ఆథ్యాత్మిక గ్రంథాలలో భగవద్గీత ఎందుకు తలమానికమైనది ?[గీతాజయంతి సందర్భంగా]
>> Friday, November 27, 2009
లోకం లో పరమాత్మను గూర్చి ఆయన లీలలను గూర్చి వివరించే ఆథ్యాత్మిక గ్రంథాలు అనేకమున్నాయి. వాటన్నింటికీ తలమానికం వంటిదని ఆథ్యాత్మికగ్రంథరాజంగా ఎన్నబడుతున్నది భగవద్గీత . కారనమేమిటంటే మిగతా గ్రంథాలనే ఆణిముత్యాలన్నీ భగవంతుని లీలా విభూతులను దర్శించిన మహాత్ముల ద్వారా అందివ్వబడినవి .అలాగే వేదాలు కూడా మహర్షులు దర్శించినవే. కానీ గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కనుక ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.
గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అను అక్షరము త్యాగమును బోధించుచున్నది. "త" అను అక్షరము తత్వమును అనగా ఆత్మస్వరూపమును ఉపదేశించుచున్నది. గీత యను రెండుశబ్దముల కర్ధము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.
త్యాగశబ్దమునకు నిష్కామ యోగమగు కర్మ ఫలత్యాగమనియు లేక సర్వసంగపరిత్యాగమనియు అర్థము కలదు . అలాగుననే తత్వబోధనము కాత్మ సాక్షాత్కారమనియు,బంధమునుండి విముక్తి గల్గుటయనియు నర్థము కలదు . ఈ పరమ రహస్యమునే గీతాశాస్త్రముపదేశించుచున్నది .
అతువంతి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈనెల 28 శనివారం. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది . ఇక పఠనము ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళి కి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం . మన జన్మ ధన్యం చేసుకుందాము.
1 వ్యాఖ్యలు:
గీతా జయంతి శుభాకాంక్షలు!
Post a Comment