అనాచారాలకుకారణం
>> Wednesday, September 3, 2008
ఇపుడు ప్రపంచమందంతటా చోటు చేసికొన్న అనాచారత్వానికి భ్రష్టాచారానికి కారణమేమిటి అనేది మన కంతుపట్టక వేధించే చిక్కు ప్రశ్న. మనిషి కర్మలో చెడు స్ధావరమేర్పరచుకోగానే ఒడిదుడుకుల జీవితం ప్రారంభమవుతుంది. క్రమంగా మన పూర్వజన్మ సంచితమైన పుణ్యం క్షీణిస్తూ వస్తుంది. అప్పటినుండే మనము కోరుకునే వస్తుప్రాప్తి కలగకుండా పోతుంది. అందువలననే మనవాళ్ళు దురదృష్టవంతుణ్ణి బాగుచేసే వాళ్ళు లేరు. అదృష్టవంతున్ని చెడగొట్టనూలేరు అన్నారు. ఒకసారొకతను తన మిత్రునితో ఒక్కనిముషం ముందుగా మా అమ్మగారికి ఆక్సిజన్ ఎక్కిస్తే బ్రతికేది అన్నాడట. ఆమెకు ప్రాణవాయువు సమయానికి లభించకుండా ఉండటమే విధివిలాసమని విన్న మిత్రుడాతడిని ఓదార్చి వెళ్ళి పోయాడట. కానీ విషయమేమిటంటే పుణ్యమెపుడు క్షీణిస్తుందో అపుడే భాగ్య రేఖ నామరూపాలులేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఆలాగని పురుషార్ధం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోమనికాదు. ప్రారబ్ద కర్మ పురుషార్ధ మార్గంలో అడ్డంకులనూ వేస్తుంది. సహాయాన్నీ యిస్తుంది. కావున మన కర్మలలో శ్రేష్ఠత్వాన్ని తెచ్చుకోవటం తప్పనిసరి. మనలోని లోపాలే అనాచారానికి కారణం. లాపానికి, లోటుపాట్లకు కారణం కర్మ, భ్రష్టత్వం. ఇవి రెండూ నామరూపాలులేకుండా నశించాలనుకుంటే జ్ఞానయోగాల ననుసరించక తప్పదు. శరీర పోషణకు ఆహారం తప్పనిసరి అయినట్లు మానవుడు ఉత్తమోత్తముడగుటకు జ్ఞానయోగాలు అత్యావశ్యకములవుతాయి.




0 వ్యాఖ్యలు:
Post a Comment