శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బ్లాగువివాదాన్నిలా పరిశీలించండి .. నా అనుభవాలతో పోల్చిచూసి

>> Tuesday, February 10, 2009

ఈమధ్య బ్లాగులోకంలో ఏవో గొడవలు జరుగుతున్నాయని తెలిసినది. వివరాలు తెలియకున్నా పర్నశాలబ్లాగులో మరొకచోట వివాదాన్ని వదిలేయమని కామెంట్ చేశాను. అసలు విషయము పరిశీలించమని మిత్రులు ఇచ్చిన లింక్ చూశాక అందులో నాపేరు కూడా ఉదహరించిన తరువాత నా అభిప్రాయాన్ని కూడా చెబితే ఈ మంటనార్పటానికి ఒక చెంబునీళ్ళు పోసినట్లవుతుందేమోనని ఇదివ్రాస్తున్నాను. అంతేకాని ఆరిపోతున్న మంటను మరల కెలకటానికో,బ్లాగు సందర్శకులను పెంచుకోవటానికో కాదని మనవి.
*******************************************************************************************
ఆసలు మనకు సంబంధము లేని వారివల్ల ఒక్కొక్కసారి మనకు మనస్తాపం కలుగుతుంది.వారితో వాదనలు చెలరేగటము వలన.ఇతరులతో వాదనలెప్పుడూ మనప్రయత్నము ఎంతో కొంత లేకుండా రావుకదా! ఆప్రయత్నము మనము సున్నితముగా చేసినా అవతలి వారి వ్యక్తిగత సంస్కారాలననుసరించి ప్రతి చర్యలు కనపడతాయి. ఇవన్నీ కేవలము ఇప్పటికిప్పుడు మాత్రమే పుట్టినవి కావు.వీటికి మూలాలు గతములో మనద్వారా జరిగిన పొరపాట్లవలనతయారయిఉంటాయని నాకైతే వ్యక్తి గతముగా అనుభవంలో కి తెచ్చి పాఠాలు చెబుతుంది ఆ జగన్మాత.అటువంటి రెండు సంఘటనలను మీముందుంచుతాను.

*******************************************************************************************
నేను డిగ్రీ ఫైనలియర్ లో వుండగనే ఉదయం పత్రికలో మా మండల విలేఖరిగా పని చేసేవాడిని. ఆసమయము లో జరిగిన ఘటన ఇది.
మావూరి లో ప్రాచీనమైన వేణుగోపాల,రామలింగేశ్వరస్వాములవారి ఆలయాలు వున్నాయి. ఆరెండు ఆలయాలకు దాదాపు రెండువందల ఎకరాల సుక్షేత్రమయిన భూమి వున్నది. కాని ప్రభుత్వం నియమించిన దేవాదాయ శాఖ పనితీరు మనకు తెలిసినదే కదా?అప్పుడు పని చేస్తున్న ఈ.వో .గుండాలు మింగేరకం. ఏనాడూ దీపారాధన ఖర్చులకు కూడా ఇవ్వడు. అర్చకులు పాపం చాలీ చాలని జీతాలతో అంతకంటే మరో మార్గం లేక ఎలానో మమ అనిపిస్తుంటారు. మనసొమ్ము కాదు కదా అనే భావతోను,ధర్మ నిస్ట లేని గ్రామస్తులు ఎవరికి వారే అలాచేయటము లేదు ఇలా చేయటము లేదనేవారేగాని నిలదీయటానికి కలసి రారు. పాపం సంజీవరెడ్డి గారని వాళ్ల అన్నదమ్ములు మేము చందాలు వసూలు చేసి మహాశివరాత్రి లాంటి పండుగలు కూడా జరుపాల్సి వచ్చేది.
ఒక సంవత్సరము మహాశివరాత్రి కన్నా ఖర్చు పెట్టి ఉత్సవము జరిపించమని ఈవోను కోరిన సంజీవరెడ్డి వాళ్లతో బజారులోనే నేనివ్వను మీదిక్కున్న చోట చెప్పుకోమని అతను నిర్లక్ష్యము గా మాట్లాడటము తో వాళ్ళు బాధపడి సాయంత్రము నాదగ్గర కొచ్చి ఇలా జరిగినదల్లుడూ అని తమ ఆవేదన చెప్పుకున్నారు. నాకు తీవ్రమయిన ఆవేశము వచ్చినది. మామా! మనకెందుకులే అని ఊరుకోవటము కూడా పాపము.వీడి తలపొగరు దించాల్సినదే అని ఊరిలో కొందరిని కలసి చైతన్యపరచాము.దుస్థితి లోనున్న ఆలయ ఫోటోలతో సహా వార్త వ్రాశాను. వానికి వత్తిడి మొదలయినది. కాని లంచాలకు మరిగిన ఆశాఖ అధికారులు నెలరోజులైనా ఏ చర్య చేపట్టకుండా అతనిని రక్షిస్తున్నారు.
ఇలా కాదని .పోస్ట్ కార్డులు కొని రోజుకు ఒక పదిమంది చేత ఇతని అవినీతి గురించి పై అధికారులకు ఉత్తరాలు వ్రాపించాము ఒక ఉద్యమములా. ఇదే సమయము లో కలెక్టర్ కు,ఇతర అధికారులకు ఫిర్యాదులు పంపాము. వరుసగా దాడి జరగటము తో అతని పని ఉక్కిరి బిక్కిరైనది. అధి కారులు విచారణ జరపక తప్పలేదు.నన్ను ఎంతో మంది చేత ప్రలోభాలు పెట్టి బెదిరించినా లొంగే రకము కాదని తెలిసి అతనేమీ చేయలేకపోయాడు.ఈదుర్గేశ్వరగాడు తగాదాకైనా తన్ను లాటకైనా సై అంటే సై అనే రకమని వచ్చినవాల్లు అతనికి చెప్పారు. ఎవరన్నా అతనిని సమర్ధిస్తున్నారని తెలిస్తే వార్త వ్రాయటము,ఉత్తరాలు పంపటము వరుసగా జరిగాయి. ఇక అతని సస్పెండుకు రంగమసిద్దమయినది.
ఒక రోజు అనుకోకుండా వినుకొండ శివయ్య స్తూపము సెంటర్ లో ఎదురు పడ్డాము.అప్పటికే వానికి పిచ్చెక్కినట్లయినది స్థితి.సహనం కోల్పోయి అదివాని సొంతవూరు అన్న దొమ్మ పొగరు తో నన్ను నిలేసి తగాదా వేసుకున్నాడు. నీయబ్బసొమ్మేమన్నా తిన్నానా అని వాడు.నీ యమ్మమొగుడు సొమ్మనుకున్నవురా?అని నేను .మాటలు తూలాయి.ఇంకా దిగజారాయి మాటలు.చేతులు కలిసాయి అప్పట్లో తన్నులాటలన్నా ,తగాదాలన్నా ఉత్సాహము,కాలేజీ వయస్సుకదా! ఇంతలో అక్కడే వున్న సి .పి.ఐ. ఆఫీసునుంచి వచ్చిన నాయకులు నాకుతెలిసినవారు ఇద్దరిని వారించి ఆఫీసులోకి తీసుకెళ్లారు.నన్ను ఏడిపిస్తున్నాడండి, అని అతను వాళ్లముందు ఏడ్చాడు.నేను కూడా వివరించాను అసలు సంగతి.వాల్లేదో సర్ది పంపించారు.ఇద్దరినీ

ఇక ఇంటి కొచ్చాను.మనసులో కల్లోలము.వాడుతూలిన మాటలే జ్ఞాపకం వస్తున్నాయి.దానితో కోపము వాన్నే మీ చేయలెకపోయాననే బాధ.ఇప్పటికిప్పుడు వెళ్ళి తన్నాలి అనే కసి. ఇలా నామనసు కల్లోలమయినది. సాయంత్రం అన్నం కూడా సహించలేదు. అలా ఆలో చిస్తూ పనుకున్నాను.మానాన్నగారు వాళ్లకు చెప్పలేదు. ఏమిటిది?నాకెందుకీ అవమానము? నేనే మన్నా స్వలాభము కోసము చేశనా? భగవంతుని కొరకేకదా? మరి నాకెందు కీ అవమానము? మనసు లోంచి బాధ తన్నుకు వస్తున్నది నిదరలేదు. అలా బాధ పడుతూ ఉండగా అర్ధరాత్రి దాటిన తరువాత .ఇంతబాధ పడుతున్నావే? ఇదేవిధముగా నువ్వు మాటలు తూలినప్పుడు ఇతరులెవరికీ బాధ కలగలేదా? అనే మాటలు వినిపించాయి మనసులోంచి.అరే!ఎవరంటున్నదని ? పరిశీలించుకుంటే అమ్మ జగన్మాత నవ్వుతూ ప్రశ్నిస్తున్నట్లు కళ్ళు మూస్తే కనపడుతున్నది. అవునా! ఆలోచన వెనక్కు వెళ్ళింది.......గతం లోకి..

నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడే నాస్నేహితుడు శ్రీరామనేని హనుమంత రావు చదువు మానుకుని చిన్న పాఠశాల ప్రారంభించాడు నూజండ్లలో అప్పటికే అక్కడ ఒక రాజకీయ నాయకుని అండదండతో ఎక్కడనుంచో వచ్చిన ఒకతను పాఠశాల నడుపుకుంటున్నాడు.వీళ్ళిద్దరికీ పోటీ. మావాడి పాఠశాలకొచ్చిన పిల్లలను కూడా ఇళ్లవెంట తిరిగి కొద్దిమంది అతని అనుకూలమయిన వారి చేత చెప్పించి తిరిగి తన పాఠశాలకు తీసుకెళుతున్నాడు.అంతే కాక మావాడి గురించి వాడికేమొచ్చు చదువని ఎగతాళి గా మాట్లాడటము. చివరకు కమ్మవాళ్ళు ఎక్కువగా వున్న ఆగ్రామములో మావాడికి వాళ్లవర్గం పిల్లలను కూడా నిలుపుకోవటము కష్టమయి పోయినది. వాడు నాదగ్గరకొచ్చి బాధపదుతున్నాడు. ఇలా మంచి పద్దతి కాదు ఎవరి కొచ్చేవాళ్ళు వాళ్ల కొస్తారు మరలా తీసుకెళ్లటము మంచిపద్దతి గాదని ఒకసారి అతనికి నూజండ్లలో సౌమ్యముగా చెప్పాను.కాని అతను లెక్కచేయలేదు. పరిస్థితి మారలేదు మావాడి ఏడుపాగలేదు. ఒకసారి వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ లో దొరికాడు నాకు అతను.వళ్ళు కొవ్వెక్కిన వయసది.ఆవేశము పొగరుబోతుతనము నిండివున్న నాకు యుక్తా యుక్తాలు తెలియలేదు. ఏరా! మావూర్లకొచ్చి మావాడి కేఎదురు నిలబడి వాడిని వేధిస్తావా?నాకొ... ఇక్కడతన్నితే దిక్కెవరా నీకు? అంటూ వాని చొక్క పట్టుకుని కొట్టబోయాను .పాపం అతను గజగజా వణుకుతూ..లేదండి. నేను మరలా మీవాడి కొచ్చిన పిల్లలను తీసుకెళ్లనండి అని ..బతిమిలాడాడు.నువ్వనుకుంటూన్నావేమో నేను నూజండ్లలో తన్నినా దిక్కులేదు నీకు జాగ్రత్త అని బెదిరించి పంపాను. [చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను].
ఇప్పుడు చెప్పు అకారణముగా అతనిని నువ్వు కొట్టబోతే,ధూషించితే అతను ఎంత బాధపడి వుంటాడు? నాకు ఇతనికి వ్యక్తిగతముగా ఎలాంటి శతృత్వములేదు.ఐనా నన్నెందు కిలా ఇతను అవమాన పరచాడని అతను ఎంతవేదన పొందాడో తెలుసా? ఆవేదనే నీకిప్పుడు అనుభవమయినది ,అని అమ్మవారు చెబుతున్నారని అనిపించినది.

అంతే! మనస్సు లో బాధ ఎగిరి పోయింది.అమ్మా నన్ను చేసిన పాపాన్నుంచి విముక్తము చెశావా? అని నమస్కరించుకుని ప్రశాంతముగా నిదురపోయాను.

రెండవది
------
ఒకసారి గుడి గోడదగ్గర ఒక కుక్క గుంతలు చేసి పనుకున్నది.దానిని తోలితే పోయేదానికి ఒకరాయి తీసుకుని విసిరాను. ఆరాయి కాలుకు తగిలి విరిగినదేమో పాపమా కుక్క కుయ్యో కుయ్యో మంటూ ఏడుస్తూ దూరంగా పరిగెత్తి చాలాసేపు అరుస్తూవున్నది .మనసు చివుక్కు మన్నది.
ఇది జరిగిన నెలకే వినుకొండ నుండి వస్తున్న నాకు నాభార్యకు యాక్సిడేంట్లోదెబ్బలు తగిలాయి. నా ఎడమకాలు మాత్రమే మెలిక పడి ఫటక్ అన్న శబ్దమ్ వచ్చినది. పాదములో ఎముకలు చిట్లాయి .భరించరాని వేదన, వెనుక వస్తున్న బస్ ఆపి మమ్మల్ని ఎక్కించుకుని ఇంటికి తెచ్చారు. నూజండ్లలో వున్న నాటువైద్యుడు కట్లు కట్తాడు[ఈయన ఎముకలవైఅద్యం లో ఆరి తేరినవాడు] .రాత్రల్లా బాధలోవున్ననాకు ,తళుక్కున మనసులో మెరుపు మెరిసినట్లయి., ఏరా! కుక్కను అకారణముగా హింసించినప్పుడు తెలియలేదా ఈబాధ ? అని అమ్మవారు అన్నట్లనిపించింది.చేతులెత్తి నమస్కరించాను అమ్మా! నీవు నేర్పు తున్న పాఠాలు నాకెప్పుడూ గుర్తుండేలా చేయి అని. తరువాత నెలరోజులు ఆబాధను ఆనందము గా అనుభవించాను. నాఖర్మ ఫలితము ధ్వంసమవుతున్నందుకు.

*******************************************************************************************
ఇప్పుడు చెప్పండి. ఏకారణము లేకుండానే మనకు ఇతరుల మాటలతో బాధ కలుగుతుందా? కలుగదు ఇవి మనఖర్మ ఫలితాలు.మనమెప్పుడో సిద్దంచెసి పెట్టుకున్న దోషఫలితాలు.ఇప్పుడు అనుభవానికొస్తున్నాయి.వాటి పరిపక్వసమయము వచ్చినది కనుక. కనుక వున్నవాటిని మోయలేక ఛస్తుంటే మరలా ఇతరులను ధూషించటము ద్వార మరింత పాపాన్ని మూటగట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకోవటమెందుకు. మన పొరపాట్లవల్ల ఒక తప్పుదొరలితే వాటి ని నివారించుకోవటము పోయి మాటల తూటాలు పేల్చుకుని .ఇతరులను బాధపెట్టి మనం బాధపడాలా? మనకు నచ్చని వారిగురించి వాల్లతోనే డైరక్ట్ గా మాట్లాడక వేరేచోట కామెంట్లు చేయటము ఒకరి పొరపాటైతే. అక్కా అన్న సంబోధిస్తూనే అసభ్యంగా వ్రాయటము ఎంత పాపము?.

జరిగిన పొరపాటు జరిగినది. ఇరువైపులా వున్నవాళ్ళు మేధావులేగాని మామూలు వారు కాదే?.కనుక మనమేధస్సునుపయోగించి లోకానికి మేలు జరిగేలా వ్యవహరిద్దాము.ఇది నామనవి బ్లాగర్ లందరికీ. తప్పు చేయనివారు ఎవరూవుండరు.దానిని దిద్దుకునే సామర్ధ్యం ఉండి కూడా ఉపయోగించుకోకుంటే మానవులుగా మనకు గుర్తింపేమున్నది. అటు జ్యోతి గారు ,సుజాత ,అరుణగార్లు నాకక్క చెల్లెల్లే.ఇటు కాగడాశర్మగారూ,ధూములుధాములు చెసే వాళ్ళు నాకన్నదమ్ములే ఏతావాతా జరుగుతున్న నష్టము మనకుటుంబానికే .దయచేసి ప్రేమతో గెలవండి.ఎదుటివారిని. అబ్బా! నీకనుభవమైతే ఏమి చేస్తావని ప్రశ్నించకండి. నన్ను తిడుతూ వ్రాసిన వ్యాఖ్యలను కూడా ఇదే పద్దతి లో ఎదుర్కొన్నాను ,నా పాతటపాలలో. అలాగని నేనేమీ స్థితప్రజ్ఞుడినో,మహాత్మున్నోకాను.మామూలు మనిషిని మీకంటే చదువులో జ్ఞానములోకూడాచిన్నవాడిని.దయచేసి వివాదానికి స్వస్తి పలుకుతూ మెయిల్ లద్వారా ఒకరికొకరు మాట్లాడుకుని ప్రశాంత స్థితికి రండి. మీకు నచ్చితే నామనవి. లేదా నన్ను తిట్టడమే మీకు సంతృప్తి నిస్తే అలాగేకానివ్వండి. నా దోషాలను పంచుకుని నన్ను విముక్తున్ని చేస్తున్న ఆత్మీయులుగానే భావిస్తాను మిమ్మల్ని.

తమసోమా జ్యోతిర్గమయ
.....................

12 వ్యాఖ్యలు:

యడవల్లి శర్మ February 10, 2009 at 8:44 AM  
This comment has been removed by the author.
యడవల్లి శర్మ February 10, 2009 at 8:46 AM  

శభాష్..దుర్గేశ్వరా..

చక్కగా చెప్పారు..

http://www.yvs-yvs.blogspot.com

కొత్త పాళీ February 10, 2009 at 9:15 AM  

మీ అనుభవాల్ని చాలా బాగా చెప్పారు. నాకు తమాషాగా అనిపించిన విషయం ఒక పురాతన దేవాలయపు ఈవో తన మీద దాడి జరిగితే సీపీఐ వాళ్ళ దగ్గర ఫిర్యాదు చేసుకోడం!

asha February 10, 2009 at 10:21 AM  

మన బ్లాగ్లోకానికి అత్యంత అవసరమైన సందేశాన్ని ఇచ్చారు.
కృతజ్ఞతలు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం February 10, 2009 at 10:48 AM  

దుర్గేశ్వరగారూ ! మీరు నేర్చుకున్నట్లే అందరూ నేర్చుకుంటే ఎంత బావుంటుంది. కానీ అదేం ఖర్మో, ఈ దేశంలో "అమ్మా ! నాయనా ! బాబూ" అంటే వినేవాడు ఎవడూ లేడు. మనం అడక్కపోతే రూల్సు ఉల్లంఘిస్తారు. అడిగితే "అడగడానికి నువ్వెవడివి ?" అంటూ రూల్సు మాట్లాడతారు. ఇక్కడ ఎక్కువమంది ప్రజాస్వామ్యానికి పనికిరారు. దాన్ని దుర్వినియోగమే చేస్తారు. వీరికి దండమే దశగుణం.

బ్లాగుల విషయానికొస్తే అందరమూ మంచి ఉద్దేశంతోనే బ్లాగావరణంలో ప్రవేశించాం. కానీ మంచివాళ్ళని మంచివాళ్ళుగా బతకనివ్వరు గదా !

Anonymous February 10, 2009 at 12:39 PM  

EXCELLENT SIR ..

"తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చూడటం లేదు" అని ఆనంద పడుతూ "త్యాగం చేస్తున్నప్పుడు ఎవరు గుర్తించడం లేదు" అని బాద పడకూడదు .. భగవంతుడు అన్ని చూస్తున్నాడు అని అనుకుంటూ వుంటాను. మీ అనుభవాలు నేను అనుకుంటున్న దానికి కరెక్ట్ గా match అయినాయి అనిపించింది.

thank you for sharing ..

జ్ఞ్జానం(ఏది తప్పు .. ఏది ఒప్పు) అంటే తెలుసుకోవటానికి ఇన్ని నాటకాలూ ఆడుతున్న భగవంతుడికి కూడా థాంక్స్ ..

Subba February 10, 2009 at 5:32 PM  

Dear Sir,

I used to read many Telugu and English blogs. Your blog made me my day today. Really, చాల బాగా చెప్పారండి. మీరు మీ బాధకు కారణాలు కనుక్కోన్నారు. కాని కనుక్కోలేని , కనుక్కోవాలని అనుకోని వాళ్ళతో ప్రాబ్లం . ఎక్కడ కూడా సమస్య ఏమంటే, నాకు తెలిసిందే నిజం నాకు తెల్సిందే న్యాయం అని వాదిస్తారు. ఈ మధ్య వేరే వాళ్ళు చేసిన తప్పుకు నేను ఎంత మానసిక వేదన అనుభవించానో. అపుడు కూడా మీ లాగానే అలోచించి మనసును తేలిక చేసుకొన్నాను.

cbrao February 10, 2009 at 7:14 PM  

మీరు బ్లాగరులలో మహాత్మా గాంధీలాంటి వారు. మిమ్ములను బ్లాగ్ గాంధీగా పిలువవచ్చు.

ప్రపుల్ల చంద్ర February 10, 2009 at 7:18 PM  

చాలా బాగా చెప్పారు. అందరూ ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే బాగుంటుంది.

durgeswara February 11, 2009 at 5:47 AM  

శర్మగారూ ధన్యవాదములు

కొత్తపాళీ గారూ మీకు తెలియనిదేమున్నది. అవినీతిపరుడు ఎప్పుడూ భయంతో వుంటాడు కనుక ఏదో ఒక అండ చూసుకుంటుంటాడు.నోరున్న వాళ్ళుకదా అని సిపిఐ లాంటివాళ్లకు చందాలిచ్చి వాళ్ల ప్రాపకం సంపాదించుకుంటుంటారు.

భవానీ గారూ ఇది నా అనుభవమమ్మా.సందేశం ఇచ్చేంతవాడిని కాను.ధన్యవాదములు మీ అభిమానానికి

తాడెపల్లి గారూ మీరన్నది నిజమే కావచ్చు,సృతి మించిన స్వేచ్చ దాని విలువను తెలియనీయకుండాచేస్తుంది.కానీ ప్రేమ శక్తి ముందు ఏదయినా తలవంచాల్సినదే.అదే చెబుతారు తమ జీవితము ద్వారా ఉదాహరణగా సాయి లాంటి మహాత్ములు,సద్గురువులు.

అజ్ఞాతగారూ,సుబ్బాగారూ
నా అనుభవాలు మీ నమ్మకాన్ని ధృఢపరచినందుకు,నేను ధన్యుడనయ్యాను.రంగులన్నీ లేకుంటే చిత్రానికి శోభరాదుకదా?ఆజగన్నాటక సూత్రధారి లీలలను మనము గమనిస్తే చాలు.

సిబిరావు గారూ మీరు పెద్దలు .ఎంతమాటన్నారు.
అఖండ రామనామ ధ్యానతత్పరుడయి నమ్మిన సత్యాన్ని పాటించిన ఆమహాత్ముడెక్కడ? అరిషడ్వర్గాల వలయములో చిక్కుకుని బయటపడలేక గిజగిజా కొట్టుకుంటున్న నేనెక్కడ.పోలికకైనా అర్హతకావాలి.నక్కకు నాగలోకానికి ముడిపెట్టటము హాస్యానికైనా తగదు.అటువంటి మహాత్ముల పాదధూళిలో రేణువును నేను.

ప్రపుల్ల చంద్రగారు మీకు నాధన్యవాదములు.

Anonymous February 11, 2009 at 8:03 AM  

శభాష్ దుర్గెశ్వరా...శభాష్
బ్లాగర్లకు సరి అయిన సందేశం గా భావిస్తున్నాం. అనవసరంగా యెవరిమీద నోరు పారేసుకోకూడదు

మనోహర్ చెనికల February 12, 2009 at 5:53 AM  

good post

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP