శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అధర్మకర్తలు.. సిఫారసు లేఖల్లో శ్రీవారు బందీ....భక్తుల గుండె మండుతోంది

>> Thursday, January 10, 2013

అధర్మకర్తలు.. సిఫారసు లేఖల్లో శ్రీవారు బందీ
సామాన్య భక్తులకు స్వామి దూరం
కోటాకు పరిమితికై అధికారుల విన్నపం
భక్తుల గుండె మండుతోంది
దేవాదాయ మంత్రి ఒత్తిడి చేస్తున్నారు
ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారు
మీ సిఫారసులు తగ్గించుకోండి
బోర్డు సమావేశంలో అజెండా
నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ధర్మకర్తలు
ఆచరణ సాధ్యం కాదని స్పష్టీకరణ

ఆ ఏడుకొండల వాడు కోటానుకోట్ల మందికి ఇంటి దైవం! ఆ గోవిందుడు అందరి వాడు! కానీ... ఏడు కొండల వాడు 'మా ఇంటికే దైవం' అంటున్నారు. ఆ గోవిందుడు 'మా వాడే' అంటున్నారు! ఇంకెవరో కాదు... తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు! 'ఏడుకొండల వాడిని మేం చూడాలి. మా సిఫారసు లేఖలు పొందిన వారు చూడాలి. భక్తులు ఎటుపోతే మాకేం' అనే స్థాయికి చేరింది వారి దూకుడు!

హైదరాబాద్, ఆంధ్రజ్యోతి, జనవరి 10: 'అయ్యా, బాబులూ! మీ పైరవీల దెబ్బతో శ్రీవారి భక్తుల గుండె మండుతోంది. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మా అధికారుల మీద, సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. మీ సిఫారసుల జోరు తగ్గించండి. విచ్చలవిడిగా లేఖలు పంపొద్దు! భక్తులకు స్వామి వారిని దూరం చేయకండి!' అని టీటీడీ అధికార యంత్రాంగం కాళ్లూ, చేతులూ, గడ్డం పట్టుకుని బతిమాలినంత పని చేసింది. పాలక మండలి చైర్మన్, సభ్యుల దూకుడుతో ఇతర వీఐపీల సిఫారసులను పక్కనపెట్టాల్సి వస్తోందని, దీని వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయని వాపోయింది.

అయినా... బోర్డు పెద్దలు కనికరించలేదు. 'మేం ఇంతే' అని తేల్చేశారు. 'సిఫారసులను తగ్గించుకోవడం ఆచరణ సాధ్యం కాదు' అని ముఖానే చెప్పేశారు. వీఐపీల సిఫారసులనూ కట్టడి చేయలేమని పేర్కొన్నారు. 'తిరుమల మా సొంతజాగీరు. మా ఇష్టం వచ్చినట్లు మేం చేస్తాం' అన్న తీరులో ఓ తీర్మానమే చేసేశారు. పాలకపెద్దల 'బాధ్యతాయుత స్పందన' చూసి టీటీడీ అధికార యంత్రాంగానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. తిరుమలలో బ్రేక్ దర్శనంతోపాటు ప్రతి సేవకు సంబంధించిన టికెట్లలో వీఐపీలకు నిర్దిష్ట కోటా ఉంటుంది. ఇందులో దేవాదాయ శాఖ మంత్రికి, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే... వీఐపీల వారీగా రోజుకు 'ఇన్ని' అని ఒక అనధికార కోటా అమలవుతోంది.

టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు మాత్రం 'అపరిమితం'. దీంతో వారు విచ్చలవిడిగా సిఫారసు లేఖలు పంపిస్తున్నారు. దీంతో ఆయా సేవలకు నిర్దిష్ట కోటా మించిపోవడం, ఇతర వీఐపీల లేఖలను పక్కన పెట్టాల్సి రావడం జరుగుతోంది. కోటాను మించి అనుమతిస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది. ఇతర వీఐపీల లేఖలను పక్కన పెడితే వారితో ఇబ్బంది. దీంతో రెండు విధాలుగా టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో... టీటీడీ బోర్డు సభ్యులు తమ సిఫారసు లేఖలను తగ్గించుకోవాలని అధికారులు కోరారు. గతనెలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టారు.

ఏ సేవకు ఎవరెవరికి ఎంత కోటా ఉంది? ఆ పరిమితిని ఏ స్థాయిలో ఉల్లంఘిస్తున్నారు? దీనివల్ల సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి? వంటి వివరాలన్నీ ఏకరువు పెట్టారు. "వీఐపీ లేఖలను మధ్యాహ్నం 3 గంటలలోపే జేఈఓ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఒక్కోసారి వీఐపీలు స్వయంగా ఫోన్లు చేసి... చివరి నిమిషంలోనూ సేవలు, బ్రేక్ దర్శనానికి సంబంధించి వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదించాల్సి వస్తోంది. దీనివల్ల కోటా పరిమితి దాటిపోతోంది.

ఎవరి సిఫారసును పక్కన పెట్టినా మాకు చీవాట్లు తప్పడంలేదు'' అని టీటీడీ అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. బ్రేక్ దర్శన సమయం ఒక్కోసారి రెండు గంటలకు మించి సాగుతోందని తెలిపింది. గత ఏప్రిల్‌లో వీఐపీల బ్రేక్ దర్శనం టికెట్లు కనీసం 500 ఉంటే... ఇప్పుడు వాటి సంఖ్య 1300 నుంచి 1800 మధ్య ఉంది. వీఐపీల కోటాలో ఆర్జిత సేవల టికెట్ల పరిమితి దాటిపోతోంది. "దేవాదాయ శాఖ నుంచి ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. తాము పంపించే ప్రతీ లేఖను పరిగణించాలని దేవాదాయశాఖ మంత్రి కోరుతున్నారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తాను పంపించిన లేఖలను తిరస్కరించినా, సిఫారసులను పట్టించుకోకపోయినా జేఈవో కార్యాలయం ముందు ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నారు'' అని అధికారులు తెలిపారు. ఇకనైనా విచక్షణ కోటాకు కళ్లెం వేయాలని కోరారు. ఇక... సిఫారసుల్లో ఇతర వీఐపీలది ఒక ఎత్తు అయితే... బోర్డు చైర్మన్, సభ్యుల లేఖలది ఒక ఎత్తు. "బోర్డు చైర్మన్, సభ్యులు ఎన్ని లేఖలు ఇవ్వాలనే అంశంపై నిర్దిష్ట కార్యాచరణ లేదు. సగటున ఒక్కో బ్రేక్ దర్శనం కోసం వీరి నుంచి 700 నుంచి వెయ్యిదాకా వస్తున్నాయి.

దీనివల్ల ఇతర వీఐపీల సిఫారసులను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఆ వీఐపీలతో టీటీడీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. వారు టీటీడీ జేఈఓ, కార్యాలయ సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తున్నారు'' అని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకొని టీటీడీ అధికార యంత్రాంగం కోటా పరిమితిని ముందుకు తీసుకొచ్చింది. ఎవరెవరు ఎంత పరిమితి మేరకు సేవలు, బ్రేక్‌దర్శనం కోసం లేఖలు ఇవ్వాలి? అనే అంశాన్ని అజెండాలో చేర్చారు. కోటా పరిమితిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు కూడా వర్తింపచేయాలని ప్రతిపాదించారు. కోటాపై పరిమితి తీసుకురాకపోతే టీటీడీలో రోజువారీ టికెట్ల జారీని నిర్వహించడం, నియంత్రించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. నాలుగు కీలకమైన సూచనలను చేసి, వాటిని ఆమోదించాలని కోరారు. అవి...

1. సేవలు, బ్రేక్ దర్శనం టికెట్ల జారీలో టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల కోటాపై పరిమితి విధించాలి.

2. దేవాదాయ శాఖ మంత్రి, చిత్తూరు జిల్లా మంత్రి, తిరుపతి ఎమ్మెల్యే లేఖలపై ఇచ్చే సేవ, బ్రేక్ దర్శనం టికెట్ల కోటాపై పరిమితి విధించాలి.

3. స్వామివారి దర్శనం కోసం వచ్చే సమయంలో తమకు సంబంధం లేని వ్యక్తులను, సిఫారసు లేఖలు పొందిన కుటుంబాలతో సంబంధం లేని వారిని ప్రోత్సహించవద్దు.

4. బోర్డు సభ్యులు ప్రైవేటు పీఏను నియమించుకునే విధానాన్ని సమీక్షించాలి. (ప్రైవేటు పీఏలు విచక్షణా కోటా టికెట్లను అధిక ధరలకు విక్రయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి).

ఈ సిఫారసులు ఆమోదిస్తే కొంతమేరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. వీఐపీల పాస్‌లు, టికెట్ల జారీలో ఇబ్బందులు తొలగుతాయి. బ్రేక్ దర్శనం సమయం పెరగకుండా నియంత్రించవచ్చు. సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎదురుచూసే సమయం తగ్గుతుంది. అయితే... పాలక మండలి ఆ నాలుగు సూచనలను ఆమోదించేది లేదని తేల్చిచెప్పింది. ఆ సూచనలు ఆచరణయోగ్యం కావని తిరస్కరించారు. 

[ andhrajyothy  daily]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP