శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-8

>> Thursday, March 21, 2013

31. భాష శబ్దనియమానికే

ఒక విషయం ఇతరులకు చెప్పుటకు భాష ముఖ్యమైన ఉపకరణం. ఋగ్వేదం మనకు ఆదిగ్రంధం. అందులో భాషారూపములు నిర్ణయించే వ్యాకరణము ఎంత చక్కగా నిర్ధారింపబడినదో చూసి పాశ్చాత్యులు ఆశ్చర్యచకితులౌతున్నారు. వ్యాకరణ విధులు మాత్రమే కాక మంత్ర స్వరూపములను కూడా విద్యార్ధులు నేర్చుకునేవారు. ఒక్కొక్క అక్షరమునీ ఎట్లు ఉదాత్త అనుదాత్తస్వరములలో పలుకవలెనో చెప్పించేవారు. మంత్రములు ఋషులకు ఏ విధముగా అనుగ్రహింపబడినవో అదే విధముగా స్వరశుద్ధముగా శిష్యులకు నేర్పించేవారు. ఎన్నో యుగముల తర్వాత కూడా ఆ స్వరశుద్ధి నేటికీ ఉంటూ, అదేవిధంగా వేదాధ్యయనము ఈ రోజు వరకూ ఈ దేశంలో చేయబడుట అత్యంత ముదావహము.

32. లిపిలేని బోధ
వ్రాత లేకుండా చదువు. ఈ కాలపు బళ్ళలో ఉండే బ్లాక్ బోర్డులూ, చాక్ పీసులూ, పలకలూ, బలపాలూ, పెన్సిల్, పెన్, నోటు బుక్కులు, ఆ కాలంలో లేవు. విద్యారంభ సమయంలో అక్షరాభ్యాసం చేస్తున్నాము. రెండువేల యేళ్ళ క్రితం ఉన్న అవ్వైయార్, వళ్ళువరూ, వ్రాత చదువులో ముఖ్యాంగమనీ సంఖ్యలూ, అక్షరములూ విద్యకు రెండు కళ్ళు అనీ చెప్పారు. వేదకాలంలోనూ, తర్వాత కొన్ని శతాబ్దాల కాలమూ, చదువు వాఙ్మూలకముగానే జరిగేది. విద్యార్ధి చెవులతో విని నోటితో చెప్పేవాడు. వేదమంత్రములు శృతులు. అవి విని నేర్చుకొనేవి. వానిని వ్రాయరాదు. ఆ దివ్యనాదం లోకంలో ప్రతిశబ్ధించి లోకక్షేమాన్ని ప్రసాదించాలి.

ఈ వేదరక్షణకు ఒక వర్గం నిర్దేశింపబడినది. వారు ఏ వృత్తులనూ అవలంబించరాదు. అప్పుడప్పుడూ చదివితే మంత్రములు మనస్సులో పూర్తిగా వ్యాపించక పైపైన ఉంటూ పూర్ణ ప్రయోజనము ఇవ్వలేకపోతాయి. మంత్రోఛ్చాటన చేసేటప్పుడు ఆ శబ్దం ప్రాణశక్తితో మేళవిస్తేనే మంత్రం ఫలవంతమవుతుంది. పుస్తకాలలో వేదాలుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూసుకొనవచ్చును కదా అనే అజాగ్రత్త, అవజ్ఞా ఏర్పడుతుంది. మంత్రములు ఆంతరంగిక సత్యములు అనడానికి వీలులేకపోతుంది. ఈ కారణం చేతనే పూర్వం వేదాలు పుస్తకాలకెక్కలేదు. వినికిడితోనే వాళ్ళు వేదాలు నేర్చుకున్నారు.

విద్యార్ధికి ఉండవలసినది ఒక్క తెలివే కాదు, శీలసంపద కూడా. అపుడే అతడు మంత్రచైతన్యాన్ని అనుభవంలోకి తీసుకొని పోగలడు. జీవితం శుద్ధంగా ఉంటేగానీ జ్ఞానానుభవం కలుగదు. అందులకే విద్యార్ధులకు బ్రహ్మచర్యం వ్రతంగా ఉన్నది. విద్యాభ్యాసమే ఒక వ్రతం. అది దీక్షతో ఆరంభమవుతుంది.

పుట్టేటప్పుడు బ్రాహ్మణుడూ శూద్రుడే. ఉపనయనకాలంలో ద్విజుడౌతున్నాడు. విద్యాభ్యాసంతో విప్రుడౌతున్నాడు. ఈ మూడిటితో అతడు శ్రోత్రియుడౌతున్నాడు అని శాస్త్రం చెబుతున్నది.

బ్రహ్మమనే వేదములలో మగ్నుడై, బ్రహ్మపదనాచ్యుడైన పరమాత్మజ్ఞానంలో నిష్ఠుడైతే బ్రాహ్మణుడౌతాడు. మన దేశంలోని చదువులు ఒట్టి జీవనోపాధికి మాత్రం నిర్దేశించినవి కావు. చదువు ఆత్మజ్ఞానానికీ జననమరణరూప సంసారతారణకూ ఏర్పడినది. గురువు మంత్రాన్ని ఒకమారు చెప్పి శిష్యులను ఐదుమార్లు చెప్పమనేవారు. గురువు ఒక్కమారు చెప్పగా శిష్యుడు దానిని మరల చెప్పగలిగితే అతడు ఏకసంథాగ్రాహి.

(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP