శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

భద్రాచలంలో అడుగడుగునా రామనామ మహిమతో సాగిన సంకీర్తనాయజ్ఞం

>> Tuesday, July 8, 2014

సర్వలోక శరణ్యుడైన శ్రీరామచంద్రుని నామం పరమ పావనం. సర్వపాప,కలుషహరణం,సర్వజీవులకు రక్షాచక్రం.అటువంటి రామనామాన్ని స్మరించినా లిఖించినా అనంతపుణ్యం. విశేషించి ఎక్కడ రామనామ స్మరణజరుగుతుందో అక్కడ హనుమంతుల వారు రక్షకులై నిలుచుని కాపాడుతుంటారనేది సత్యం.
అటువంటి రామనామాన్ని సామాన్యులుకూడా లిఖించి మేలుపొందటం ఒక దివ్యమైన సాధనావిధానం.
మన పీఠంలో ఈసంవత్సరం నిర్వహించబడ్డ హనుమత్ రక్షాయాగంలో భాగంగా సామూహికంగా ఇరవైనాలుగు కోట్ల రామనామలేఖన కార్యక్రమమును చేపట్టటం జరిగినవిషయం మీకందరకూ విదితమే.
యాగానంతరం   పీఠమునకు చేరిన రామనామ లేఖన ప్రతులను తీసుకుని "రామదండు"  శుక్రవారం నాడు భద్రాచలమునకు బయలుదేరినది . అప్పటివరకు ఎంతమంది వస్తారో సందిగ్దంగా ఉండటంతో అంబసత్రం వారిని ఒక వందమందికి వసతి కల్పించవలసినదిగా కోరటంజరిగినది. తీరా గిద్దలూరు ప్రాంతం నుంచే తొంభైమంది రైల్లో బయలుదేరామని చెప్పారు. మిగతా ప్రాంతాలవారిని బస్సులలోవచ్చి విజయవాడలో కలవమని చెప్పటం జరిగినది.
బయలుదేరే రోజు తెలంగాణాలో  ఐదు ఆరు తారీఖులలో ఆంధ్రా బస్సులను తిరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని వార్త వచ్చినది.

మొట్టమొదట అడుగులోనే అడ్డంకా స్వామీ ! అని హనుమంతులవారి కి చెప్పుకుని ఆయనపైనే భారం వేశి బయలుదేరాము. విజయవాడలో డ్రైవర్లు కూడా పాల్వంచదాకా వెళ్లగలుగుతామేమో నని చెప్పినా చివరకు  తెల్లవారు జాముననాలుగు గంటలకు చేరాము అప్పటికే మొత్తం నూటాఎనభైమందిమయ్యాము.
తెల్లవారే సరికి మరో ఇరవైమందయ్యారు. 
పొద్దుటే స్నానాదులు పూర్తిచేసుకుని గోపూజ కు సిద్దమయ్యాము . అప్పటికే భద్రాచలవాసులైన రాజశేఖర్ అనే భక్తుడు గోపూజకోసం  పెద్దగెల అరటిపండ్లు అంబసత్రం నకు చేర్చి ఉన్నారు. బంజర అనే గ్రామంలో ఉన్న నాపూర్వ విద్యార్థినులు మూడు మోపుల పచ్చిగడ్డిని ఆటోలో పంపారు. ముందుగా గణపతి స్తుతితో సంకీర్తన ప్రారంభమయింది. అప్పటికే మా ఆవిడ, మాతమ్ముని భార్య గోమాతలను పసుపుకుంకుమలతో అలంకరించారు. భక్తులందరకూ అరటిపండ్లు అందించి గోవిందనామ సంకీర్తన ప్రారంభింపజేశాము. గోవిందుని నామాలను ఆలకిస్తూ అరటిపండ్ల నివేదన రుచిని  ఆస్వాదిస్తూ గోమాతలు ఆనందం పడినాయి. వచ్చిన పచ్చిగ్రాసాన్ని తింటూ ఆనందించటాన్ని ఆశీశ్శులుగా భావించాము. 

రామనామ ప్రతులను తలలపై దాల్చి న రామదండు కార్యకర్తలకు హారతులిచ్చి గిరిప్రదక్షినను ప్రారంభిమ్చారు. దారిలో అడుగడుగునా భద్రాచలంలోని భక్తులు  రామనామలేఖన ప్రతులను తాకి నమస్కరించుకుంటుండగా గిరి ప్రదక్షిణం చేసి స్వామి సన్నిధికి చేరినది రామదండు.  లోపల అర్చకులు ఆ ప్రతులను స్వీకరించి నేరుగా  భద్రాద్రిరాముని పాదాలదగ్గర ఉంచటం నిజంగా స్వామి అనుగ్రహమని మురిసిపోయారు కార్యకర్తలంతా.
ఆపై ఆలయంలో సంకీర్తన చేయటం,రామనామ లేఖనసందర్భంగా నిరూపణ అయిన మహిమలను గూర్చి చెప్పుకోవటం జరిగినది.
 మరలా అంబసత్రమునకు వచ్చి అల్పాహారం స్వీకరించి అమ్మ బాలాత్రిపురసుందరి సన్నిధిలో ఒంటిగంటదాకా సంకీర్తనతో పులకించిపోయారు కార్యకర్తలు.  ఈకార్యక్రమం గూర్చివిని విజయవాడనుండి వచ్చి పాల్గొన్న మూర్తిగారు వారిశ్రీమతిగారూ సంకీర్తనలో పాల్గొన్నారు.
భోజనానంతరం కొందరు పర్ణశాలకు వెళ్ళగా కొందరు విశ్రాంతి తీసుకున్నారు. మరలా సాయంత్రం రామదాసుధ్యానమందిరంలో సంకీర్తన కొద్దిసేపు చేసి   ఆలయానికి చేరుకుని ఆంజనేయస్వామివారి సన్నిధిలో సంకీర్తన చేసుకున్నాం . విశాఖపట్టణం నుండివచ్చిన శ్రీనివాస్ గారి బృందం vaari సంకీర్తన ప్రతిహృదయంలో రామనామామృతాన్ని చిలుకరించినది. అనుకోకుండా బెంగళుర్ నుంచి హరి అతని మిత్రబృందం,హైదరాబాద్ నుండి పవన్ అతని మితృడు   అలాగే మాన్యశ్రీ సుభాష్ గారు,గిద్దలూరు నుండి గోరంట్లయ్య గారు వారిభార్య ,ఒంగోలునుండి శ్రీనివాసరెడ్డి ఆయనబంధువు కూడా ఈ కార్యక్రమానికొచ్చి చేరుకుని ఏపరిచయం లేకున్నాశ్రీరామ నామం ద్వారా ఏర్పడే బాంధవ్యం ఎంతగొప్పదో  అని ఆనందపడ్డారు.సంకీర్తన ముగించి మరలాస్వామి దర్శనం  చేసుకుని సత్రం నకు చేరుకున్నాము. మాన్యశ్రీ సుభాష్ గారి ఏకాంతసేవకు వెళ్ళగా స్వామి వారి శయ్యపై పూలదండ మాకోసం ప్రసాదంగా అందజేయించారు రామయ్యతండ్రి కరుణతో. మరుసటిరోజు ఉదయం గోదావరిపై పడవలో రాజమండ్రి వెళ్ళి అక్కడనుండి తిరుగు ప్రయాణమవ్వాలని మా రామదండు పిల్లలంతా ఉత్సాహం చూపటంతో అందుకై మోటారు పడవకు టికెట్లు బుక్ చేసుకున్నారు యాభైమంది భక్తులు
ఆదివారం ఉదయాన్నే   బోట్ ఏజంట్లు ఏర్పాటుచేసిన వాహనాలు వచ్చేసరికి ఖాళీగా ఉండటమెందుకని  మరలా సంకీర్తన మొదలెట్టారు. ఒకగంటసేపు పరవశించిపోయాయి హృదయాలు. ఖచ్చితంగామంగళహారతిగీతం పాడిముగించే సమయానికి  ఆలయదర్శనానికెళ్ళిన హరి పెద్దలడ్డు తెచ్చి చేతిలోపెట్టాడు  ,స్వామీ! అందరికీ పంచండి అని.    ఇలా ప్రసాదం పంపి      మమ్ములను కరుణతోగాస్తున్నానని స్వామి సంకేతమిచ్చారు కదా! అని సంబరపడ్డాము.

ఇక భద్రాచలం నుండి వాహనాలలో డెబ్భై కిలోమీటర్లు తీసుకెళ్ళి బోట్ ఎక్కించారు. చిత్రమేమిటంటే  ఆ పడవ పేరు
శ్రీరాములు. తండ్రీ భవసాగరమును దాటుటకు శ్రీరామ నామమే దిక్కు అని ఇలా చూపించావా అని రెపరెపలాడె ధ్వజంపై  కూర్చున్న  హనుమత్ప్రభువుకు మొక్కుకున్నాము .  పడవ బయలుదేరేముందు మేము వాయిద్యాలు సరిచెసుకోవటం చూసి   రోజూ ఆపడవలపై యాత్రికుల కోసం పడవ యాజమాన్యం ఏర్పాటుచేస్తున్న  సినిమాచెత్తడాన్స్ బృదం పడవ ఎక్కకుండా వెళ్ళారట [ఆవిషయం మాకు తరువాత చెప్పారు.] లేకుంటే ఆదరిద్రపుడాన్సులు పాటలతో తలలూపి   భద్రాచల  యాత్ర ఫలితం పోగొట్టుకునేవారు మా రామదండు లో కుర్రపిల్లలు.
ఎండ తీవ్రంగా ఉంది .ఇక మేముసంకీర్తన మొదలెట్టెసరికి ముందువరుసలోకూర్చున్న యాత్రికులకు  సంకీర్తన ఇష్టం లేనట్లుంది ఒకనితో వాద్యబృందంలో హార్మోనిస్ట్ నాగేశ్వరరావుగారికి వాదనయింది . శకునం బాలేదు ఆపెయ్యండి అని చెప్పిటాప్ మీదనుండి దిగి కిందకువచ్చి కూర్చున్నాము.
దారిలో పేరంటాళ్లపల్లిలో ఉన్న ఓ మౌనయోగిమఠంలో అద్భుతంగా వున్న వాతావరణం చూసి ఇక్కడుంటే చాలు హరినామసంకీర్తనచేసుకుంటూ కాలం గడిపెయ్యవచ్చు అనిపించినది. మధ్యాహ్నం  భోజనాలకు ఆపిన ఇసుకతిన్నెలపై పడివున్న మద్యంబాటిళ్లు,చెత్తాచెదారం చూసి  ఒకనాడునదీతీరాలలో నాగరికత వెళ్లివిరిస్తే ఈరోజు నదులను కలుషితం చేయటమే  నాగరికత గా భావించటం జరుగుతున్నదన్న ఒక మితృలమాట గుర్తుకొచ్చింది. ఇలాంటప్పుడు నదులుకోపగించటంలో తప్పులేదేమో ?

భోజనానంతరం సరంగులు మావద్దకొచ్చి స్వామీ ! మా పడవలో మీరు సంకీర్తనచేయాలని బ్రతిమాలారు. పైన ఉన్నవారికిష్టం లేకుంటే క్రిందకాబిన్ లో చేయాలని మరీమరీ కోరారు.  ఇంకో విషయం తెలుసా ?  భద్రాచలేశునికి ప్రతి సంవత్సరం తెప్పోత్సవానికి ఈ పడవనే హంసవాహనం గా అలంకరిస్తారు  కనుక మీరు ఈపడవలో పాడాలి అన్నారు.
ఆహా! తనువుమనసు పులకరించాయి మాకు. సాక్షాత్తూ స్వామివారు తామువిహరించినపడవ ను ఎక్కేలాచేశారు.
ఆ భావనే మనసును ఊయలలూగించింది. సంకీర్తన  సాగతుండగా  వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మావాళ్లు స్వామీ ! చాలాబాగుందిప్పుడు పదవప్రయాణం అన్నప్పుడు ఆయన అనుగ్రహముంటే వర్షంకూడావస్తుంది అన్నాను యథాలాపంగా.  నిజంగానే మాప్రయాణంలో ఆశీఃపూర్వకంగా చల్లిన అక్షతలవలె చినుకులుచల్లారు ప్రకృతిమాత .
రాత్రికి రాజమండ్రి చేరుకుని అక్కడనుండి తెల్లవార్లూ ప్రయాణించి ఇంటికి చేరుకున్నాము రామయ్యతండ్రి దివ్యరూపాన్ని స్మరిస్తూ ,తల్లి సీతమ్మ కరుణను ప్రస్తుతిస్తూ, హనుమయ్యకృపను గుర్తుచేసుకుంటూ..

[హనుమత్ రక్షాయాగ నిర్వహణాభారాన్ని మీదవేసుకుని నడిపించిన శ్రీ నూకలశ్రీనివాస్ గారు[ యుఎస్ ఎ], మా కుర్రవాళ్లు చెనికలమనోహర్ [బెంగళుర్], చింతలపాటి శ్రీకృష్ణ [బెంగళూర్] పెండేల వి.ఆర్. సూర్యనారాయణ [యు ఎస్ ఎ] సునీల్ వైద్యభూషణ్  శ్రీకాకుళం    లదే ఈకార్యక్రమ ఏర్పాట్లలో కూడా భారం యాత్రాఫలితంలో అగ్రభాగం కూడా .వారికి రామదండు తరపున ధన్యవాదాలు తెలుపాలని ఉంది. కానీ వాళ్ళే రామదండులో భాగం కనుక ఏమనిచెప్పను?]

జైశ్రీరాం
కొన్ని వీడియోలు ఇక్కడ చూడండి[మరికొన్ని ఇక్కడుంచుతాము]


గోవింద నామసంకీర్తనతో  గోపూజ
ఇరవై నాలుగుకోట్ల రామనామలేఖన కార్యక్రమంలో లిఖించబడ్డ రామనామ ప్రతులతో "రామదండు"
 భద్రాచలేశుని సన్నిధిలో సంకీర్తన
తల్లిగోదారి ఒడిలో  శ్రీరామ నామ నావపై  సంకీర్తన

1 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. July 11, 2014 at 5:38 AM  

ఆర్యా! దుర్గేశ్వరా! నమస్సులు.

రామ సుధార్ణవంబది. పరాత్పరు సన్నిధి,రామ పెన్నిధిన్
క్షేమముఁ గూర్చు శ్రీహనుమ,శ్రీకర భక్త జనాళికంతకున్.
స్వామి దయాసుధారసము చక్కగ గ్రోలిన భక్తవర్య!మీ
ప్రేమకు పాత్రమై నిలుచు విజ్ఞులకెల్ల నమస్కరించెదన్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP