శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అభినవ హితహరివంశుడే ఈ రసయోగి

>> Tuesday, September 28, 2010

రసయోగి _ 15

19

ఒకసారి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు నెల్లూరులో రాధాతత్వం పై ఉపన్యసిస్తున్నారు. భక్త జన సందోహం అంతా పరవశులగుచున్నారు. ఆ భక్తులలో ఒక డ్రాయింగ్ మాష్టారు ఉండెను. అతని పేరు A.V. సుబ్బారావు. రాధికాప్రసాద్ మహారాజ్ గారి ఉపన్యాసాలకు ప్రభావితుడై రోజూ రాధికాప్రసాద్ గారిని దర్శించి వారి చేసే అనుగ్రహ భాషణకు పరవశమొందుచుండెడివారు. వారికి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది _ రాధికాప్రసాద్ మహారాజ్ గారికి చెప్పగా _" నా పటం ఎందులకు ? రాధారాణి పటాన్ని చిత్రించు" అని పల్కిరి. కానీ వారు కాలాంతరమున ఏమియో పనులలో పడి విషయమును మరచెను. 10 సంవత్సరములు గడిచెను.

ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం గుంటూరులోని మందిరములో సంకీర్తన జరుగుతూ ఉండెను. ఆ రోజు సంకీర్తన ప్రారంభం కానున్న సమయంలో A.V. సుబ్బారావు గారు రాధారాణి నిలువెత్తు చిత్రాన్ని చిత్రీకరించి, రాధికాప్రసాద్ మహారాజ్ గారి చిత్రాన్ని కూడా చిత్రీకరించి రెండు పటాలను మందిరమునకు తీసుకొచ్చెను. నాన్నగారికి సమర్పించెను. రెండు పటములలో జీవకళ ఉట్టిపడుచుండెను. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు రాధారాణి పటమును నిత్యపూజలో ఉంచెదనని అతనికి మాట ఇచ్చెను.

ఇంతకు ముందరే రాధికాప్రసాద్ మహారాజ్ గారి ప్రత్యేక మందిరములో చిన్నారి చిత్రములు రెండు యున్నవి. ఇప్పుడిది మూడవది. అంతకు ముందరున్న రెండు పటములకి రోజూ వెండి గ్లాసులలో పాలు పోసి "భోగ్" పెట్టుచుండెడివారు. ఇప్పుడు "చిన్నారి"ది మూడవ పటము. స్టీలు గ్లాసులో పాలు పోసి "భోగ్" ను సమర్పించు చుండెను. వెండి గ్లాసు కొనవలెనని రాధికాప్రసాద్ మహారాజ్ గారు తలంచెను. కానీ ఇంతలో ఒక వ్యక్తి "వెండి గ్లాసు" ను పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారికి సమర్పిస్తూ "రాధారాణి" సేవకు అని పల్కెను. ఎంత ఆశ్చర్యకర సంఘటన " "చిన్నారికి" వెండి గ్లాసు లేదేయని ఆలోచన మనసున మెదిలినంతనే "చిన్నారి" వెండి గ్లాసు తెప్పించుకుంది. రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆ వెండి గ్లాసులో మూడవ పటమునకు కూడా పాలను భోగ్ ను సమర్పించు చుండెడివారు. ఆ చిత్రము బృందావనములో మందిరములో ముఖ్య స్థానాన్ని ఆక్రమించి అందరి ఆరాధనలను అందుకొనుచున్నది. చిన్నారి రాధ ఆ విధముగా ఆ భక్తుని సేవను స్వీకరించి అతనిని కరుణించింది. ఆ భక్తుడు పరమానంద భరిత హృదయముతో గృహమునకు చేరెను.

ఒక రోజు శుక్రవారం గుంటూరు మందిరములో సంకీర్తన ప్రారంభమయ్యింది. రాధికాప్రసాద్ మహారాజ్ గారు ధ్యానంలో ఉన్నారు _ " 11 ,12 సంవత్సరముల వయస్సు గల చిన్నారి రాధ తెల్లని పరికిణి, దాని మీద బంగారు చుక్కల తెల్లటి పావడాతో అత్యంత శోభాయమానంగా, వయ్యారంగా సంకీర్తన సమయంలో మందిరములో నడయాడుతూ కానవచ్చెను. "అంతట రాధికాప్రసాద్ మహారాజ్ గారు అంజనీమాతను పిల్చి విషయమును తెలియజేసి రేపు చిన్నారికి తెల్లని చీర, దానిపై బంగారు చుక్కలు ఉండవలెనని పల్కి కొనమని ఆదేశించిరి. మరుసటి దినమున మాత అంజనీ దేవి కొట్లన్నీ తిరిగి చిన్నారికి ఎర్రని చుక్కలున్న తెల్లని చీర కొన్నది. ఆ చీరతో రాధారాణిని అలంకరించింది. సర్వాంగ సుందరముగా రాధారాణి ఆ చీరలో శోభిల్లెను. ఆ అందాన్ని దర్శించిన రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆనంద పారవశ్యంతో ధ్యానమగ్నులైరి.

43. రసయోగి నేతృత్వంలో రావలిలో రాధా జన్మోత్సవము

1999, ప్రమాది నామ సంవత్సరము భాద్రపద మాసం దక్షినాయనం, వర్షరుతువు శనివారం, శుక్ల పక్షం అష్టమి శుభ తిథిన రావలి గ్రామములో రాధాజన్మోత్సవ మహోత్సవమును చేయ రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు సంకల్పించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుండి అనేక ప్రాంతాలనుండి వందల సంఖ్యలో భక్తులు ఆ ఉత్సవానికి హాజరు అయినారు. ఢిల్లీలోని పప్పుశర్మ గారు, హేమంత్ గారు, శ్రీ రాజగోపాలాచారి గారు మరియు వైజాగ్ నుండి శేఖర్, గుంటూరు నుండి పి.వి.కె రామారావు గారు, హైదరాబాదు వాస్తవ్యులు కొంతమంది ఒక వారం ముందరగానే బృందావనం చేరి రాధామహోత్సవానికి అన్ని ఏర్పాట్లు గావించారు. మాత అంజనీదేవి పర్యవేక్షణలో ఉత్సవమునకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. బృందావనం నుండి మూడు ప్రత్యేక బస్సులలో, కార్లలో అందరూ రాధాష్టమి దినమున తెల్లవారు ఝామున 4 గంటలలోపు రావలి గ్రామానికి చేరుకున్నారు. దేవాలయ ప్రాంగణం ముందర ఖాళీ స్థలంలో పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. మందిరమునకు దగ్గరగా ఉన్న ఒక పాఠశాలను విడిదిగా తీసుకున్నారు. ఉదయం 4 గంటలకల్లా అందరూ రాధానామ సంకీర్తనతో మందిరములో ప్రవేశించారు. ఉదయం 5 గంటలకు రాధా ఆవిర్భావం. ఉదయం 5 గంటలకు అయింది. పెద్ద ఎత్తున భక్త జనం "రాధే రాధే" అని కీర్తన చేయనారంభించారు. భక్త జనులలో ఉత్సాహంపెల్లుబికింది. కొందరు నృత్యం చేయనారంభించారు. కొంతమంది రాధా గానం, మరికొంతమంది ధ్యానం అటువంటి ఆనందమయ స్థితిలో రాధా ఆవిర్భావం, రసరాణి దివ్యసీమల నుండి భువికి దిగి వచ్చింది. అనంత భావ స్వరూపిణి అయిన రాధ ఆవిర్భవించింది. ఆ దివ్య మనోహర మూర్తిని యోగులు, తత్వవేత్తలుమ్ భక్తులు దర్శించారు. ఆ మహోత్సవాన్ని ఆ కోలాహల భరిత వాతావరణాన్ని చూస్తుంటే వృషభాను మహారాజ్ బహుశ ఈ విధముగానే ఉత్సవాన్ని ఆ రోజులలో జరిపి ఉంటాడు. ఆనందంలో ఆ తల్లిని తన "బారసానా" పురమునకు తీసుకొని వెళ్ళి ఉంటాడు అని అన్పించింది. రాధా ఆవిర్భావం తర్వాత రాధారాణికి పంచామృత స్నానం చేయించారు. ఆ రోజు రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు "రావలి చిన్నారి రాధ్" చిత్ర పటమును ఆవిష్కరించిరి. ఆలయము ముందు ఏర్పాటు చేయబడిన వేదికపై మధ్య భాగమున "రావలి చిన్నారి రాధ" చిత్రపటమును ఎత్తైన సింహాసనమున కూర్చుండబెట్టి సర్వాలంకారములు గావించారు. సాక్షాత్ రాధారాణి స్వరూపంలో అక్కడకు వచ్చి స్వయంగా ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నదా అన్పిస్తున్నది. ఆ రాధారాణి చుట్టూ అష్టసఖీ రూపధారణతో కన్నె కామణులు ఆ తల్లి సేవకు సంసిద్ధులై యున్నారు. అద్భుతముగా ఉంది సన్నివేశం. భక్త జన బృందమంతా వేదిక ముందర కూర్చొని ఉండగా లీలా విలాసాలను వివరించారు. అంజనీమాత తన సుమధుర గాత్రంతో రాధారాణికి కీర్తన సేవ గావించారు. ఆ సభలో మహాకవి డా| | ప్రసాదరాయకులపతి గారు రసరాణి రాధ శక్తిని, గురువులు రాధికాప్రసాద్ గారి అనితర సేవా భావాన్ని కొనియాడారు. పళ్ళె నాగమణి గారు, శ్రీ పి.యస్. ఆర్. ఆంజనేయప్రసా ప్రభృతులు ప్రసంగించారు. అటు తర్వాత రాధారాణి చిత్రపటమును దివ్యాలంకారములతో పుష్పమాలాదులతో అలంకరింపబడిన రధముపై కూర్చుండబెట్టారు. ఆ చిర్తపటము ముందర ఐదు సంవత్సరముల ఒక చిన్నారి పాపను "రాధారాణి" వలెను అలంకరణ గావించి కూర్చుండ బెట్టిరి. రాధారాణి అధిరోహించిన ఆ "పూలరధం" రావలి గ్రామంలో పర్యటించింది. రావలి గ్రామ వాసులు తండోపతండములుగా ఆ ఊరేగింపు దృశ్యాన్ని చూచి ఆనంద పరవశులైనారు. ఆ రోజు మరొక విశేషం _ పూజ్యులు, రసయోగి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి రావలి గ్రామ వాసులందరికీ భోజనాదులు ఏర్పాటు చేశారు. ఎందుకని ఈ ఏర్పాటు చేశారని అడిగితే _ "నా తల్లి రాధ ఆ గ్రామంలో ఆవిర్భవించింది. దివ్యసీమనుండి భూతలమునకు వచ్చిన ఆ శుభ సమయం వృషభాను మహారాజ్ జీవితాన్నే మార్చి వేసింది. ఆ తల్లిని మేళతాళాదులతో, ఊరేగింపుతో తన పురమునకు తీసుకెళ్ళి అతిశయ ఆనందాన్ని ఆయన పొందారు. ఎంత అదృష్టశాలి అతను.ఎంత పుణ్యము ఆ రావలి గ్రామం చేసుకుందో, ఎంత పవిత్రత అక్కడి వాతావరణంలో ఉందో. అక్కడి ప్రజలు ఎంత నిష్కల్మష చరితులు కాకపోతే తల్లి అక్కడ ఆవిర్భవిస్తుంది. మరి ఆ ఊరి వారిని నేను ఏ విధముగా సత్కరించాలి, అమ్మకు అన్నం పెట్టడమంటే ఇష్టం. అమ్మకు ఇష్టమైన పనిని నేను చేస్తాను. ప్రతి సంవత్సరం అక్కడ "జన్మోత్సవం" జరుపుతాను. అకడ అందరికీ భోజనాదులు ఏర్పాటు చేస్తాను." అని భక్తి భావ పూరిత హృదయముతో వారు పలికిన పలుకులు ఆ ఉత్సవానికి హాజరైన యువకుని హృదయాన్ని కదిలించాయి. ఆ ఉత్సవములో పాల్గొన్నందుకు తన జీవితం ధన్యమైనదని భావించాడు. రాధికాప్రసాద్ మహారాజ్ కు, రావలి రాణికి, రావలి గ్రామానికి సాష్టాంగ నమస్కారం గావించాడు.

44. అది చిత్రపటమా లేక ప్రత్యక్షమైన సజీవ మూర్తియా ?

పూజ్యులు, రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారి పూజా మందిరములో రావలి చిన్నారి రాధ చిత్రపటము ఉంది. ఎంతో ముగ్దమోహనంగాఉండే ఆ పటమును చూచిన వారు తమ కళ్ళను పక్కకు తిప్పలేరు. అంతగాఅ మూర్తీభవించిన సౌందర్యముతో ఆ చిత్రపటము తేజరిల్లుతున్నది. ఆ చిత్రపటము ఏర్పడుటకు ముందర ఒక కథ ఉన్నది. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని ఆ చిత్ర పటము గురించి ప్రశ్నించగా _ మానవ సృష్టికి సంబంధించిన విగ్రహాలను, చిత్రపటములను నేను ఆరాధించును" గర్గ సంహిత అనే గ్రంధంలో గర్గముని ఇలావ్రాశాడు _ "మాన సృష్టిలో, మానవ కల్పితమైన దేవతా విగ్రహాల్లో, చిత్రపటల్లో కానీ దివ్యతత్వం ఉండదు". ఈ కారణం చేత నేను కొన్ని రోజులు దీక్షగా అమ్మని ప్రార్థించి నీవు ఐదు వేల సంవత్సరములకు పూర్వం ఈ భూలోకానికి వచ్చావు తల్లీ ! అప్పుడు ఏ రూపంలో వచ్చితివో అదే రూపంలో నాకు దర్శన భాగ్యం ప్రసాదించు. ఆ దివ్య రూపాన్ని నేను "చిత్రవంతం" చేయవలెననెడి నా కోర్కెను నెరవేర్చు తల్లీ ! గొప్ప పటముగా చిత్రించునట్లు చేయుము. నాకు నీ దివ్య దర్శనం ఇచ్చావంటే ఆ చిత్ర పటానికి ఎటువంటి లోపాలు లేకుండా నేను మార్పులు చేస్తాను." అని ప్రార్థించాడు. అమ్మ దివ్య దర్శనం లభించింది. అమ్మ చిత్ర పటము తయారయింది. ఈ చిత్ర పటానికి దివ్యత్వం ఉంది అనటానికి రుజువుగా అనేక లీలలు జరిగాయి. ఒక్కొక్కప్పుడు ఈ చిత్రపటమును ఊయలలో కూర్చుండబెట్టినప్పుడు అది ఎవరి ప్రమేయం లేకుండా ఊగుతూ ఉండేది. అప్పుడప్పుడూ ఆ ఊయలనుండి, అమ్మను పరుండబెట్టే మంచమునుండి, అద్భుతమైన సుగంధవీచికలు వీస్తూ ఉండేవి. కాబట్టి ఆ చిత్రపటం సామాన్యమైనది కాదు, బజారులో లభించే శక్తి రహితమైన విగ్రహం కాదు. కొంత మంది భక్తులకు ఆ చిత్ర పటమునుండి యే మురళి ధరించిన ద్విభుజగోపాలుని దర్శనం కూడా అయ్యింది.

45. రాధాజీ ఉపాసన

రాధారాణి కృపను దయచూరగొన్న జీవుని మించిన భాగ్యశాలి ఇంకొకరు సృష్టిలో ఉండరు. ఆ రాధాజీ ఉపాసనా లక్షణములను గూర్చి రాధాజీ సఖీ జనులే రసయోగి ఎందుట ప్రకటించారు. ఆ సంఘటన బృందావనంలో రావలి గ్రామంలో జరిగింది. రాత్రి 11 గంటలకు సఖీజనులతో రసయోగి గారికి సంభాషణ జరిగింది. రాధారాణిని రసయోగి అలంకరణ గావించమనినారు. మందిరవాసులు ఎన్నో విధములు రాధారాణిని అలంకరణ గావించారు. కానీ ఆమె ఎందుకనో ప్రసన్నతనొందలేదు. దనికి సమాధానం రావలి గ్రామంలో సఖీ గణము తెలిపారు _ " మీరు చేసింది స్థూలదేహ అలంకరణ మాత్రమే. రాధాజీకి కావలసింది మానసిక సౌందర్యం కాని స్థూలదేహ సౌందర్యం కాదు. స్థూల దేహాత్మ భావము మాత్రమున్ననూ రాధాజీని చేరుటకు అది గొప్ప ఆటంకమే అగును. ఆమె ప్రసన్న మగుతున్నది స్థూలదేహ అలంకరణ వల్ల కాదు. ఈ మానసిక సౌందర్యమును ప్రతి జీవుడు తనకి తాను చేసుకోవలయును. అదియే తపస్సు. అదితే రాధాజీని చేరుటకు మార్గము. ఈ మానసిక సౌందర్యమును ఏ విధానాల ద్వారా జీవుడు సిద్ధించుకోగలడో అందులో మొదటిది _"త్ తల సుఖేన సుఖిత్వం" అమ్మకు సుఖం ఇవ్వటానికి భక్తుడు తన జీవితాన్ని ధార పొయ్యాలి. ఆమె "భక్తానుగ్రహకాతరాం" అని మహాత్ములచేత వర్ణింపబడింది. అనగా భక్తులను అనుగ్రహించవలెనని అమ్మ ఎంతయో సదా ఆత్రుతతో ఉంటుంది. ఎట్టి లక్షణములు కలవారిని రాధాజీ అనుగ్రహిస్తుందో తెలుసుకోవాలి. అమ్మ యొక్క లక్శణము తత్సుఖీన సుఖీత్వం" ఏకారణమ్ చేతనైనా గాని ఒక జీవుడు శాంత రహితుడై దు:ఖముతో నిండియున్నచో వాని దు:ఖమును పోగొట్టి వానికి పూర్ణ శాంతిని ఇవ్వటం నీ కర్తవ్యం. ఇదియే అమ్మ మనకు ఇచ్చే సందేశం.

బృందావనంలో ఒక బెంగాలీ సాధువు ఒక చెట్టు క్రింద కూర్చొని బిగ్గరగా ఏడ్చుచుండెను. యాత్రార్ధమై వచ్చిన వందలాది భక్తులలో ఎవరికినీ వాని దు:ఖమును గురించి తెలుసుకొనవలెననెడి అభిలాష లేకుండెను. ఆ జనుల వలె "అమ్మ" లేదు. ఆ సాధువు దు:ఖాన్ని చూచి 8, 9 సంవత్సరముల గల బాలికగా ఆవొర్భవించి ఆ సాధువు వద్దకు వచ్చి మృదు కంఠముతో ఆ సాధువునిట్లు ప్రశ్నించెను _ "బాబా ! ఎందుకు ఇట్లు విలపించుచున్నావు ? నీకేమి కష్టము వచ్చినది ? " అంతట ఆ సాధువు _ "అమ్మాజీ ! ఇంత పిన్న వయసులో కూడ నీవు మనోశాంతి లేని నాబోటి వాని వద్దకు వచ్చి కష్టసుఖములను విచారించటం బట్టి ఎవరో మహాదేవతవని నాకు తోచుచున్నది. నాది వంగ దేశం నా తల్లి దండ్రులు ధనికులే వారు తమకు తాము సుఖపడుటయే జీవితపరమావధిమని తలంచి జీవయాత్ర సాగించుచున్నారు. అట్టి ఆడంఅబర్ జీవితం నాకు సరిపడక చిన్ననాడే ఇల్లు విడిచి పవిత్రమగు బృందావనమునకు వచ్చినాను. కానీ ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళిననూ గోధుమ రొట్టెలే పెట్టెదరు. అవి తినుటచే నాకు రక్త విరోచనములయి ఆరోగ్యము దెబ తిన్నది. మా వంగ దేసములో మేము నిత్యమూ అన్నము తినెదము. బృందావనమును విడిచిపోయెదమన నా కన్న తల్లిని విడిచిపోవునట్లనిపొంచుచున్నది. అమ్మను వదిలి ఎన్ని విధములగు లౌకిక సుఖములను చేర్చిననూ,అవి అంతగా అమ్మకు మనలను దూరము చేయుట సత్యము _ ఇక్కడ ఈ ఆహారమును తినుచు జీవించుట నాకు కష్టముగా నున్నది. విడిచి నాదేశమునకు పోయిన ఆహారము లభించును గానీ నా తల్లికి దూరమై దు:ఖప్రాప్తియే కలుగును. ఇక్కడ ఉండలేను. అక్కడకు పోలేను. కానీ నా ఆశయం ఒక్కటే_ "పరమకృపానిధి నా చిన్నారి తల్లి రాధ ఎప్పటికైనా నన్ను చూడకపోవునా ? అదియే నా ఆశ. ఆ ఆశతో జీవిచుచున్నానమ్మా" అని పల్కగా ఆ పిల్ల _ "బాబా ! నీవు నాతో రా" అని పల్కి "అదిగో !అక్కడ మూడు గృహములు ఉన్నవి. అందులో మధ్య ఉన్న గృహమునాది. ఆ గృహములో మా అమ్మా, నాన్న ఉంటారు. నీవు అక్కడకు పోయి తలుపు తట్టి నీ కుమార్తె నన్ను ఇక్కడకు పంపితే వచ్చానమ్మా యని చెప్పుము. మీ బిడ్డ మీకు ఒక విషయము చెప్పమన్నది. _ "మీరు ఈ రోజు ఉదయమే "ఖీర్" వండి మధ్యాహ్నం తినవచ్చునని వంట ఇంటిలోని అల్మారా మూడవ అంతస్థులో దాచిరట" అని పల్కుము అతనిని ఆ ఇంటికి పంపి తను అంతర్ధానమయ్యెను. తలుపు తట్టగా యజమానులు వచ్చిరి. మొదట చాలా విసుక్కొనిరి, తర్వాత "ఖీర్" విషయము చెప్పిన వెంటనే వీధుల వెంట తిరిగే ఈ సాధువునకు మన "ఖీర్" విషయము ఎట్లు తెలియును ? ఇక్కడకు ఈయనను పంపినది సర్వాంతర్యామి యగు మన బిడ్డయే. మనకు సంతానము లేనందున అమ్మనే మన బిడ్డగా భావించుకొనుచున్నాము. అమ్మ దర్శనం అయింది మహానీయునకు. అంతట వారు ఆ సాధువుతో "నీవు యావర్జీవితము ఇక్కడే ఉండుము నీకు అన్నమునే పెట్టెదము అని పల్కిరి. ఇదియే అమ్మ లక్షణం. ఈ లక్షణమే అమ్మ సౌందర్యం, ఇట్టి సౌందర్యమునే మనము కలిగియుండవలెను. అమ్మను చేరు సాధనా విధానము ఇదియే. ఆనాడు కన్నయ్య శిరో వేదనతో బాధపడుచుండెనని నారదును ద్వారా విన్న గోపికలు నారదుడు కోరిన విధముగా తము నరకమునకు పోవుటకు సిద్ధపడియు తము పాద తీర్థమును కోరిన విధమున తము నరకమునకు పోవుటకు సిద్ధపడియు తమ పాదతీర్థమును కన్నయ్యకు ఇవ్వుటకు సిద్ధపడిరి. ఇతరుల భాధలను తొలగించి వారికి శాంతిని చేకూర్చుటయే నిజమైన సాధన్. అటి సాధనచే మనో సౌందర్యము చేకూరును. రెండవది అనన్య నిష్ఠ : అనన్య నిష్ఠ అనగా ఈ బ్రహ్మాండము నిండా అంతా అమ్మ నిండి యున్నది. అనే భావన కల్గి అంతటనూ అమ్మనే చూచుచూ, అమ్మనే చింతన చేయుచూ జీవించుట. ఇది రెండో మెట్టు. ఇక మూడవది ఆనాడు కళ్యాణము అయిన పిదప శ్రీ రాముడు రధమెక్కెను. అప్పుడు సీత రాముని అనుసరించి "పతికి దాసిగా ఉండుటయే సతీ ధర్మమని" మా అమ్మ నాకు చెప్పినది అని పల్కెను. అంతట రాముడు "సహచరీవ్రతమునకు మించిన వ్రతము లేదు సీతా ! నీవు నాదాసివి కాదు, నా సహచారిణివి" అని పల్కెను. "నిన్ను విడిచి నేను ఉండలేను, బ్రతకలేను" ఇదియే సహచారీ వ్రతనిష్ఠ అనగా మన ఇష్ట దేవతను విడిచి ఒక్క లిప్త కాలమైననూ కీవింపలేకుండా ఉండవలెనని ఇది మూడవ సూత్రం ఇక నాలుగవ సూత్రము _ అమ్మ స్వరూపము సాకారము, నిరాకారము రెండునూ ఉన్నవి. వాటి సమన్వయించుకుంటూ జీవించవలెను.

ఒక్ లిప్తకాలమైననూ రసయోగి అమ్మను విడిచి యుండరు. ప్రతి జీవియూ అట్లే ఉండవలయును. ఇది రసయోగి ఆశయం. అమ్మ తాలూకు లక్షణములన్నియూ భోధించుటకు 8 భాగాలు అవసరం. అందుకొరకు 8 భాగాల రాధాగాధామృతానికి నాంది పలికి 6 భాగాలు పూర్తి చేసెను. ఈ ఎనిమిది భాగాలు వ్రాయటానికి అమ్మ కూడా తనకు అనుమతినిచ్చెను.

46. అకారణ కరుణామయి శ్రీ రాధ

శ్రీ రాధదేవి సర్వేశ్వరిగా, సురేశ్వరిగా, కృష్ణప్రాణ సఖిగా, కృష్ణమంత్రాధి దేవతగా భక్తులచే ఆరాధింపబడుతున్నది. అట్టి శ్రీ రాధాదేవి లీలలను, మహిమలను తెలుగు వారికి అందించాలని రసయోగి సంకల్పించెను. ఇది " అమ్మకు నేను సమర్పించే అలంకరణ" అని అంటూ ఉంటారు. "యోగము" అంటే కలయిక అని అర్ధము, యోగ సాధన అంటే "జీవుడు నిరంతరమూ భగవంతుడు నాతో, నాలో ఉన్నాడను ఆత్మ విశ్వాసముతో మెలుగుటయే". ఇదియే దివ్యసాధన్. ఎవరైతే నిరంతరం అమ్మ చింతనలో ఉంటారో అటి వారి యోగక్షేమాదులు తల్లియే వహిస్తుంది. వారికి ఎప్పుడు ఏది అవసరమో అది వారికి అప్పుడు సమకూరుస్తూ ఉంటుంది.

ఒకసారి రసయోగి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు తన మందిరం ( రాధాకృష్ణమందిరం _ గుంటూరు) లో ఒక కుర్చీలో కూర్చొని "బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" అనే పుస్తకమును వ్రాయుచుండెను. వేసవి కాలము. ఎండలు బాగా ఉన్నాయి. వేడి వడగాల్పులు వీస్తున్నాయి. అయిన వారు పట్టుదలతో అల్ల్గే కూర్చొని గ్రంథరచన కొనసాగించుచుండిరి. ఇంతలో అక్కడకు గుంటూరులోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు శ్రీ రాయపాటి సుబ్బారావు గారు రసయోగి దర్శనార్ధమై అక్కడకు విచ్చేశారు. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు రసయోగి అనిన అమిత భక్తి, ప్రేమ. వారు రసయోగిని చూచు "నానాగారూ ! ఏమి వ్రాయుచున్నారు ?" యని అడిగెను. అంతట రసయోగి "అమ్మ భక్తుల దివ్య గాథలు" వ్రాస్తున్నాను. నా తల్లి లీలలను లిపి బద్దం చేస్తున్నాను" అని పల్కిరి. గాలి లేక చెమటలు కారుచున్ననూ, ఎండ వేడికి శరీరము కందిపోతున్ననూ లెక్క చేయక వారు అమ్మ సేవలో నిమగ్నమయ్యెను, అక్కడ పరిస్థితి చూసిన శ్రీ రాయపాటి సుబ్బారావు గారు " వెంటనే నాన్న గారు ఉన్న గదిని ఎ.సి. గదిగా మార్పించిరి. వలదని వారించినా " నాన్నగారూ మీరు అమ్మ సేవ చేస్తున్నారు. మీరు భక్తులు, యోగులు. మేమే మీ సేవ చేసి తద్వారా ఆ తల్లికి ఆనందం కలిగిస్తాము. మీరు కాదనకూడదు. అమ్మకు తన సేవకంటే తన భక్తుల సేవ అంటే ఎంతో ఇష్టం" అని ఎంతో నిరాడంబరముగా పల్కిన నిగర్వి శ్రీ రాయపాటి సుబ్బారావు గారు.

ఒకసారి నాన్నగారిని దర్శించాలని "మలేషియా" నుండి శ్రీ రామానుజం గారు విచ్చేశారు. వారు గొప్ప యోగసాధకులు కొన్ని దివ్య శక్తులను కూడా సాధించినవారు. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని దర్శించి, గుంటూరు రాధాకృష్ణ మందిరంలో కొన్ని రోజులు బస చేశారు. వారు "ఈ రాధాకృష్ణ మందిరం గొప్ప ఆధ్యాత్మిక శక్తి గల్గిన కేంద్రము. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు గొప్ప సిద్ధయోగులు వారి దర్శనం నాకు ఎంతో ఆనందాన్ని కల్గించింది అని పల్కారు. వారు రసయోగుల సేవార్ధం " ఆ మందిరానికి క ఇన్వర్టర్" బహుమతిగా ఇచ్చారు. పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు 8 నెలలు బృందావనంలో 4 నెలలు గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఉన్న సమయంలో కరెంటు కోత వల్ల అనేక ఇబ్బందులు మందిరవాసులు పడుతుండేవారు. ఇది చూచిన రామానుజం గారు ఈ ఇబ్బంది ఉండకూడదు. పూజ్యులు, జ్ఞానవృద్ధులు రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారికి ఏ మాత్రం ఇబ్బంది ఉండకూడదు. ఆయనకు బాధ కలిగితే అది అమ్మకు కష్టం కలిగినట్లే" అని భావించేవారు. అటువంటి సున్నిత మనస్వి శ్రీ రామానుజం గారు.

రాధారాణి యే తన సర్వస్వం, ఆమె సేవయే తన జీవిత పరమార్ధం అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారు శ్రీ రసయోగి. "యే యథామాం ప్రపద్యంతే తాంతథైవ భజామ్యహాం" అని అమ్మ వాక్కు. ఎవరు నన్ను ఎలా తలుస్తారో, వారిని నేను అలానే భావిస్తాను అని దాని అర్థం అమ్మ నిరంతర సేవయే తన భాగ్యం, తన ధ్యేయం అని భావించే వారు శ్రీ రసయోగులు. మరి వారి క్షేమసమాచారాలు, బాగోగులు ఆ తల్లియే స్వయంగా చూస్తుంది. ఆ తల్లియే శ్రీ రాయపాటి సుబ్బారావుగారిలో, శ్రీ రామానుజం గారిలో ప్రేరణ కల్గించి తద్వారా తన తనయునికి అన్ని వసతులూ ఏర్పాటు చేసింది. రసయోగి చేయి చాచి ఎవ్వరినీ ఏదీ ఏనాడు అడిగి ఎరుగరు. ఆఖరికి తన ఆరాధించే తల్లిని కూడా "అమ్మకు తెలియదా తన బిడ్డకు ఏమి ఇవ్వాలో" అని నవ్వుతూ పల్కుతారు రసయోగి. ఆ తల్లి పట్ల ఆయనకున్న ధృఢవిశ్వాసం, బలీయమైన ప్రేమ, నమ్మకం అటువంటిది. ఆ తల్లికి ఈ బిడ్డ పట్ల అంతే వాత్సల్యం ప్రేమ. వారి ప్రేమానుబంధం వర్ణనాతీతం. మాటలకు అందనిది. వర్ణించనలవికానిది.

47. అభినవ హితహరివంశుడే ఆంధ్ర రసయోగి

పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ గారి ఆజ్ఞ పై యువకుడు అనేకమంది మహాత్ముల చరిత్రలను హిందీ నుండి తెలుగులోనికి అనువాదం చేశారు. ఒకసారి రాధికాప్రసాద్ మహారాజ్ గారు యువకుని పిలిచి బృందావనంలో నివసించిన మహాత్ములలో "హితహరివంశుడు" మహోన్నతుడు. ఆయన చరిత్రను నాటక రూపంలో నేను తెనుగున వ్రాశాను. ది నీవు హిందీలోకి అనువదించాలి. అది నేను ఇక్కడ వ్రజ వాసులందరికి పుస్తక రూపంలో పంచిపెడతాను. ఆ నాటకాన్ని వాడవాడలా ప్రదర్శిస్తాను. ఆ మహాత్ముని భావాలని చక్కగా అర్థం చేసుకొని ఆ మార్గంలో అందరూ నడవాలి. ఈ కార్య భారం నీ మీద ఉంచుతున్నానని పలికారు. రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ గారు చెప్పిన ఆ పనిని ఎంతో భక్తితో, ఉత్సాహంతో యువకుడు నెరవేర్చాడు. హిందీలోని హితహరి వంశ నాటకాన్ని విని రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఎంతో ఆనందించారు. ఆ నాటకాన్ని రంగస్థలం మీద ఆడించేందుకు ఏర్పాటు గావించారు. అది రాధాష్టమి మహోత్సవ సందర్భంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని పల్కారు.

యువకునికి పుస్తకం వ్రాస్తున్నంత సేపూ హితహరి వంశునికి, రాధికాప్రసాద్ మహారాజ్ గారికి ఎన్నో విషయాలలో సామ్యం ఉండటం గమనించాడు. అలనాటి హితహరి వంశయే మరల ఈ రూపంలో మరొకసారి జనావళి నెల్ల రాధా భావ తరంగాలలో స్నానమాడించుటకై అవతరించెనా అని అన్పించింది. యువకుని మనోవీధిలో హితహరివంశ ఆయన స్థానంలో పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు కదలాడసాగిరి.

వ్రజము యొక్క ఉపాసన రసోపాసన _ ప్రేమోపాసన. ఆ ఉపాసనా లక్ష్యము భగవంతుడు కాదు భగవంతుని ప్రేమ. ఆ ఉపాసనా మార్గం అనెడి ఆధ్యాత్మికాకశంలో ఉదయించిన జ్యోతిర్మయి నక్షత్రములలో శ్రీ హితహరి వంశజీ ముఖ్యులు. ఆయన వలెనె రసోపాసనే తన జీవిత లక్ష్యముగా మార్చుకొని, దానిని సాధించి ఆ ఆనంద రసాంబుధిలో ఓలలాడుతూ బద్ద జీవులను ఆ మార్గగాములుగా మారుస్తున్న మహానుభావులు మన శ్రీ నాన్నగారు.

శ్రీ హితహరి వంశుడు _ శ్రీ కృష్ణుని వేణువు అంశయని విద్వాంసులు తెలిపారు. నిత్యము ఆనందకందుని సుందర రమణీయ కరకమలములలో ఇమిడిపోయి శ్యామసుందరుని అధరామృతఝరిలో మునిగిపోయి ఆనంద పారవశ్యంతో మోహన రాగాలు వర్షించే ఆ వేణువు హరివంశజీగా అవతరించి శ్రీ కృష్ణుని గూర్చి ఉపాసించలేదు. రాసలీలలో ప్రవేశమునకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా ఎవరి కృపా దృష్టి కావాలో అట్టి రాసేశ్వరి శ్రీ రాధాదేవిని ఉపాసించారు. అట్టి మార్గంలోనే శ్రీ రాధాజీనే సర్వశ్రేష్ఠగా తెలుసుకొని తన సర్వస్వము ఆమెయేనని భావించి ఆమె ఉపాసనలో తన జీవితాన్నొక పుష్పము చేసి సమర్పించుకున్న మహనీయుడు మన నాన్నగారు. అదే శ్రీ రాధికాప్రసాద్ లోకసిద్ధులైన శ్రీ రాధా రాధకులు.

శ్రీ హరి వంశజీ తన ఉపాసనలో శ్రీ రాధాదేవిని ఆరాధిస్తూనే తనకు తాను శ్రీ రాధాజీకి సఖిగా భావము పొంది, ఆమెకు సేవ చేస్తున్నట్లు అనుభూతులు ప్రత్యక్షముగా పొందేవారు. శ్రీ రాధాదేవి కూడా ఆయనను "హితసఖీ" అని పిలెచేదని మహాగ్రంథాలు ఆధారంగా తెలుస్తుంది. ఇదే విధంగా నాన్నగారి ప్రియ శిష్యురాలు, అనుగామి అయిన మాతా అంజనీదేవికి ఒకరోజు రావలిలో శ్రీ నాన్నగారు సఖీ రూపం దాల్చి లికుంజలో శ్రీ రాధాజీకి గంధము పూయుచున్నట్లు దృశ్యము కనబడింది. అదే సమయంలో ఆ గదిలో ఉన్న వారందరికి సుందర సుగంధ పరిమళం వచ్చింది. శ్రీ నాన్న గారు కూడా తన్మయస్థితిలో శ్రీ రాధాజీని "సఖి" గానే ఉపాసిస్తారు. "శ్రీ హిత హరి వంశ మాదిరిగానే శ్రీ నాన్నగారు కూడా తన ప్రియ సఖియే" అని శ్రీ రాధారాణి, పై సంఘటన ద్వారా చెప్పకనే చెప్పింది.

బాల్యమున శ్రీ హరివంశజీ తల్లిదండ్రులు రాధా గోవిందుల ఊయల ఉత్సవము చేయదలచి రాధాగోవిందుల మూర్తులను ఊయలలో కూర్చుండబెట్టి హరివంశునితో ఊపమని చెప్పి తామేవో పూజా పనులు చేసుకోసాగిరి. కొంత సేపటికి బాలికా స్వరముతో ఎవరో అత్యంత మధురముగా గానము చేయుచూ ఊయల ఊపుతున్నట్లు వారికి వినిపించెను. వచ్చి చూడగా తమ బాలుడే _బాలిక కాదు. ఈ విధముగా పలు మారులు హరి వంశుని బాల రూపము బాలిక గాను _ బాలికా రూపముగా మారుచుండెను. అనగా హరివంశుని బాహ్య రూపము పురుష రూపమైననూ అంతరంగికంగా భావదేహంతో స్త్రీగా రాధారాణి సఖిగా రాధా గోవిందుల సేవ చేసిరని విశదమగుచున్నది. నాన్నగారి శిష్యులలో అనేకమందికి నాన్నగారు స్త్రీ రూపంలో కనిపించారు. కొంతమందికి స్వప్నంలో, కొంతమందికి ధ్యానంలో, కొంతమందికి ప్రత్యక్షంగాను ఈ అనుభూతి కలిగింది. నవవ్రత బ్రహ్మచారి అను బెంగాలీ స్వామీజీ తన శిష్య బృందంతో శ్రీ నాన్నగారి దర్శనార్ధం వచ్చారు. వారి శిష్యులలో 70 సంవత్సరాల శిష్యురాలికి శ్రీ నాన్నగారు రాధా సఖిగా స్త్రీ రూప అనుభూతి కలిగింది. దానికి పరవశురాలై ఆమె ఒక చీర కొని శ్రీ నాన్నగారికి అలంకరించి దివ్యానుభూతికి లోనయింది. అంతే కాక శ్రీ నాన్నగారికి ముక్కుకు ముక్కెర పెట్టుకొనే చోట స్త్రీ ల మాదిరిగానే రంధ్రము ఉంటుంది. అది ఆయనకు పుటుకతో వచ్చినది. కనుక ఆయన భౌతిక దేహము పురుష రూపమే అయినా మానసికంగా, భావత్మకంగా స్త్రీ రూపం దాల్చిన రాధాసఖి.

లోకంలో దుష్కర్మలు చేసే జీవులను శిక్షించడానికి శ్రీ మహవిష్ణువు అవతరిస్తాడు. ఆయన వారిని సంహరిస్తాడే గాని వారిలోన దుష్టత్వాన్ని రూపుమాపడు. కాని శ్రీ రాధాజీ మార్గము వేరు ఆమె తన హ్లాదినీ శక్తి తరంగాలతో దుష్టులలోని దుష్టత్వాన్ని పోగొడుతుంది. దానికై ఆమె అనేకమంది వ్యక్తులను త్న ప్రతినిధులుగా ఎన్నుకొని తన కృపా సింధుత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. వారిలో హరి వంశుడు ముఖ్యుడు. శ్రీ రాధాజీ ఆయనకు స్వయంగా వచ్చి తన మంత్రోపదేశం చేసింది. దాని ప్రభావంతో జీవుల నుద్దరించమని చెప్పింది. అదే విధంగా శ్రీ నాన్నగారికి కూడా శ్రీ రాధాజీ మరొకదేవత దుర్గాదేవి స్వయంగా షడాక్షరీ మంత్రాన్ని, శ్రీ రాధాజీ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేసించారు. తరువాత శ్రీ రాధాజీయే స్వయంగా తనకు ఇష్టమైన ధ్యాన మార్గాన్ని ఉపదేశించింది. ఆ మార్గంలో తపస్సు చేసి నాన్నగారు తన ప్రభావంతో ఈ లోకంలో జీవులకే కాదు, ఊర్ధ్వ లోకాలలో అశాంతితో మగ్గుతున్న అనేక ఆత్మలకు, యింకా కొంతమంది దేవతలకు కూడా రాధా ప్రేమరసాన్ని పంచి వారికి శాంతి ప్రదానం చేసి శ్రీ రాధాభక్తి మార్గంలో నడిపిస్తున్న కారణజన్ములు.

శ్రీ హరివంశుడు తన జీవితంలో నిరూపించిన సత్యమొకటున్నది. నిజమైన భక్తునకు గృహస్థు జీవితం అడ్డుకాదు. భగవంతుని కోసం సన్న్యాసులు కానవసరం లేదు. సంసారంలో ఉంటూనే మనసుతో సన్యసించాలని ఆయన ఉద్దేశ్యం. గృహస్థునిగా తన సంసారాన్ని మొత్తం శ్రీ రాధాజీకి అర్పించి శ్రీ రాధాజీ సంసారంగా మార్చుకొని అమ్మను సేవించిన ఆదర్శమూర్తి. శ్రీ నాన్నగారు గృహస్థుగా ఉంటూనే ధ్యానమార్గంలో ఉత్తుంగ శిఖరాలను అందుకున్నారు. భర్తగా తండ్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే జగదీశ్వరికి త్రికరణ శుద్ధిగా అంకితమైన అవతామూర్తి. తన సంసార సభ్యులను కూడా శ్రీ రాధా మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఇంటి యజమానిగా తన బాధ్యత నిర్వహించారు. అమ్మ ఆదేశంతో చిన్న వయసులోనే (భార్యతో ఉంటూనే ) బ్రహ్మచర్యలం అవలభించిన తపస్వి శ్రీ నాన్నగారు. కాషాయం కట్టని సిసలైన సన్యాసి.

రాసలీలలో ప్రవేశానికైనా, శ్రీ రాధాజీ కృప పొందడానికైనా మొట్టమొదటి సోపానం బృందావన నివాసం. శ్రీ హరివంశుడు కూడా రాజాస్థాన పదవి వలదని వ్రజ ధామానికి వచ్చి బృందావనంలో వ్రజ వాసుల ద్వారా శ్రీ రాధాజీ ఇప్పించిన భూమిలో ఆశ్రమం నిర్మించుకొని శ్రీ రాధా గోవిందుల సేవను చేసుకున్నారు.

శ్రీ నాన్నగారు కూడా తన స్వస్థలాన్ని, భోగభాగ్యాలను, పేరు ప్రతిష్ఠలను వదులుకొని బృందావనంలో తన నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఇల్లు కొనటం కష్టసాధ్యమైనప్పటికినీ అమ్మ సంకల్పంతో ఇల్లు ఏర్పరుచుకున్నారు. ఈ రోజుకీ నాన్నగారు బృందావనమే నా "స్వగ్రామము" అంటారు.

శ్రీహిత హరి వంశజీ తన ఆశ్రమంలో గంగ, యమునల వంటి అనేక దీన దు:ఖితులకు ఆశ్రమం కల్పించారు. గంగ, యమునలు తమ మాన సంరక్షణకై ఎంతో దూరంలో ఉన్నప్పటికీ హరి వంశుని స్మరించగానే వారిని తన శక్తి తరంగాల ద్వారా కాపాడారు. శ్రీ నాన్నగారు కూడా బృందావనం వెళ్ళకముందే అనాధులకోసం వసతి గృహం నిర్వహించారు. శ్రీ నాన్నగారు తన ఆశ్రమంలోనే దొంగతనం చేసిన వ్యక్తులను వారెవరో తెల్సి కూడా క్షమించారు. తన ప్రభావంతో వారు తమ తప్పులను తాము తెల్సుసుకునేటట్లు చేసారు. ఇప్పటికీ తన ఆశ్రమంలో అనేక దీన దు:ఖితులకు ఆశ్రమం కల్పిస్తున్నారు. వారికే కాక ఆర్తితో త్న వద్దకు వచ్చిన ఏ జీవికైనా ప్రేమతో తన శక్తి తరంగాలతో హస్త సంసొఅర్శ వారి బాధలను నివారించే ప్రేమమూర్తి, ఆశ్రిత రక్షకులు శ్రీ నాన్నగారు. మానవులకే కాదు అనేక ఆత్మలకు, దేవతలకు కూడా తన తపోశక్తితో దు:ఖ నివృత్తి గావించిన అమృతమూర్తి.

శ్రీ హరి వంశజీ తన దైనందిన చర్యలు అన్ని రాధా భావంతో శ్రీ రాధాజీ సంతోషం కోసం, త్రికరణ శుద్ధిగా అర్పితమై చేసేవారు. ఉదాహరణకు అమ్మ తాను స్వయంగా తయారు చేసే భోగ్ వండినంత సేపు ఎవరితోనూ మాట్లాడే వారు కాదు. మనసా, వాచా, కర్మణా అమ్మ చింతనలోనే దైనందిన చర్యలు చేపట్టేవారు.

శ్రీ నాన్నగారు కూడా సాధనలో ముఖ్యంగా అవలంభించ వలసినది శ్రీ రాధా భావమనే _ అని చెబుతారు. తాను చేసే ప్రతి పని అమ్మ చూస్తున్నది అనే భావనతో చేయాలంటారు. ఆయన ఏ పనైనా శ్రీ రాధాజీకి ఇష్టమా ! కాదా ! అని ఆలోచించి చేస్తారు. అమ్మ పని అంటే ఎంత కష్టమైననూ ఇష్టంగా చేస్తారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా అమ్మ గురించి ఎవరైనా అడిగితే నిద్రాహారాలు మానేసి అనర్గళంగా ఉపన్యసిస్తూనే ఉంటారు

తనకి హాని తలపెట్టిన నరవాహనుడు మొదలైన వారిని క్షమించి, అమ్మ అనుగ్రహంతో వారిని తపోమూర్తులుగా తీర్చిదిద్దిన క్షమామూర్తి శ్రీ హరివంశుడు.

శ్రీ నాన్నగారిని విమర్శించిన వారెందరో తరువాత ఆయన ప్రేమశక్తికి తలవంచి ఆయన పాదాల మీద పడ్డారు. జీవులను భౌతికంగా శిక్షించడం వలన కాకుండా ప్రేమతో వారి మనసులను మార్చడం నాన్నగారి మార్గం. అదే హిత హరి వంశుని ద్వారా ఆనాడు శ్రీ రాధాజీ చూపించిన మార్గం, ఈనాడు కూడా శ్రీ రాధాజీ నాన్నగారి ద్వారా మనకు చూపిస్తున్న మార్గము.

శ్రీహిత హరివంశజీ అమ్మ అనుగ్రహంతో తనకు లభించిన దివ్యానుభూతుల ఆధారంగా "హితచౌరసీ" అనే గ్రంథరాజాన్ని రచించారు. ఆ గ్రంథం నేటికీ వ్రజ రసికాచార్యులకు శిరోధార్యం, ఆ గ్రంథ పఠనం వలన దివ్యానుభూతులకు లోనైన అదృష్టవంతులు నేటికీ వ్రజములో కనిపిస్తారు.

శ్రీరాధాజీ ఆదేశంతో అమ్మ లీలలను సామాన్య జనావలికి అందించాలనే బృహత్తర భగవత్సేనా దృక్పథంతో శ్రీ నాన్నగారు "బృందావనేశ్వరి శ్రీ రాధాదేవి" అనే ఎనిమిది గ్రంథ రాజాలను శ్రీ రాధాదేవికి అలంకారములుగా సమర్పించుతున్నారు. వాటిని పఠించి లౌకికంగాను, పారమార్థికంగాను ఉన్నతులైన సామాన్యజనులను మనం చూడవచ్చు.

ఈ విధంగా శ్రీ కృష్ణుని వేణువు అంశయైన శ్రీ రాధాజీ కృపావీక్షణాంశమై భూమి పై అవతరించి హితసఖిగా తరించిన శ్రీ హిత హరి వంశునితో అనేక సామ్యాలు కలిగి ఆయనకు ప్రతిరూపముగా ఆయన ఆదర్శములను ఆచరిస్తున్న ఆధునిక హితహరి వంశుడు అని మనం పిలుచుకోవలసిన శ్రీ రాధాజీ ప్రియ సఖి, శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు.

20

48. రసయోగి కథ పుస్తక ఆవిర్భావము

కాలం గడుస్తున్నది. కాల ప్రభావానికి ఎవరైనా లొంగవలసిందే. ఏదో కొద్దిమంది సిద్ధయోగులు తప్ప. రాధికాప్రసాద్ మహారాజ్ గారు వంటి వారు కాలాన్ని నిర్దేశించగల శక్తి గలవారు. కనుకనే వారు కాలంలో వచ్చే మార్పులను చూచి చలించరు. సుఖాన్ని, దు:ఖాన్ని సమంగా చూసే వాడే యోగి. నిరంతరమూ రాధామాధవ చింతనలో మధురానందాన్ని గ్రోలేవాడే రసయోగి. రసయోగులు రాధికాప్రసాద్ మహారాజ్ గారు. రాధాతత్వాన్ని దశదిశలా ప్రచారం చేస్తూ భక్త జనానికి మార్గ దర్శనం కావిస్తున్నారు.

యువకునికి ఇరువురు స్నేహితులున్నారు. ఒకరు శ్రీధర్. మరొకరు శ్యామల. ఇరివిరూ మంచి ఆధ్యాత్మిక చింతన కల్గినవారు. ఒకరోజు వారిరువురూ యువకునితో _"నీవి వ్రజ ధామానికి చెందిన అనేక మంది భక్తుల గాథలని హిందీ లోనుంచి తెలుగులోనికి అనువదించావు. మన ఎప్పుడు కలుసుకున్నా రాధికాప్రసాద్ మహారాజ్ గారి గొప్పతనము గురించే చెబుతూ ఉన్నావు. నీకు ప్రేరణ ఇచ్చి, నీ చేత ఆ మహానీయుల గాథలను రచింపచేసి, నీకు, రాధారాణి సేవా భాగ్యాన్ని కల్గించిన పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి జీవన గాథను నీవెందుకు రాయకూడదు" అని ప్రశ్నించెను. "నిజమే ! ఎంతోమంది భక్తుల మహనీయుల గాథలు చదివాను, వ్రాశాను. పూజ్యులు, యోగీశ్వరులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి జీవన గాథను ఎందుకు వ్రాయకూడదు" అనే ఆలోచన, వ్రాయాలనే సంకల్పం యువకుని మనసున స్థిరపడింది. తన ఆలోచనను తన బాబాయి గారికి తెలిపెను. ఆయన ఆనందించి ప్రోత్సాహించెను. అయితే యువకునికి ధైర్యము చాలదయ్యెను. కారణం మహాశక్తి సంపన్నులు, నిరుపమాన భక్తి సంపన్నులు, నిరంతర రాధా చింతన తత్పరులు, రసికాచార్యులైన శ్రీశ్రీశ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి విరాడ్రూపాన్ని మాటల్లో చిత్రీకరించటమంటే ఒక చెంచా తీసుకొని సముద్రంలో నీటిని కొలవటం వంటి పనే, అలాగే ఒక చిన్న అగ్గిపుల్లను వెలిగించి సూర్యతేజాన్ని వివరించటం లాంటిదే. ఇది సాహసిక కార్యము. కానీ యువకుని మనోభావాలకు, మాత అంజనీదేవి ఆశీర్వాదం, అండదండలు, అవ్యాజమైన ప్రేమ ఎంతో బలాన్ని చేకూర్చి పెట్టాయి. ధైర్యం చేసి యువకుడు రచనా వ్యాసంగం ప్రారంభించాడు. తను బృందావన యాత్ర బయలుదేరినది మొదలుగా ఇప్పటి వరకు తను చూచిన, విన్న, అవగాహన చేసుకున్న బృందావన విషయాలన్నీ క్రోడీకరించి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిని కేంద్రంగా తీసుకొని భక్తి భావ భరితమైన తన భావాలకు ఒక రూపం కల్పించాడు. గ్రంథం తయారయింది. ఇక నామకరణం చేయాలి. "ఏం పేరు పెట్టాలి ?" అనే మీమాంసలో యువకుడుండెను. ఆ రోజు శుక్రవారం. యువకుడు మందిరానికి వెళ్ళెను. "సంకీర్తన" జరుగుతున్నది. మాత అంజనీదేవి రాధికాప్రసాద్ మహారాజ్ గారిచే రచింపబడిన గీతాన్ని అత్యంత మధురంగా ఆలాపిస్తున్నది. యువకుడు కన్నులు మూసుకొని పాటను వినసాగెను _

గీతం

చరణం : నను మరువబోకమ్మ నాతల్లి రాధరో

ఓ..........భవతారిణి శుభలీలామణి || నను||

1. భవ జలధిలో పడి అవనిలో నిన్నేకోరి

అన్నియు మరిచి నే నిన్నే నమ్మితినమ్మ || నను ||

2. నా స్వప్నమందైన నీ ప్రేమనే కోరి

నా భావ పూలచే నిన్నే పూజించెద

నా ప్రేమ పూలచే నిన్నే సేవించెద || నను ||

3. నీ పద సేవయే నా సంపదయని

మది నమ్మినానమ్మ నాకన్న తల్లిరో || నను ||

4. మాధవ ప్రీతిచే ముక్తి మాత్రమె కల్గు

నీ కృప కల్గిన పొందెదరు మాధవుని

నీకృప కల్గిన పొందెదరు నీ రాస || నను ||

భక్త జనమంతా ఆనంద పారవశ్యంతో మాత అంజనీదేవి గొంతుతో గొంతు కలిపి గీతమును ఆలాపించిరి. యువకుడు తన గురుదేవులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పాదముల చెంత కూర్చొని ధ్యానమగ్నుడయెను. _" మహానీయుని గ్రథం వ్రాశాడు. కానీ ఇందులో గొప్పతనమేమియు లేదు. అతను ఒక సామాన్యుడు. నిమిత్తమాత్రుడు. అంతా రాధారాణి లీలయే". రాధారాణి ఎటు నడిపిస్తే అటు నడిచే ఆమె చేతిలోని కీలుబొమ్మయే తను. ఆమెయే ఆతని స్నేహితుల రూపాన ప్రేరణ కల్గించింది. ఆమెయే అంజనీమాత రూపాన అండగా నిలిచి గ్రంథం ఒక పరిపూర్ణ రూపాన్ని పొందటానికి కారణమ్యింది. ఆమెయే అతని బాబాయి రూపాన బృందావన దర్శనం చేయించింది. ఆమెయే ఈ గ్రంథం వ్రాయటానికి కావలసిన శక్తిని ఇచ్చిందన్న విషయం యువకునికి తెలుసు. ధ్యానమగ్న స్థితిలోనే యువకుని మనసున తను వ్రాసిన ఈ గ్రంథానికి ఏ నామం పెట్టాలో తట్టింది. అదీ రాధారాణి కృపావిశేషంగానే యువకుడు భావించాడు. సంకీర్తన పూర్తి అయినది. ప్రసాదాలు స్వీకరించాడు. పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి పాద పద్మములకు నమస్కరించాడు. మాత అంజనీదేవికి నమస్కరించాడు. యువకుని మనస్సులో ఎంతో తృప్తి, ఆనందం చోటు చేసుకున్నాయి. ఇంటికి వచ్చి తను వ్రాసిన గ్రంథాన్ని ఒక్కసారి అమూలాగ్రం పరికించాడు. రాసేశ్వరి రాధాదేవిని మనస్సున ధ్యానం చేసి పుస్తకానికి నామకరణం గావించాడు. ఆ నామమే "రసయోగి , ( or ) The sperituval way to Sri Radha ".



********


రసయోగి జీవితంలో మలుపులు

శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి చిన్నతనము నుండియే వారి ఆధ్యాత్మిక జీవన యాత్రలో అనేక మలుపులు జరుగుతూ చివరకు అసలైన "రసోపాసన"ను అందుకొన్నారు.ఒకప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస ఇట్లు ప్రకటించెను _ " భగవదనుగ్రహమును, పొందిన జీవుడు ఒకే జీవితమునందే అనేక జన్మల సంస్కారములను దాటుకొని ముందుకు పోవును". రసయోగి (నాన్నగారు) జీవితము నందు కూడా అట్లే జరిగినది. అనేక చిల్లర దేవుళ్ళను, చిన్న చిన్న ఫలములనే ఆశ్రయించి వాటినెల్ల దాటుకొని అనేక ఫలములతో కూడిన మహావృక్షమగు, మూలతత్వమగు శ్రీ రాధా రసోపాసనలో ప్రవేసించారు. రసయోగి మరిడమ్మ సాధన చేసినా, గాయత్రీ, శివాక్షరీ, కామగాయత్రీ, రాధాస్వామీ దయాల్ బాగ్ మార్గము, కుసుమహరనాధుల తత్వ ప్రచారము _ ఏ మార్గములో ఉన్నా ఆయనది అంతర్లీనముగా ప్రేమమార్గము. మధుర మార్గము అయిన రసోపాసనయే చెప్పేవారు.

హరనాథ్ బాబా వారు ఒకసారి తన లేఖలో ఇట్లు ఉదహరించారు _ నేను శ్రీ కృష్ణ మహావృక్షమునకు చెందిన ఒకానొక అనామధేయమైన ఫలము మాత్రమే. సృష్టిలోని అన్ని నామములోనూ మధురాతి మధురమైనది శ్రీ కృష్ణ నామము. బాబా వారు తన లేఖల ద్వారా భక్తులకు, తల్లులకు, శ్రీ కృష్ణ మహిమను గురించి ఎంతగానో వర్ణించారు. బృందావనము అందరికీ శాంతినిచ్చు ధామము. ఎవరికి బాధ కల్గినా, ఏ కష్టము వచ్చినా బృందావనము వెళ్ళి శాంతిని పొందండి అని చెప్పారు. రసయోగి సుమారు మూడు దశాబ్దములు కుసుమ హరనాధుల మార్గములో ఉండి హరనాధబాబా వారు బోధించిన శ్రీ కృష్ణ ప్రేమతత్వాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆ మూడు దశాబ్దాల కాలంలో రసయోగి ద్వారా జరిగిన, పొందిన అనుభూతులు, జరిగిన విభూతులు ఆనాటి వారికి ఇప్పటికినీ చిరస్మరణీయులే. 1952 లో నాన్నగారు రాధా ఉపాసకురాలైన జనని శ్రీ రాధామహాలక్షి వారితో కలిసి రసోపాసనా మార్గములో ప్రవేశించి వ్రజభూమి వాసమే రసయోగ మార్గమని బృందావనంలో ఆశ్రమ స్థాపన చేసి రసోపాసన గావిస్తూరాధాప్రేమ వీచికలను వెదజల్లుచున్నారు.

*****************************

పూజ్యుశ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారి 100 వ జన్మదినోత్సవము

సువర్ణ సుమమాల

డా || ప్రసాదరాయకులపతి [ప్రస్తుతము కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానందభారతి]

జీవలిపిన్ లలాటముల చెక్కెడి విశ్వ విధాత బ్రహ్మయే

రావలిరాణి దర్శనము రాక తపించె సహస్రవర్షముల్

జీవులలోన నొక్కడు విచిత్రముగా ప్రతిరోజు రాధికా

దేవుని చూచు _ పల్కును _ నుతించు _ ఇతండెటువంటి సృష్టియో

సాధిత కృష్ణదేవ పదసారస మంజు మరంద మాధురీ

సౌధకు ప్రేమభక్తి వివశత్వ విధాన విశిష్ట బోధకున్

రాధకు, నెయ్య్పున్ సఖిగ రంజిల బోవుచున్న తత్పదా

రాధకు నాన్నగారనగ రాజిలు యోగిని సంస్తుతించెదన్

నూరవయేడు వచ్చెనటె ! నూతన శక్తి సర: ప్రపుల్లక

ల్హారు నకున్, ధరామర శిలాశ్కటాన్వయ భద్రమూర్తికిన్

హోరలు పట్టినట్టి రసయోగికి అమ్మ కృపా విశేషమా

హారము ప్రాణముల్ సకలమైన మహాత్ముడు నాన్నగారికిన్

ముఖ్యము మాకు నెల్లరక పూర్వ మహత్వము రాధికాప్రసా

దాఖ్యతపో నిధానము, తదించిత భౌతిక భవ్యరూపమున్

లేఖ్యము గాని వెల్గున విలీనము గక నిరంతరమ్ము చిత్

సఖ్య మహస్సుతో నయన జాలము ముందర నిల్వగోరెదన్

లీనము నీదు నాదమురళిన్ హృదయమ్మిది కృష్ణచంద్ర ! సం

లీనము నీదుపాద యుగళిన్ శిరమో రసదేవి ! రాధికా

రాణి ! త్వదీయ ధామమున వ్రలగ గోరుచునున్న యీ మహా

ధ్యానిని మాకు నెల్లపుడు దక్కగనీయరె ! అంజలించెదన్

************

3 వ్యాఖ్యలు:

Anonymous September 28, 2010 at 3:49 PM  

ఏ సీరియల్ ఎప్పుడైపోతుందండి? వచ్చే వారం కొత్త సీరియల్ ప్రారంభించగలరు.

శ్రీవాసుకి October 2, 2010 at 4:01 AM  

టపాలు బాగున్నాయి. నాకు ఇంత వరకు ఈయన గురించి తెలియదు. ఇటువంటి మహనీయులని సశరీరంతో ఉండగా దర్శించుకోగలగడం నిజంగా అదృష్టం. గుంటూరులో వీరి ఆశ్రమం ఎక్కడ ఉందండీ. చిరునామా తెల్పండి.

suvarna October 4, 2010 at 11:38 AM  

i want also great master darshan
please give me address.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP