శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవారిసేవకునిగా ఆనందాన్ని,సామాన్యభక్తునిగా ఆవేదనను అనుభవింపజేసిన “శ్రీవారిసేవ “

>> Saturday, December 29, 2012





విశ్వపాలనకళాధురీణుడైన తిరువేంకటపతి కొలువులో సేవకై మరోమారు అవకాశం కలిగింది శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం నకు ఈనెల 19 నుండి  26 వ తేదీ వరకు . "రామదండు "గా ఏర్పడినమా బృందమంతా కలసి పద్దెనిమిదిన    ఒంగోలు చేరి అక్కడనుండి ట్రైన్ లో తిరుపతి చేరుకున్నాము. అయితే ఈ సారి  రావాలనుకున్నవారు కొందరు  రాలేకపోతే ...అనుకోకుండా  వచ్చి చేరి సేవాభాగ్యం దక్కించుకున్నవారు కొందరు .  అందరూ  అటుహైదరాబాద్ నుండి కాయలనాగేంద్రగారు ,శ్రీకాకుళం,బెంగళూరు, కురిచేడు ,విశాఖ ఇలా వివిధప్రాంతాలనుండి వచ్చిన  భక్తులంతా చేరినదాకా ముందొచ్చినవాల్లము  తిరుపతిలో “శ్రీనివాసంలో “ లో వేచి ఉన్నాము. ఉదయాన్నే  అందరం పైకి చేరుకుని సేవాసదన్ లో రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడ్డాము. ముక్కోటి ఏకాదశి సేవలకుగాను దాదాపు నాలుగువేలకుమంది పైగా శ్రీవారిసేవకులు వచ్చారు. వీల్లందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రాత్రయ్యింది. గతంలో పలుమార్లు సేవకు వచ్చిన బృందాలనాయకులలో కొందరి  కార్యాలయ సిబ్బందికి  మామిడితాండ్రలు,కాలెండర్లు ,బహుమతులు ఇవ్వటం చూడగనే  ఆహా! కలిమాయ ఇక్కడా మొదలయ్యింది అని అర్ధమయ్యింది.
 కాకుంటే ఏడుకొండలవానిదగ్గర ఎన్నిమాయలూ బలాదూరే .ఎవరికి ఎక్కడ ఏపని అప్పగించాలో ఆయన పరివారదేవతలకు తెలుసు.   వరుసలో మాఫైల్ నంబర్  ఇరవై నాలుగు . భోజనాలకు వెళ్ళి తిరిగొచ్చేప్పటికి కొందరికి సేవాస్థలాలు,విధులు నిర్ణయింపబడ్డాయి . దాదాపు నలభయ్యవ నంబర్ ఫైల్ వాల్లకు కూడా డ్యూటీ స్లిప్ లు ఇవ్వబడ్డాయి.  మాఫైల్ కనపడలేదు . అదేమిటీ ! మాకంటే వెనుకవారికికూడా డ్యూటీలిచ్చారు  మాఫైల్ ఏదీ? అనడుగుతూ వెతికితే మా ఫైల్ ఎక్కడో టేబుల్ అడుగున పడిఉంది. “హరిమాయ” .  పొద్దుననంగా వచ్చాము . మాకుకూడా డ్యూటీలివ్వండి అనడుగుతుండగా సీనియర్ అసిస్టెంట్    ఎవరన్నా చదువుకున్నవాల్లుంటే చెప్పవయ్యా  సూపర్వైజర్లు కావాలి అని  టైపిస్ట్ ను అడుగుతున్నాడు. స్వామీ! మావాల్లలో  చాలామంది విద్యాధికులున్నారు అనిచెప్పాను . సార్ ! మీకు సూపర్వైజర్లుగా  డ్యూటీ లిస్తాము అని మొత్తం ముప్పైఎనిమిది మందిలో ఇరవై ఆరుగురికి సూపర్వైజర్లుగా మూడు షిఫ్ట్ లలో డ్యూటిలిచ్చారు. మరో పన్నెండు మందికి హెల్త్ డిపార్ట్ మెంట్ లో డ్యూటీలు ఇచ్చారు. ఆరోజు చాలాపొద్దుపోవటం వలన మరుసటిరోజునుంచి  సేవావిధులలో చేరాము. నేనూ ,శ్రీనివాసరెడ్డి  మానిటరింగ్ టీమ్ గాను నాగులుడిపార్ట్మెంట్ల లో ఒక్కోవిభాగానికి ఇద్దరు సూపర్వైజర్లచొప్పున ఒక్కో షిప్ట్ కు ఎనిమిది మంది గా మొత్తం మూడూ షిప్ట్ లకు సూపర్వైజర్లుగా నిర్ణయించి డ్యూటీచార్ట్ తయారుచేసి ఆఫీసుకిచ్చాము . మాకు మాధవం లో మూడవ హాలులో బసకోసం లాకర్లిచ్చారు.

ఇక మన కుర్రవాల్లు ముందు కొంత అసంతృప్తికి గురయ్యారు. స్వామీ! చేతినిండా పనుంటే ఇక్కడకొచ్చినందుకు సేవ చేశామని తృప్తిగా ఉంటుంది . కానీ ఇలా తిరగటం వలన ఫలితమేముంది  అన్నారు. స్వామీ లీల మనకర్ధం కాదు. ఆయన ఎందుకు ఈసేవనప్పగించారో ? మనంం ఇచ్చినపనిని చక్కగాచేద్దాం అని సర్దిచెప్పాను.  కానీ చివరి రోజు వచ్చేప్పుడు అర్ధమయ్యింది అందరికీకూడా స్వామి ఎంత పెద్దపని అప్పచెప్పాడో !
ఇక మా బృందం లో పదిమంది దాకా నాపూర్వవిద్యార్థులే ఉన్నారు .అదీగాక వాల్ల టీచర్ గారుకూడా బృందంలో ఉన్నారు కనుక పిల్లలకు ఎక్కడలేని సంతోషం .
ముక్కోటి సమయం కావటం తో కొండపై రోజురోజుకు రద్దీపెరిగుతున్నది . ఎప్పుడు లేనంతగా నాలుగువేలమంది శ్రీవారిసేవకులకు విధులు కేటాయించారు . వీల్లలో ఎవరు ఎక్కడపనిచేస్తున్నారో .ఎక్కడ అదనంగా కావలసి వస్తారో నిరంతరం పర్యవేక్షణ పనిమాది .మా బృందంలో ఉన్నవాల్లంతా ఎక్కడా క్షణం విశ్రాంతిలేకుండా కొండంతా కలియతిరిగారు . ప్రతిగంటకూ కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం అందించేవాల్లు. అవసరమైన చోట మావాల్లనే నిలబెట్టి సేవాకార్యక్రమాలు సాగించేవాల్లు . ముక్కోటి కిముందు తరువాతరోజులైతే వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో అధికారులు   కార్యాలయానికి ఫోన్  చేసి  ఈ సూపర్ వైజర్లను రాత్రికి కూడా  ఇక్కడే  ఉంచమని ప్రత్యేకంగా కోరటం జరిగింది . రాత్రి పన్నెండుగంటల దాకా డ్యూటీ చేసికూడా  మరలా తెల్లవార్లూ విధులు నిర్వహించారు మనవాల్లు. గడగడవణికిస్తున్న చలిని లెక్కచేయకుండా పిల్లలు ఉత్సాహంతో   చేశారు సేవ.  వచ్చేప్పుడు మీవాల్లు చాలాచక్కగా  చేశారండి  సేవ. అని  అభినందించటం స్వామి ఆశీశ్శులుగా భావించాము.
ఇక ఈ వత్తిడిలోకూడా పదేపదే వక్రమార్గాలలో దర్శనానికి వెళుతున్నవారిని చూపుతూ  “ బయట చలిలో గంటలతరబడి  పిల్లాపాపలతో భక్తులు వేచిఉంటే చూస్తూ కూడా  వక్రమార్గాలద్వారా దర్శనానికి వెల్లటం మహాపాపం. అది శ్రీవారి అనుగ్రహాన్నికాదు ఆగ్రహానికి కారణమవుతుంది అని చెప్పాను  మావాల్లకు. ఎవరూ కూడా ఈ సూపర్వైజర్ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని దర్శనానికి వెల్లొద్దని హెచ్చరించాను.  ముక్కోటి నాడుకూడా నేను వరాహస్వామి ఆలయం వెనుకున్న పార్కులో కూర్చుని గోపురం చూస్తూ నామస్మరణచేస్తూ గడిపాను.
ఇక మాబృందం లో కొందరు అంగప్రదక్షిణం టిక్కెట్లు తీసుకుని దర్శనానికెల్లొచ్చారు ముందుగా . శనివారం పద్దెనిమిది మందికి సన్నిధిలో సేవాకార్యక్రమానికి అనుమతి వచ్చింది. ఆతరువాత ఇరవై అయిదవతేదీ రాత్రి ఎనిమిదినుండి ఏకాంతసేవవరకు సన్నిధిలో అవకాశ్ం ఇచ్చారు మాకు. ఆమరునాడు బృందమంతా జాపాలి తీర్ధానికి వెళ్ళి హనుమజన్మస్థలమైన ఆక్షేత్రంలో  చాలీసా,సంకీర్తన చెసుకున్నాము. సంకీర్తన జరుగుతుండగా ఓ వృధ్ధుడు వచ్చి ఈరోజు విశేషం తెలుసా ? సీతమ్మవారి జాడకనుగొన్న రోజు. అందుకే ఈరోజు హనుమవ్రతం చేసుకున్నా పూజించినా  సకలశుభాలు కలుగుతాయని ఆజగన్మాత వరమిచ్చినది అని చెప్పగానే ఒళ్ళు పులకరించింది. ఆనందంతో సంకీర్తనకుపక్రమించగనే  భక్తులలో ఒకాయన  డోలక్ తీసుకుని ఆలయం లోకి వచ్చాడు. మావాల్లు అతనిని అడిగి డోలక్ తీసుకుని ఇచ్చారు నాకు. ఆ వాద్యసహాయంతో చాలీసా పారాయణం ఆకొండలలో మార్మోగింది.  హనుమన్న ఆనందతాండవం చేస్తున్నారనడానికి సంకేతం అది.
ఇక ఆరోజు ఉదయం పదిగంటలకే టీమ్ లీదర్లు వస్తే ప్రసాదం టిక్కెట్లు ఇస్తామని ఆఫీసులో చెప్పారు. కానీ మేము జాపాలినుంచి వచ్చేసరికే ఒకటిన్నరయింది. ఇకప్రసాదాలుకూడా లేవా అని మధనపడుతున్నారు పిల్లలు. చిత్రంగా మేము వచ్చేదాకా కౌంటర్ మూసివేయకుండా టీమ్ లీడర్లకు టిక్కెట్లివ్వటం నేనువెళ్లి తీసుకురాగానే పిల్లలు లడ్లు తేవటం  తిరిగిబయలుదేరేముందు అందరి చేతులలో తలా మూడులడ్లు ప్రసాదంగా ఉంచటం ఖచ్చితంగా స్వామి లీలే !

ఇక బాధకలిగించిన కొన్ని విషయాలు చెప్పుకోవాలి. చలికి వణుకుతూ రోజులతరబడి లైన్లలో నిలబడుతూ సామాన్యభక్తులు స్వామిదర్శనం కోసం పడిగాపులు గాస్తుంటే . విఐపీ లు.అధికారులు గంటల్లో నేరుగావచ్చి దర్శనం చెసుకుంటూన్నారు . ఏమిటీ వివక్షత ?  బాగాచదువుకున్నవాల్లలో అహంకారమే కనపడుతుంది అక్కడ. ఈ భాగ్యవంతుల పిల్లలలో డ్రెస్ కోడ్ కూడా పాటించటం లేదు. కారుల్లోన తిరిగేతల్లికి కట్టేబట్టె కరువైపోయే !! అన్నరీతిగా ఉంది కొందరాడపిల్లల వస్త్రధారణ. ఆలయంలోకి ఇటువంటి వస్త్రధారణతో అనుమతించకూడదని తెలిసినా  ఉద్యోగస్తులు నోరు మెదపరు.  ఇంకాకొమ్దరు సాక్స్  వేసుకునే లోపలికొస్తుంటే నేను అవికూదా పాదరక్షలే రాకూదదని అడ్డగించి వాటిని తీపించాను.  దీనికి అక్కడ దేవస్థాన ఉద్యోగి “మనం మంచి చెప్పినా చెడ్దవుతుందండీ! మనకెందుకు వదిలేయండి అన్నాడు. అయ్యా ! మీరు జీతం తీసుకుంటుంది స్వామి దగ్గర. ఇలాంటివాల్లకు మీరు భయపడాల్సిన పనిలేదు అన్నాను. కానీ ఆయన అనుభవాలు ఆయనకూంటాయి కదా ?
విఐపీ బ్రేక్ పేరుతో రెండుగంటలలో సుమారు వెయ్యిమంది స్వామిని దర్శిమ్చుకుంటే  మిగతా నాలుగు గంటలలో ఇరవై అయిదవతేదీ నలభైవేలమందిని దర్శనం చేయించటం  కాదుకాదు.. ఈడ్చి పారేస్తూ .....నెట్టివేస్తూ .. ఒక్కక్షణం కూడా స్వామిని చూడకుండానే లాగివేయటం  జరిగింది .
 ఆసేవావిధులతరువాత  మాస్టారూ ! మనకెందుకండీ ! ఈపాపం .అని మావాల్లు బాధపడ్డారు .  ఇష్టమొచ్చినప్పుడల్లా వీఐపీ దర్శనాలంటూ గంతలతరబడి డబ్బున్నవాడు,అధికారబధిరాంతకులు,ఉద్యోగస్థులు స్వామి ముందు తిష్ఠవెస్తుంటే  ఏడుకొండలవాడా! ఎక్కడున్నావయ్యా అని అర్తనాధాలు  చేస్తున్న భక్తజనం బాధ  గుండె ను రంపపుకోతకు గురిచేసింది.
గుర్తుంచుకోండి ! ఏదో ఒకరోజు భక్తుల సహనం నశిస్తుంది . కొండమీద కనపడకుండా మిమ్మల్ని తరిమికొట్టేరోజొస్తుంది . అంతదాకా రాకుండా ఉండాలంటే  మీరుకూడా స్వామి కి నిజభక్తులుగా మారండి. మీ అధికారాం దర్పాలు వదలి సామాన్యులవలే స్వామి దర్శించండి . స్వామి ఆగ్రహానికి గురికాకుండా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలని విఐపీదర్శనాలకు వెల్లే భక్తులకు విన్నవించుకుంటున్నాను.

శ్రీవారి సేవనూ వ్యాపారంగా మారుస్తున్న నికృష్ఠులు

ఇక శ్రీవారి సేవలోనైతే స్వామిని దగ్గరగా చూడొచ్చు అనే ఆశపెరుగుతుండటంతో   శ్రీవారి సేవను కూడా ఆదాయమార్గంగా మార్చుకుంటున్న నీచులు తయారవుతున్నారు. అదెంతపాపమో ? ఆతరువాత శిక్ష ఎలా ఉంటుందో తెలియక   పాకేజీలు మాట్లాడుకుని శ్రీవారి సేవకు తీసుకొస్తున్నవారు కొందరు. కార్యాలయ అధికారులూ .వైకుంఠ క్యూకామ్ప్లెక్స్ లలో ఉద్యోగులకు లంచాలిచ్చి దొడ్డిదారిని దర్శనాలకు,సన్నిధిలో సేవలకూ పంపుతున్నవారు కొందరు. చాలామంది టీమ్ లీడర్లను కలసి ఈవిషయం పై  చర్చ జరిపాను. అధికారులకుకూడా ఈవిషయాలు తెలిసినా నిశ్శహాయులవుతున్నారు. ఒకవంక ఇంటివద్ద అన్నంతినివచ్చి శ్రీవారిసేవలో తరిస్తున్న అంకితభావంకలఉద్యోగులున్న టిటీడీ లో మరొక వంక ఎలుకలు పందికొక్కులూ ఉన్నాయి.స్వామిసేవలో  ఎంతో తపన ఉన్న అధికారులతోపాటు,స్వార్ధశక్తులూ తిష్ఠవేశాయి.

ఈవిషయాలు ఇక్కడ ప్రస్తావించటం సమంజసం కాదు కనుక సమగ్రంగా నాపరిశీలనలను టిటిడీ అధికారులకు పంపుతున్నాను .
  స్వామి దయవలన నాకు పదవొచ్చినదని కాక పలనా నాయకుల వలన  నాకు టిటీడి లో అవకాశమొచ్చినదనిచెప్పుకునే పాలకులవల్ల ఇక్కడ  ధార్మికులకు మేలు జరుగదు.
హిందువులధర్మస్థలాలను హిందువులుమాత్రమే నిర్వహించుకునే రోజురావాలి. తమ మొక్కులు, తమ కొప్పరిచిప్పప్రసాదాలు తప్ప ధర్మగూర్చి ఆలోచించని భక్తులుకూడా కళ్ళుతెరవాలి/ ఎందుకంటే స్వామి ముందు అవకాశం మనకే ఇచ్చి ఉన్నాడు. సరిదిద్దుకుంటారా ? సమసిపోతారా అని .

 మాడ వీధులలో విష్ణుసహస్రనామపారాయణం

 జాపాలి  క్షేత్రంలో
 మా గుర్తింపు కార్డ్

తరిగొండవెంగమాంబ బృందావనం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP