ఎవరు వీఐపీ? వేంకటేశ్వరుని సన్నిధిలో !!!
>> Sunday, September 20, 2015
కలియుగ
ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం, సేవల నిమిత్తమై
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. చాలా ప్రాచీనమైన
భారతీయ సంస్కృతిలో భక్తి భావనతో కూడిన ఆధ్యాత్మ చింతన భారతీయుల రక్త
నిష్టమైన గుణం. అటువంటి అచంచల విశ్వాసంతోనే అసంఖ్యాక భక్తులు తిరుమలకు
వస్తున్నారు. వేల సంఖ్యలో ఇంకా చెప్పాలంటే గరుడసేవ లాంటి సందర్భాలలో లక్షల
సంఖ్యలో తిరుమలకు వస్తున్న భక్తులలో కొంత మందిని వీఐపీలుగా, ఇంకా
వీవీఐపీలుగా పరిగణించటం, వారికి అటువంటి రీతిలోనే రాచమర్యాదలు చేయడం
పరిపాటిగా ఉంది. అయితే వీరంతా లౌకిక దృష్టిలోనే వీఐపీలుగానో, వీవీఐపీలుగానో
పరిగణింపబడే వారే. కరుణా సముద్రుడు, ధర్మావతారుడునైన శ్రీనివాసుని
దృష్టిలో ఇలా పరిగణింపబడే వారందరినీ వీఐపీలుగా నిర్ధారింపలేము. పవిత్రమైన
ఆధ్యాత్మ దృక్ఫథంతో వివేచన చేసి చూస్తే దేవదేవుడైన పరమాత్మ దృష్టిలో పరమ
భాగవతోత్తములు, మహాయోగులు అనబడే వారే వీఐపీలు. శ్రీవేంకటేశ్వర స్వామి
వైభవాన్ని తత్త్వాన్ని, మహత్యాన్ని అద్భుతంగా వర్ణించిన పురాణాలను బాగా
అధ్యయనం చేస్తే ఈ అంశం తేటతెల్లమవుతుంది. వరాహ పురాణం, పద్మ పురాణం,
బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం వంటి 12 పురాణాలలో వర్ణింపబడి ఉన్న
శ్రీ వేంకటాచల మహాత్య కథా విశేషాలను పరిశీలిస్తే శ్రీవారి నిజమైన కరుణా
కటాక్షాలకు పాత్రులైన మహాభక్తుల వృత్తాంతాలు విశదమవుతాయి. వరాహాది
పురాణాలలో భీముడు అనబడే భక్తుడు మట్టితో చేసిన తులసీ దళాలతో శ్రీనివాసుని
పూజింపగా, తొండమాన్ చక్రవర్తి సమర్పించిన బంగారు తులసీ దళాల కంటే వానినే
నిండు మనస్సుతో స్వీకరించినట్లు ఐతహ్యం వర్ణింపబడి ఉంది. తొండమాన్
చక్రవర్తి సైతం ఆ భీమ భక్తుని అనుపమాన భక్తి తాత్పర్యానికి ముగ్ధుడై
స్వయంగా వెళ్ళి ఆ భాగవతోత్తముని దర్శించినట్లు ఆ పురాణాలలో వర్ణింపబడి
ఉంది. ఇక్కడ తొండమాన్ చక్రవర్తి దేశాన్ని పరిపాలించే మహోన్నత స్థాయిలో
ఉన్న పదవి రీత్యా వీఐపీ కావచ్చు. కాని శ్రీనివాసుని దృష్టిలో భీముడే వీఐపీ
అయినాడు. ఈ అంశాన్ని అన్నమయ్య కూడా తన సంకీర్తనలలో కుమ్మర దాసుడైన
కురువరత్తి నంబి అని ఆ మహా భక్తుని వైశిష్ట్యాన్ని వర్ణించి యున్నాడు.
మహా
భారతంలో కురుక్షేత్ర యుద్ధంలో తమకు సహాయం చేయవలసిందిగా శ్రీ కృష్ణ
భగవానుని దగ్గరకు దుర్యోధనుడు, అర్జునుడు ఇరువురు వచ్చిన సన్నివేశం చూస్తే
కూడా దేవదేవుని దృష్టిలో ఎవరు వీఐపీలో తేటతెల్లమవుతుంది.నిజానికి ఆ
ఇరువురిలో దుర్యోధనుడు పదవి రీత్యా వీఐపీ కావచ్చు. ఇంకా చెప్పాలంటే రారాజు
అనిపించుకున్న వాడు కాబట్టి వీవీఐపీ కూడా కావచ్చు. అర్జునుడు అప్పుడే
అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్న రాజ్యాధికారం లేని సామాన్య భక్తుడే
కావచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుని దృష్టిలో అర్జునుడే వీఐపీ. ఎందుకంటే
దుర్యోధనుడు వస్తున్నట్లు తెలియగానే ఆ స్వామి లేని నిద్ర నటించినాడు.
అర్జునుడు వచ్చిన తర్వాతనే మేలుకాంచి యుద్ధంలో తన నిజమైన సహాయం అర్జునునికే
చెందేటట్లుగా లీలావిభూతిని ప్రదర్శించినాడు. ఈ దృష్టాంతాలన్నీ పరిశీలిస్తే
దేవదేవుడైన శ్రీనివాసుని కృపాకటాక్షానికి పాత్రులు కావాలంటే అచంచల భక్తి
విశ్వాసంతో కూడిన భాగవత విజ్ఞాన సంస్కారం అవసరం. అటువంటి భాగవతోత్తములైన
భక్తులు లఘుదర్శనం చేసుకున్నా, మహా లఘు దర్శనం చేసుకున్నా తప్పక శ్రీవారి
కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరు. భక్తి రసాంకితమైన భాగవత లక్షణం లేకుండా
కులశేఖరప్పడిదాకా వెళ్ళి, హారతులతో కూడిన శ్రీవారి దర్శన సేవా భాగ్యం
పొందగలిగినా వారు ఆ దేవదేవుని దృష్టిలో వీఐపీలు కాజాలరు.
తిరుమలకు
వచ్చే అసంఖ్యాక భక్తులతో మరొక విధమైన భావన కూడ బలీయంగా వినిపిస్తూ
ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి శ్రీవారి సన్నిధికి వస్తే ఒక్క నిమిషమైనా
శ్రీనివాసుని చూడనీయకుండా లాగివేస్తూ ఉంటారే... అని. ఇందుకు సరియైున
సమాధానం భవిష్యోత్తర పురాణంలోని రహస్యాధ్యాయంలో ఉంది. యుగాంతం క్షణమాత్రేణ
తేషాం కాలస్తు గచ్ఛతి... అని పేర్కొనడాన్ని బట్టి శ్రీవారిని ఒక్క క్షణం
చూస్తే ఒక యుగకాలం చూచినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి పుణ్య ఫలం
భక్తులందరికీ ప్రాప్తించాలంటే ప్రతి భక్తుడు తన వెనుక ఎందరో భక్తులు అవకాశం
కోసం తపిస్తు న్నారనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. బ్రహ్మాది దేవతలు కూడా
శ్రీనివాసుని దర్శన సేవా భాగ్యానికై నిత్యం వస్తూ ఉంటారని, వారు కూడా
శ్రీవారి సన్నిధిలో ఎక్కువసేపు శ్రీవారిని సేవిస్తూ ఉండాలని ప్రయత్నిస్తే
విష్వక్సేనుడు తన బంగారు బెత్తంతో వారి తలపై ఒక్క దెబ్బ వేస్తాడని మనం
ప్రతి రోజూ వింటూ ఉన్న శ్రీవారి సుప్రభాతంలోని శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ
నిర్మలాంగాః... అనే శ్లోకం ద్వారా తెలుస్తూ ఉంది.
మేడసాని మోహన్
1 వ్యాఖ్యలు:
Chala baaga chepparandi....
Post a Comment