త్రైలింగస్వామి చరిత్ర [
>> Thursday, April 26, 2012
ఇది ‘‘మహాత్మ శ్రీ త్రైలింగస్వామి- జీవితము, ఉపదేశములు’’ అనబడే తెలుగు అనువాద గ్రంథము. దీనికి హిందీ మాతృక డా.వాసుదేవ ఛటర్జీగారి అనువాద గ్రంథం. దానికి మూలం శ్రీ ఉమాచరణ్ ముఖోపాధ్యాయగారి బెంగాలీ గ్రంథం. ఈ తెలుగు అనువాదం చేసినవారు ఆచార్య హరిశివకుమార్‌గారు, ఆచార్య రేగులపాటి మాధవరావుగారు. తెలుగు అనువాదకులు ఇద్దరూ కూడా ఉత్తమ శ్రేణికి చెందిన సంస్కృత, హిందీ, ఆంధ్ర పండితులు కావడం చేత ఈ శైలి సులభసాధ్యమయింది. ఈ తెలుగు గ్రంథం పునర్ముద్రణ గావించబడటం ముదావహము.
బెంగాలీ నుంచి హిందీలోకి అనువాదం అయ్యేనాటికే ఈ మహాయోగి దేహూత్సర్జనము చేసిన నాటినుండి 80 సంవత్సరములు గతించాయి. మొదటి మూలగ్రంథమైన బెంగాలీ గ్రంథమే, దాని శైలి చేత ఒక మహాయోగి వ్యక్తిత్వాన్ని పండిత- పామరులకు గ్రాహ్యమైన విధంగా ఆవిష్కరించలేకపోయింది.
1887వ సంవత్సరములో దేహూత్సర్జనము చేసిన ఈ స్వామి జీవిత చరిత్రను మంచి రచయిత ఎవ్వరూ వ్రాసే ప్రయత్నం చేయలేదు. ఒక మహాయోగి చరిత్ర వ్రాయడానికి, అతడికి సన్నిహితుడై, కొంత విద్యావంతుడై ఉంటే, అటువంటి మహావ్యక్తిని అర్థం చేసుకోవడానికి- తిరిగి వ్రాయడానికి సాధ్యమవుతుంది. కాని ఆ భక్తుడు కేవలం సేవకుని మాత్రంగానే సహచరించినవాడైతే, తాను చూచినకొన్ని మహత్తులు మాత్రం వ్రాయగలడు.
ప్రశ్నోత్తరాలగు సంభాషణలు మాత్రం కొంతవరకు గుర్తుంచుకొని ఆ సేవక భక్తుడు బెంగాలీలో వ్రాసినట్టు తెలుస్తోంది. ప్రతి భాషకీ నుడికారం అంటూ ఒకటి ఉంటుంది. మాటకి మాట అనువదించినా మూలంలోని భావం సువ్యక్తంకాదు. అనేక సంవత్సరాలు సేవచేసినవాని అవగాహన ఎంత లోతైనదీ, వివేకవంతమైనదీ అయితే, అతడి రచన ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అంత స్పష్టముగా మనకు చెప్పగలదు. ఇంతటి మహనీయుడు వారణాసిలో 15 దశాబ్దాలు జీవించినా, పదిమంది పండితులు కానీ, చదువుకున్న వ్యక్తులు కానీ ఆయనను గురించిన మంచి గ్రంథము ఎవరూ వ్రాయకపోవడం ఆశ్చర్యమే.
ఆనాటి సమాజములోని ప్రముఖ వ్యక్తులు అనేకుల యొక్క జీవన విశేషాలు, బోధలు ఎంతో వివరముగా రచించిన గ్రంథాలు మనకు లభిస్తున్నాయి. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస. అలాగే కొద్దికాలం తర్వాతివారైన శ్రీ అరవిందులు, శ్రీ రమణమహర్షి వంటి వ్యక్తుల చరిత్రలు, బోధలు మనకు ఎన్నో లభిస్తున్నాయి.
శ్రీ అరవిందులు స్వయముగా విస్తారమైన రచన కూడా చేయడం జరిగింది. శ్రీ రమణులు అసలు గ్రంథరచనే బహుళముగా చేయలేదు. కొద్దిపాటి చిన్న రచనలు, సంభాషణలు, భక్తులయొక్క అవగాహనతో కూడిన రచనలు మనకు లభిస్తున్నాయి. శ్రీ అరవిందులు నాగరక సమాజంతో పెట్టుకున్న క్రియాశీలక సంబంధం ఎంతో ఉన్నది. కాని, రమణులు రచన- ఉపన్యాసములు కాక ప్రశ్నలకు సమాధానమే ఇచ్చారు. తనకు తానై సమాజముతో పెట్టుకున్న సంబంధం ఏమీ లేదు. తనదైన ఒక సంస్థ లేదు.
ఇక త్రైలింగస్వామి విషయం- ఆయనకు ఈ ప్రపంచముతోనే తనదైన సంబంధం లేదు. ఓ మఠము, సంస్థ, ఉపన్యాసము, బోధనలు, ఒక నిత్యమైన నిర్దిష్టమైన కార్యక్రమము, ఒక సంస్థారూపకమైన సిబ్బంది ఏమీ లేవు. ఈ మహాత్ముడు క్రీ.శ.1737లో వారణాసి ప్రవేశించి 1887 వరకు, 150 సంవత్సరములు ఆ పట్టణములో సంచరించాడు. ఆయన దిశమొలతో ఈ ప్రపంచ స్పృహ దాదాపు లేకుండానే చుట్టూ ఉన్న సమాజాన్ని తానుగా గుర్తించకుండానే సంచరించాడు
- ఇంకాఉంది




1 వ్యాఖ్యలు:
నమస్కారం గురువు గారూ.
చాలా కాలంగా త్రైలింగస్వామీ వారి చరిత్ర గుఱించి వెతుకుతున్నాను. ఇంతకాలానికి మీ ద్వారా తెలుసుకుంటున్నాను. కొనసాగించండి
Post a Comment