శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అలిగిన వేళనే చూడాలి ...........అందులో అర్ధం ఈరోజు తెలిసినది

>> Thursday, September 24, 2009




ఈరోజు స్వామి వారి అలకమోము చూడాలి ..ఎంతందం ??? ఎంతందం ?
అసలే ..." పుంసామోహనరూపాయ " అనికీర్తించబడే స్వామి మోము లో అలక ఛాయలు అలరారుతూ వుండగా ఏమందమేమందము ? స్వామివారిది.

అసలేంజరిగినదంటే . ఈరోజు వేకువనే సుప్రభాత సేవ జరిగినతరువాత రోజుకు మల్లే బాలభోగం లో అమ్మ వారికి క్షీరం నివేదన చేస్తున్నాను .కొద్దిగా పక్కకు తిరిగి చూతును కదా ! చిన్న పిల్లవాడు ఎవరో బుంగమూతి పెట్టుకుని , మరి ..నాకో ... అని అలుగుతూ అడిగినట్లనిపించినది . కానీ ఇప్పుడు శరన్నవరాత్రులు కదా ప్రధానంగా దుర్గకు నివేదనం చేస్తే చాల్లే అని సర్దిపుచ్చుకుని దుర్గామాతకు ,రాధాదేవికి మాత్రమే క్షీర నివేదనం గావించాను.

ఇక అభిషేకములు ప్రారంభమయ్యాయి . వినుకొండనుంచి భక్తులు సూరి అతని స్నేహితులు వచ్చారు . అభిషేకానంతరం శ్రీవారికి అర్చన చేస్తున్నాను .స్వామి కి అలంకరిస్తున్న మందార పూలు ఒక పక్క అమరుస్తుంటే మరొకపక్కవి ఎగిరి వచ్చి కింద పడుతున్నాయి . స్వామి వారిముందు నుంచుని తిలకిస్తున్న సూరి వాళ్లు అన్నా!పూలు క్రింద పడుతున్నాయి అని అంటున్నారు . అప్పుడు అర్ధమైనది ఇవి ఎగిరి పడటం కాదు ,స్వామి వారే పీకి విసిరి కొడుతున్నారు అని. అవునయ్యా ! స్వామి వారు ఈరోజు అలిగారు అని చెప్పాను . అందుకనా ? ఎప్పుడు ముసుముసి గానవ్వుతూ కనిపించే స్వామి మొహం లో ఏదో తేడా గా వున్నది .అని వాల్లన్నాక నేను పరీక్షగా స్వామి మోములోకి చూస్తే ... నిజమే ..అయన బుంగమూతి పెట్టినట్లుగా వున్నది.
లెంపలు వేసుకుని . సూరీ ! ఉదయం అమ్మవారికి పాలు సమర్పిస్తూ స్వామి వారిని నిర్లక్ష్యం చేసాను .అలిగాడు అని చెప్పాను . మరలా మనసులో దాసుని తప్పులు దండముతోసరి స్వామీ ! ఇలా అలిగితే ఎలా ? రేపన్నుంచి చూడు ముందుగా నీకే పాలను నివేదన చేస్తాను . లేకుంటే అప్పుడు చూడు అని క్షమాపణలు చెప్పుకుని మరలాపూలు లంకరించి చూద్దును గదా .కిలకిల లాడుతున్నాడు కోనేటి రాయడు . దొంగా .... అనుకుని ,బయటవారితో ఇప్పుడు చూడండి అని అన్నాను. వాల్లు అన్నయ్యా ! స్వామి ఇప్పుడు నవ్వుతూ వున్నట్లుగా కనపడతున్నాడు అని చెప్పుకుని ఆనందం తో పూజలో పాల్గొన్నారు.

నిజమే ! అలగినవేలనే చూడాలీ .. గోకుల కృష్ణుని అందాలూ ..... అని ఓ కవి వ్రాసిన పాటను చాలా సార్లు విన్నానుగానీ ఆయన ఏ అనుభూతినిపొంది ఆపాట వ్రాసాడో ఇప్పుడు అర్ధమవుతున్నది.



3 వ్యాఖ్యలు:

Sreevathsava September 24, 2009 at 2:42 PM  

ఆ ఊహే అద్భుతం.. మీరు చూడగలగడం ఇంకా అదృష్టం..
"కృష్ణం వందే జగద్గురుం".

రాఘవ September 25, 2009 at 4:01 AM  

భలే. బోలెడన్ని దండాలండీ మీ చిఱునవ్వుల కోనేటిరాయనికి :)

durgeswara September 25, 2009 at 10:22 AM  

మన భావాన్ననుసరించి ఆటలాడుతాడాస్వామి .నాటి యశొదమ్మ దగ్గర్నుంచి తరిగొండ వెంగమ్మ దాకా మనకు తెలిసిన లీలలే . కాకుంటే మన గమనించుకోలేనంత మాయలో ముంచుతాడా మాయలమారి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP