నా రాముడు కలలో కూడా అబద్ధము ఆడడు...అంటే ఇదే కాబోలు
>> Thursday, March 27, 2025
రామదాసు సినిమాలో భక్తురాలు పాత్రధారి. సుజాత..నా రాముడు కలలో కూడా అబద్ధం ఆడడు అంటుంది. అప్పుడు మనసుకు సరిగా పట్టలేదు .కానీ ఇప్పుడు అర్థమవుతోంది..ఆయనే కాదు..ఆయనను నమ్మిన వారిని కూడా అబద్ధము ఆడే దోషము నుండి కాపాడుతాడు అని. గత సంవత్సరం హనుమత రక్షా యాగం లో భక్తులచే లిఖించబడ్డ రామ నామ ప్రతులు...అయోధ్య లో సమర్పించాలని సమర్పించాము .యజ్ఞం నిర్విఘ్నం గా ముగిసింది. తరువాత అందరికీ వెసులుబాటు సమయం చూసుకుని 40 మంది తో నవంబర్ లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము .నిర్వాహణ బాధ్యత లక్ష్మీనారాయణ రెడ్డి కి అప్పగించాము .తీరా బయలుదేరే సమయానికి ట్రైన్ రద్దయినది .అందరూ నిరుత్సాహ పడ్డారు. మరలా ఎంతో ప్రయాస తో మార్చి 20 న ప్రయాణానికి సిద్దంపడ్డాము .ఇక్కడ మరొక పెద్ద సంకటం. నాకు శెలవు కావాలని రెండు నెలల ముందుగానే అడుగుతున్నాను .తీరా ఈ సమయానికి naa సహ ఉపాధ్యాయుడు తప్పనిసరి స్థితిలో శెలవు తీసుకోవటం. ఇదే సమయానికి పరీక్షలు ప్రారంభం కావటం తో..నాకూ సెలవు అంటే ప్రత్యామ్నాయముగా ఎవరూ దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. పక్క స్కూళ్లలో కూడా అరకొరగా ఇబ్బంది పడుతుంటే ఎవరిని పంపాలని..మీరే అడిగి చూడండి అని అన్నారు. ఏమీ తోచలేదు. నన్ను నమ్మి అంతమంది వస్తుంటే..నాకుమాత్రం కుదరదు అంటే ఎలా? చివర వరకు చూసినా కుదరలేదు. ఇక తప్పక లక్ష్మీనారాయణ నే వీళ్లని..రామ నామ ప్రతులు తీసుకుని బయలుదేరి వెళ్ళ మనీ చెప్పాను. అందరిలో ఒక అసంతృప్తి. దానితో పాటు కోపం కూడా ఉండి ఉంటుంది కూడా. స్వామి..ఏమిటి ఈ పరీక్ష. ఎట్టి స్థితిలోనూ చేయి విడువ వు అని నమ్మి ఉన్నాను. మరలా ఉగాది నుండి యాగం ప్రారంభం అవుతుంది. ఈ లోపే నేను తీసుకుని వెళ్లి అయోధ్య ఇస్తానని చెప్పి..ఇప్పుడు వెళ్ళలేక పోతే అబద్ధమే అవుతుంది కదా. అదీ కలలో కూడా అబద్ధమాడని రామయ్య తండ్రి కార్యక్రమంలో నా? ఏమిటి ఈ సంకటం అని మా పెద్దాయన (ఆంజనేయ స్వామి) ముందు వాపోయాను . వెళ్లిన వాళ్లు ముందు కాశీ వెళ్లి .అక్కడ స్వామి అమ్మవారలను దర్శించుకున్నారు. ఇక్కడ పోనీలే వీణ్నికూడా పంపాలని అనుకున్నాడేమో స్వామి , సోమవారం సాయంత్రం ఒక deputation పై రావటానికి అంగీకరించారు. ఆఘమేఘాల పై ప్రయాణం .విజయవాడ వెళ్లే సరికి నాగపూర్ వరకు మా అబ్బాయి ఒక టికెట్ బుక్ చేయగలిగాడు . ఏమైనా సరే. సీటు దొరకకుండా ఉంటే కింద కూర్చొని అయినా వెళ్లాల్సినదే అని బయలుదేరాను . రాత్రికి నాగపూర్ నుండి itaarsi వరకు మరొక టికెట్ మా తమ్ముడు బుక్ చేయగలిగాడు .నాగపూర్ వెళుతూ train లో పరిచయమైన రాంబాబు గారు కౌంటర్ వద్దకు వెళ్లి వేగంగా ఒక జనరల్ టికెట్ తెచ్చి ఇచ్చారు. అక్కడ నుండి itaarsi లో స్లీపర్ లో jabalpoor వరకు వెళుతుండగా మధ్యలో ayodhya వరకు ac లో మరొక టికెట్ మా తమ్ముడు రిజర్వ్ చేయగలిగాడు ు .తెల్లవారుజామున దిగి సరయు నది లో మూడు మునకలు వేసి అప్పటికే అయోధ్య చేరి దర్శనము కోసం లైన్ లో ఉన్న మా బృందాన్ని కలవగలిగాను .ఆపై ప్రతులు తలపై పెట్టుకుని వెళ్లగా అక్కడ రక్షణ విభాగం వారు సెక్యూరిటీ నిబంధనల వలన ఆలయం లోపలికి అనుమతించ లేమని వాటిని వేరే స్థలం లో ఇవ్వాలని చెప్పారు. ఆ పని మీరే చేయమని వారికే అప్పగించి బాల రామునికి దివ్య దర్శనo తో తరించి పోయాము . ఈ రోజు తిరుగు ప్రయాణం అయ్యాము . ఆడిన మాట తప్పడు రామయ్య. ఆయనను నమ్మి పాదాలు పట్టుకుని ఉంటే నాలాంటి అల్పుల మాట కూడా వమ్ము కానీయడు హనుమయ్య. ఇక భక్తుల పట్ల ఎంత కృప కలిగి ఉంటాడు కదా? జై శ్రీరామ్.
0 వ్యాఖ్యలు:
Post a Comment