శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శౌచం ...ఇది అన్నిటికన్నా శక్తివంతమైన వాక్సిన్

>> Monday, April 20, 2020

*శౌచం - ఇది అన్నిటి కన్నా శక్తి వంతమైన vaaksin*

By
_డా. కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి_
_వ్యవస్థాపక ఛైర్మన్‌,_ _శాంతా బయోటెక్నిక్స్‌ లి.‌_

ధర్మదేవత కున్న నాలుగు పాదాల్లో శౌచం ఒకటని ధర్మరాజు చెప్పాడు.
ఇది కలియుగం కాబట్టి తక్కిన సత్యం, అహింస, ఆస్తేయం వంటివన్నీ పోయి యిదొక్కటే మిగిలింది.

మనం ఆ పాదాన్నే గట్టిగా పట్టుకుని మనల్ని మనం కాపాడుకోవాలి.
శౌచం అంటే శుభ్రంగా వుండడం.
శరీరాన్ని, మనసును, చుట్టూ ఉన్న సమాజాన్ని అన్నిటిని పరిశుభ్రంగా వుంచుకోవడం.
ఇది అనారోగ్యాన్ని నిరోధించే ఉత్తమోత్తమ సాధనం.
దీనికి మనం వాడేది నీరు.
నీరు ఎక్కడుందా అని వెతుక్కుంటూ మానవాళి భూమంతా తిరగడంతోనే నదీతీరాల వెంబడి నాగరికతలు వర్ధిల్లాయి.

అందువలన మనం నదీ జలాలను కాపాడుకోవాలి.
వాటిని పరిశుభ్రంగా వుంచాలి.
శుద్ధి చేయ వలసిన నీటినే కలుషితం చేస్తే యింక అదెక్కడ శుభ్రం చేస్తుంది?
మనం నదులను పవిత్రంగా భావిస్తాం, పాపాలు పోతాయంటూ వాటిలో మునకలు వేస్తాం.
అదే సమయంలో నానారకాల వ్యర్థాలను వాటిలో వదులుతాం.

సామాజిక పరంగా మనం చేస్తున్న తప్పు అదొక్కటే కాదు.
బహిరంగ మల మూత్ర విసర్జన, ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయడం యిలాటి దుర్లక్షణాలు ఎప్పటికి పోతాయో తెలియదు.

మనమే విదేశాలు వెళ్లినపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటాం.
అదే మన దేశానికి వచ్చేసరికి చెత్తడబ్బా దాకా వెళ్లడానికి బద్ధకిస్తాం.
మన యిల్లు కాకపోతే చాలు,
ఎంతైనా పాడు చేయవచ్చు అనే పద్ధతి పోవాలి.
మనకు తగ్గట్టే పాలకులూ తయారయ్యారు.
మన యిళ్లల్లోంచి సేకరించిన చెత్తను ఒక చోట దిమ్మరించి తమ పని అయిపోయిందను కుంటారు.
దాన్ని నిరపాయకరంగా ఎలా వదుల్చు కోవాలన్నది వారికి పట్టదు.

ఎప్పుడో ఒకరోజు ఎవడో అగ్గిపుల్ల వెలిగించి పడేస్తాడు. దాంతో ఆ చుట్టు పక్కల కాలనీల్లో వారం రోజుల పాటు పొగ, దుర్గంధం, దగ్గు, తుమ్ములు..!
చాలా ఊళ్లల్లో చెత్త పడవేసే డంపింగ్‌ యార్డులు కూడా లేవు. చెరువుల్లో,
కాలవల్లో,
నదిలో పడేసి పోతారు.

డ్రైనేజి సమస్య లేని ఊరే లేదని చెప్పవచ్చు.
రోడ్డు మీది డ్రైనేజి పైపులు పగిలిపోయి, పొర్లిపోతూ వుంటాయి.

అనేక నగరాల్లో డ్రైనేజి పైపులు,
మంచి నీటి పైపులు కలిసిపోతూ వుంటాయి.
ముఖ్యంగా అపార్టుమెంట్లు మొలుచుకుని వచ్చాక యీ సమస్య తీవ్రమైంది.
ఫ్లాట్లు కట్టే టప్పుడు సూర్యరశ్మి లోపలికి వస్తుందా లేదా అని చూడకుండా కట్టేవాళ్లు కడుతున్నారు,
అనుమతు లిచ్చేవాళ్లు అనుమతు లిస్తున్నారు.
మనం సూర్యుణ్ని ఎందుకు ఆరాధిస్తాం?
సూర్యుడు ఆరోగ్యాన్ని యిస్తాడు,
క్రిములను పారద్రోలుతాడు కాబట్టి.
ఇంట్లో వస్తువులకు బూజు పడితే ఎండలో ఆరబెడితే బాగుపడతాయి.
ఆ ఎండ తగలకే యిప్పుడందరూ డి-విటమిన్‌ లోపంతో బాధ పడుతున్నారు.   

ఇల్లన్నాక వ్యర్థాలను వదుల్చు కోవడానికి మరుగుదొడ్డి అవసరం.
ఊరన్నాక చెత్త పడవేసే డంపింగ్‌ యార్డు,
దానిని డిస్పోజ్‌ చేసే యంత్రాంగం అవసరం. కానీ పాలకులు మర్చిపోతారు.
పౌరులు పట్టించుకోరు.
ప్రభుత్వ స్థలమేదైనా ఖాళీగా కనబడితే పేదలకు యిళ్లస్థలాల కోసం అట్టే పెడదామంటుంది అధికారపక్షం.
లబ్ధిదారులు చప్పట్లు కొడతారు.
డంపింగ్‌ యార్డు గురించి వారికి తోచదు,
వీరడగరు.
గ్రామాల్లో అయితే చెత్త ఎక్కడైనా పడేయ వచ్చనుకుంటారు.
నగరాల్లో, పట్టణాల్లో  కొన్ని ప్రాంతాలను అందంగా వుంచడానికై ఊళ్లో చెత్తను పట్టుకెళ్లి శివార్లలో,
పోరంబోకు భూముల్లో పడేస్తూంటారు.
పక్కనే అక్రమంగా ఒక కాలనీ వెలుస్తుంది. కాలనీ వాసులు, పిల్లలు ఆ యార్డులోనే పొర్లాడు తూంటారు.
అనారోగ్యాల పాలవు తూంటారు.
వాళ్ల కర్మాన వాళ్లే పోతారులే అని వూరు కుంటూ వచ్చాం.

ఇప్పుడు కరోనా బుద్ధి చెప్పింది - వాళ్లను పట్టించు కోకపోతే వాళ్ల ద్వారానే నీకు సంక్రమిస్తుంది జాగ్రత్త సుమా అని.
కూలీగా పనిచేసే ఆ కాలనీ వాసుడి తుమ్ము తుంపర్లు పడిన వస్తువును షాపింగ్‌ మాల్‌లో కొని నీ ఏడంతస్తుల మేడకు తెచ్చుకుంటే కరోనా లక్ష్మికి నువ్వు హారతిచ్చి లోపలికి తీసుకువచ్చినట్లే!

అందువలన మనమే కాదు,
మన చుట్టూ ఉన్న సమాజం కూడా శుచిగా,
శుభ్రంగా వుండేట్లు చూడాల్సిన అవసరం మనది.

ఇక వ్యక్తిగత శౌచానికి వస్తే యిది మొదటి నుంచి వున్నదే, యిటీవలే పట్టించు కోవడం మానేశాం.
బయట నుంచి వస్తే,
బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తే,
భోజనానికి ముందూ వెనుకా కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కో-  అనేవి ఎవరైనా చెప్పాలా?
తుమ్ము వస్తే రుమాలుతో ముక్కు కప్పుకో,
దగ్గితే చెయ్యి అడ్డుపెట్టు కో అని కరోనా వచ్చాక టీవీల్లో సూపర్‌ స్టార్ల చేత చెప్పించు కోవడానికి సిగ్గుగా లేదా?
ఇవి ప్రాథమికమైన నాగరికమైన విషయాలు కావూ?

అన్నం పర బ్రహ్మస్వరూపం. భోజనం చేయడం యజ్ఞంతో సమానం.
ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా, బజార్లో తిరిగి వచ్చిన దుస్తులతో తిన కూడదు.
అలా తింటే దేహరక్షణ వ్యవస్థ బలహీనమై, మనం రోగానికి సులభంగా లొంగి పోతాం. 

పెళ్లిళ్లల్లో బఫే భోజనాలకు వెళ్లి వందలాది మందికి షేక్‌హ్యాండ్‌లు యిచ్చి,
హేండ్‌ వాష్‌ దూరంగా వుందని బద్ధకించి, అదే మురికి చేత్తో భోజనం చేసేవాళ్లు ఎందరో ఉన్నారు.
చేశాక టిస్యూ పేపరుతో తుడిచేసుకుని,
మళ్లీ కరచాలనాలు మొదలెట్టేవారు కొందరు.
అసలు కరచాలనా లెందుకు,
చేతులు జోడించి నమస్కారం పెట్టకుండా! అవతలివాళ్లు
ఆ చేతిని అంతకు ముందు దేనికి ఉపయోగించా రో మనకే మెఱుక?
ఇది చాలనట్లు వాటేసు కోవడాలొకటి. భార్యనైనా సరే, బహిరంగంగా కౌగలించు కుంటే కళ్లెగరేసిన ఒకనాటి గొప్ప సమాజం మనది.
అలాటిది యిప్పుడు ఆడా, మగా తేడా లేకుండా అందర్నీ ‘హగ్‌’ చేసుకునే స్థితికి వచ్చాం.
అందుకే కరోనా, మాయాబజారు శశిరేఖలా
‘దూరం, దూరం’ అంటోంది.

ఎవరిదైనా ఎంగిలి తిన రావలసి రావడం ఖర్మగా భావించే వారు.
ఎంగిలి ఐన కూడు పెట్టినందుకు ఋషులు శపించిన సందర్భాలున్నాయి.
అలాటిది యిప్పుడు ఎంగిలి పాటిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గు పడాల్సిన విషయం అయిపోయింది.
ఒకే ప్లేట్లో నలుగురు తినడం,
ఒకే గ్లాసులోది అరడజను మంది తాగడం ఫ్యాషనై పోయింది. అవతలివాడికి
ఏ రోగం ఉందో మనకు తెలుసా?
వాడి లాలాజం ద్వారా మనకు పాకదన్న గ్యారంటీ వుందా?
అసలే ఫ్యాషన్‌ పేరుతో అందరూ పెరిగిన గడ్డాలతో,
మురికి బట్టలతో బూచాళ్లలా తయారయ్యారు.
రఫ్‌గా ఉంటేనే మ్యాన్లీగా ఉన్నట్లు అనుకుంటూ స్నానాలు మానేసి, డీయోడరెంట్‌ చల్లుకుని జనాల్లో తిరిగేస్తున్నారు.
ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు తింటారో, ఎప్పుడు పళ్లు తోము కుంటారో తెలియదు.
ఎక్కడ తింటారో ముందే చెప్పలేం.
పెద్ద ఉద్యోగం చేస్తూ, కార్లలో తిరుగుతూనే రుచికోసం అంటూ రోడ్డు పక్క దుమ్మూ ధూళీలో పెట్టిన బళ్ల దగ్గర తింటారు.
దాన్ని ఆధునిక జీవనశైలిగా అభివర్ణించు కుంటారు.
వేళాపాళా లేని బతుకులు. అలాటివాడి ఎంగిలి ఆరోగ్య దాయకంగా ఉంటుందని చెప్పగలమా?

తిండి దగ్గరకు వచ్చాం కాబట్టి దాని గురించి మరింతగా మాట్లాడు కోవాలి.
మనకు వంటిల్లే ఔషధాలయం.
సుగంధ ద్రవ్యాల పేరుతో మనం వాడే దినుసులున్నీ శరీరానికి ఎంతో మేలు చేసేవి.
ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు, వాము, శొంఠి, మెంతులు, మిరియాలు, ఆవాలు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క.. యిలాటివన్నీ ఎందుకు పని చేస్తాయో నేను విడివిడిగా చెప్పనవసరం లేదు.

ఇంటివైద్యం, చిట్కాలు తెలిసిన ప్రతి గృహిణికి తెలుసు.
పోపుల పెట్టెయే ఆవిడ మందులషాపు.
వీటికోసమే గతంలో పాశ్చాత్య దేశాల వాళ్లు మన దేశాలకు వచ్చి,
అంతిమంగా మన నెత్తికెక్కారు.
అంత సంపద మన దగ్గర పెట్టుకుని, యివేమీ లేని పిజ్జాలు, బర్గర్ల కోసం మనం వెంపర్లాడడం, రోగ నిరోధక శక్తిని నాశనం చేసు కోవడం మూర్ఖత్వం కాదా?

మన నివసించే పద్ధతి ఎలాటిది?
ఇంటి ముంగిట వేపచెట్టు యాంటీ యాక్సిడెంట్లు యిస్తుంది.
మామిడి చెట్టు ధారాళంగా ఆక్సిజన్‌ యిస్తుంది.
కర్పూరం వెలిగిస్తే, ఆవు పిడకలు కాలిస్తే రోగక్రిములు నశిస్తాయి.
ఇక వండుకునే విధానం ఎలాటిది?
పెరట్లోని దొండపాదు దొండ కాయలిస్తుంది,
మునగ చెట్టు ములక్కాడ లిస్తుంది,
కరివేపాకు చెట్టు కరివేపాకు యిస్తుంది,
కొత్తిమీర మడి కొత్తిమీర యిస్తుంది.
తాజా కూరలతో వంట తయారవు తుంది.
పోపుల పెట్టె సహాయంతో వేడి వేడి చారు తయారై కఫం అణచేస్తుంది.
అంతా తాజా తాజాగా, వేడివేడిగా, అప్పటి కప్పుడు వండుకుని తింటాం.

పాశ్చాత్యుల దంతా డబ్బా తిళ్లు.
ఎప్పుడో వండి డబ్బాల్లో కుక్కితే అది సూపర్‌ మార్కెట్‌ అరల్లో మగ్గిమగ్గి, వీళ్లింటికి వచ్చి యింకొన్నాళ్లు మగ్గి అప్పుడు నోట్లోకి వస్తుంది.
అది వేడిగానూ వుండదు,
తాజాగానూ ఉండదు. ఖర్మ కొద్దీ మనం అలాటి తిళ్లకు అలవాటు పడుతున్నాం.
కంటికెదురుగా ఉన్న నవనవలాడే పండు ఒలుచు కుని తినకుండా,
అట్టపెట్లో వచ్చిన ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నాం.
‘దీనిలో ఏ పళ్లరసమూ లేదు,
ఉన్నవి కేవలం పంచదార నీళ్లు,
ఆ పండు తాలూకు ఫ్లేవర్‌ యిచ్చే కెమికల్‌ మాత్రమే’
అని రాసినా ఖాతరు చేయటం లేదు.
ఇవి అసలు దినుసు కంటె కొన్ని రెట్లు ఖరీదెక్కువని తెలిసినా పట్టించుకోవడం లేదు.
ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో అసలైన చిక్కు,
నిలువ వుంచేందుకు వాడే ప్రిజర్వేటివ్‌ కెమికల్స్‌,
నదురుగా కనిపించేందుకు వాడే రంగుల వలన వస్తుంది.
ఆహార పదార్థాల్లో కూడా అవి వాడి దుష్పరిణామాలు కొని తెచ్చుకోవడం దేనికి?
ఇటీవల నిలువ చేసిన దోసె పిండి సూపర్‌మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడు పోతోంది.
ఇంట్లో మిక్సీలున్నా, రుబ్బుకునే గ్రైండింగ్‌ మెషిన్లున్నా రెడీమేడ్‌ పిండిని కొనడంలో విజ్ఞత ఏమిటో మనకు మనమే ప్రశ్నించు కోవాలి.
ఇంట్లో వండ కుండా బయట నుంచి పిజ్జాలు ఆర్డరు యిచ్చుకోవడం దేనికి?
వాడు శుభ్రంగా,
ఆప్యాయంగా,
తల్లిప్రేమ రంగరించి వండుతున్నానని చెప్పాడా

ఎంతో ఎదిగి పోయామను కున్న అమెరికా,
యూరోప్‌ దేశాలు ఈరోజు మనని అడిగి మందులు తీసు కుంటున్నాయి.
భారతీయ ఔషధాలే కాదు,
భారతీయ వంటకాలు కూడా వాళ్లు ఒంట పట్టించుకోవాలి.
తాజావి, పూర్తిగా ఉడికించినవి తినడం నేర్చుకోవాలి.
ఎప్పుడో ఒకసారి ఇండియన్‌ రెస్టారెంటుకి వెళ్లి లొట్ట లేసుకుంటూ తినడం కాకుండా,
మన పోపుల పెట్టెను వాళ్ల కిచెన్‌లో పెట్టుకోవాలి.
వాళ్ల బాగోగులు మనకెందుకు అనకండి,
గ్లోబలైజేషన్‌ తర్వాత ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయిందని కరోనా మరొక్కమారు గుర్తు చేసింది కదా!
వాళ్ల ఆరోగ్యమే మన మహాభాగ్యం.
మన ఆరోగ్యమే వాళ్ల భాగ్యం.
ఇక శాకాహారం, మాంసాహారం మాటకు వస్తే మనిషి నిర్మాణం మాంసాహారానికి అనువైనదే అంటున్నారు కానీ జీవ పర్యావరణ చక్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ కనబడే ప్రాణు లన్నిటినీ  తినడం ప్రాణాంతకమని కరోనా మరోసారి గుర్తు చేసింది.
శాకాహారం అందరికీ మంచిదే కానీ మాంసాహారం కష్టజీవులకు మాత్రమే,
అదీ ఒక వయసు వరకే మంచిదని శాస్త్రీయంగా తెలుస్తోంది.
శారీరక శ్రమ పెద్దగా లేనినాడు మాంసం తినడం,
దాన్ని అరిగించు కోలేక అష్టకష్టాలు పడడం శరీరాన్ని రొష్టు పెట్టినట్లే.
పైగా శుచీ, శుభ్రతా అంతగా లేని యీ సమాజంలో, సహజ పద్ధతుల్లో కాకుండా కృత్రిమంగా కోడి గుడ్లను,
అసహజంగా కోళ్లను తయారు చేస్తున్న యీ రోజుల్లో సాధ్య మైనంత వరకు మాంసాహారానికి దూరంగా వుండడమే మేలని నా సలహా.

శరీరం బాగుండాలంటే మనసు కూడా బాగుండాలి.
రెండూ పరస్పరాశ్రితాలు.
మనసు బాగాలేక శరీరానికి వచ్చే వ్యాధులను సైకో`సొమాటిక్‌ డిసీజెస్‌ అంటారు.

కోపం, నిరాశ, దిగులు, క్రుంగుబాటు వలన రక్తపోటు, కడుపులో అల్సర్ , గుండెనొప్పి, నిద్రలేమి, కీళ్లనొప్పులు రావడం మనకు తెలుసు.
జీవితంలో కష్టాలు లేనివారు ఎవరూ లేరు.
అయితే రోజులో కాసేపయినా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం  సంగీతం,
సాహిత్యం, యితర లలితకళ ఏదైనా వినడమో, చూడడమో అలవరచుకోండి.
యోగా, ధ్యానం చేయండి. యోగాసనాలకు ఒళ్లు ‘వంగని’ వారు కనీసం ప్రాణాయామం చేయండి.

ఈ కాలుష్య వాతావరణం లో అన్నిటికంటె ఎక్కువగా దెబ్బ తినేవి ఊపిరితిత్తులే.
కరోనా కూడా ఊపిరి తిత్తులను ముడుచుకునేట్లా చేస్తుంది.
ప్రాణాయామం తో అవి విప్పారు తాయి.
పూర్తి స్థాయిలో పనిచేస్తాయి.
ఇక ధ్యానమంటారా, ఏకాగ్రత కుదరడం లేదని మానేయకండి. ఇవన్నీ అభ్యాసంపైనే వస్తాయి.
ఇతరులకు ఉపకారం చేయక పోయినా,
అపకారం చేయకుండా వుండాలి అనే బుద్ధి వుంటే మనసును ప్రశాంతంగా వుంచుకోవడం మరీ అంత కష్టం కాదు.

ఇక - అనుకున్నది దక్కలేదు,
కష్టానికి తగిన ఫలితం రాలేదు,
నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు,
దేవుడు నన్ను చల్లగా చూడటం లేదు,
పక్కవాడికి అర్హత లేకపోయినా అన్నీ యిచ్చాడు వంటి ఆలోచనలు కూడా మనశ్శాంతిని చెడగొడతాయి.

మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. పాశ్చాత్యులూ దాన్ని నమ్మడం మొదలు పెట్టారు.
వాళ్లూ మాటల్లో
 ‘కర్మ’ వాడడం మొదలెట్టారు.
ఎందుకంటే దైవలీలలు ఎవరికీ అర్థం కావు. బిడ్డకు పాలెప్పు డివ్వాలో,
పాయసం ఎప్పుడివ్వాలో తల్లికి తెలిసున్నట్లు,
మనకు ఎప్పుడు ఏది యివ్వాలో భగవంతుడికి తెలుసు.
నువ్వు తగినవాడివి అనుకుంటే అయాచితంగా యిస్తాడు.
అది నువ్వు భరాయించు కోలేవను కుంటే ఏడ్చి మొత్తుకున్నా యివ్వడు.
అందు వలన భగవద్గీతలో చెప్పినట్లు -
నీ పని నువ్వు చేసుకుంటూ పో,
ఫలితంపై ఆశ పెట్టుకోవద్దు.
అది దేవుడి పని. ఫలితాన్ని ఆశించి పని చేయవద్దు.
‘ఇది నా ధర్మం,
నిర్వర్తిస్తున్నాను.’
అనుకుంటూ చేసు కుంటూ పోవడమే మన పని.
ఈ సిద్ధాంతాన్ని నమ్మి చెడినవాడు లేడు. 

ఇదీ మొత్తంగా నేను చెప్ప దలచినది. సారాంశంగా మూడు ముక్కల్లో చెప్పాంటే -

శరీరాన్ని, మనసును, బుద్ధిని శుచిగా పెట్టుకోండి, మంచి ఆహారం తినండి, మంచి అలవాట్లు పాటించండి,
శరీరాన్ని దృఢంగా చేసి పెట్టు కోవడమే దివ్యమైన వాక్సిన్‌.

దాన్ని ఏ ట్రంపూ బెదిరించి లాక్కోలేడు. సమాజం కూడా శుచిగా వుండేట్లు పౌరుడిగా కృషి చేయండి, పాలకులపై ఒత్తిడి తెండి.
విద్య, వైద్యానికి గౌరవం యివ్వండి,
ప్రభుత్వానికి చెప్పి పెద్ద పీట వేయించండి, ఆరోగ్యమే మహాభాగ్యమని, అధిక ధనమూ, ఆయుధాలు ఆపత్సమయాన అక్కరకు రావని గుర్తించ మనండి.

కరోనాను దూషించ కుండా బుద్ధి చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయుడి లా గౌరవించి గుణ పాఠాలు నేర్చుకోండి.
చివరిగా ఎవరూ అప్పటి కప్పుడు ఔషధాలూ, టీకాలూ సృష్టించలేరని, ముందు జాగ్రత్తే పరమౌషధమని గుర్తు పెట్టుకోండి.

ఐసియు కన్న ఇల్లు పదిలం
వెంటి లేటరు కన్న మాస్క్‌ నయం
చికిత్స కన్న నివారణ శ్రేయం
(సమాప్తం)

_డా. కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి_
_వ్యవస్థాపక ఛైర్మన్‌,_ _శాంతా బయోటెక్నిక్స్‌ లి._
🌹👏🏽🌷

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP