లకు ఆగ్రహం వస్తుందేమోనన్న గమనిక ఉండటం వలన .
కేవలం మానవమాత్రులైన వీళ్లకే ఇంత విలువిస్తామే ! ఇక భగవంతుని దగ్గర ఎలా ఉండాలి ! అంటూ మెల్లగా అర్ధమయ్యేలా చెప్పాను.
ఆయన ,ఆయనభార్య ,కుమారుడునాకోపానికి కారణం అర్ధం అయింది కాబోలు చాలావినయంగా తీర్ధప్రసాదాలు స్వీకరించి మేము వచ్చి ఒకవారం రోజులు ఇక్కడ ఉండాలని ఉంది స్వామీ అని కోరారు . తప్పనిసరిగా రండి పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టలేకపోయినా ఉన్నదాన్నే వచ్చినవారితో ఆప్యాయంగా పమ్చుకుంటాము . అదీగాక దైవభక్తులసేవ చేయగలగటం మా అదృష్టం అని చెప్పాను. తరువాత వాళ్లు ఒక అరగంట మాతో గడిపి వెళ్ళారు పెళ్ళికి .
ఈమధ్య మాతమ్ముని వెంట వాళ్ల మండల అభివృద్ధి అధికారి వెంట మరో ఇద్దరు స్నేహితులతో వచ్చాడు . వాళ్ళిద్దరుకూడా ఎమ్డీవోలే . మావాడు వాళ్ల అసిస్టెంట్ కనుక దర్పంగా గుడిలో కొచ్చారు . నేను పూజలో ఉన్నాను ,
వారిలో ఒకాయన ముడ్డివెనుక చేతులు కట్టుకుని విలాసంగా చూస్తున్నాడు అన్నీ . కనీసం నమస్కరించనుకూడా లేదు దేవునికి . నాకు చిర్రెత్తు కొచ్చింది ఇలాంటివాళ్లను మందిరంలోకి రానిచ్చినందుకు.
భగవంతుని పట్ల గౌరవం ఉంటేనే మనం ఆలయాలలోకి అడుగుపెట్టాలి . ఇలా విలాసంగా పరిశీలించటం ప్రమాదం . మీ జిల్లాధికారి వస్తేనే మీరు సార్ సార్ అని పదిసార్లు పిలుస్తూ వినయం చూపించటానికి పోటీపడతారే ! అలాంటిది గుడిలో కొచ్చి భగవంతుని దర్శించుకోవాలి కానీ అవినయంగా ఉండకూడ దు అన్నాను .
అలాకాదు స్వామీ ! మీరు పూజచేశాక ప్రసాదమిస్తారు కదా అప్పుడు నమస్కారం చేసుకుందామని ఆగాం అన్నారు
ఇదేమిటిస్వామి ? దేవాధిదేవుడైన భగవంతుని మూర్తి కనపడగానే నమస్కరించాలి గాని ఎప్పుడోతరువాత నమస్కారం చేస్తామా ? అని మాటలు తుంచివేశాను . వాల్లు వినీ విననట్లు వెళ్ళిపోయారు .తరువాత ఇటువంటివాళ్లను ఎప్పుడు ఆహ్వానించమాకు మందిరానికి అని మాతమ్ముణ్ణి హెచ్చరించాను.
అధికారి కదా !చూడాలని అంటే కాదనలేక పిలచాను అన్నాడు మావాడు
పిలువు . కానీ ఇక్కడేలా ఉండాలో చెప్పు ముందుగానే . వీల్లకు చదువులు పెరిగాయి కానీ సంస్కారాలు అబ్బలేదు . సర్వానికి అధికారి భగవంతుడు , మనం ఆయనపట్ల గౌరవం చూపనివారికి విలువివ్వవలసిన అవసరం లేదు . అని చెప్పాను .
మొన్న జిల్లా జాయంట్ కలెక్టర్ గారు వచ్చారు . ఆయనకు నేను ముందే చెప్పాను మీరు మాత్రమే రమ్మని . అయినా ఆయన పోగ్రామ్ తెలిసినందున వెంట మండలసిబ్బంది .ఆయన తో పనిబడ్డ స్తానిక నాయకులు కూడావచ్చారు. పాపం ఎంతో శ్రద్దగా ఆయన స్నానంచేసి మందిరంలోకొచ్చికూర్చుంటే బయట ఆవరణలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారీబాచ్ .పైగా ముచ్చట్లు ఇక్కడ మందిరం ఆవరణలోపల కుర్చీలు లాంటి ఆసనాలు వేయటం అంగీకరింపము . అంజిరెడ్డి అని కుర్రనాయకుడొకడు గదిలో ఉన్న కుర్చీలు తెచ్చి వేసి బాతాఖానీ మొదలెట్టాడు .లోపలకు వినపడుతున్నాయి మాటలు . బయట మాసర్పంచ్ బాలిరెడ్డి ఇంకాఇద్దరు ఉన్నారు వాల్లు నేలమిదే కూర్చునివున్నారు . బాలిరెడ్డి ! అక్కడ మాట్లాడెదెవరయ్యా ? అనడిగాను . మేముకాదండి అంజిరెడ్డి సెట్టింగ్ అన్నారు వాల్లు , బయటకు వచ్చి ముక్కచివాట్లు పెట్టాను బుద్దీజ్ఞానం ఉందా లేదా ? అని . తెలీదు స్వామీ తెలియక వేశాము అని వాల్లు కుర్చీలు పట్తుకుని లేచి వెల్లారు . పూజయ్యాక జెసీ గారికి చెప్పాను , చూశారుకదా ! వీల్లకు శ్రద్ద లేదు . వినయం లేదు , మీలాంటి వాల్లను చూసైనా నేర్చుకోరు .గర్వం .ఆ తలపొగురు భగవంతుని పట్ల ఎలా ఉండాలో నేర్చుకోనివ్వదు . మీరు ఈసారొచ్చేప్పుడు ఎవరికీ సమాచారం అందించనివ్వకండి .భార్యాభర్త మాత్రమే రండి ప్రశాంతంగా ఉంటుంది .ఈ గుంపులు మీ కు మాకు ప్రశాంతత నుండనివ్వవు అని చెప్పాను.
ఇక్కడ హనుమత్ రక్షాయాగంలో ఎంతో శ్రద్దాశక్తులతో పాల్గొని సేవచేసిన ఐదవరోజే కేంద్రమంత్రి ఒకరివద్ద కు ప్రమోషన్ మీద వెళ్ళిన మాజిల్లా అధికారి దుర్గాప్రసాద్ గారు అంకితభావంగల భక్తులు . ఇక్కడ జరిగేపూజల ఫలితం చూసినవాడు . ఈమధ్య ఫోన్ చేసి స్వామీ మీరు ! స్తానిక ఎమ్మెల్యేలను పిలవండి పీఠానికి పెద్దవాల్లంతా వస్తుంటే బాగుటుంది పీఠ అభివృద్దికి అని చెప్తున్నారు.
వద్దండి ! ఇక్కడ అమ్మ సేవ చే్సేప్పుడు చాలా నిష్థ్గగా ఉండాలి . ఇప్పుడీ ! రాజకీయ నాయకులను పిలచామనుకోండి వాల్లవెంట భజనబృందాలుంటాయి .వాల్లను వెంటేసుకుని వాల్లదర్పం చూపిస్తూ వస్తారు . శుచీ శుభ్రతా లేనివాడు ,ఈసమయంలో గుడిలోకి వెళ్లకూడదు అని తెలిసినా లెక్కచేయని వాల్లూ వస్తారు వెంట . ఎవరినీ నిరోధించలేము . అంతా అనాచారమవుతుంది .అటువంటీవాల్లకు లేనిదోషం తలకెత్తుకున్నట్లవుతుంది
అదీగాక మనం ఎన్నిసార్లు పిలచినా ఆవిడ కిష్టమైన వాల్లే ఇక్కడ అడుగుపెడతారు . మనం పిలవకున్నాసరే ఆతల్లి ఆజ్ఞ అయినవారు వస్తుంటారు . పీఠం అభివృద్దిగూర్చి ఆలోచించాల్సిన పని నాదికాదు. అమ్మ అనుజ్ఞ లేనిదే ఇక్కడడుగు పెట్టలేరెవరూ . ఒకవేళ అవకాశం ఉండి వచ్చినా గర్విష్ఠులు ఇక్కడ పదినిమిషాలు కూడా నిలబడలేరు . చీమలు జెర్రులు పాకినట్లు ఉంటుంది కాబోలు రుసరుస లాడుతూ వెళ్లిపోతారు . ఇది నాకు ప్రత్యక్ష అనుభవం . మీరున్నారు చూడండి . ఎంతపెద్ద ఉద్యోగంలో ఉన్నా భగవత్ సేవలో ఎంతో వినయంతో పాల్గొంటారు దానికి తగ్గట్టు ఫలితముంటుంది .అలాంటివాల్లు సాధనచేసుకోవటానికే అమ్మ అనుగ్రహం పొందడానికే ఈ పీఠం లో సేవాకార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి .అని వివరించానాయనకు
వీల్లే కాదు గొప్పసాధకులమని పేరుపొందినవారిలో కూడా వినయవిధేయతలులేనివారు ఇక్కడకొచ్చినప్పుడు పడినపాట్లు నేను చూశాను.
నేను ఎవరైనా మితృలింటికెళ్లినప్పుడు కూడా వాల్లలో కొందరు ,మా పూజ గది చూద్దురుగాని రండి అంటారు . నేను స్నానం చేయనిదే పూజగదిలోకడుగు పెట్టను . అన్నప్పుడు కొందరు పరవాలేదండి కాళ్ళుకడుకుని వచ్చి చూడండి అంటారు.
అయ్యా ! మీకవి పటాలుగా కనిపిస్తున్నాయేమో గాని పూజాగదిఅంటే దైవనివాస స్థానం అని నా నమ్మకం ,వాస్తవం కూడా . నేను ప్రయాణాలు చేసివచ్చి శుచీ శుభ్రత లేకుండా ప్రవేశించే సాహసం చేయలే్ను అని వారిస్తుంటాను
మనం గుడికెళ్లనీ ,లేక పూజామందిరం లో కెళ్లనీ అక్కడ వినయవిధేయతలతో శ్రద్ధాశక్తులతో ప్రవర్తించాలి
లేకుంటే మనం ఎన్ని జన్మలెత్తినా బొమ్మల్ను చూడ గలుగుతామేగాని అమ్మనుమాత్రం చూడలేము ... జాగ్రత్త
ఏమిటీ తలతిక్క వాడని మీరనుకోవచ్చు అనుకోండి ,కానీ నాకు అమ్మ తన సంకల్పం తో తాను ఇక్కడ కొలువై ఉన్నానని ప్రత్యక్ష ప్రమాణాలు చూపిస్తున్నది . దేవతాప్రతిష్ట చేయాలంటే ముందు విగ్రహాలు సిద్దపరచుకోవాలి . కానీ విగ్రహమెక్కడ ఉందో తెలియకుండానే ఆహ్వానాలు పంపి సంబారాలు సమకూర్చుకుని , ప్రతిష్ఠాచార్యులను పిలుచుకుని సిధ్ధమైన మూర్ఖుణ్ణి బహుశా ప్రపంచంలో నన్నుతప్ప మీరింకెవరినీ చూసి ఉండరు . ప్రతిష్ఠకు పదిరోజులముందు మాత్రమే తన ఉనికిని తెలిపి తరలి వచ్చింది అద్భుతమైన రూపంతో అమ్మవారు. ఆవివరాలు గతంలో ఇక్కడే తెలిపాను . ఆ మూర్ఖత్వానికి ్ ఆధారం అమ్మ అనుగ్రహ లీలలతో నాతోపాటు నాలోపెరిగిపెద్దదైన నమ్మకం . ఆనమ్మకమే నాజీవితానికి . గతి, స్థితీ కూడా.
జైభవానీ
3 వ్యాఖ్యలు:
great...
అయ్యా ఓలేటిగారూ మీఅభిమానానికి కృతజ్ఞతలు కానీ ఇందులో గ్రేట్ ఏమీలేదండి . నాకప్పగించిన గేట్ దగ్గరే నాపని నిర్వహిస్తున్నాను .దాని ప్రతిఫలం కూడా తీసుకుంటూనే ఉన్నాను . అందువల్ల ఇది సాధారణమైన విషయమే
Post a Comment