పూర్ణం పూర్ణస్య: పూర్ణమిదం (కదలివచ్చిన కనకదుర్గ..చివరిభాగం)
>> Monday, July 7, 2008
{తరువాయిభాగం]
ఇక మిగతా సరంజామా గూడా సిద్దమవుతున్నది. రామలింగేస్వర స్వామి లింగము,నరసరావుపేటలోను, నవగ్రహాలు, అయ్యప్ప,కుమారస్వామి, లక్ష్మి,సరస్వతి, గణపతి విగ్రహాలు పురుషోత్తమ పట్నములో తయారయ్యాయి. శ్రీ పెంచలరెడ్డిగారు [సి.ఇ.ఓ.] గారు గణపతి, శ్రీ యుగంధర్ కుమార్ దంపతులు శివ, ప్రతిష్ఠ తీగలరవీంద్రబాబు, సి.ఐ. హనుమంతుని ప్రతిష్ట లకు ముందుకు వచ్చారు. నెల్లూరు వాసులు వెంకటేస్వర రెడ్డిగారుఅన్నదానమునకు
బియ్యము ఇప్పించారు అనూహ్యముగా ఎక్కడెక్కడినుండో కావలసినవి కొరతలేకుండా వచ్చి పడుతున్నాయి. వినుకొండలో స్వాతి డ్రసెస్ అధినేత సూరి, అన్నయ్య మాకు చెప్పలేదేమిటి అని అడిగిమరీ నాతమ్ముడు క్రిష్ణతో కలసి సరుకులూ వెచ్చాలు,పోగుచేసారు, వినుకొండ డాల్ మిల్స్ వాళ్ళు కందిపప్పు అందించారు. వీళ్ళెవరినీ నేను ప్రత్యక్షముగా కలవక పోయినా అమ్మ కు వారిపైగల ప్రేమకు నిదర్సన మేమోగాని అందరూ తమయింటిలో పెళ్ళిలాగా ఈకార్యక్రమానికి తలా ఒకవైపునుంచి సహకార మందించారు. ఈ లోపల మరొక పరీక్ష ,శ్రీ లలిత్ మనోహర్ గారి సెక్రటరీ ఫోన్ చేసి సార్ అమెరికా వెళుతున్నారు ,మీకార్యక్రమము మరొకసారి ఏర్పాటు చేసుకోండి, లేదా ప్రత్యామ్నాయము చూసుకోండి అని చెప్పారు. ఇదేమిటి ఇందులో ప్రధానమయిన ఖర్చు భరిస్తారనుకున్న వారు ఇలా? నాకు తల తిరుగుతున్నది. ఒకవైపునుంచి అడగకుండానే కొన్ని వస్తుంటే సంతోషించాలా ,అనుకున్నవి అందకపోతే బాధపడాలా? మళ్ళీ అమ్మలీల మొదలయినది. నెల్లూరు జడ్.పి. చైర్మన్, శ్రీ గోవర్ధన రెడ్డిగారు వేంకటేశ్వర స్వామివారికార్యక్రమము కనుక ముందుకువచ్చి ఇచ్చారు. ఎక్కడి నెల్లూరు ఎక్కడి రవ్వవరం. డబ్బున్నా ఇలా భగవంతుని కోసం ఖర్చుపెట్టగల వారు ఎందరున్నారు? అందులో తనకు తెలియని ప్రాంతములో . నేనుఖచ్చితముగా చెప్పగలను ,ఇదిస్వామివారిలీల అని. తనవాళ్ళు ఎక్కడున్నా తనసేవకు పిలిపించుకుని మరీ చేపించుకుంటాడు,ఆ కొండలరాయడు. గంగినేని బాబు , నెల్లూరునుండి చక్రపాణి, దారామల్లి ఖార్జునరావు,చండ్రసాంబశివరావు మరెందరో వారందరికీ పేర్లువ్రాయటానికి ఇదివేదికకాదుకనుక కృత జ్ఞ తలు తెలుపుకుంటున్నాను తలా ఒకచేయి అందించారు. ఇంతపెద్ద కార్యక్రమము కనుక పెద్దలు శ్రీఅన్నదానం చిదంబర శాస్త్రిగారిని వచ్చి ఈకార్యక్రమము పర్యవేక్షించవలసినదిగా కోరాను. అయితే చీరాలలో ధర్మసమ్మేళనము వున్నది కనుక వారురాలేకపోతున్నానని కానీతన మనస్సంతా అక్కడేవుంటుందని అన్నారు. నాదగ్గరున్న మొత్తాలను పోగుచేసుకుని సిద్దపడ్డాను ఒక వంక నాతమ్ముళ్ళిద్దరూ నిద్రాహారాలు మాని పరుగులుపెడుతున్నారు. వూర్లోచూస్తే ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. కూలీలుదొరకక రైతులు తీవ్రమైనఇబ్బందులతోవున్నారు. నీవు ఈకార్యక్రమన్ని వేసవిలో పెడితే అందరమూ నిలబడేవాళ్ళము,ఇలా చేసావేమిటి అని నిస్ఠూరాలాడారు కొందరు. నేనేమిచేయగలను అమ్మకు కూలీవాడిని ,ఆమె ఎన్నుకున్నపని ఆమె ఇష్టమువచ్చినప్పుడుమాత్రమే చేయాల్సివుంది ఇవన్నీ నేననుకున్నానా? అని సర్ధిచెప్పాను . ఇక కార్యక్రమాలకు అవసరమగు యజ్ఞ శాల నిర్మాణము నకు ఎవరినిపిలిచునా రావటము లేదు,పనివత్తిడులు అలావున్నాయి. ఎలాచేద్దామురా అన్నాను ,అంతే మాపిల్లలు బాల హనుమంతులై విజృంభించారు. స్తంభాలు బాతటం వాసాలు కట్టటం, తాటాకు కప్పే మనిషికి అందివ్వటం, సాయంత్రానికల్లా రెడీచేశరు. ఇక ఋ త్విక్కులు వచ్చారు. 26వతేదీ కార్యక్రమాలు మొదలుపెట్టారు, ముందుగా ఈకార్యక్రమానికి యజమాని ఎవరు? కంకణధారణ చెయ్యటానికి అని అడిగారు. నేను వెంటనే చూపించాను క్సేత్రపాలకుడైన హనుమంతుని, అడుగో ఆయనే ఈకార్యక్రమం అంతా చేపిస్తున్నవాడు,కనుక ఆయనకే కంకణధారణ జరపండి అని చెప్పారు. దానితోవారు వుత్సాహంగా ఈ కార్యక్రమమే చిత్రముగానున్నది అనుకుని,స్వామువారి మూర్తికే కంకణధారణ జరిపి వస్త్రాలు సమర్పించారు. నాబ్లాగులో మీరుచూస్తున్న ఆంజనేయస్వామి ఆయనే. ఇక కార్యక్రమానికొచ్చిన ప్రతివొక్కరిలో వుత్సాహం కట్టలుతెంచుకున్నది. పనుల సీజన్ అని చెప్పాను కదా .జలాధివాసానికి మూర్తులను తీసుకెళ్ళటానికి కూడా జనము సమయానికి రాలేకపోతే ,పెద్దవాళ్ళమే ఎత్తటానికి గిజగిజ లాడే బరువున్న ఆ విగ్రహాలను పిల్లలే జై శ్రీరాం అంటూ దగ్గరలోవున్న సాగర్ కెనాల్ వద్దకు మోసుకెళుతుంటే,జొన్నబెండ్లులాగా తేలికకా వెళుతున్న ఆమూర్తులను,ఆపిల్లలను చూసి ఋత్విక్కులు ముక్కున వేలు వేసుకున్నారు. మేము ఇన్ని కార్యక్రమాలు చేశాము గానీ ,ఈపిల్లలేమిటి ?,ఇంత కార్యక్రమాన్ని అలవోకగా చేసెయ్యడమేమిటి, ? నిజంగా ఆంజనేయుడు వీరిలో దూరి చేస్తున్నట్లేవుంది. అని ఆశ్చర్యపోయారు. చీరాలలో కార్యక్రమముఅనూహ్యంగావాయిదాపడినదంటూ,చిదంబర శాస్త్రిగారు రెండవరోజు వచ్చారు. అమ్మ సంకల్పం మరి. ఇక పుట్తపర్తి సాయి భక్తుడయిన మా బంధువుల అబ్బాయి రాయలు, మా మేనత్తకొడుకు శ్రీను, కార్యక్రమానికి ముందుకువచ్చినసూరి మాతమ్ముళ్ళు క్రిష్ణ ,శ్రీను తదితరులు నిద్ర అంటే తెలియనట్లు ఈమూడురోజులూ యంత్రాలులాగాపనిచేశారు. ప్రతిష్ఠ రోజు 70 మంది వంటవాళ్ళ ట్రూపు అన్నదానంకార్యక్రమాలు చూస్తున్నది. ఆయేర్పాట్లు ,తెఁట్లు చూస్తున్న చిదంబర శాస్త్రిగారు ఈ పల్లెటూరిలో ఎంతమంది వస్తారు? ఎందుకింత పెద్ద ఎత్తున ఏర్పాట్లు< ? అని అనుకున్నారట. ఆయన నాతో తరువాత చెప్పారు. ఇక 28 వతేదీ pratishThaku ఎక్కడెక్కడినుండో జనం తండోపతండాలుగా రాసాగారు. విపరీతమయిన జనం రాకతో ఆపరిసరాలన్నీ కిటకిటలాడాయి. అంతమందికి కూడా ఏ ఇబ్బందీ కలగ కుండా పిల్లలు అన్నపానాదులు,ఏర్పాట్లు చేస్తున్న తీరుచూసి జనం వీళ్ళు పిల్లలు కాదు నాయనా పిడుగులు అని అంటున్నారు. ఎ క్కడా చిన్న పొరపాటు జరగకుండా, అత్యద్భుతమ గా ,ఆదివ్య ముహూర్తానికి, గోవిందా..గోవిందా, ఓమ్ కాళిమాతాదుర్గకూ జై ,హరహర మహాదేవశ్ంభో అనే భక్తుల నామస్మరణ లతో పరిసరాలు మార్మోగుతుండగా, వేదఘోషలు మిన్నుమిట్టుతుండగా మంగళవాద్యాలు మనసును వురకలెత్తిస్తుండగా ఆదివ్యశక్తి భక్తజన రక్షణార్ధమై దిగివచ్చి ఆలయములో స్తిరపడినది. ఆసమయములో అమ్మ ఎన్నిలీలలుగా ఈకార్యక్రమాన్ని నడిపినదో మైకులో చెబుతుంటే భక్తులు కన్నీరు కార్చారు ఆనందముతో, ఇక కార్యక్రమానంతరం దర్శనమునకు ఋత్విక్కులు అనుమతిచ్చారు. మొదటగా నన్ను పిలచి అద్దములో అమ్మను చూడమని ఇచ్చారు, అప్పుడునాకు పిల్లలు పుడితే ఆలయములో శాంతులుచేసి వాళ్ళముఖము చూడమంటారుకదా అలాంటిభావన కలిగినది . చూద్దును కదా అక్కడ మాచ్చిన్నారి దివ్యప్రభలతో వెలుగొందుతూ... జన్మ ధన్యమయిపోయినది. అమ్మా!.. నీవుజగత్తుకుతల్లివా? ఇప్పుడు నాకు కూతురువయ్యావా? నామనసు ఈలోకములోలేదు ..మాటలు రావటములేదు.. కళ్ళవెంటధారా పాతముగా నీళ్ళు. ఇక నిభాళించుకొని శ్రీవారిని చూద్దునుకదా.. అహో ఏమిటా .. సొగసు.ముసిముసినవ్వుల మోహనరూపం . చూస్తున్నవారందరికీ స్వామివారి మోములో చిరునవ్వులు స్పష్టంగా కనపడుతుండటముతో ఆనందముతో వెర్రెక్కి పోతున్నారు. గోవిందా గోవిందా అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఇటుచూస్తే . రామలింగేశ్వరులు ప్రశాంతగంభీర సాగర సదృశములా... బయట కలియుగములో భక్తజన రక్షణార్ధము దీక్షాధారులయిన పార్వతీ నందనుడు,గణపతి, శివపుత్రుడు కార్తికేయుడు,అత్రిపుత్రుడు, దత్తాత్రేయస్వామి , హరిహరసుతుడు అయ్యప్ప, వాయునందనుడు హనుమంతుడు. , నవగ్రహదేవతలు చిరునవ్వుల నొలకబోస్తూ నిలుచున్నారు. శాంతిమంత్రాలు మనస్సులకు ప్రశాంతిని కల్గించగా దర్శనమునకు బారులుతీరిన జనం సాయంత్రమువరకు సాగుతానే వున్నారు. అన్నదానం జరుగుతూనే వున్నది సాయంత్రము చూస్తే ఇంకా రాసులుగా అన్నం కూరలు మిగిలాయి వచ్చిన జనానికి వండినవి చాలవేమోనని వంటవాళ్ళు భయపడితే.. ఇలా రాసులు రాసులు మిగిలి వుండటము ఆశ్చర్యము. ఆరాత్రల్లా మేము,పిల్లలు కలసి. అన్నమురాసులను, దగ్గరలోని సాగర్ కెనాల్ కు మోసుకెళ్ళి నీటిలో కలుపుతూనే వున్నాము. జలచరాల ఆకలి సహితము తీర్చాలని అమ్మ అనుగ్రహము కాబోలు. ఎంతప్రతిష్ఠ జరిగినదో అంత అన్నదానము జరిగినది,చాలా గొప్పగా జరిగినది అమ్మ సంకల్పము అని శాస్త్రిగారు వెళ్ళేటప్పుడు చెప్పారు. అంతా కలలో లాగా జరిగినది. ఇప్పటికీ ఈఅల్పుడు అంతకార్యక్రమము అన్నీ సమకూర్చుకుని ఎలా జరిగినదో అర్ధముకాక తికమక పడుతూనే అంతా అమ్మ అనుగ్రహమని సమాధానము చెప్పుకుంటున్నాడు. అలాగే 16రోజుల పండుగ సందర్భముగా కళ్యానోత్సవములు,40రోజులకు యజ్ఞపూర్ణాహుతి వైభవముగా జరిగాయి. తరువాత వచ్చిన వేసవిలో మిగిలిన సరుకులతో ఆంజనేయదీక్షతీసుకున్న భక్తులకు అన్నదానము 21రోజులపాటుసాగినది. ఈసంవత్సరము నవరాత్రులు,కార్తీక మాసములో 40రోజులు అయ్యప్పదీక్షలు తీసుకున్నవారికి అన్నదానము వంటికార్యక్రమాలు జరిగాయి.భక్తుల కొరకు వారి గోత్రనామాలతో పూజలు జరుపబడుతున్నాయి. శఠారిలో డబ్బులు వేసే పద్దతికి ఇక్కడ స్వస్తి పలికాము, భక్తులెవరూ జేబులోంచి డబ్బులుతీసి పళ్ళెములో వేయవలసిన అవసరము లేదు. సమర్పించాలని కోరిక వున్నవాళ్ళు బయటనున్న హుండీలో వేయవచ్చు .ఆలయములో మాత్రము ప్రశాంతమంస్కులయి దర్శనము చేసుకోవాలి .స్వయముగా అర్చన అభిశేకము చేసుకోవాలను కునేవారిచేత అర్చామూర్తులకు, పూజలు చేపిస్తారు. యజ్ఞము కూడా స్వయముగా యజమానుల చేత జరిపించబడుతున్నది. వచ్చి సేవించిన వాళ్ళెందరో అయ్యా ఇక్కడకు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిన తరువాత మా సమస్యలు తీరిపోయాయి,మాకిలా మేలు కలిగినది అని, చెబుతూ వుంటారు. వాళ్ళందరికీ మేము ఒక్కవిన్నపము చేస్తుంటాము. మీకు మేలుజరిగినదికదా! మరికృతజ్ఞతగా మీరు మీకున్న 24 గంటల సమయము లో 23 గంటలు మీకోసము వాడుకుని ఒక్కగంట భగవంతుని,పూజ,ధార్మిక గ్రంధాల పఠనము, ధార్మిక కార్యక్రమాలకు కేటాయించ0డి అని. ...చేరీకొలువరో ఈతడు శ్రీదేవుడూ. . ...
2 వ్యాఖ్యలు:
ఇంతటి మహత్తరకార్యం మీ ద్వారా జరిపించిన ఆ రామభక్త హనుమాన్ కు శతకోటి వందనములు.మీరు మాకు స్పూర్థిదాయకులు.
"కదలివచ్చిన కనకదుర్గ" - మీరు వ్రాసిన విషయాలు చదువుతుంటే ఒడలు పులకరిస్తున్నది. జై దుర్గా మాతా! శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. జై వీరాంజనేయ!
Post a Comment