శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శాస్త్రీ‌యత లేని ఇంగ్లీషు ఉద్యమం

>> Saturday, July 9, 2016

శాస్త్రీ‌యత లేని ఇంగ్లీషు ఉద్యమం
09-07-2016 23:53:52   FROM ANDHRAJYOTHY DAILY

2013 వరకూ అమెరికాకు వలసవచ్చిన 4.5 కోట్ల విదేశీయులలో భారతీయులు సుమారు 21 లక్షలు. భారతీయుల పట్ల అమెరికా చూపించే వివక్షకు తార్కాణం ఇది. వీళ్ళా మిలియన్ల కొద్దీ ఇండియన్లను ఆదరించి ఆశ్రయమిచ్చేవారు! ఇక ఆస్ర్టేలియా, కెనడా వలస చట్టాలు బాహాటంగానే ఆసియా ఆఫ్రికావారిపై నిర్బంధాలను అమలుపరుస్తున్నాయి. ఈ పరిస్థితులలో అసత్య అశాస్త్రీ‌య ఆధారాలతో ఇంగ్లీషు మాధ్యమ ఉద్యమ ప్రచారం దేనికోసం, ఏం ఆశించి చేస్తున్నారు?
 
ఒకప్పుడు సంస్కృత గుత్తాధిపత్యం నుంచి బైటపడడానికి తెలుగూ తదితర దేశభాషలకు వేయి సంవత్సరాలకు పైగా పట్టింది. యుగం మారినా మళ్లీ అదే బాట- ఈ మారు సంస్కృతం బదులు ఇంగ్లీషు దాస్యం. ప్రాథమిక విద్యా భ్యాసంలోనే మాతృభాషలకు బదులు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అనా గరికం. పసివయసులో ఇంగ్లీషును రుద్దడమంటే బలవంతాన భావదాస్యంలోకి తోసివేసినట్లే. దూరదృష్టి లోపించిన స్వార్థపరులైన కొందరు ఉద్యోగాలను ఎరచూపి ఇంగ్లీషును ఇట్లా ప్రోత్సహించడం బలహీనులపై చేస్తున్న మానసిక దాడిగా గుర్తించాలి. ఇంగ్లీషు మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలూ బతుకు దెరువూ అని నమ్మించడం అమానుషం. ఈ ఇంగ్లీషుతోనే మనం పేదరికంనుండి గట్టెక్కుతామనడం ఒక బానిస భావన. ఈ భావన మన సమాజానికి ఎక్కుతున్న విష సంస్కృతి ప్రభావమే.
 
                  సుమారువందకుపైగా దేశాలు మన తెలుగు రాష్ర్టాలకంటే విస్తీర్ణంలో చిన్నవి. ఇరవై దేశాలు మాత్రమే తెలుగు రాష్ర్టాల కన్నా ఎక్కువ జనాభా గలవి. ఈ విస్తృతినీ ఈ ఆధిక్యాన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎంతోవిస్తీర్ణమూ అధిక జనాభా, వివిధ భాషలూ, పలు సంస్కృతులూ కలిగిన మనరాష్ర్టాలనూ దేశాన్నీ కొన్ని జాతుల సమాఖ్య (ఫెడరేషన్‌ ఆఫ్‌ నేషన్స్‌)గా చూడాలిగానీ పాలనా పరమైన ఏవోకొన్ని అవసరాలకోసం విభజింపబడ్డ రెవెన్యూ భాగాల సముదా యంగా కాదు. ఇండియాని కొన్ని దేశాలూ జాతుల సమాఖ్యగా చూడలేనివారి ఆలోచనా విధానం అశాస్త్రీ‌యం. తెలుగును వదిలి ఇంగ్లీషు భాషను మాత్రమే నేర్చుకోవాలనేది ఈ అశాస్త్రీ‌య ఆలోచనా ఫలితమే. ఇంగ్లీషు భాషా నైపుణ్యంతో మున్ముందు ఆస్ర్టేలియా, కెనడా, అమెరికాలాంటి దేశాలను మన వలస దేశాలుగా మలచుకోవచ్చనే ఆలోచనలు అసంబద్ధమైనవి.
మన దేశంకన్నా రెండు మూడింతలు పెద్దవైన అమెరికా, ఆస్ర్టేలియా, కెనడా దేశాలకు వలస పోయేందుకు పనికివస్తుందని మనం మన భాషలను వదిలి ఇంగ్లీషును మాధ్యమంగా ఎంచుకోవాలనడం దారుణం. మన దేశంలో జనాభా సాంద్రత ఎక్కువే. దానిని ఎప్పటికైనా నియంత్రించక తప్పదు. నేడు వనరులు తక్కువగా ఉన్నాయని చెప్పి మన దేశభాషలను వదులుకొని ఇంగ్లీషును మాధ్యమంగా ఎంచుకోవాలనడం సమంజసం కానేకాదు.
 
                  ఇంతకూ ఎక్కడకు వలసపోతాం? అమెరికా 1917, 1924లో తెచ్చిన నిర్బంధ వలస చట్టాలు, అమెరికా సంయుక్తరాష్ర్టాలకు ఆసియా నుండి సాగే వలసలను నిషేధస్థాయికి తెచ్చాయి. ఇక భారతదేశం నుండి వలస ఇప్పటికే అతి తక్కువ స్థాయిలోకి చేరింది. ఉదా. 2013 వరకూ అమెరికాకు వలసవచ్చిన 4.5కోట్ల విదేశీ యులలో భారతీయుల శాతం 4.7 మాత్రమే. అంటే సుమారు 21 లక్షలు. అమె రికా సంయుక్తరాష్ర్టాలు భారతీయుల పట్ల చూపించే వివక్షకు తార్కాణం ఇది. మిగిలిన 4.30 కోట్లమందిలో ఎక్కువమంది ద.అమెరికా, యూరపునుండీ కాగా బహుతక్కువమంది మాత్రమే ఆసియా ఆఫ్రికానుండి. ఎంత వివక్ష! వీళ్ళా మిలి యన్ల కొద్దీ ఇండియన్లను ఆదరించి ఆశ్రయమిచ్చేవారు.
 
                  ఇక ఆస్ర్టేలియా కెనడా సంగతులు చెప్పనవసరమే లేదు. ఈ దేశాల వలస చట్టాలు బాహాటంగానే ఆసియా ఆఫ్రికావారిపై నిర్బంధాలను అమలుపరుస్తున్నాయి. మరి ఈ పరిస్థితు లలో ఈ అసత్య అశాస్త్రీ‌య ఆధారాలతో ఇంగ్లీషు మాధ్యమ ఉద్యమ ప్రచారం దేనికోసం, ఏం ఆశించి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నట్టు, ఏ లాభం ఆశించి చేస్తున్నారు? భారతదేశానికి అనాది కాలంనుండి అనేక జాతులూ, మతాలూ ఇతర సముదాయాలవారు రావడం, వీలుంటే దోచుకుపోవడం లేదంటే ఇక్కడే తిష్టవేయడానికి ఈ దేశ సహజ సంపదల ఆకర్షణే ప్రధాన కారణం. నేటి పేదల కడగండ్లు, ప్రాకృతిక వనరులూ సహజ సంపదలూ లేకకాదు. స్వార్థపరుల రాజ కీయాలూ కొందరి అంతులేని ధనదాహంవలనే. ఇంగ్లీషు నేర్చుకొని సొంతదంతా వదులుకొని పొట్టచేతబట్టుకొని వలస పొమ్మనడంకంటే ఇంటి సంపదను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అవసరం. దీనికి ఇంగ్లీషు మాధ్యమ విద్య అవసరం లేదు. వేల యేండ్లకిందటే మనతో పుట్టి, మనమధ్య వికసించి మన జీవితంతో పెనవేసుకొని మనజీవనంలో కలగలిసి మనతో మమేకమైన తెలుగును ఒక్క కలంపోటుతో పక్కనపెట్టి ఇంగ్లీషు మాధ్యమానికి తలవూపడం అవివేకం, అనాలోచితం.
ఇప్పటికే కార్పొరేట్‌ స్కూళ్లలో ఇంటర్‌లో తెలుగు లేకుండా చేశాం. దీనితో, తెలుగులో చదవడం రాయడం తగ్గడంతో పిల్లలు మన నడత, నడవడిక, మనం బతుకుతున్న వైనం, మన కుటుంబ సభ్యులతో పెద్దా చిన్నా తేడాలతో మెలిగే తీరూ తిప్పలూ తెలియకుండా పోవడం మొదలైంది.
 
                  తెలుగులో మన జీవన విధానాన్ని ప్రతిబింబించే రచనలను చదవడం తగ్గడంతో ఒకరితో ఒకరు మెల గడం మసులుకోవడం తెలియకుండాపోతోంది. నేడు మన కళ్ల ముందు జరుగు తున్న ఘోరాలూ నేరాలూ, హత్యలూ ఆత్మహత్యలూ, హింసాప్రతిహింసా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పిల్లలూ పెద్దలని తేడాలేకుండా ఓర్పును కోల్పో తున్నాం. తల్లిదండ్రులు కోప్పడితేనో, మార్కులు తక్కువ వచ్చినై అనో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, తనను కాదన్న ఆడపిల్లపై ఆమ్లదాడికి దిగడం మన సమాజంలో తలెత్తుతున్న సహన హననాన్ని తెలుపుతున్నాయి. మాతృభాషలో మానవీయ విలువలున్న సాహిత్యాన్ని చదివించాల్సిన సమయాన్ని మనం కుదించివేశాం. నిర్దిష్టమైన ఆశయాలనూ సమాజంలో ఉమ్మడి బాధ్యతలనూ పాఠ్యపుస్తకాలలో విపులంగా చర్చించకుండా తరువాతవచ్చే దుష్పరిణామాలపై తలలుపట్టుకోవడం చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకోవడమే. ఇట్లాంటి సామాజిక దుష్పరిణామాలను నివారించడానికి మాతృభాషా మాధ్యమం అత్యంత ఆవశ్యకం.
 
                  పిల్లలకు బడిలో నేర్చినదానికీ ఇంట్లోనూ తన చుట్టూవున్న సమాజంలోనూ తను పాటించాల్సిన మానవీయ విలువలకు పొంతన ఉండాలి. బడిలో ఎంతసేపూ మానవ సంబంధాల బోధనను చులకనచేసి చిన్నచూపు చూస్తూ సమాజంతో మంచిగా మెలగాలని కోరుకోవడం ఒక భ్రమే ఔతుంది. మన సమాజంలోనూ కుటుంబాలలోనూ వ్యక్తుల హక్కులనూ సామాజిక బాధ్యతలనూ గుర్తిస్తూ మానవీయ విలువలను పాటించే ఓర్పునూ నేర్పునూ మాతృభాషద్వారానే నేర్పించాలి. ఇది తల్లి ఒడిలోనేమొదలౌతుంది. మధ్యలో ఆంగ్లభాష పెత్తనం ఎందుకు?
తెలుగువదిలి ఇంగ్లీషు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఆర్ధిక పరిస్థితులు మెరుగౌతాయి అనడం పచ్చి అబద్ధమే. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక 2014-15 గణాంకాల ప్రకారం భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం 17.01%, పరిశ్రమలు 30.02%, సేవలు 52.97% (నిర్మాణం, వాణిజ్య-వ్యాపారాలు, హోటళ్లూ-రెస్టారెంట్లూ, రవాణా, నిలువలూ, సమాచార ప్రసారం, సామాజిక సేవ, బీమా రంగాలు). ఈ గణాంకాలను ఎలా విశ్లేషిస్తాం? ఉద్యోగరంగ సమాచార వ్యవస్థ: ఉద్యోగ మంత్రిత్వ శాఖవారు విడుదలచేసిన నివేదికలో భారతదేశంలో 52.85% ప్రజలు వ్యవసాయరంగంలోనూ, 24.08% సేవారంగంలోనూ, 23.07% ఉత్పాదక, అనుత్పాదక నిర్మాణ వాణిజ్య రంగా లలోనూ ఉపాధి పొందుతున్నారు. అంటే వ్యవసాయరంగంలో తెలుగూ తదితర భారతీయభాషలనేగానీ ఇంగ్లీషు వాడరుగదా. సేవా రంగంలోనూ భారతీయ భాషలనే ఎక్కువగా వాడతాం, ఇంగ్లీషు వాడకం తక్కువ. మిగిలిన ఉత్పాదక, అనుత్పాదక నిర్మాణ రంగాలలో ఎక్కువ శాతం భారతీయ భాషలను వాడినా చెప్పుకోదగిన స్థాయిలో ఇంగ్లీషు వాడకం ఉంది ఐతే అది పైస్థాయిలలోనే. అంటే మన స్థూలజాతీయ ఉత్పత్తికి ప్రధానాధారం భారతీయ భాషలేగానీ ఇంగ్లీషు కాదు అనితెలుస్తోందికదా. మరి మన ఉత్పాదక శక్తికి ఆలంబనగా నిలిచి దేశా భివృద్ధికి తోడ్పడే తెలుగూ తదితర భారతీయ భాషలను వదిలివేయాలనే ఆలోచనా సరళి అశాస్త్రీ‌యంగాక ఏమౌతుంది?
 
                  విదేశాలకు వెళ్లిన మనవారు ప్రపంచం నలుమూలలా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నది ఎంత? స్థూల జాతీయ ఉత్పత్తికి ప్రవాస భారతీయుల వాటా 4ర మాత్రమే. ఇందులోనూ తక్కువ నైపుణ్యాలు ఉన్నవారూ, అర్ధనైపుణ్యం గలవారే ఎక్కువ. మన ప్రవాస భారతీయులు ఎక్కువగా ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలోనే ఉద్యోగాలను వెతుక్కొంటున్నారు. అంటే వీరిలో ఎక్కువమందికి ఆంగ్ల భాషా మాధ్యమంతో పనిలేదు. ఐతే, ఇంగ్లీషూ ఇతర విదేశీ భాషలు నేర్చుకొనే సౌకర్యం కావాలి.
 
                  తెలుగూ తదితర భారతీయ భాషల స్థానే ఇంగ్లీషును ప్రవేశపెడితే జరిగే ఘోర విధ్వంసానికి గురయ్యేది సినిమా పరిశ్రమ, ఇంకా దాని ఆధారంగా చేసుకొని నడుస్తున్న బుల్లితెర పరిశ్రమ. సంవత్సరానికి 16,250 కోట్ల వ్యాపారానికి చేరిన సినిమా పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. భారతీయ సినిమా పరిశ్రమలో ఎక్కువ సినిమాలతో, ఎక్కువ థియేటర్లతో ప్రపంచంలోనే ముందున్నది తెలుగు సినిమా. తెలుగును పక్కనబెడితే తెలుగు సినిమా పరిశ్రమను ఘోర విధ్వంసానికి గురిచేసినట్లే. తెలుగు సినిమాను నాశనంచేసి ఇంగ్లీషు సినిమాలను తీసుకువచ్చే ప్రయత్నం వెనుక ఓ అంతర్జాతీయ కుట్ర ఉండివుండాలి. ఇది చిత్రపరిశ్రమపై ఆధారపడి జీవించే లక్షలాదిమంది జీవి తాలను తొక్కివేసినట్లే. వేలాదిమంది కళాకారులూ సాంకేతికనిపుణులూ శ్రామి కులూ రోడ్డునబడతారు. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగదు. భారతీయ ముద్రణా పరిశ్రమ వ్యాపారం యేడాదికి దాదాపు 25వేలకోట్లకు చేరుకుంది.
 
                  ప్రపంచంలోనే ఎక్కువ అచ్చుయంత్రాలు ఉన్న దేశంమనది. దీనిద్వారా సుమారు 25లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ముందుముందు ప్రపంచంలోనే మొదటిస్థానానికి చేరుకోబోతున్న పరిశ్రమ ఇది. ఇక ఇంగ్లీషు మాధ్యమం వస్తే వేలాది రచయితలూ, లక్షలాది ఉద్యోగులూ పనిలేక మూలన కూర్చోవలసిందే. అమెరికా, ఇంగ్లండు, ఆస్ర్టేలియా మొదలైన దేశాలలో కూర్చొని రాసిందే అచ్చయ్యి మన ముందుకు వస్తుంది. మన జనవిధ్వంసానికి ఇంతకన్నా ఏంకావాలి. ఇంగ్లీషు మీడియం భారతదేశానికి అణుబాంబే. దానితో ఎన్నో దేశీయ పరిశ్రమలు మూల బడతాయి. లక్షలాదిమంది ఉద్యోగస్తులు ఉపాధికోల్పోతారు. ఈ జీవ విధ్వంసాన్ని ఎలాగైనా ఆపాలి.
 
                  మాధ్యమిక స్థాయి వరకూ విద్య పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉచిత విద్యావిధానంలో నడవాలి. తెలుగు మాధ్యమంలోనే ఉండాలి. దీనివలన పసి వయసులో విద్యార్థులమధ్య ప్రభుత్వబడుల విద్యార్థులనీ కార్పోరేట్‌ బడుల విద్యా ర్థులనే భేదభావం రాదు. సమాజంలో చిన్నతనంనుండే ఏర్పడే వైరుధ్య భావా లను కొంతవరకైనా నివారించినవాళ్లం ఔతాం. జపానూ చైనాలు ఇట్లాంటి విద్యా వ్యవస్థనే నడుపుతున్నాయి. ఒకవేళ మైనారిటీ సముదాయాలవారూ ఇతర ప్రైవేటు విద్యాసంస్థలూ ఇలాంటి బడులు నడపాలంటే ప్రభుత్వ గుర్తింపుతో నడపవచ్చు కానీ విద్యార్థులనుండి ఎలాంటి రుసుమునూ వసూలుచేయరాదు. ఇంగ్లీషూ తదితర భాషలు ప్రత్యేక విషయాలుగా మాత్రమే ఉండాలి. ప్రతి స్కూలులోనూ అది ఉన్న స్థానిక జనాభా ప్రాతిపదికన మాత్రమే తెలుగేతర మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. మనకందరికీ పుట్టుకతో వచ్చి తల్లి ఒడిలోనూ బడిలోనూ మనతో ఉండి మనకు ఇంత మానసిక ధైర్యాన్ని కలిగించి నేర్చినదాన్ని రాయడానికీ చెప్పడానికి వీలు కలిగేది తెలుగులోనే. మాతృభాషలో భావప్రకటన స్వేచ్ఛకు సంకేతం. కొత్త విషయాల ఆవిష్కరణకు మాతృభాష చిరునామా.
 
వ్యవసాయరంగంలో తెలుగూ తదితర భారతీయభాషలనేగానీ ఇంగ్లీషు వాడరుగదా. సేవా రంగంలోనూ భారతీయ భాషలనే ఎక్కువగా వాడతాం. అంటే మన స్థూలజాతీయ ఉత్పత్తికి ప్రధానాధారం భారతీయ భాషలేగానీ ఇంగ్లీషు కాదు. మరి మన ఉత్పాదక శక్తికి ఆలంబనగా నిలిచి దేశాభివృద్ధికి తోడ్పడే తెలుగూ తదితర భారతీయ భాషలను వదిలివేయాలనే ఆలోచనా సరళి అశాస్త్రీ‌యంగాక ఏమౌతుంది? 
  ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 
9866128846

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP