శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సాధన సప్తకమంటే ఏమిటి ?

>> Sunday, January 17, 2010


దేవుడిపై భక్తి కలగడానికి ఉన్న ఏడు సాధనాలనే 'సాధన సప్తకం' అంటారు.
1. వివేకం ః
జాతిని బట్టి గాని, ఆశ్రయాన్ని బట్టి గాని, నిమిత్తాన్ని బట్టి గాని దూషితం కాని సాత్త్విక ఆహారాన్ని తీసుకొని, మనస్సుకు శుద్ధి కలిగించుకోవడం వివేకం. 'ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః' అను శ్రుతి అంతఃకరణ శుద్ధికి పరిశుద్ధాహారాన్నే తీసుకోవాలని తెలుపుతుంది.

గంజాయి, వెల్లుల్లి, మాంసము మొదలైనవి జాతి దుష్టాలు. ఆచార హీనుల వద్ద ఉన్న వస్తువులను ఆశ్రయదుష్టాలు అంటారు. ఎంగిలి, వెంట్రుకలు, కీటకాల వల్ల దూషితమైన ఆహారం నిమిత్తదుష్టం. ఈ మూడు దోషాలు లేని ఆహారం తీసుకుంటే సత్వగుణం అభివృద్ధిచెంది మంచి చెడులు గుర్తించగల వివేకం కలుగుతుంది.

2. విమోకం ః
భోగాలపై వ్యసన రూపమైన ఆసక్తి లేకుండా ఉండటం విమోకం.

3. అభ్యాసం ః
నిరంతరం భగవత్‌ ధ్యానంలో ఉంటూ బాహ్య విషయాలను మరచిపోవడం అభ్యాసం చేయడం.


4. క్రియ ః తన శక్తిని అనుసరించి నిత్యం పంచ మహా యజ్ఞాలు చెయ్యడం. అవి దేవయజ్ఞం - హోమం, అర్చనలతో ఇష్ట దేవతారాధన. బ్రహ్మయజ్ఞం - సదా వేదశాస్త్రాధ్యయనం. పితృయజ్ఞం - మాతాపితలకు సేవలు చేయడం. మనుష్య యజ్ఞం - అతిథి, అభ్యాగతులను ఆదరించడం. భూతయజ్ఞం - గోవులు, తదితర జంతుజాలానికి ఆహారమివ్వడం వీటినే 'క్రియా' అంటారు.

5. కల్యాణ ః కల్యాణాలనబడు ఈ సద్గుణాలను కలిగి ఉండటం. సత్యం - సర్వ ప్రాణులకు హితకరమైన యదార్థ వచనం. ఆర్జవం - మనోవాక్కాయాలలో ఏకరూపమైన ప్రవృత్తి. అనభిద్య ః పరుల ఆస్తులను దొంగిలించకుండా ఉండటం, అహింస, దయాది గుణాలను కలిగి ఉండాలి. 6. అనవసాద ః ఎటువంటి పరిస్థితుల్లోనూ దైన్యం అంటే మానసిక నిరుత్సాహం లేకుండా నిత్య నూతన ఉత్సాహంతో ఉండటం అనవసాదం. 7. అనుద్ధర్ష ః అంటే మితిమీరిన సంతోషం లేకుండా ఉండటం. ఈ సాధన సప్తకం ముముక్షువులకు నిశ్చల భక్తియోగాన్ని ప్రసాదిస్తుంది.

-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ


[ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి సేకరించబడినది.]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP