కదలివచ్చిన కనకదుర్గ ...........(రెండవభాగము)
>> Friday, July 4, 2008
నాకు చిన్నతనమునుండి భగవత్ కార్యక్రమములతో పరిచయము అవటము వలన అదీ,భక్తిసాంప్రదాయము నకు చెందినవవటమువలన సంకీర్తన అన్నా, భగవంతుని కీర్తించే కీర్తనలన్నా చాలా ఇస్టము. మా నాన్నగారు నాకు చిన్నతనములోనే తిరుపతినుండి రాజాజీ మెచ్చిన భాగవతము అనే పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు అది చదవటము, ఆయన చెప్పే మహాభారత, రామాయణ గాధలను వినటము వలననో , పూర్వజన్మ సంస్కారమో తెలియదు. హరిభక్తి మనసులో నాటుకుపోయినది. భక్తుల గాథలు చదువుతుంటే ఒళ్ళు పులకరించి పోతుంది. భగవంతుని కథలు విన్నా, సినిమాలలో చూసినా మనసు భావలోకములోకి వెళ్ళిపోతుంది కళ్ళవెంట నీళ్ళు ఆగవు. మావూరి శివాలయములో నాచిన్నప్పుడు ఋత్విక్కులు చేసే రుద్ర పారాయణాన్ని విని మనసు వురకలు వేసేది. నేనుకూడా నామనసారా నీళ్ళుతెచ్చి స్వామిమీద పోసి స్నానము చేపించాలని మనసు తహతహ లాడేది. అయితే ఇవన్నీ ఆ జగన్మాత కు పలురూపాలుగా తప్ప అన్యము అనేభావన ఇప్పటివరకు నాకు కలగటములేదు. "పురుషేచ విష్ణుః క్రోధేచ కాళీ ,సమరేచ దుర్గ, భోగ్యేచ భవానీ" అమ్మ పలు రూపాలలో తనలీలా విలాసాలు సాగిస్తున్న దిగా కనపడుతుంటున్నది వుదాహరణకు మీ అమ్మగారికి ఎర్రరంగు చీర, పచ్చరంగుచీర, నీలిరంగుచీర ఇలా పలురంగుల చీరలున్నాయను కుందాము .వాటిలో ఏరంగు చీరలో చూసినా మీఅమ్మగారు మీకు ఒకేరకముగా ఎలా కనపడతారో ,నాకూ ఏరూపాన్ని చూసినా అమ్మ అలాగే భావనలోకొస్తున్నది. ఇక మన ఫేవరేట్ హీరో మనగురువుగారు ఆంజనేయ స్వామివారు. ఆయన నడచిన విధముగానే భక్తుడు భగవంతుని సేవచెయ్యలనేది నామనసుకు వచ్చిన బోధ. ఇలా క్రిష్ణరాసకేళిని అమ్మలీలతో సమన్వయంచేసుకునేవిద్య ఎలా నేర్పినదో నాకింకా ఆశ్చర్యమే. అయితే ఆధ్యాత్మిక మార్గములో ఎవరికి వారే అనుభవం తో తెలుసుకోవలసినదే .మరొకరు వివరిస్తే గందరగోళముగా వుంటుంది. వదిలేద్దాం.
ఇంటర్మీడియెట్ నుండి పీఠములో సేవా కార్యక్రమాలు నాకు లభించిన అదృష్టముగా భావిస్తూ నిర్వహించే వాడిని. నా చిన్నతనము నుంచీ ఏదో నామస్మరణ ప్రసాదము, హారతి కీర్తనలతో నిర్వహించటమె తప్ప శాస్త్రీయముగా పూజా విధి తెలియదు. ఒక సారి పుస్తకాల షాపులో గాయత్రీ పూజా విధి చూసికొని దానిప్రకారము పూజా కార్యక్రమాలు జరిపేవాడిని. మానాన్న గారు నాకు చిన్నప్పుడు చెప్పిన బాలాత్రిపురసుందరీ మంత్రాన్ని నిష్టగా జపించేవాడిని. ఖడ్గమాల ,తీక్షణముగా పఠించేవాడిని. ఇక అమ్మ శిక్షణప్రారంభమయినది. లలితా సహస్రనామ పారాయణము చేయమని ప్రేరణ మొదలయి అది,గీతా పారాయణము సాగినది. దసరా నవరాత్రులు వైభవముగా సాగుతున్నాయి. పెళ్ళిజరిగినతరువాత ,నాన్నగారు చనిపోయినతరువాత,మా గ్రా మము నకు 1 కి.మీ. దూరం లోవున్న మాపొలములో చిన్నపాకలు నిర్మించి హిందూ పబ్లిక్ స్కూల్ పేరుతో చిన్న స్కూలు ప్రారంభించాను. ఆస్కూలు ప్రారంభసమయములో అక్కడి స్థలాన్ని పరిశీలించిన మా పురోహితుడు ఒరే దుర్గా ! ఈస్థలము తులసి, దర్భలు పెరిగివున్నది . ఈస్థలము చాలా పవిత్రమయినది అని అన్నాడు. అలా స్కూలు జరుగుతున్న సమయములో వుపాద్యాయ పోష్టు రావటము అమ్మలీలగా యెలా జరిపినదో ముందుపోష్టులో తెలియజేశాను. ఈసమయములో అమ్మ దయవలన లక్ష్మీ దేవికి ఇష్టమయిన కనకధారా స్తవం , సరస్వతీ మాతకు ఇస్టమయిన శ్యామలా దండకం పారాయణ చేస్తుండటం అలవాటయినది. ఈసమయములో ఒకసారి ఋషిక్షేత్రములో జరిగిన గాయత్రీ హోమము, చూశాను. చేయాలనిపించింది అంతే భవానీ దీక్షలో వున్న నేను త్రిపురాంతకం వెళ్ళినప్పుడు అక్కడ గాయత్రీ పరివార్ సభ్యులతో పరిచయం యజ్ఞ క్రియను నేర్చుకోవడము అంతా అమ్మ చెప్పిన పాఠములా జరిగింది . అంతకు ముందే రుద్రసూక్తము సుస్వరముగా చేయటము వచ్చింది. ఎలా సాధ్యమయిందో అమ్మకే ఎరుక. అన్నిసాంప్రదాయాలకు చెందిన మహాత్ముల జీవితాలు, వారిబోధనలు, సాధనా పద్దతులన్నీ అనేక పుస్తకాల రూపేణా నాకు అందుబాటులోకి రావటము, నేనుచదవటము, ఇవన్నీ అమ్మ ఇచ్చిన శిక్షణలో భాగముగానే జరిగాయనుకుంటున్నాను. ఇక నేను మాగురువుగారిని రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నప్పుడు., ఆయన ఒరే నీ నోరుమూపించే మహానుభావుడు బృందావనములో వున్న శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారే వెళ్ళి ఆయనను ఆశ్రయించు. ఆయన కొంతకాలము గుంటూరులోని ఆశ్రమము నకు వస్తారు. వెళ్ళి కలవమని చెప్పారు. మూడుసంవత్సరాలు ప్రయత్నించిన తరువాత ఆమహా పురుషుని దర్శించే భాగ్యములభించింది. భారతభూమిలో వున్న మహాసాధకుడు ,సాక్షాత్తు రాసనాయకి శ్రీరాధాదేవి కృష్ణసహితముగా ఎవరితోనయితే నిత్యము ఆటలాడుకుంటుందో ఆ మహానుభావుని ఆశ్రయించటం ,నిజముగా నాపూర్వజన్మ సుకృతం. ఆ రాధాసఖీస్వరూపాన్ని గురించి మరొక పోస్ట్లో వ్రాస్తాను. మొదటిసారి చూడగానే వారు నన్ను ఆదరించి దగ్గరకు చేర్చుకున్నతీరు, పూర్వజన్మలో ఎప్పుడో ఆ మహానుభావుని సేవించిన ఫలితమాఅని అనిపించినది. ఆకరుణామూర్తి దయ నాపైవుండి . రాధా షడక్షరీ మంత్ర రాజాన్ని. నాచివివినగలిగింది చిన్నారి కృపకు నేనుపాత్రుడనయ్యాను. అయితే అమ్మ శిక్షణలో ఇన్నిమలుపులెందుకున్నాయో నాకిప్పుడు అర్ధమవుతున్నది. మూలప్రకృతి అయిన అమ్మ మొదట అయిదు రూపాలుగా వ్యక్తమయినదని దేవీ భాగవతము చెబుతున్నది. భగవంతుని హ్లాదినీశక్తి రాధ, క్రియాశక్తిదుర్గ, ఐ శ్వర్యశక్తి,లక్ష్మి , విద్యా జ్ఞానశక్తి సంకేతాలయిన సరస్వతి, సావిత్రి{గాయత్రి} గా వ్యక్తమయినదట. అందుకనే కాబోలు ఆతల్లి నాచేత తన విభూతులన్నింటినీ తెలుసుకునేలా చేసింది. ఏమిటో ఆతల్లి దయ. నేనా గొప్ప సాధనలు, యోగాలు జపాలు, తపాలు చేసిన వాడినికాను. నిజంచెప్పాలంటే పట్టుమని గంటసేపుకూడా ధ్యానములో కూర్చొని ఎరుగనే, మరేమిటీ ఆతల్లికి ఈఅపారప్రేమ? అమ్మా అని పిలిచిన ఒక్కపిలుపుకే కరిగిపోయి పతనమయ్యి జారి పడబోయినప్పుడల్లా చేయిపట్టుకు ని నడుపుతున్న ఆతల్లి ప్రేమ ను ఎలా వర్ణించాలి? ఒక హీనుడను,దీనుడనయిన నాపట్లే ఇంత కరుణ చూపే ఈతల్లి నిజమయిన సాధకుల నింకెంత గా కరుణిస్తుందో చెప్పనక్కరలేదు. ఇంత చిన్న సేవకే కరుణించి తన మందిర నిర్మాణము జరిపే లీలలో నాకుప్రధానపాత్రనిచ్చిన ఆలీల మరొక పోష్టులో వివరిస్తాను.
2 వ్యాఖ్యలు:
మీ భక్తీ, ఆధ్యాత్మిక ఆసక్తీ చాలా స్ఫూర్తిదాయకమైనవి.
ఆధ్యాత్మిక మార్గంలో ఎవరికివారు తెలుకోవలసిందే అన్న మీ మాట ఆక్షరసత్యం.ఆ అనుభవాన్ని ఎవరికి వారు అనుభవించాల్సిందే.నేను విష్ణుసహస్రనామాన్ని శ్రద్దగా పారాయణం చేయడం ప్రారంభించాక మీకుకలి గినఅనుభవాలు నేనుకూడా అనుభవించాను.
Post a Comment