శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పరమాచార్య స్వామి వారి వైభవం .

>> Sunday, October 29, 2017

కంచి  పరమాచార్య  స్వామి  వారి  వైభవం .

పచ్చని పట్టు పావడా

పరమాచార్య స్వామికి అత్యంత భక్తులైన ఒక కుటుంబం స్వామి దర్శనానికి మద్రాసు నుంచి కాంచీపురం ప్రయాణమయ్యారు. కర్మవసాన వారు ప్రయాణం చేస్తున్న బండికి ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులకు అంతగా గాయాలవ్వలేదు కాని పిన్న వయస్కురాలైన వారి కుమార్తె మాత్రం బాగా గాయలపాలయ్యి ప్రాణాపాయస్థితిలో ఉంది. దానివల్ల ఆ తల్లిదండ్రులు ఆ పాపను ఆసుపత్రిలో చేర్చడానికి తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు. మద్రాసులో ఉన్న ఒక ఆసుపత్రిలో పాపను ఐ.సి.యలో ఉంచారు. ఆ పాప తండ్రి కాంచీపురంలో ఉన్న వాళ్ళ దగ్గరి బంధువు ఒకాయనకు ఫొను ద్వారా వారు కంచికి ఎందుకు రాలేదో తెలియచెప్పి, ఆయనను శంకరమఠానికి వెళ్ళి, వారి పాపను గండం నుంచి తప్పించి కాపాడవల్సిందిగా పరమాచార్యస్వామిని ప్రార్థించి, ఆయన ఆశీర్వాదం కోరమన్నాడు.

కరుణాతంతరంగులైన స్వామి వారు జరిగినదంతా విని, ధ్యానమగ్నులై కొంతసేపటి తరువాత ఒక ఆపిల్ పండును తీసుకుని, తిరిగి ధ్యానమగ్నులై ఆ పండును కొద్దిసేపు తడుముతూ పట్టుకున్నారు. తరువాత ఆ పండును ఆ బంధువుకు ఇచ్చి రాత్రికల్లా ఆ పండుని పాప దగ్గర్లో ఉంచమని చెప్పారు. అంతే కాక అతణ్ణి మద్రాసు వెళ్ళేముందు కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళమన్నారు. ఉదయం అర్చన అయ్యాక అమ్మవారి గుడిని మూసేయచ్చని, కాబట్టి తొందరగా వెళ్ళమని సూచించారు. అతను త్వరగా వెళ్ళడం వల్ల అమ్మవారి దర్శనం కేవలం రెండు నిముషాలే చేసుకోగలిగాడు. అమ్మవారు ఆకు పచ్చటి సిల్కు పావడాలో, మూక శంకరులు ఆర్యాశతకంలో చెప్పినట్టు "కారణ పర చిద్రూపా కాంచిపుర సీమ్ని కామపీఠ గతా కాచన విహరతి కరుణా కాశ్మీర స్తబక కోమలాంగ లతా" అన్నట్టు కరుణను వర్షిస్తూ దర్శనము ఇచ్చారు. దర్శనం అయిన కొద్ది క్షణాలకే అమ్మవారి గుడిని మూసివేశారు. పరమాచార్య స్వామి అశీర్వాదం వల్లే అమ్మవారి దర్శనం చేసుకోగలిగాడని అతనికి అర్థమైంది. అతను వెంటనే మద్రాసుకు ప్రయాణమయ్యి సాయంత్రానికల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు.

వైద్యులు పాప కోలుకోవడం కష్టమన్నారని పాప తల్లితండ్రులు అతనికి తెలియచేసారు. అతను పరమాచార్య స్వామితో జరిగిన సంభాషణను, ఆయన ఆదేశాన్ని తెలియచేసాడు. మహాస్వామికి మనసులోనే సాష్టాంగ ప్రణామం చేసి, అత్యంత భక్తితో ఆపిల్ పండును పాప తలగడ కింద పెట్టారు. వైద్యులు అతను చెప్పిన విషయన్ని విన్నా పాప కొలుకుంటుందన్న నమ్మకం వారికి కలుగలేదు.

మరుసటి రోజు ఉదయాన అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పాప కళ్ళు తెరిచి అమ్మానాన్నల వంక చూసింది. నెమ్మదిగా జరిగినదంతా గుర్తుతెచ్చుకుంటూ మట్లాడుతోంది. వైద్యులు విస్మయంతో ఆ పాపని నిశ్చేష్టులై చూస్తున్నారు. పాప పూర్తి స్పృహలో ఉన్నదని గమనించి పాపను మాట్లాడకుండా ఉండమన్నారు. అయినా పాప మట్లాడుతూనే ఉంది.

తల్లిని పిలిచి, "ఆకు పచ్చటి పావడాలో రాత్రి అంతా తన పక్కనే ఉండి తనకు స్వాంతన చేకూర్చిన చిన్ని పాప ఎక్కడ ఉంది?" అని అడిగింది. పాపకి ఏమైనా అయినదేమో అని వైద్యులు, తల్లిదండ్రులు కలవరపడ్డారు. కానీ కంచి నుంచి వచ్చిన ఆ బంధువుకు మాత్రం పరమాచార్య స్వామి తనని అమ్మవారి సన్నిధికి వెళ్ళమనడం,  అక్కడ కామాక్షి అమ్మవారి దర్శనం అన్నీ గుర్తొచ్చాయి. అమ్మవారు ఆకుపచ్చటి పావడాలో ఇచ్చిన దర్శనం గుర్తొచ్చి, అమ్మవారే స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆ పాపను కాపాడింది అని అర్థమైంది. పరమాచార్య స్వామి తనని అమ్మవారి దర్శనానికి ఎందుకు వెళ్ళమని చెప్పారో అవగతమయ్యి ఆనందంతో అక్కడున్న అందరికి ఈ విషయాన్ని చెప్పాడు. వైద్యులు పాపకిది పునర్జన్మ అని అన్నారు. ఆ కుటుంబం అంతా ఆనందాశ్రువులతో పరమాచార్య స్వామిని ప్రార్థించారు.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP