శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మోక్షం పొందేందుకు పూజలు, జపాలు, స్తోత్ర పారాయణలు అవసరమా?

>> Monday, November 25, 2013

మోక్షం పొందేందుకు పూజలు, జపాలు, స్తోత్ర పారాయణలు అవసరమా?
అది పొరపాటు.  ఇవన్నీ భక్తీ యొక్క అంగాలు.  పాలను పోసే ముందు పాత్రను ఎలా శుద్ధి చేస్తామో అలానే పరమపవిత్రమైన జ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడి హృదయ క్షేత్రము కూడా శుద్ధి పొందాలి.   అందుకే 'మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవగరీయసీ' మోక్షసాధనకు అంతఃకరణ శుద్ధి అవసరము.  అట్టి అంతఃకరణ శుద్ధికి భక్తి అనే మార్గాన్ని సూచించారు.  కాబట్టి భక్తుడు కానిదే జ్ఞాని కాలేడు.  జ్ఞానార్జనకు భక్తి మొదటి మెట్టు.  ఈ మెట్టునే ఎక్కలేని వాడు మోక్షపదానికి అర్హుడు కాలేడు.  కాబట్టి సాధకుడు పూజ, జపము, స్తొత్రపారాయణల వంటి సత్కర్మలను ఆచరించి భక్తి అనే సోపానంతో అంతఃకరణ శుద్ధిని పొందగలడు. 

భక్తి అంటే ఏమిటి?
నుదుట విభూతి రేఖలు, బొట్టు ధరించి ఉదయం, సాయంత్రం పూజలు చేయడం, ప్రతిరోజూ గుడికి వెళ్ళడం వంటివి భక్తికి బాహ్యాంగాలు మాత్రమే.  భక్తి అనే మహత్తరమైన భావాన్ని వీటి వరకే పరిమితం చేయకూడదు.  రౌడీలు, గూండాలు, ఖూనీ చేసే వారు కూడా బొట్టు పెట్టుకుంటారు.   పూజలు చేస్తారు.  గుళ్ళు, గోపురాల చుట్టూ తిరుగుతారు.  కనుక భక్తిని కేవలం ఈ బాహ్యకర్మలకే పరిమితం చేసి సంకుచితభావన తో చూడకూడదు.  భక్తునిలో చిత్తశుద్ధిని కలిగించి క్రమేపీ అతనిని పరిపక్వస్థితికి చేర్చేదే భక్తి. అట్టి చిత్తశుద్ధి కలిగిన సాధకుడు ధ్యానం ద్వారా అంతర్ముఖతను పొంది నిజస్వరూపమైన ఆత్మతత్త్వమందు నిశ్చల స్థితిని పొందగలడు. 

ధ్యానంలో మనసు నిలకడగా ఉండడం లేదు.  ఎందువల్ల?
మనసు అలజడి, ఉద్వేగాలకు లోనై రకరకాల విన్యాసాలు చేస్తుంది.  ఈ విన్యాసాలకు, వికారాలకు మన ఆహార విహారాలే కారణమౌతున్నాయి.  కనుక సాధకుడు తన ఆహార విహారాల్ని, చుట్టూ ఉండే పరిసరాలను తన సాధనకు సానుకూలమైనట్లుగా మార్చుకోవాలి.   అంతే కాని సాధనకు విరుద్ధమైన మార్గాలలో పయనిస్తూ మనసు నిలవడం లేదని ఫిర్యాదు చేయడం సముచితం కాదు. 

మరి ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి సహకరిస్తాయా?
ప్రాణాయామం, యోగాసనాల వల్ల శరీరంలోని నాడులు శుద్ధమై చక్కటి దేహధారుఢ్యం లభిస్తుంది.   అయితే మనసు ఏకాగ్రతను పొందాలంటే అంతరంగిక సాధనను అలవాటు చేసుకోవాలి.  తిరిగే ఫ్యానుని ఆపడానికి స్విచ్ నొక్కినట్లుగా పరుగులు తీసే మనసుని నియంత్రించేందుకు కూడా మార్గముంది.
"సత్సంగత్వే నిస్సంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం 
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః" అన్నారు.
సత్సంగంలో మనసు పరివర్తన పొందుతుంది.  తద్వారా అంతర్ముఖమై క్రమేపీ ప్రశాంతతను పొంది స్వస్వరూపాన్ని గుర్తించ గలుగుతుంది. 

సత్సంగం అంటే ఏమిటి?
1) సత్పదార్థేన సంగః   (2) సత్ శాస్త్రేణ సంగః     (3) సజ్జన సంగః అని మూడు విధాలుగా వివరించారు.  సత్పదార్థమంటే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్త్వం.  అట్టి తత్త్వ స్వరూపానికి ఆద్యంతాలు లేవు.  చావు పుట్టుకలు లేవు.  వినాశం వుండదు.  కనుక ఆ పరమాత్మ తత్త్వం నిత్య సత్యమై, శాశ్వతమై శోభిల్లుతుంది.  అట్టి ఈ తత్త్వాన్ని గ్రహించాలంటే మనకు ప్రమాణం వేదశాస్త్రాలే.  వాటిని మనంతట మనమే గ్రహించలేము కనుక వాటిని బొధ పరచే ఓ సజ్జనుడు కావాలి.  వారినే గురువు అంటాం.  అట్టి గురువునే సజ్జనుడని, వేదశాస్త్రములనే సచ్చాస్త్రమని, పరమాత్మ తత్త్వాన్ని సత్పదార్థమని, వీటితో సంగాన్ని పెంచుకోడాన్నే సత్సంగమని శాస్త్రాలు పేర్కొన్నాయి.  ఇంతటి సమగ్రమైన బోధనా విధానం ఒక్క హిందూ ధర్మంలో తప్ప మిగతా ఎందులోనూ ఇంత విశేషంగా కానరాదు.  కావున హిందువుగా జన్మించడం ఒక వరమైతే హిందూ ధర్మం బోధించే మార్గంలో పయనించి జన్మను చరితార్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ధన్యులే. 
     
హరిః ఓం తత్సత్ 
...

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP