శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి!!!

>> Monday, March 20, 2017



ఒక ఐఏఎస్ అధికారి తన సర్వీస్ లో ఇప్పటి వేతనాలను బట్టి మూడు కోట్ల వరకు సంపాదిస్తాడు.  అతని ఖర్చులు పోను పదవీ విమరమణ తరువాత కనీసం కోటి రూపాయలు కూడా మిగలవు.  కానీ ఒక స్థానిక సంస్థలో కౌన్సిలర్ గా అయిదు ఏళ్ళు పని చేసిన ఏమాత్రం విద్యాగంధం లేని నాయకుడు కనీసం పది నుంచి ఇరవై కోట్ల వరకు వెనకేస్తాడు.  ఒకసారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఎదో పత్రికలో రాసిన వ్యాసం లో మంత్రి స్థాయి వ్యక్తి అయిదు ఏళ్లలో కనీసం అయిదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు, ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి అయిదు వేలకోట్ల వరకు సంపాదించగలడు అని గణాంకాల తో సహా ఒక వ్యాసం రాశారు.  కోట్ల విజయ భాస్కర రెడ్డి అర్ధ శతాబ్దం రాజకీయాల్లో ఉన్నప్పటికీ, హైదరాబాద్ లో ఆయనకు సొంత ఇల్లు లేదు...

   దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు.  అగ్ర కులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు.   సంజీవయ్య అవినీతిపరుడు అని, లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రు కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి.  సంజీవయ్య నీతి, నిజాయితీ కూలంకుషం గా ఎరిగిన నెహ్రు వారి ఫిర్యాదులను కొట్టి పారేశారు.  అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.  సరే, విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రు.  కొంతకాలం పాటు ఆ నిర్ణయం వాయిదా పడ్డది.

   అప్పుడు నెహ్రు తన ఆంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంద్ర వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు, నేటి ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ అయిన చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు.  సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు.  అయినప్పటికీ, ప్రధాని ఆదేశం కావడం తో వెళ్లాల్సిందే అన్నారు ఆయన.

  ఇద్దరూ కలిసి సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో.  గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి.  ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యి పై మట్టి కుండతో అన్నం వండుతున్నది.  పొగ గొట్టం తో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది.  "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు నాయకుడు.  "సంజీవయ్య గారి ఇల్లు ఇదే.  ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు.  కారు దిగండి"  అన్నారు చక్రపాణి.  నాయకుడు నివ్వెరపోయాడు.

  చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న  మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు"  అన్నారు.

  ఆమె చెమటలు తుడుచుకుంటూ  "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది.  ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు"  అన్నది.

  నాయకుడి నోట్లోంచి మాట రాలేదు.  "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?"  అడిగారు చక్రపాణి.  "అవసరం లేదు.  కారును హైద్రాబాద్ కు పోనీయండి"  అన్నాడు నాయకుడు.

  ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు....

ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి!!!

1 వ్యాఖ్యలు:

అన్యగామి March 20, 2017 at 3:09 PM  

నిజమే కులంతో సంబంధం లేకుండా చాలా మంది పెద్దలు, నాయకులు ఆకాలంలో నిజాయతీగానే ఉండేవారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP