శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

త్రైలింగస్వామి చఠిత్ర 53,54,55,56,57

>> Sunday, July 1, 2012

మనము- ఇతరులు అంతా సమానమే అనే పరిజ్ఞానం కలిగేటంతవరకు, పరస్పరం నిజమైన ప్రేమ కలగనంతవరకు, ధర్మాన్ని గురించి చర్చించటం వృథా అంతేకాక అది కేవలం ప్రతారణము మాత్రమే. ప్రేమ రెండు రకాలుగా ఉంటుందని అందరికీ తెలిసిదే. మొదటిది స్వాభావికమైన ప్రేమ- అది సంబంధాలను బట్టి కలుగుతుంది. ఎట్లాగంటే- తండ్రీ కొడుకులకు, భార్యాభర్తలకు కలిగేది. రెండవది గుణములను బట్టి కలిగేప్రేమ- మిత్రులను బంధువులను చూసినప్పుడు కలిగే ప్రేమ. యథార్థమైన ప్రేమకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రేమించినప్పుడే అది మహత్తరమైన ఫలాన్ని ఇస్తుంది. సంపూర్ణ రూపంలో అహంకారాన్ని తనను, సమస్త జగత్తును, సమస్త ప్రాణులను, సమస్త జనులను, సమస్త జగత్తును ప్రేమించటం నేర్చుకొంటే, ‘అసలైన ప్రేమ ఏమిటి’ అన్న విషయం అర్థమవుతుంది.
మనం ప్రేమించేదానిలోని మంచి చెడులను చూడవలసిన అవసరం లేదు. అది మంచిదైనా ప్రేమిస్తాము, చెడ్డదయినా ప్రేమిస్తాము. జగత్తు మంచిదో, చెడ్డతో, అని పరీక్షించి చూసి దానిని ప్రేమించాలని అనుకోకూడదు. సమస్త జగత్తూ ఆ సచ్చిదానంద స్వరూపమే. అందువలన సమస్త జగత్తూ ప్రేమపాత్రమే. ఎందుకంటే ఆ అనంతపురుషుడు ధ్యానావస్థలో తన ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టి, అన్నింటినీ భగవద్భావంతో నింపివేశాడు.
అతడే సమస్త జగత్తునూ ప్రేమించటానికి అర్హుడు. ఆయనే జగత్తును జగదీశ్వరుడని భావించి ప్రేమించగలుగుతాడు. నా అభిప్రాయంలో విజ్ఞులైన వారు దీనిని గ్రహించాలంటే, వారికి హిందూ శాస్తమ్రుల సంస్కారాలు కొన్ని చాలా అవసరము. హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత, దానిని మించిన సత్యము ఉత్కృష్ట ధర్మములు ఉండవని అందరికీ తెలుసు. ఎవరైనా భగవంతుని దర్శించి ముక్తి పొందితే, లేదా ముక్తిని పొందాలనుకొంటే, అది హందూ ధర్మంవల్లనే లభించింది. మనకు మార్గం చూపించగల సహాయకులు ఎవ్వరూ లేరు. అలాంటి విషయాలను గురించి సముచితంగా వ్యాఖ్యానించగల పండితులు ఈనాడు మనకు లేరు. ఈనాటి పండితులు తెలిసో తెలియకో, సత్యము, మిథ్య, మంచి చెడు వంటి విషయాలను గురించి విచారించక, తమ పాండిత్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఎంతోమంది మహాత్ములు తామే శ్లోకాలను వ్రాసి పురాణ కథలలోనో వేదంలోనో చేర్చి, శాస్త్రాన్ని మభ్యపరుస్తున్నారు. కాని అసలైన తత్త్వాన్ని వాస్తవంగా ప్రదర్శించటం అత్యంత ఆవశ్యకమైన విషయము.
ఏదో ఒక విధమైన మార్గాన్ని అవలంబించకుండా ధర్మం ఎలాంటిదో తెలిసేది కాదు. పూజలు చేసినా, మంత్రాలు మననం చేసినా ధర్మం తెలియదు. ముక్కు మూసికొని ధర్మాన్ని ఆచరిస్తున్నానని లోకాన్ని వంచించటం ధర్మం కాదు. శరీరంలోని అన్ని అంగాలకు హరినామ ముద్రలు వేసికొని, హరినామం ఉన్న జోలెను వేసుకొని, వీథుల వెంట తిరిగితే అది కూడా ధర్మం కాదు. ధర్మానికి సన్నిహితత్వము ద్వేషభావములు లేవు. ‘‘ఆత్మవత్ సర్వభూతేషు’’ అన్న సద్భావన కలగనంతవరకూ ఎవరు నిజమైన ధార్మికులు కాలేరు. సమదర్శి కానంతవరకు సిద్ధి లభించదు. కలహద్వేషములతో కూడిన జగత్తులో పాపం ఉన్నంతవరకు వివాదపడటం ఉచితంకాదు. ఈశ్వరుడు అందరికీ సమానుడే. ఆయన ముందు జాతికాని, సంప్రదాయికమైన ధర్మం కాని ఏదీ లేదు.
బ్రాహ్మణుడు, శూద్రుడు, యవనుడు, చదువుకొన్నవాడు, చదువులేనివాడు, ధనవంతుడు, ధనహీనుడు వంటి భేదాలు లేవు. ఎవరు ఆయనను భక్త్భివంతో పిలుస్తారో, వారు భగవంతునివారైపోతారు. ఆయన అందరివాడనే భావాన్ని వదిలిపెట్టి ధర్మమును గురించి వాదోపవాదాలు చేస్తూ ఉంటాము. ఇంతకన్నా విచారకరమైన విషయం మరేమి ఉంటుంది? ఆయన ఒక్కడే అయినా అందరివాడు. అందువలన జగత్తంతా ఒక్కటే. జగత్తులోని వారంతా ఒక్కటే. అన్ని ధర్మాలూ ఒక్కటే. ధర్మము యొక్క ప్రేమ చాలా ఉదారమైనది. ఎవరికి ఏ మతం పట్ల విశ్వాసం ఉంటుందో, వారు అదే మతం ద్వారా ధర్మలాభాన్ని పొందటానికి సమర్థులవుతారు. ఎవ్వరి ధర్మసంబంధమైన విశ్వాసాలనూ భంగపరచటం ఎప్పుడూ సముచితం కాదు.
ఈ సంసారాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్తే కాని ధర్మలాభం కలగదని చాలామంది అనుకొంటూ వుంటారు. అది చాలా భయంకరమైన తప్పు. ఒకవేళ జగత్తులోనివారంతా అడవిలోకి వెళ్తే, అప్పుడు ఆ అడవి కూడా సంసారం అయిపోతుంది. లేదా సృష్టే నష్టమైపోతుంది. ఒకవేళ సృష్టే లేకపోతే ఈ సంసార సృష్టే వ్యర్థమైపోతుంది. అప్పుడు ఈశ్వరుని పనికి బాధ కలుగుతుంది. సంసారమే ధర్మానికి ప్రధాన స్థానము.
వాయువులాగా దేనిలోనూ కలిసిపోకుండా, అన్ని పనులూ చెయ్యాలి. ధర్మమార్గం అందరికీ ఒక్కటి కాదనే విషయం అందరికీ తెలిసిదే. గృహస్థుడు ఒకవేళ వానప్రస్థమార్గమో లేదా బ్రహ్మచర్య మార్గమో అవలంభిస్తే, దానికి ఫలితం ఏమీ ఉండదు. అలాగే ఇంట్లో కూర్చొని ఎవరైనా కుంభకయోగం అవలంభించాలని ప్రయత్నిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. అన్ని నీళ్లు జలాశయంలో కలిసినట్లు, మార్గాలు భిన్నమైనా కార్యం ఒక్కటే.
జగత్తులో రకరకాల సాధకులున్నారు. అందులో రెండు రకాల సాధకులు ప్రధానులు. మొదటిరకం వారు సంసార రూపమైన మాయా శృంఖలాలను త్రెంచుకొని, తమ ముక్తికోసం నిర్జరారణ్యాలకు వెళ్లి యోగమో తపస్సో చేస్తూ కాలక్షేపం చేస్తారు. రెండవ రకంవారు మానవ సమాజాన్ని తమదిగా భావించి, వారికి ముక్తిమార్గంలో పెట్టి, వారిని ఎంతో ప్రేమతో ధర్మమార్గంలోకి తెస్తారు. ఇతరుల ఇష్టాలను తమ ఇష్టాలుగా భావిస్తారు. అంతేకాక పరోపకారం కోసం పిచ్చివాళ్లయిపోతారు. బుద్ధుడు, చైతన్య మహాప్రభువు అలాంటివారే.
మానవుని సృష్టి జరిగినప్పటినుంచీ, మానవుడు మాట్లాడటం నేర్చుకొన్నప్పటినుంచీ, మానవునిలో బుద్ధి వికసించినప్పటినుంచీ, మానవ సమాజంలో ధర్మం కూడా విస్తరించసాగింది. ఆ కాలంలో ధర్మమనే పేరు కాని, నియమ నిబంధనలు కానీ ఇన్ని లేకపోయి ఉండవచ్చును. కాని అప్పుడు కూడా ఏదో ఒక ధర్మం తప్పక ఉండి ఉంటుంది. ఏది సత్యమో అది అనశ్వరమైనది. అంతేకాక అదే మానవులకు గ్రహణయోగ్యమైనది. వేదోక్తమైన సనాతన ధర్మమేదో అది అనశ్వరమైనది. అనంత సత్యంతోకూడినది. అందువలన దానిని అవలంభించాలి. అందరూ నోటితో ధర్మం ధర్మం అంటారు. కాని దాని అసలు విషయం ఏమిటో, దాని కర్తవ్యం ఏమిటో ఆలోచించాలి. మనస్సును స్థిరంగా ఉంచి, భక్త్భివంతో ఆత్మచైతన్యాన్ని విశ్వచైతన్యంతో కలపటమే పరమ ధర్మం. అంతేగాక ఏ మార్గంలో నడిస్తే ఆ విధంగా కలపటానికి వీలవుతుందో అదే ధర్మపథము.
ధర్మం అంటే ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి? అంటే, ధర్మశబ్దం యొక్క అర్థనిర్ణయం చేస్తే దాని ఆవశ్యకత ఏమిటో తెలుస్తుంది. ధర్మశబ్దం ‘్ధృ’్ధతువునుండి నిష్పన్నమైంది. ధారణ చేసే దానిని ధర్మం అంటారు. ఏది దేనిని ధారణ చేస్తుందో అది దాని ధర్మము.
ఒక పదార్థము యొక్క స్వభావమును ధర్మమని చెప్పవచ్చును. ఎట్లాగంటే సూర్యుని యొక్క ధర్మము తాపము; జలము యొక్క ధర్మము రసము; అగ్నియొక్క ధర్మము దహనశక్తి; అట్లాగే జీవుని ధర్మము ఆత్మజ్ఞానము. ఏ వస్తువు లేకపోతే పదార్థంలోని పదార్థత్వం ఉండదో, ఆ వస్తువు అన్నిటికన్నాప్రయోజనకరమైనది. దానిని మళ్లీ వివరించవలసిన అవసరం లేదు. ధర్మము జగత్తు యొక్క ప్రతిష్ఠాస్వరూపము.
ధర్మమువలన పాపములు నశిస్తాయి. కనుక ధర్మము అన్నింటికంటే శ్రేష్ఠమైనది. విద్య, ధనము, శరీరము, సత్కులములో జననము, రోగములు లేకపోవవటం, ముక్తి మొదలైనవన్నీ ధర్మంవల్లనే లభిస్తాయి. ధర్మం వృద్ధి చెందితే అవన్నీ వృద్ధి చెందుతాయి; అది క్షీణిస్తే అన్నీ క్షీణిస్తాయి.
 మనుష్యుడు తప్పక ధర్మాన్ని ఆశ్రయించాలి. లేకపోతే మనిషిలో మనష్యత్వం నశించి, పశుత్వమో లేదా మరొక హీనత్వమో ప్రాప్తిస్తుంది.
ధర్మమునకు మూలము హృదయము. మనస్సు- శక్తులతో భగవంతునిపైన భక్తి విశ్వాసములను ఉంచుకోవాలి. ప్రతివాడూ తన వారిని, సమస్త జగత్తును తనది అనేది భావించటం, తెలిసి తెలిసి ఇతరులకు అన్యాయం చెయ్యకపోవటం, అన్ని జీవులపట్ల దయ, అహింస, లోభరాహిత్యము, క్రోధ రాహిత్యము. సత్యవాక్కు, క్షమ, సత్సంగము, జితేంద్రియత, శౌచము, గురుభక్తి, అన్ని ప్రాణులలోను మాతృత్వము, ఈశ్వరునియందు పితృత్వము- ఇలాంటి పరిజ్ఞానమే ధర్మము అనబడుతుంది.
శాస్తమ్రు అనంతమైనది. కాని ఆయువు అత్యల్పమైనది. అంతేకాక మానవ జీవితంలో విఘ్నాలు ఎక్కువ. అందువలన అన్ని శాస్త్రాలలోని సారమును మాత్రం తెలుసుకోవాలి. కొంచెం జ్ఞానంతోనే ధర్మజ్ఞానం కలుగవచ్చును. ఎన్నో శాస్త్రాలు చదవనక్కరలేదు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. ఎక్కడ సత్సాంగత్యం ఉంటుందో అక్కడ సద్బుద్ధి ఉంటుంది. ఎక్కడ ధార్మికులుంటారో అక్కడ భగవంతుడు విరాజిల్లుతాడు. ధర్మలాభము ఏ మతాన్ని అపేక్షించదు. ఎవరు దానిని ఎట్లా ఆరాధిస్తారో, అది కూడా వారి కోరికలను అట్లా పూర్తిచేస్తుంది. ఏ విధంగా నదులు నానా దిశలలోను ప్రవహించినా, చిట్టచివరకు సముద్రంలో కలిసినట్లు, భగవంతుని ఉపాసన ఏ భావంతో చేసినా, ఆ ఉపాసన పరబ్రహ్మలోనే అర్పితమవుతుంది.
ఉపాసన
ఉపాసన అని దేనిని అంటారో ముందు తెలుసుకోవాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా, ఆయనను పొందాలన్నా ఉపాసన చాలా అవసరం. అలాంటి కోరికలు లేకపోతే ఉపాసన యొక్క అవసరం ఉండదు. తనను ఎవ్వరైనా సంతోషపెట్టాలని ఈశ్వరుడు కోరడు. అందరిపట్లా ఆయనకు సమానమైన దయ వున్నది. ఉపాసన లేదా ఆరాధన భగవంతుని విశుద్ధశక్తిని ఆకర్షించే యంత్రంలాంటిది. ఆయనను తెలుసుకోవాలనుకొంటే, ఏ మార్గంలో వెళ్తే ఆయనను తెలుసుకోవచ్చునో దానినే ఉపాసన అంటారు.
మనుష్యుడు సుఖాన్ని కోరుకొంటాడు. కాని, అసలైన సుఖం అని దేనిని అంటారో అది ఎవరికీ తెలియదు. దుఃఖము యొక్క చరమ నివృత్తియే మహాసుఖము. సుఖము ఏ అడవులను వెలుగులతో నింపిందో, మనస్సు యొక్క సంపూర్ణ శాంతి ఏ సాగర గర్భంలో దాగి ఉన్నదో, దానిని గురించి ఆలోచించాలని ఎవ్వరూ అనుకోరు. దుఃఖము లేకపోతే సుఖము ఎట్లా ఉంటుందో ఎవరూ తెలుసుకోలేరు. ఏదో ఒక రకమైన అన్యాయం పనిచేసినప్పుడే కష్టం అనుభవించవలసివస్తుంది. ఈశ్వరుడు మనుష్యులకు కష్టం కల్గిస్తున్నాడంటే, సుఖాన్ని పొందటనికే! మనిషి ఎప్పుడూ సన్మార్గంలో నడిచి, ఎప్పుడూ సుఖానే్న అనుభవించాలనే ఆయన కోరిక. బంగారం ధర ముప్ఫై అయిదు వందలైతే, దానిలో ఎంత కల్తీ కలిస్తే అంత విలువ తక్కువ అవుతుంది. స్వర్ణకారుడు దానిని రసాయనంలో వేసి, అది పూర్తిగా శుద్ధి అయ్యేంతవరకూ దానిని సుత్తితోకొడుతూ ఉంటాడు. అట్లాగే ఈశ్వరుడు కూడా మనుషులకు కష్టాలను కల్గించి, అతనిని అన్యాయపు పనులు నుంచి పూర్తిగా తొలగించి, అతడు విశుద్ధుడై తిరిగి మంచి మార్గంలో నడవటానికి యోగ్యునిగా చేస్తాడు. జీవునికి కష్టం కలిగించటం కూడా ఆయనకు పరమదయలోని భాగమే! దానిని బట్టి సుఖ దుఃఖాలు రెండు సమానములని తెలుసుకోవాలి. అందువలన అన్యాయపు పని చేసి దుఃఖాన్ని అనుభవించటం కన్న, అసలు అన్యాయం చెయ్యకపోవటమే మంచిది. శరీరానికి మాలిన్యం అంటించుకొని దానిని కడుక్కోవాలనుకోవటం కన్నా అసలు మాలిన్యం అంటించుకోకపోవటమే మంచిదని అందరూ ఒప్పుకొంటారు కదా.
ఈశ్వరోపాసన ఎల్లప్పుడూ ఆవశ్యకమే!
 అలాంటి ఆలోచన మనస్సులో స్థిరపడి, దృఢ విశ్వాసం కలిగినప్పుడు, మొదట ఆసనము అవసరమవుతుంది. ఆసనములు అనేక విధాలుగా ఉన్నాయి. కాని సంసారులైన వారికి ఏది ఉపయోగకరమో దానిని గురించి తెలుసుకోవాలి. అందువలన ఇక్కడ దానిని గురించే వివరింపబడుతున్నది. నిర్జనము, ప్రశస్తము ఐన ఒక గదిలో మొదట దర్భాసనము, దానిమీద తివాచీ, దానిమీద ఒకవస్తమ్రు పరిచి, దానిమీద సాధకుడు ఉత్తర ముఖంగా కూర్చోవాలి. అట్లా కూర్చున్నప్పుడు శరీరము, తల, మెడ అన్నీ ఒక రేఖలో ఉండాలి. కుడిముంగాలి మధ్యభాగములో ఎడమ పాదతలమును, ఎడమ ముంగాలి మధ్యభాగములో కుడిపాద తలమును నిలపి సూటిగా కూర్చోవాలి. తరువాత కళ్లు మూసుకొని, ముక్కు చివర కాని, లేదా భ్రూమధ్యమున కానీ దృష్టిని నిలిపి, శాంతము స్థిరము అయిన చిత్తముతో గురువు ఉపదేశించిన బీజాక్షర మంత్రమును జపించాలి. దీనిలో బ్రాహ్మణుడు శూద్రుడు అన్న భేదంలేదు. ఆ విధంగా ప్రతిరోజూ ప్రాతః సాయంకాలములలో కనీసం అరగంట వరకూ నిశ్చలమైన మనస్సుతో కూర్చోవాలి. ఎంతవరకూ కాంతి కనిపించదో అంతవరకూ క్రమంగా ధ్యాన సమయాన్ని పెంచుతూ పోవాలి.
మనస్సును స్థిరపరచటానికి అంతకన్నా మరొక సూటియైన మార్గం లేదు. మనస్సు చాలా చంచలమైనది. అందువలన దానిని నిరోధించి పనిలో పెట్టాలి. కొన్ని రోజులు అట్లా అభ్యాసం చేస్తే మనస్సు మన అధీనం అవుతుంది. మనస్సుతోనే మనస్సును వశపరచుకోవాలి. అది మనవల్ల అవుతుందా కాదా అని పొరపాటున కూడా అనుకోకూడదు. కాకపోతే ఏమీ ఫలం లభించకపోవచ్చును. అయితే అదే మన ప్రధాన కర్తవ్యమని, అది మనకు చాలా అవశ్యకమని, ముఖ్యంగా మనం ఆలోచించాలి. అది సాధించే వరకూ మనం దానిని వదిలిపెట్టకూడదు.
ఈ విధంగా దృఢ మనస్కులమై ప్రయత్నిస్తే ఫలితం తప్పక లభిస్తుంది. మనస్సు స్థిరపడిన తరువాత ఏ సాధన అవసరం లేదు. ఆసనం యొక్క అవసరము లేదు.
బుద్ధి, మనస్సు, ప్రాణము, శరీరము, అహంకారము, ఇంద్రియములకన్న చిత్ రూపమైన ఆత్మ భిన్నమైనదని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ ఆత్మయే ఈశ్వరుడు. అది నిర్మలము, నిరాకారము, జన్మ మృత్యు-జరా-వ్యాధివర్జితము అయినది. అది చిన్మయము, ఆనందమయము అశీరము, పూర్ణము, జ్యోతిర్మయము, నిత్యము, శుద్ధము, జ్ఞానమయము, సర్వదేహస్థితము, సర్వాతీతము అయినది. ఏకాగ్ర చిత్తముతో ఈ విధమైన చింతన చెయ్యాలి. కొందరు నాస్తికులై ఈశ్వరుడు లేడని, అన్నీ సహజంగానే అవుతాయని అంటారు. అలాంటి మూర్ఖులు అజ్ఞానులు జగత్తులో ఎవ్వరూ ఉండరు.
ఈశ్వరుడు ఒక్క క్షణం ఈ శరీరాన్ని వదిలిపెడితే, కళ్లు మూతలుపడి జీవనలీల సమాప్తమైపోతుంది. ఈనాడు ఎవరిలోనో ఒకరిలో ధర్మపిపాస జాగృతమవుతున్నది. కాని దానికోసం శ్రమపడటానికి ఎవ్వరూ అంగీకరించటంలేదు. రెండుమూడు రోజులు కళ్లుమూసుకొని కూర్చొని, ఏమీ లభంచకపోతే అంతా మిథ్యయని, వృథాగా శ్రమపడటంవలన ఏమీ లాభం లేదని అనుకొంటారు. ఆత్మవిశ్వాసంతో ఈశ్వరుని తమ చిత్తంలోకి ప్రవేశింపజేయగలిగితే, విశ్వాసం కలుగుతుంది. ఒకరికి విశ్వాసం కలిగినా కలకగపోయినా జగత్తుకు దానివలన నష్టం ఏమీ లేదు. అలాంటివారికి దూరంగా ఉండాలి. వారి నిద్రమత్తు తొలగిపోయినపుడు వారే సరియైన మార్గంలో నడుస్తారు. మొదట అరుణోదయం లాగా వారిలో వృత్తిరూపమైన జ్ఞానోదయం కలిగి, అజ్ఞాన రూపమైన అంధకారం నశిస్తుంది. దాని తరువాత ఆత్మ సూర్యునిలాగా స్వయంగా ప్రకాశిస్తుంది. భ్రాంతివలన ముడుచుకొని ఉన్న చెట్టు మనిషిలాగా కన్పించినట్లు, బ్రహ్మ పదార్థము జీవునిలా కన్పిస్తుంది. కాని ఆ భ్రాంతి నశించగానే జీవుని యథార్థస్వరూపం దర్శనమిస్తుంది. అంతేకాక జీవుని యొక్క జీవన వ్యవహారం నివృత్తమవుతుంది.
- చిత్తౌన్నత్యం కోసం మనిషి ఏదో ఒక ఉన్నత స్థితిని పొంది, చరమాదర్శ స్వరూపుడైన ఆ మహాపురుషుని ఆదర్శాలను గూర్చి చింతన చేస్తూ వాటిని ఎప్పుడూ హృదయంలో నిలుపుకొని, ఆ ఆదర్శాలతోనే ఔన్నత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. మన మనస్సు చాలా చంచలమైనది కనుక ఏదో ఒక ఆదర్శ చరిత్రను మనస్సులో ధారణ చెయ్యటం సహజమైన పనికాదు. అందువలన ఎవరో ఒక ఆదర్శపురుషునితో మన మనస్సును ఎట్లాగైనా బంధించాలి. అట్లా మహాపురుషునితో బంధనాన్ని దృఢపరచుకోవటానికి దృఢమైన భక్తి అవసరము. ఎందుకంటే భక్తి లేకపోతే ఈశ్వరోపాసనలో అగ్రేసురులం కాలేము.
సంపూర్ణ జ్ఞాని అయిన విశిష్ట యోగి జ్ఞానచక్షువు ద్వారా తన ఆత్మలో సమస్త జగత్తును ఆ ఆత్మనే జగత్తులోను చూస్తాడు. ఈ జగత్సముదాయమే ఆత్మ. ఆ ఆత్మకు భిన్నమైన వస్తువు లేదు. ఎట్లాగంటే ఘటము, కలశము మొదలైనవి మట్టి యొక్క రూపాలే. మట్టి లేకపోతే ఘటము కలశము అనే వస్తువులు లేనే లేవు. అట్లాగే జ్ఞాని అయిన వ్యక్తి తన ఆత్మలోనే సమస్త సముదాయమును చూస్తాడు.
వాయువు అంతటా ప్రసరించినా, ఏ వస్తువుకూ అంటుకోనట్లు జ్ఞాని అయినవాడు అనిత్యమైన బాహ్య సుఖములను వదిలిపెట్టి, ఆత్మసుఖంతో పరిపూర్ణుడై, నిశ్చలమైన దీపంలాగా నిర్మలమైన అంతరంగంతో ప్రకాశిస్తాడు. అంతేకాక వౌనిలాగా ఆలోచిస్తాడు. ఉపాధి నశించగానే ఆ వౌని సర్వవ్యాపియైన పరమాత్మలో ప్రవేశిస్తాడు. నీటిలో నీరు, తేజస్సులో తేజస్సు, ఆకాశంలో ఆకాశము కలిసిపోయినట్లు పరమాత్మలో లీనమవుతాడు. ఎట్లాగంటే భ్రమరము ఒక పురుగును పట్టుకొన్నపుడు, ఆ పురుగు ఆ భ్రమరమును గురించే ఆలోచించి ఆలోచించి చివరకు ఆ భ్రమరంలాగానే మారిపోయినట్లుగా ఆత్మజ్ఞానియైన పురుషుడు ఆత్మరూపియైన ఆ సచ్చిదానంద స్వరూపాన్ని గురించి ఆలోచించి ఆలోచించి తనలో పూర్వపు ఉండిన ఉపాధిరూప గుణాలను వదిలిపెట్టి, సచ్చిదానంద భావమును పొందుతాడు. అలాంటి వ్యక్తినే జీవన్ముక్తుడంటారు.
జ్యోతిర్మయుడు- ఆనందమయుడు అయిన ఆ పరబ్రహ్మను ఆశ్రయించుకొని, బ్రహ్మ నుంచి పిపీలికాది పర్యంతము, తమ తమ తారతమ్యములనుబట్టి ఆనందాన్ని పొందుతారు. పాలలో నెయ్యి ఉన్నట్లుగా అన్నింటిలోనూ బ్రహ్మ పదార్థమున్నది. అంతేకాక సంసారిక వ్యవహారాలు కూడా ఆయనకన్న భిన్నం కావు. శ్రవణము, మననము, అజ్ఞానము కువాసనలతో విషయాకృష్టుడై ఉన్నాడు జీవుడు. అతనిని విషయముల నుంచి వెలికిలాగి ఆత్మలో నిలిపి జ్ఞానాగ్నిలో తపింపజేస్తే, ఉపాధి మాలిన్యములనుండి ముక్తుడై, ఆత్మ బంగారంలాగా ప్రకాశితవౌతుంది.
సర్వవ్యాపి, సమస్తము, నీకు ఆధారభూతమైన ఆత్మ హృదయాకాశంలో సూర్యునిలాగా ఉదయించి, అజ్ఞానాంధకారాన్ని హరించి, అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. నిష్క్రియుడు, దిక్‌దేశకాలాది అపేక్షారహితుడు, శీతోష్ణాదుల కతీతుడు, సర్వవ్యాపి, నిత్యసుఖ స్వరూపుడు అయిన ఆత్మను ఎవడు భజిస్తాడో, అతడు సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, అమృతుడు అవుతాడు.
ధర్మమువలన భక్తి, భక్తివలన జ్ఞానము, జ్ఞానమువలన ముక్తి లభిస్తుంది. మనస్సును ప్రాణాన్ని ఈశ్వరునికి అర్పించటమే ధర్మము. కనుక ముముక్షువు కాదలచిన వ్యక్తి ధర్మముకొరకు ఈశ్వరుని మీద ఆధారపడాలి.
సచ్చిదానంద స్వరూపుడైన బ్రహ్మమాత్రమే సర్వమయుడు. అందరు దేవతలు ఆయన సూక్ష్మాంశాలే! ముముక్షువైనవాడు విధివిధానంగా అనుష్ఠానం చేసి, చిత్తశుద్ధి పొందిన తరువాత, ఆత్మజ్ఞాని అవుతాడు. ధర్మమార్గానికి అనిష్టకారకములైనవి కనుక కామాది అరిషడ్వర్గాన్నీ హింసనూ ఒకేసారి వదిలిపెట్టాలి. ప్రయత్నపూర్వకంగా ఈపని చేయగలిగినవారికి తత్త్వజ్ఞానం లభిస్తుందనటంలో సందేహం లేదు. తత్త్వజ్ఞానం కలిగిన తరువాత ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆత్మ ప్రత్యక్షమైతే ముక్తిలభిస్తుంది.
మనోసంయమనమే సాధన యొక్క ప్రధాన లక్షణము.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP