శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సోషల్ ఐసోలేషన్

>> Sunday, September 2, 2018

సోషల్ ఐసోలేషన్

ఒక ఇరవై సంవత్సరాలకు ముందు చదువుకోవటానికి  కేవలం ప్రభుత్వ పాఠశాలలే ఉండేవి. దాని వలన ఎంత డబ్బున్న వాడైనా ఏ కులానికి చెందిన వారైనా ఏ మతానికి చెందిన వారైనా, అందరూ ఒకేచోట ఒకే తరగతి గదిలో కూర్చుని చదువుకునే పరిస్థితి ఉండేది. దీనివలన ఒక ఉన్నత వర్గం వాడికీ ఒక బీద వాడికీ మధ్యన పెద్దగా gap ఉండేది కాదు. ఇదొక రకమైన సోషల్ ఈక్వాలిటీని తీసుకుని వచ్చేది. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఒకసారి ఇదే మాట చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ పద్దతులైన బస్సులూ, ట్రైన్ లూనూ. అంటే సమాజంలో ఇవన్నీ ఒకే కామన్ సోషల్ స్పేస్ ను సూచించేవి.  తరచి చూస్తే రాను రాను ఈ కామన్ సోషల్ స్పేస్ కుంచించుకు పోవటం కనిపిస్తోంది. విద్యలో ప్రభుత్వ పాఠశాలలు బీదవారికి, ప్రైవేటు పాఠశాలలు ధనికులకూ ఐపోయాయి. అలాగే వైద్యం, ట్రాన్స్ పోర్ట్ కూడా. ఏ వర్గానికి ఆ వర్గంగా వేరు వేరుగా ఉంటున్నాయి. ధనిక బీదల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. దీనితో పాటు పెరుగుతున్న టెక్నాలజీ మనుషిని ఇంకో మనిషితో కలవనీయకుండా విడిగా ఉండటానికి తోడ్పడుతోంది. దీనిని సోషల్ ఐసోలేషన్ లేదా సమాజంనుండి విడివడిన స్థితిగా అర్థం చేసుకోవాలి.

ఈ సోషల్ ఐసోలేషన్ చదువుకున్న వారిలో మరీ‌ ఎక్కువ. కొందరు రచయితలు అసలు సమాజంతో ఏ మాత్రం సంబంధం లేకుండా రచనలు చేస్తున్నారనే అపవాదు కూడా ఇపుడిపుడు పెరుగుతోంది. సల్మాన్ రష్దీ ఇండియా గురించి ఒక పుస్తకాన్ని లండన్ లో కూర్చుని రాయవచ్చు. ఇండియా తో ఇండియన్ ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ఇంటర్నెట్ లో వచ్చే వార్తా కథనాల ఆధారంగా ఒక కథను వండి వార్చే అవకాశం ఇపుడు పెరిగింది. ఇపుడు పాఠకుడు అనే వాడు ఒక జీవిత సత్యం కాకుండా ఒక "మానసిక బిగ్ అదర్" అన్నమాట. సినిమాల విషయంలో ప్రేక్షకుడూ అంతే..కాబట్టి సినిమా కథ ఆ జనాల మధ్య కాకుండా ఎక్కడో మలేషియా సింగపూర్ లలో పుడుతుంటుంది. చార్లెస్ డికెన్సు నవలలు రాసేటపుడు తన పాఠకులతో సంబంధం కలిగి ఉండటం కోసం ఉత్తర ప్రత్యుత్తరాల మీద ఆధారపడేవాడట. ఇప్పుడా పరిస్థితిలేదు. అప్పటికప్పుడు ట్విట్టర్ లో వేల మంది చేసే లఘు సందేశాలతో ఆ సంబంధం విలువలేని తాత్కాలిక విషయంగా తేలిపోతూ ఉంటుంది. పాఠకుడి తో ఒక ఆర్గానిక్ రిలేషన్ ఒక అర్థవంతమైన రిలేషన్‌ నెరపలేని స్థితి వారి సోషల్ ఐసోలేషన్ ని తెలియజేస్తుంది.

సమాజంలోని సభ్యులతో, కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవటం అలాగే ఇతర భావాలూ, భావజాలాలూ కల వారితో కనీస సంబంధాలు కూడా‌ లేకపోవటం వలన సమాజంలో వ్యక్తి ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యక్తి తనకు తానొక కంఫర్ట్ జోన్ ని ఏర్పరచుకుని అందులోనే ఉండిపోవడం, ఇతరుల‌ అభిప్రాయాలకూ, ఆచార వ్యవహారాలకూ, భావాలకూ, భావజాలాలకూ ఏమాత్రం కనీస గౌరవం ఇవ్వలేకపోవటం వంటివి ఆ వ్యక్తి లోని తీవ్రమైన ఒంటరితనాన్ని సూచించేదిగా ఉంటుంది. ఇటువంటి వారిలో నెగేటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ లేదా పీక్స్‌ ఆఫ్ నార్సిస్సిజం కనిపిస్తూ ఉంటుంది. కోల్ మరియు అతడి సహచరులు కలిసి చేసిన స్టడీ ప్రకారం సోషల్ ఐసోలేషన్ అనేది దీర్ఘకాలం పాటు ఉన్నట్టైతే అది శరీరంలోని జన్యువులను కూడా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. దాని వలన వీరిలో వ్యాధి నిరోధకత తగ్గుముఖం పడుతుందట. ఎన్నో స్టడీస్ చెప్పేదాని ప్రకారం బలమైన కుటుంబ సామాజిక సంబంధాలు కలిగిన వారికంటే సోషల్ ఐసోలేషన్ కలిగిన వారిలోనే ఆత్మహత్య లు ఎక్కువగా జరుగుతున్నాయట. ఆడవారిలో కంటే మగవారిలో ఈ సోషల్ ఐసోలేషన్ ఎక్కువగా ఉండటం వలన దీనికి సంబంధించిన ఆత్మహత్యలు మగవారిలోనే ఎక్కువట. ఒక వ్యక్తితో లేదా కొందరు వ్యక్తులతో కలిసి శారీరక అలాగే మానసిక దగ్గరితనం లేకపోవటం, ఆ భావోద్వేగాలు లేకపోవటం అన్నది ఇపుడు ఉన్న సోషల్ ఐసోలేషన్ ప్రధాన లక్షణం. కలిసి దేనినీ పంచుకోలేక పోవటం, కలిసి దేనినీ పండుగ చేసుకోలేక పోవటం వలన మనుషులు ఎక్కువ స్వార్థ పరులుగా, ఎక్కువ కఠినంగా, ఎక్కువ జడ్జ్మెంటల్ గా, సైకో పథ్ లుగా మారుతున్నారట. అందువలన వాళ్ళూ ప్రశాంతంగా ఉండక చుట్టూ ఉన్న వారినీ ప్రశాంతంగా ఉండనీయక, జీవితాన్ని సంతోషంగా పరిపూర్ణంగా జీవించనూ లేక, చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడి అన్యాయమౌతున్నారట.

సోషల్ మీడియాలో వర్చువల్ రిలేషన్ లు ఏమాత్రం నిజమైన రిలేషన్లు కావని విజ్ఞుల మాట. ఇవి సోషల్ ఐసోలేషన్ నుంచి బయటపడే ఎస్కేప్ పద్దతులే తప్ప మరేమీ కావని విజ్ఞులంటున్నారు. మారుతున్న సామాజిక నిర్మాణం మనుషులను మరింత స్వార్థపూరితంగా తయారు చేయబోతున్నదని స్పష్టమౌతున్న తరుణంలో చదువుకున్న మేధావులు మనుషులను ఏకం చేయగల అందరినీ కామన్ సోషల్ స్పేస్ ని పంచుకోగలిగే దిశగా ఏంచేస్తే బాగుంటుందో ఆలోచించాలే తప్ప, మనుషుల మధ్య భావజాలాల పేరుతో వైషమ్యాలు పెంచి పోషించి మరింత ఒంటరి తనాలను పెంచకూడదు. అటువంటి మేధావులను ఎంకరేజ్ చేయకపోగా జాలిపడటం, వారి సహజ సోషల్ ఐసోలేషన్ ని గుర్తించి తోడ్పాటుని అందించటం తక్షణ అవసరాలు.

28/8/18
విరించి విరివింటి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP