శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏ ఏ దేవతలను ఆరాధిస్తే శుభం కలుగుతుంది?

>> Monday, November 18, 2013


ఏ దేవతనైనా ఆరాధించవచ్చు.  ఈ విగ్రహారాధన భక్తుని మనో నిశ్చలతకు ఉపకరిస్తుంది.  అందుకే 'సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనా' తత్వాన్ని గ్రహించే సూక్ష్మ బుద్ధిని పొందాలంటే ప్రప్రథమంగా సాధకులు ఈ సగుణ రూపంలో వుండే దేవతలను ఆరాధించాలని, సాధకులకు వీలుగా పరతత్వంలో సగుణ  చేయబడింది.  అందుకే  పంచాయతన దేవతారాధనను శ్రేష్ఠంగా పరిగణించాయి.

పంచాయతన దేవతలంటే?

ఆదిత్యం అంబికామ్ విష్ణుం గణనాథం మహేశ్వరం
పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం

ఆదిత్యం - సూర్యుడు,
అంబికా -
అమ్మవారు,
విష్ణుం - మహావిష్ణువు
గణనాథం - గణపతి
మహేశ్వరం - ఈశ్వరుడు  
ఈ ఐదుగురినీ పంచాయతన దేవతలని అంటారు.  హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నాయి.
'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అన్నారు.  సూర్యుడు ప్రత్యక్ష దైవం.  కర్మ సాక్షి.  యావత్ సృష్టికీ శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి, ఓజస్వి.  ఆయనను ఆరాధించడం ద్వారా ధృఢ ఆయురారోగ్యాలను పొందుతారు.
'సాహిశ్రీరమృతాసతాం' - అమ్మ వారిని మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ రూపమైన లలితాంబికగా ఆరాధించాలి.   అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్ శుద్ధి, సంపద, వర్చ్చస్సు, సుభాగ్యం, త్రికాల దర్శనం, దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి.  వీటన్నింటికన్నా అంతఃకరణ శుద్ధి కలిగి మానసిక పరిణతి పొందుతారు.
'మోక్షమిచ్చేత్ జనార్ధనాత్' - మొక్షాన్నిచ్చే వాడు మహావిష్ణువు.  విష్ణువు యొక్క దశావతారాలలో ప్రధానమైనది శ్రీకృష్ణావతారం.  'కృష్ణస్తు భగవాన్ స్వయం' అని అంటారు.  ఆయన ఆవిర్భావం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం.  శిష్టులను రక్షించడం అంటే కేవలం దుష్టుల నుండి కాపాడడమే కాక పతనమయ్యే మార్గం నుంది వారిని రక్షించి మోక్షమార్గాన్ని ఉపదేశించే భగవద్గీతా శాస్త్రాన్ని మానవ జాతికి ప్రసాదించాడు. 
'ఆదౌపూజ్యో గణాధిప' ఏ కార్యమును ప్రారంభించినా మొదటగా పూజించబడేది గణపతే.  మహా గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా యోగసాధనకు ఉపకరిస్తుంది.  దీనివలన సాధనలో ప్రతిబంధకములు తొలగడమే కాకుండా ఐహిక, ఆముష్మిక వాంచలు కూడా నెరవేరుతాయి.
'ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్'! ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్షు వృద్ధి పొంది, సకలైశ్వర్యాలూ సంప్రాప్తమౌతాయి.  రుద్రాభిషేకాలు, రుద్రజపం మొదలగు వాటి వాళ్ళ సకల దుహ్ఖ నివారణ కలిగి, గ్రహ బాధలు తొలగి స్వాంతన, ఐశ్వర్యసిద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.  కావున నిత్యం ఈ దేవతలనారాధించే వారికి సకల శుభములు చేకూరుతాయని ధర్మశాస్త్రాల యొక్క ప్రతిజ్ఞానువచనం.

ఈ ఐదుగురు దేవతలనూ ఆరాధించాలా? ఒక్కర్ని ఆరాధిస్తే సరిపోదా?
ఈ ప్రశ్న అంత సమంజసమైనది కాదు.  ఎందుకంటే, పంచ భూతాలలో ఏ ఒక్కటి లేకున్నా ఈ ప్రకృతి ఎలా నడవదో, అలానే ఈ పంచాయతన దేవతలలో ఏ ఒక్కరిని విడిచిపెట్టి పూజించినా అట్టి ఆరాధన పూర్ణత్వాన్ని పొందదు.  కనుక అయిదుగురు దేవతలను విధిగా ఆరాధించి తీరాలి.  అయితే మనకు వంశపారంపర్యంగా, సంప్రదాయసిద్ధంగా సంప్రాప్తమైన దైవం ఎవరైతే వారిని ప్రధానంగా మధ్యలో పెట్టి, మిగిలిన నలుగురు దేవతలను నాల్గు దిశలలో స్థాపించి ఆరాధించాలి.  అంటే మన ఇంటి ఇలవేల్పు విష్ణువైతే విష్ణువుని మధ్యనుంచాలి.  ఈశ్వరుడైతే ఆయనను మధ్యలో వుంచాలి.  అంతే గానీ మన ఇష్టదేవతలే గొప్ప అని మిగిలిన దేవతలను న్యూనంగా భావించి దూషించ గూడదు.  వారికి చేసే ఆరాధనను విడిచిపెట్ట కూడదు.  రాగద్వేషాలతో, చాందస భావాలతో చేసే ఆరాధన నిష్ఫలమే కాక దుష్ఫలితాలకూ దారితీస్తుంది.  
[kbnsharmagaari dvaaraa]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP